సాయి కథలు - ఎంతటి దయామయులో మహాత్ములు!
శ్రీసాయినాథాయనమః
సాయిబాబా మహాసమాధికి(అక్టోబరు 15, 1918)
కొన్నిరోజులముందు తీసిన చిత్రం
సాయి కథలు - ఎంతటి దయామయులో మహాత్ములు!
" మహాత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే ! " శ్రీ సాయి సచ్చరిత్రము
భగవంతుడు తాను సృష్టించిన జగతిని ఉద్ధరించుటకు సద్గురువుల, మహాత్ముల రూపంలో తానేఅవతరిస్తాడనేది ఆర్యవాక్కు. సద్గురువులు సాక్షాత్తు దైవరాయబారులు. యోగులు తమ ప్రతిరూపులని శ్రీకృష్ణుడు తెలిపియున్నాడు. జీవులపట్ల హద్దులెరుగని కారుణ్యము, అతిశయించిన ప్రేమానురాగాలతో సద్గురువులు ఆవిర్భవిస్తారు. వారు మానవజాతిని ఉన్నత మార్గంలో నడిపిస్తూ, వారి యోగక్షేమాల బాధ్యతను గూడ వహిస్తారు. అనుభవింపలేని భక్తుల పాపకర్మల, బాధల తామనుభవించి వారికి బాధోపశమనం కలిగిస్తారు. ఈలక్షణాలు సాయిబాబాలో పరిపూర్ణంగా గోచరిస్తాయి. ఇలాంటి తత్వమే రామకృష్ణ పరమహంస మరియు రమణమహర్షి జీవితచరిత్రలలో మిగుల ప్రతిబింబిస్తుంది. ఈ సద్గురుదేవుల కారుణ్య తత్వాన్ని క్లుప్తంగా, సోదాహరణంగా పరిశీలించుదాం.
సాయిబాబా జీవితచరిత్ర చదివిన వారెల్లరకు తెలిసిన విషయమేమంటే, భక్తులబాధల, జబ్బులను తమ శరీరంపై ధరించి వారిని రోగముక్తుల జేయుట. శ్రీ సాయి సచ్చరిత్రము 7వ అధ్యాయంలో భక్తజనులపట్ల సాయికరుణను తెలియజేయు నొక యుదాహరణమును గుర్తుకు తెచ్చుకొందాము. అమరావతి నివాసియగు ఖాపర్డే భార్య కొడుకుతో శిరిడీలో యున్నపుడు తనబిడ్డకు ప్లేగుజ్వరం సోకింది. అమరావతి పోదలచి , సాయంకాలం లెండీవనానికి వెళ్ళేబాబాను దారిలోకలసి యనుమతి కోరినది. బాబా మిగుల దయతో యిట్లన్నారు, " ప్రస్తుతం ఆకాశం మబ్బుపట్టియున్నది. కొద్దిసేపట్లో మబ్బులన్నీ చెదరిపోయి, ఆకాశము నిర్మలమగును. " ఆవిధంగా చెబుతూ బాబా కఫ్నీని పైకెత్తి చంకలో కోడుగుడ్లంత నాలుగు ప్లేగు బొబ్బలను చూపుతూ, " నాభక్తులకొరకు నేనెట్లు బాధపడెదనో చూడుము! వారి కష్టములన్నియు నావే! " బాబా మరొక కరుణామయ సంఘటన. 1910వ సంవత్సరము దీపావళి ముందురోజు ద్వారకామాయిలో ధునియందు తమచేయి మిగుల గాల్చుకొని ఎచటో దూరానున్న కమ్మరిబిడ్డను అగ్నిప్రమాదంనుండి రక్షించారు. ఓపర్యాయం బాబాకు భక్తుడు దక్షిణసమర్పించాడు, దక్షిణతోపాటు వాని జబ్బునుగూడ తమదేహంపైకి తీసుకొన్నారు. ఆక్షణంలోనే మంటల జ్వరంచే బాబా బాధపడ్డారు. తుదకు మరణశయ్యపైనున్న తాత్యా చావును తాముపొంది వానికి ప్రాణభిక్ష పెట్టారనేది భక్తుల విశ్వాసము.
ఈవిషయమై రామకృష్ణుల భక్తజన కారుణ్యాన్ని చూచెదము. ఈవివరణ ' Sri Ramakrishna And His Divine Play ' గ్రంథమునుండి గ్రహింపబడినది. రామకృష్ణ పరమహంస తమ చివరి రోజుల్లో భరింపరాని గొంతు క్యాన్సరు వ్యాధిచే బాధననుభవించారు. ఆసమయంలో వ్యాధినివారణ నిమిత్తము కలకత్తాలోని శ్యామ్ పురుకూర్ ప్రాంతంలో నివసించారు. అచట ఓరోజున వారి సూక్ష్మదేహం, భౌతిక( స్థూల )దేహంనుండి వేరై దానిచుట్టూ పరిభ్రమించుట చూసారు. సూక్ష్మశరీరంతో ఆసమయంలో గొంతువెనుకభాగాన కొన్నిగాయాల గమనించి తమకలా యెందులకు జరిగినదని మిగుల ఆశ్చర్య పడ్డారు. వారికాసమయాన జగన్మాత ఓ దృశ్యాన్ని చూపించినది.
అన్నిరకాల పాపకార్యాలు జేసిన జనులు వారిదేహాన్ని తాకుతున్నారు. ప్రజల దీనస్థితికి మిగుల దయచెంది వారిపాప కర్మఫలాలను తాము స్వీకరించారు. దాని ఫలితమే యీ గొంతువ్యాధి. లేకుంటే తమ దేహమేల యీ వ్యాధిచే బాధననుభవించాలి? పూర్వమెలాంటి పాపంజేసి యెరుగదే ఈశరీరం. " మహాత్ములు సామాన్యుల ఆత్మోద్ధరణకై వారి పాపకర్మల స్వీకరిస్తారు. రామకృష్ణుల మాటలు విన్న సమీపశిష్యులు, తామేల మిగులు పాపకర్మలు జేసి గురుదేహాన్ని తాకుతున్నామని ఆత్మావలోకంతో మిగుల వ్యధచెందారు. కేవలం తమమూలముననేగదా వారీ భయానక గొంతు క్యాన్సర్ తో పీడింపబడుచున్నారని తలచి వారి పవిత్ర దేహాన్నెపుడు తాకరాదని నిశ్చయించుకొన్నారు. ఓపర్యాయం బొల్లి ( ల్యూకోడెర్మా ) వ్యాధిగ్రస్తుడు రామకృష్ణులజేరి తన దేహంపై వారిచేతుల త్రిప్పి రోగముక్తునిజేయమని మిగుల ప్రాధేయపడ్డాడు. జాలినొందిన పరమహంస వారికీవిషయమై యేమి తెలియదనీ, జగన్మాత తలస్తే వాని చర్మరోగము పోగలదని చెబుతూ వాని శరీరంపై తమ చేతుల తిప్పారు. పిమ్మట రోజంతా భరింపరాని చేతిబాధచే పీడితులై వ్యాకులమనస్సుతో తామెన్నడూ అలాంటి పనులజేయమని జగన్మాతను ప్రార్ధించారు. ఆపై రోగివ్యాధిముక్తుడైనాడు, కాని వానికర్మను, బాధను పరమహంస అనుభవింపక తప్పలేదు!
భగవాన్ రమణ మహర్షి తమ అంత్యకాలంలో కాన్సర్ వ్యాధిచే పీడితులైనారు. దీనజనోద్ధరణయే మహాత్ముల జన్మకారణముగావున వారు తప్పక భక్తజన పాపకర్మ ఫలాల స్వీకరించి వ్యాధిగ్రస్తులైనటుల మనమూహింపవచ్చును. ఉబ్బసవ్యాధితో బాధపడు వ్యక్తివచ్చి తమకు స్వాస్థ్యత కల్గించమనివేడగా, ప్రారబ్ద మనుభవింపవలెనని చెప్పినప్పటికీ వారిసన్నిధిలో యెందరో మానసిక సమస్యలనుండి, ఆధ్యాత్మిక సందేహములనుండి,యితర పెక్కుభాధలనుండి ముక్తులైనారు. వారి శ్రేయస్సుకొరకు మహర్షి తమ తపఃశక్తిని వినియోగించారు. పూర్వపాపకర్మ ఫలముచే మనోక్లేశములు, నిత్యశంక, అశాంతి మొదలగు స్వభావములేర్పడతాయనేది పెద్దలమాట.
శ్రీ సాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!
రామకృష్ణపరమహంస మహాసమాధికి(ఆగస్టు 16, 1886)
కొన్నిరోజుల ముందుతీసిన చిత్రం
కొన్నిరోజుల ముందుతీసిన చిత్రం
రమణమహర్షి మహాసమాధికి (ఏప్రిల్ 14, 1950)
కొన్నిరోజులక ముందుతీసిన చిత్రం
కొన్నిరోజులక ముందుతీసిన చిత్రం
సద్గురుహృదయము కరుణా సంద్రము !
ReplyDelete