సాయి కథలు - శ్రీ బి.వి. నరసింహస్వామిగారి అనుభవం

శ్రీసాయినాథాయనమః 

సాయి కథలు - శ్రీ బి.వి. నరసింహస్వామిగారి ( జననం 21-08-1874 , సాయిలోక ప్రాప్తి 19-10-1956 ) అనుభవం
" మహాత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే ! "  శ్రీ సాయి సచ్చరిత్రము 


సాయిబాబా జీవించియున్నపుడు వారి మహిమలను దాసగణు మహరాజ్ తన శ్రావ్య కీర్తనలద్వారా, నానాసాహెబ్ చాందోర్కర్ తమ ఉపన్యాసములద్వారా దూరప్రాంతములకు వ్యాపింపజేశారు. సాయి సమాధి చెందిన పిమ్మట 1936వ సంవత్సరమునుండి షుమారు 1956 వరకు భారత దేశంలో నలుమూలలా బాబాఖ్యాతి వ్యాప్తిచెందుటలో అత్యంత కీలకబాధ్యత వహించినవారు శ్రీ బీవీ నరసింహస్వామిగారు. వీరు మద్రాసులో అఖిలభారత సాయిసమాజ్ సంస్థను  స్థాపించి, సాయిసమాజ్ కేంద్రంగా విశేష సాయి ప్రచారం తమ చివరి క్షణం వరకు కొనసాగించారు. అంతటి  పరమభక్తులగుటకు దోహదపడిన వారి అద్భుత   జీవితానుభవం  పరిశీలిద్దాం. 
శ్రీ నరసింహ స్వామి 21ఆగష్టు , 1874న తమిళనాడులోని కోయింబత్తూర్ జిల్లాలో సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.  అత్యంతప్రతిభతోగూడిన   విద్యాభ్యాసానంతరము  1895లో సేలం లో తమ న్యాయవృత్తిని ప్రారంభించారు. పేదలనుండెలాంటి  డబ్బుస్వీకరింపక ఉచిత న్యాయసేవలందించెడివారు.  తమ  నిరాడంబరత, పరోపకారములాంటి సత్ప్రవర్తనచే విశేషంగా  ప్రజలమన్నల పొందారు, అత్యంత ప్రతిభచే మిగుల కీర్తి,  సంపదల గడించారు. భార్య సీతాలక్ష్మి, కొడుకులు కూతుళ్లతో వారి గృహస్థజీవితమెంతో ఆనందమయంగా కొనసాగుతుండేది. 
విధివ్రాతనెవరూ తప్పింపలేరుగదా, వారి ప్రశాంత జీవితంలో ఓవిషాద సంఘటన జరిగినది. 1921లో తమ ఇద్దరు పిల్లలు జయరాం, సావిత్రి ఆడుకొంటూ  పెరటి బావిలోపడి మునిగిపోయారు. అనుకోని ఈ భయానక విపత్తు వారిని దిగ్బ్రాంతికి గురిజేసినది. ఈ దుర్ఘనట యనంతరము మిగుల రాబడినిచ్చెడి తమ న్యాయవృత్తిని వదలి వేశారు, రాజకీయ సామాజిక సేవలనుండి వైదొలిగారు.  మిగిలిన  కూతుళ్లు, కొడుకులు తమతమ జీవితాలలో గౌరవప్రదంగా   స్థిరపడినారు. కాని వారుమాత్రం లౌకిక జీవితం పట్ల మిగుల వైరాగ్యం పెంచుకొన్నారు. మనఃశాంతికై  లక్ష్మీనారాయణ దేవాలయ నిర్మాణములో బాధ్యతల పంచుకొని పూర్తిజేశారు. 

ఆధ్యాత్మిక జీవితం పట్ల ఆసక్తి పెంచుకొని సద్గురుని వెదుకుచూ 1925లో  యిల్లు వదలినారు. జగద్గురు నరసింహ భారతి ని కలిసి వారిసలహాపై  తిరువన్నామలై లోని రమణ మహర్షిని సందర్శించారు. అచటి గుహలో మూడేండ్లు  మౌనం పాటించి వేదాంతభావన పట్ల తమ దృష్టి మరల్చారు. ఆసమయంలో  రమణుల జీవిత గాధను  "  ఆత్మసాక్షాత్కారము " పేరుతొ ఆంగ్లంలో రచించారు. వారి రచన యనంతరము దేశనలుమూలలా, యూరప్ అమెరికాలాంటి  విదేశములలో పెక్కుమంది రమణ మహర్షి గూర్చి తెలిసికొన్నారు. ఆయా దేశాలనుండి పెక్కుమంది  భక్తులు తిరువణ్ణామలైకి రాసాగారు. 

ఆపై నరసింహస్వామి పండరీపుర విఠలుని దర్శించి అక్కడినుండి పూనావద్దనున్న ఖేడ్ గాం నివాసి సద్గురునారాయణ మహారాజ్ ను కలుస్తారు. తరువాత వారిసలహాపై అహమద్ నగర్ సమీపమునున్న మెహర్ బాబాను కలుస్తారు. అచట కొంతకాలమున్నపిమ్మట వారి గురువైన శ్రీ ఉపాసనీ బాబాను సకోరిలో 1933లో కలిసి కొంత కాలమచట గడుపుతారు. అలా ఎలాంటి ధ్యేయమూ, దిశా లేకుండా వారి అన్వేషణ కొనసాగినది. ఆసమయంలోనే శ్రీ సాయిబాబాగూర్చి ఉపాసనీ బాబానుండి వింటారు. సాయిబాబానే వారికి గురువని గ్రహించి, ఉపాసను మహారాజునంతటి మహాత్ముని జేసిన సాయిబాబా ఎంతటి గొప్పవారోయని యోచిస్తారు.  ఉపాసని మహారాజ్ పట్ల కృతజ్ఞతతో వారిపై   ' సాకోరి సంతు ' యను పుస్తకం వ్రాసారు. ఆపిమ్మట వారి యనుమతి ఆశీస్సులతో శిరిడీ వెళ్లారు. 

1936లో వారు శిరిడీ సాయిబాబా సమాధిసందర్శించి సమయం మరచి  మౌనంగా అలా ఉండిపోయారు. అదే వారి గమ్యస్థానం, వారిజీవితంలో ఎప్పటినుండో కాంక్షిస్తున్న, ఎదురుజూస్తున్న మరువలేని అత్యంత ప్రశాంత క్షణాలు. గూడు గట్టిన విషాద ఛాయలు తొలగి పోయాయి, వారి హృదయాన్ని సాయిబాబా పరమ శాంతితో నింపారు. ఆవిధముగా వారి అన్వేషణ ముగిసినది;  నరసింహస్వామి సాయిబాబాలో తమ సద్గురుని కనుగొన్నారు, వారితో తాదాత్మ్యం చెందారు! 

Ref :   Bondada Janardhana Rao on Sri B.V.Narasimha Swami

నీసన్నిధి యెంతో... హాయి
నీ సన్నిధి శాంతుల వనము, నీచూపే చందన సమము
నీతలపే పరిమళసుమము  నీనామమె భవభయ హరణం
సాయి సాయి సాయీ... నీసన్నిధి యెంతో... హాయి

శిరిడియే  బృందావనము   బహులీలల గోకుల జగము
ద్వారకమయి మహి ఘనము గోవిందుని క్రీడల గృహము
సాయి సాయి సాయీ... నీసన్నిధి యెంతో ... హాయి

ఆర్తికి నీవే దైవం   అర్ధార్ధికి నీవే భాగ్యం
జ్ఞానికి నీవే ధ్యేయం   మూ .. ముక్షుకు నీవే మోక్షం
సాయి సాయి సాయీ... నీసన్నిధి యెంతో ... హాయి

శ్రీసాయికరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!

Your feedback greatly helps for improvement of the blog , please write your opinion in the comments section below and share if you like.  ( మీ సలహా  మిగుల విలువైనది, క్రింది కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయము తెలియపరచగలరు. నచ్చితే తెలిసినవారితో  పంచుకోండి.)
శ్రీ బి.వి. నరసింహస్వామి


Comments

  1. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు !

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)