సాయి కథలు - " నా ఖజానా నిండుగా నున్నది "

శ్రీసాయినాథాయనమః 

పాఠకమహాశయులెల్లరకు దీపావళి శుభాకాంక్షలు!
సాయి కథలు -  " నా ఖజానా నిండుగా నున్నది "
" మహాత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే ! " శ్రీ సాయి చరిత్రము

" నా ఖజానా నిండుగా నున్నది " ఈ మాటాలన్నదెవరో కాదు, సాక్షాతూ సద్గురు సాయిబాబానే! వేరు వేరు సందర్భాలలో బాబా భక్తులతో చెప్పిన మాటల పరిశీలిద్దాము. "  నా ఖజానా నిండుగా నున్నది. ఎవరికేది కావలసిన దానిని వారికివ్వగలను. కాని వాని యోగ్యత నేను మొదట పరీక్షించవలెను. " శ్రీ సాయి సచ్చరిత్రము 16-17 అధ్యాయములు. "  నాసర్కారు యొక్క ఖజానా ( ఆధ్యాత్మిక ధనము ) నిండుగా నున్నది. అది యంచువరకు నిండి పొంగిపోవుచున్నది.  నేను ' త్రవ్వి ఈధనమును బండ్లతో తీసుకపొండు. సుపుత్రుడైనవాడు ఈ ద్రవ్యము నంతయు దాచుకొనవలెను.' అనుచున్నాను. " 32వఅధ్యాయము. బాబానుగూర్చి పూర్తిగా తెలియనివారికీమాటలు బహు వింతగా తోచవచ్చును. చూచువారలకు బాబా యొక్క సంపద  తేటతెల్లము. వారికున్నదల్లా చిరిగిపోయిన కఫ్ని, తలగుడ్డ, భిక్షాపాత్ర, తంబిరేకు డబ్బా, సటకా, చిలుంగొట్టం, కొద్దిపాటిపొగాకు; వారు నివసించేది పాతమజీదు,  కలసి భోంచేసేది కుక్కలు పిల్లులతో.  అలాంటపుడు బాబా పైమాటలెందుకన్నట్లు? తానసత్యమెన్నడు పలుకనినిగూడ చెప్పారు. ఈమాటల వెలుగులో కొద్దిలోతుగా  ఆలోచిద్దాము, వారి దాగిన ఖజానానుగూర్చి మనపరిధిలో శోధన జేదాము.  మానవతయే వారికున్నపెద్ద ఆభరణము. వారిది మిగుల దయా హృదయము. సర్వజీవులలో దేవుని జూసేవారు. అందరిబాధలనుభవించేవారు, అందరి హృదయవాసిగా యనుభవమిచ్చేవారు. దూరము దగ్గరాలేక అందరికీ దగ్గరయ్యేవారు. సమస్త దేవీదేవతా మూర్తులుగా దర్శనమిచ్చేవారు. యోగులందరి రూపము తమ స్వరూపమేనని రుజువు జేసెడి  వారు. సర్వజీవుల ఆకలి తమ ఆకలిగా భక్తులకనుభవమిచ్చేవారు. ఎదుటి వారి మనసుల దాగిన భావాలను తెరచినపుస్తకంలా చదివేవారు. పరుల రోగాలను తమ శరీరంపై జూపేవారు. అణకువనందు అగ్రేశ్వరులు,  రాజు పేదల భేదమెరుగనివారు. చిత్రంగా తమ  ప్రతిబొమ్మలోను, విగ్రహంలోనూ వారి   చైతన్యతను చాటెడివారు. 
భగవద్గీత 16వ అధ్యాయము, దైవాసుర సంపద్విభాగ యోగములో 26 గుణాలను దైవసంపత్తు లేక దైవధనముగా చెప్పబడినది. ఆ దైవ ధనలక్షణములు వరుసగా అభయము, చిత్తశుద్ధి, జ్ఞానయోగస్థితి, దానము, బాహేంద్రియ నిగ్రహము, జ్ఞానయజ్ఞము, ఉపనిషద్గీతాదుల పారాయణము, తపస్సు, కపటములేకుండుట, అహింస, సత్యము, కోపము లేకుండుట, త్యాగము, శాంతి, కొండెములు  చెప్పకుండుట, సమస్త ప్రాణులయెడ కరుణ, విషయవ్యామోహము లేకుండుట, మృదుస్వభావము, ధర్మ విరుద్ధ కార్యములలో లజ్జ గలిగియుండుట, చంచలస్వభావము లేకుండుట, బ్రహ్మతేజస్సు, ద్వంద్వములయందు సహనము, ఆపదకాలములోగూడ ధైర్యము కోల్పోకుండుట, బాహ్యంభతర శుచి, పరులకు ద్రోహము చేయకుండుట, అభిమానము లేకుండయు అనునవి.  సాయిబాబా జీవితమును నిశితముగా పరీక్షించిన పైన చెప్పబడిన దైవగుణములన్నియు వారిలో వెల్లివిరిసినవి.
మరోవిధంగాజూస్తే భగవంతుడు ఆరు లక్షణాలతో ప్రకాశిస్తాడని శాస్త్రాలలో చెప్పబడినది. అవి వరుసగా కీర్తి, ధనము, అభిమానము లేకుండుట, జ్ఞానము, మహిమ, ఔదార్యము. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మున్నగు అవతార పురుషులలో ఈ దైవలక్షణములను జనులు గాంచిరి. బాబా లోగూడ పైదైవ లక్షణములు పరిపూర్ణంగా నిండియున్నాయి.
బాబా మహాసమాధిచెంది 100 సంవత్సరములు నిండినప్పటికీ నిత్యం వేలాది భక్తులు శిరిడీ దర్శించి వారి మహిమల సమాధికి ప్రణమిల్లుచున్నారు, వారి యునికిని నిత్యం అనుభవిస్తున్నారు, ఆశీసులు రక్షణ నిత్యం పొందుచున్నారు. 24 గంటలు ప్రకాశించే సూర్యుడిలా వారి దైవశక్తి భూమండలమంతా అన్నివేళలా వ్యాప్తినొందినది, నొందుచున్నది.  జాతిభేదముల  కులమతముల హద్దులచెరపి, దైవమే సర్వాధికారి తాము వారి సేవకుడననెడి  భావమును నిత్యము నిలిపి తమను జూడవచ్చినవారల శారీరక, మానసిక రుగ్మతల దూరంజేస్తూ ఆధ్యాత్మిక  జ్ఞానదీపాల వెలుగులందిస్తూ  మానవరూపం ధరించిన దైవశక్తిమూసగా, పిలిచిన పలికే దైవంలా నిత్యనూతనంగా విరాజిల్లుచున్నారు. వారిది యెంతటి మహిమ, యెంతటి ఘనత. రాజాధిరాజులు, యోగిరాజులు, పరబ్రహ్మస్వరూపులు, సచ్చిదానందులు సాయినాథులు. తిరుమలేశుని సంపద కొలవలేక సొమ్మసిల్లిన గోవిందస్వామిలా , ఎవరు సాయి ఖజానాను కొలువగలరు, విలువగట్టగలరు?    వారి సంపద యంతులేనిది, వారి ఖజానా పొంగిపొరలుచున్నది. విలువకట్టలేని అలాంటి నిండైన ఖజానాను , బాబా ఎలా స్వాధీనపరచుకొన్నారు?  ఇది వారి  ఒక్కరోజు  శ్రమఫలితం కాదు. ఇంద్రియశక్తులన్నిటినీ  తమకన్నులలో కేంద్రీకరించి, నిద్రాహారాలు మరచి ఆ కేంద్రీకరణ శక్తితో  గురునిపై గురినిలిపి  పన్నెండేడ్లు సేవించారు.  ఇదియే గాదు, ఎన్నో పూర్వజన్మ పుణ్యఫలరాసులకు  వారసులు వారు.  బాబాది దయగల  మాతృహృదయంగావున తమ సంపాదనంతనూ తనవారలకు పంచాలని ఆరాటపడుతున్నారు, తమబిడ్డల రాకకై యెదురుచూపులతో నిరీక్షిస్తున్నారు.  వారి ఖజానానుండి ఓచిన్న నగను  పొందగలిగినా మనజన్మము ధన్యముగదా !  ఆ యోగ్యత , అర్హత  పొందుటకు  దీపావళి శుభసమయంలో  సంకల్పిద్దాము, వారుజూపిన పథంలో పయనిద్దాము !

శ్రీ సాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి! 

Your feedback greatly helps for improvement of the blog , please write your opinion in the comments section below and share if you like.  ( మీ సలహా  మిగుల విలువైనది, క్రింది కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయము తెలియపరచగలరు. నచ్చితే తెలిసినవారితో  పంచుకోండి.)


Comments

  1. కొండంత సాయిబాబా నిండైన ఖజానానుండి ఓచిన్నినగను దీపావళి కానుకగా పొందుదాము!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)