సాయి కథలు - అష్టసిద్ధులు

శ్రీసాయినాథాయనమః

సాయి కథలు - అష్టసిద్ధులు
" మహాత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే ! "   శ్రీ సాయి సచ్చరిత్రము 

భగవత్ప్రాప్తికి ఋషులు వివరించిన యోగ  మార్గములలో రాజయోగమొక మార్గము. షుమారు 5 వేల సంవత్సరాలకు పూర్వము పతాంజలి మహర్షిచే సంకలీకరింపబడిన రాజయోగము( పతాంజలి యోగసూత్రములు ) నకు అష్టాంగయోగమనియు పేరుగలదు. ఇందు 8 భాగములున్నవి. అవి వరుసగా యమ, నియమ, ఆసన, ప్రాణయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. పతాంజలి యోగసూత్రముల ననుసరించు సాధకులు చివరిదశ యైన సమాధిస్థితి పొందుసమయమునకు పెక్కు సిద్ధులు లేక శక్తుల పొందెదరు. వానిని అష్టసిద్ధులని యంటారు. 
అష్టసిద్ధులు 8, అవి వరుసగా
అణిమ: అనుమాత్రపు లేక అంతకంటే తక్కువ పరిమాణము పొందుట, అనగా అతిసూక్ష్మ రూపము దాల్చుట
( సీతాన్వేషణలో హనుమ ఈ సిద్ధి చూపారు)
మహిమ: అత్యంత వ్యాపక రూపము ధరించుట ( శ్రీకృష్ణుని విశ్వరూప ప్రదర్శనము)
గరిమ: సంకల్పమాత్రముచే అత్యంత బరువును పొందుట ( హనుమంతుని వాలమును భీముడు ఎత్తలేకపోవుట)
లఘిమ: అత్యల్ప భారస్థితిని పొందుట, గాలిలో ఎగురుట మున్నగు చర్యలు ( అడ్డ బల్లపై బాబా నిదుర )
ప్రాప్తి: తాను కాంషించిన  ఏ వస్తువును యెచటనైనను  పొందగల శక్తి
ప్రాకామ్య: తాను తలచిన దేనినైనను పొందుశక్తి, కలలను సాకారముజేయగల సామర్ధ్యము
ఈషిత్వ: సమస్త సృష్టిపై సార్వభౌమత్వము కలిగియుండు సామర్ధ్యము
వషిత్వ: పాంచభౌతిక సృష్టి తదితరములను   స్వాధీనమునందుంచగల శక్తి
వికసించే పుష్పానికి సౌగంధమబ్బినటుల యోగమార్గంలో  సిద్ధులు అప్రయత్నంగానే ప్రాప్తిస్తాయి, కాని సరియైన యోగసాధకుడు సాధనను ప్రక్కదారుల మళ్ళించు సిద్ధులజోలికి వెళ్ళక తన యోగమార్గం కొనసాగిస్తాడు. ఈ క్రమంలోనే సాయిబాబాకు సహజంగానే పెక్కు సిద్ధులు  కలిగాయి. సాయిబాబా తమకు లభించిన  సిద్ధులను భక్తుల శ్రేయస్సునకు, వారిసన్మార్గములో నుంచుటకు కొన్ని సందర్భములలో వారికి వినోదము కలిగించుటకు ఉపయోగించారేగాని, తమ ప్రతిభను  చాచుటకుగాని, అన్యులకు కీడు కల్గించుటకుగాని ఎన్నడూ ప్రదర్శింపలేదు. అలానే అలాంటి సిద్ధులను జూపువారల నిరసించారు, నిందించారు. కుశాభావు యనే వ్యక్తిని  తానునేర్చుకున్న సిద్ధులను గోదావరిలో విడుచు వరకు స్వీకరింపలేదు. అలాగే ఒక సాధకుడు యోగమభ్యసిస్తూయుంటే దూరదృష్టి లభించినది, దూరాన తన యంత్రశాల తగలబడుతూ వుంటే అతడు ధ్యానంలో చూడగలిగాడు. అతడు శిరిడీ వచ్చినపుడు బాబా, " ఎందుకా వేశ్య ప్రదర్శనలను చూస్తావు? నేనెన్నడూ అలా చేయను, అదెవరికీ తగదు" అన్నారు.
సిద్ధుల విషయమై రామకృష్ణ పరమహంస అనుభవాలను, వారి అభిప్రాయమునిచట జూసెదము. పరమహంస వారి తంత్ర సాధన పూర్తియైన పిమ్మట ( షుమారు 1864వ సంవత్సరములో )  అణిమాది  సిద్ధుల పొందారు. ఓరోజు తమ మేనల్లుడు హృదయ్ కోరికమేరకు కాళీమాతను (మాతను ప్రత్యక్షంగా చూసి  మాట్లాడేవారు)   తాము సిద్ధుల ప్రదర్శించుట తగునాయని ప్రశ్నించారు. సిద్ధులు వేశ్యప్రదర్శనలాంటివని, కావున తప్పక నిరసించాలనెడి సమాధానమును మాతనుండి పొందారు. ఆరోజునుండి సిద్దులపట్ల తీవ్ర హేయభావం పెంపొందించుకొన్నారు. ఓరోజు స్వామీ వివేకానందాను ఏకాంతంగా పంచవటి (5 వృక్షాల తోట) వద్దకు రామకృష్ణ పిలిపించి యిట్లన్నారు , " చూడు నరేంద్రా!  నేను అష్టసిద్ధుల పొందాను.  కాని ఎంతోకాలం క్రితమే ఆశక్తుల చూపుట తగదని నిర్ణయించుకొన్నాను, నాకు వాటి అవసరంకూడా లేదు. కాని నీవు మన మత , ధర్మ ప్రచారం   తోపాటు ఎన్నోపనులు చేయాలి. ఆశక్తులన్నిటిని నీకివ్వాలని సంకల్పించాను, కావున దయతో అంగీకరింపుము . "   " గురుదేవా ఆ శక్తులు నాకు దైవాన్ని చూపగలవా? " నరేంద్రుని ప్రశ్న.  ఆయా సిద్ధులు  మతవ్యాప్తికి కొంతవరకు దోహదపడినా భగవంతుని చూపలేవని గ్రహించుటచే నరేంద్రుడు సిద్ధులను తిరస్కరించాడు.  నరేంద్రుని నిర్ణయానికి పరమహంస యెంతో సంతోషించారు. నకిలీ స్వాములతో, సిద్ధులతో అమాయకులెందరో మోసపోవుచున్నారు కదా!

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి ! 





Comments

  1. నకిలీ స్వాములు, మోసపూరిత గురువులతో తస్మాత్ జాగ్రత !

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము 51 (Nectar of Sri Sai's message 51)