సాయి కథలు - సాయిసన్నిధి, చిక్కుముడి పరిష్కారము

శ్రీసాయినాథాయనమః 

నేడు పరమపూజ్య శ్రీ ఎక్కిరాల భరద్వాజగారి జయంతి
సాయి కథలు - సాయిసన్నిధిలో చిక్కుముడి పరిష్కారము
" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము 


సాయి భక్తులచే  ప్రేమగా పిలవబడే సాయిమాస్టారు ( శ్రీ ఎక్కిరాల  భరద్వాజ)  గారి చిన్ననాటి అనుభవమిది.  కౌమారదశనుండి వారిని  ఓ ప్రశ్న నిత్యం వేధిస్తూ ఉండేదట, వివరాల్లోకెళదాం. ఇది ధర్మానికి సంబంధించిన సందేహం. విషయానికొస్తే రామాయణ గాథలో శ్రీరామచంద్రుడు ధర్మాచరణకు మారుపేరు, ఆయనకు సకల శాస్త్రాల, ధర్మాల విశేష జ్ఞానముంది. రాజ్యాభిషేకానికి సంబంధించి,  రాజు తదనంతరము రాజ్యము పెద్దకొడుకునకు సంక్రమింపవలె. కాని తండ్రి దశరథుడు తన మూడవ భార్య కైకేయి కిచ్చిన మాటచే భరతునకు రాజ్యం సంక్రమిస్తుంది. ధర్మపరంగా, న్యాయపరంగా రాజ్యాధికారానికి  తామే అర్హులమని శ్రీరామునకు తెలిసినప్పటికీ, పితృవాక్య పరిపాలన ( పెద్దలమాటను పాటింపవలె ) ననెడి మిషచే భరతుని రాజునిజేసి తాను సీతా లక్ష్మణ సమేతంగా వనవాసానికెళ్తాడు. ఈ ఘటన రామాయణ కాలంలో జరిగిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఇపుడు మహాభారతగాథను పరిశీలిద్దాం. పాండవ కౌరవులమధ్య సయోధ్య కుదరక కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణుడు అర్జునికి  రథసారథిగా బాధ్యత స్వీకరిస్తాడు. శత్రురాజులలోని తన  తండ్రుల, సోదరుల అన్య బంధు మిత్రులజూసిన పిమ్మట అర్జునుడు మిగుల దుఃఖితుడై, వారిని చంపలేనని గాండీవం త్యజిస్తాడు. అపుడు శ్రీకృష్ణుడు అర్జునునకు గీతోపదేశం చేస్తూ, ధర్మపరంగా జరిగే యుద్ధంలో  వీరుడైనవాడు  ధర్మ రక్షణకై శత్రువర్గంలోని పెద్దలను,గురుతుల్యులను, తండ్రి దాయాదులను, బంధుమిత్రులను  వధించుటలో ఎలాంటి పాపమంటదు గావున శత్రుపక్ష దుర్యోధనాదులతో  యుద్ధానికి ప్రోత్సహిస్తాడు, అనగా ఇచట రామాయణకాలంనాటి శ్రీరాముని  పితృవాక్యపరిపాలన యనగా పెద్దలగౌరవింప వలెనన్న ధర్మసూత్రానికి వ్యతిరేకంగా కృష్ణుడు ధర్మరక్షణ  కోసం పెద్దలతో యుద్ధం జేయమని  బోధిస్తాడు. ఈపై చెప్పబడిన  రామాయణ,  భారత సన్నివేశాలను విశ్లేషిస్తే  శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పరస్పర విరుద్ధ ధర్మాలను  బోధించినటుల కన్పిస్తుంది. శ్రీరాముని సిద్ధాంతం పాటిస్తే శ్రీకృష్ణుని భాష్యం పొరపాటనిపిస్తుంది, అలాగే శ్రీకృష్ణుని  సలహాపై అర్జునుడు యుద్ధం జేస్తే శ్రీరాముని నిర్ణయంలో లోపం కనిపిస్తుంది. ఈవిషయమొక చిక్కుముడిగా గోచరిస్తుంది. ఇదీ భరద్వాజగారిని యేళ్ళ తరబడి వేధించిన సమస్య.  సమాధానానికై యెందరో పెద్దల, పండితులవద్దకు వెళ్ళాడు, కాని ఎవరూ తృప్తికరంగా సమాధానమివ్వలేకపోయారు. ఎన్నో యేండ్లు ఈ సమస్యను తన  మస్తిష్కంలో మోస్తూ ఓపరి శిరిడీ వెళ్లి ద్వారకామాయిలోని బాబా పాదుకలకు నమస్కరిస్తుంటే వారికిలా అనిపించింది, "  బాబా నీవు ఎంతోకాలంక్రితం సమాధిచెందినా, నిత్యం పాదుకలచే నీ  భక్తులను  పాలిస్తున్నావు, నీపాద సేవచే వారిని రక్షిస్తున్నావు ! "   ఈ ఆలోచన వచ్చిన మరుక్షణం భరద్వాజగారి  మనసులో ఓ మెరుపులాంటి యూహమెదిలి  పైన వివరించుకొన్న సమస్యకు పరిష్కారం లభించినది. ఇపుడు సాయిమాష్టారు గారికి  వచ్చిన మెరుపులాంటి  వూహేమిటో చూద్దాం.  శ్రీరామచంద్రుడు రాజ్యము వదలి వనవాసానికెళ్లినటుల లోకానికి గోచరించినా, సూక్ష్మంగా గమనిస్తే తానే భరతుని నిమిత్తునిజేసి తమపాదుకలతో  పాలించారు. అనగా ధర్మపరంగా,  పెద్దకుమారునిగా రాజ్యమేలారు. పాదుకలతో పదునాలుగేండ్లు పాలనజేసి, తమ అవతారకార్యమైన  రావణాది రాక్షస సంహారముజేసిన పిమ్మట అయోధ్యకు మరలివచ్చి    రామరాజ్య సుపరిపాలన కొనసాగించారు. పాఠకులారా చూసాం గదా బాబాసన్నిధిలో చిక్కుముడెలా వీడినదో !           
శ్రీసాయిమాష్టరుగారి  ఆడియో ప్రవచనములనుండి 

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి! 

Your feedback greatly helps for improvement of the blog , please write your opinion in the comments section below and share if you like.  ( మీ సలహా  మిగుల విలువైనది, క్రింది కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయము తెలియపరచగలరు. నచ్చితే తెలిసినవారితో  పంచుకోండి.)



శ్రీ ఎక్కిరాల  భరద్వాజ

Comments

  1. సాయిమాష్టరుగా భక్తులచే ప్రేమగా పిలువబడే సాయిభక్తి మార్గదర్శి శ్రీ ఎక్కిరాల భరద్వాజగారి పవిత్రజయంతి నేడు !

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)