సాయి కథలు - గురుస్పర్శ ప్రభావము 1

శ్రీసాయినాథాయనమః

సాయి కథలు - గురుస్పర్శ ప్రభావము 1
" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము
" సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి  భేదభావమును నశింపజేసి, అప్రాప్యమును ప్రాప్తిపజేయును."

బాబా సపత్నేకర్ తలపై హస్తముంచి యోదార్చి యిట్లనియె. " ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచుము. నీ మనోభీష్టములు నెరవేరును. "  సంతానలేమిచే దుఃఖపడు యాతనికి ఒక సంవత్సరములో కొడుకు పుట్టెను. 

   గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః  గురుదేవో మహేశ్వరః 
గురుస్సాక్షాత్  పరబ్రహ్మా  తస్మై శ్రీగురవేనమః

( గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు, గురువే సాక్షాత్తు విశ్వ మూలకారణ పరబ్రహ్మ.  అలాంటి గురువరేణ్యునకు నా నమస్కారములు.)

శరణం శరణం గురుచరణం 

శరణం శరణం  శరణం శరణం 
సాయీచరణం ...శరణం శరణం 
భవభయహరణం  బహుశుభకరణం 
బాబాచరణం   పావన తీర్ధం                         || శరణం శరణం ||     
కలిమలతరణం  కామితవరదం  
కరుణకునిలయం  కాలాతీతం                     || శరణం శరణం ||     
పరమపవిత్రం  పావన చరితం 
చిత్రవిచిత్రం  లీలలక్షేత్రం                             || శరణం శరణం ||     

దైవస్పర్శ ప్రభావము మరియు  శక్తి,   రామాయణ మహాభాగవత సద్గ్రంధములందు సోదాహరణముగా వివరింపబడినది. శ్రీరామచంద్రుని పాదస్పర్శచే శిలారూపము దాల్చిన అహల్య సుందరమూర్తిగా శాపవిమోచనం పొందినది. శ్రీకృష్ణుడు కురూపి కుబ్జను తాకి సౌందర్యరూపిణిగా మార్చాడు.
" గురుహస్తస్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడ కాలనట్టి  వాసనామయమైన సూక్ష్మశరీరము గురుకరస్పర్శ తగులగనే భస్మమైపోవును. అనేకజన్మార్జిత పాపసంచయము పటాపంచలైపోవును. "
శ్రీ సాయి సచ్చరిత్రము, 6వ అధ్యాయము
ఇందులకు శ్రీ సాయి సచ్చరిత్రములోని 2వ అధ్యాయమున చక్కటి యుదాహరణము లభించును. సచ్చరిత్ర రచయిత హేమాడ్ పంతు అనుభవమునొకసారి స్మరించెదము. 1910వ సంవత్సరమున అతడు మొట్టమొదట సాయిబాబాను జూసెను, అప్పటియాతని స్మృతులిలాయున్నాయి. " నేను పోయి బాబాపాదములకు   సాష్టాంగ నమస్కారము జేసితిని. నాలో ఆనందము పొంగిపొరలినది. నానాసాహెబు చాందోర్కరు చెప్పినదానికన్ననూ ఎన్నోరెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తిచెంది యాకలి దప్పికలు మరచితిని. మనస్సుకు సంతుష్టి కలిగెను. బాబాపాదములు పట్టినవెంటనే నాజీవితములో గొప్పమార్పు కలిగెను. ... నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనమువల్ల కలుగు చిత్రమేమన మనలోయున్న ఆలోచనలు మారిపోవును. వెనుకటిజన్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నాపూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనము లభించినదనుకొంటిని. సాయిబాబాను చూచినంతమాత్రముననే నీ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను. "

భగవాన్ శ్రీ రమణమహర్షి 


శ్రీరమణ మహర్షిని భగవంతునిగా గుర్తించి వారిని భగవాన్ రమణులుగా పూజించి  సేవించిన వ్యక్తి  గణపతి ముని యని   మహర్షి అసంఖ్యాక  అనుచరులకు , ప్రచారకులకు,  శిష్యులకు,  అంకితభక్తులకు , చరిత్రకారులకు తెలిసిన విషయమే.  రమణమహర్షిని ప్రధమ పాశ్చాత్య ఇంగ్లీష్ వ్యక్తి ఫ్రాంక్ హంఫ్రీస్ కు పరిచయముజేసినదికూడా గణపతి మునియే.
గణపతిముని ప్రఖ్యాత సంస్కృత విద్వాంసుడు, మరియు కవి. వాని జ్ఞాపకశక్తి మహాద్భుతమైనది. తెలుగు అక్షరాలుకూడా తెలియని ముని కేవలం 15 రోజుల్లోనే రాయడం, ధారళంగా మాట్లాడటం నేర్చారు. 1904వ సంవత్సరంలో వెల్లూర్ నగరంలో తెలుగు బోధకునిగా నియమితులైనారు.  బోధనా వృత్తి విడచి , 1907 లో తనమంత్రజపము కొనసాగించుటకు అరుణాచలము వెళ్లారు. ఓరోజున ఆయన తన బాధల, కష్టాల, సందేహాల దీర్చుకొనుటకై అరుణాచల సమీపగుహలో నివసించెడి యువస్వామి ( బ్రాహ్మణస్వామి / రమణ మహర్షి  ) ని సందర్శింప దలచాడు. నవంబరు 18, 1907 న విరూపాక్షాగుహలో   రమణుల గాంచి , వారికి సాష్టాంగ నమస్కారముజేసి యిట్లన్నారు.
" చదవదగ్గ గ్రంధములెల్ల జదివాను, చేయదగిన మంత్రజపముల జేసాను. ఇంతజేసినప్పటికీ నాకు శాంతి లభింపలేదు, దయచేసి నన్ను రక్షించండి."
యువస్వామి కొద్దిసమయంతీసికొని తర్వాత గణపతి మునిని తదేకంగా నిశ్శబ్దంగా 15నిముషాలు వీక్షించారు. పదకొండు సంవత్సరాలుగా తాము పాటించిన మౌనవ్రతమువీడి  మాట్లాడారు. " ఎపుడైతే మనిషి ' నేను ' అనెడి భావము , యేమూలమునుండి  వస్తున్నదో  పరిశీలించినచో  ఆవ్యక్తి మనసు ఆ మూలములో లయిస్తుంది. అదియే తపస్సు. మంత్రం జపించేటపుడు నీలో యెచటినుండి ఆధ్వని వెలువడుతుందో గమనించుము.  ధ్యానశ్లోకాన్నిగాని,  భక్తిగీతాన్నిగాని   ఆలాపన జేయునపుడు యెచటినుండి  ఉద్భవిస్తుందో పరిశీలించుము, అదే నీహృదయ స్థానము. దానిపైనే నీయెరుక, నీశ్రద్ధ  నిలుపుము. అదియే  త్యాగము, అదియే  తపస్సు. తెలియవలసినదంతే  !
రమణుల దర్శించినపిమ్మట గణపతిమునికి సందేహనివృత్తి కలిగి ప్రశాంతిచిత్తుడై ,  గొప్ప రమణ భక్తులైనారు.
(ప్రధమ దర్శనమైన ఓ సంవత్సరము తరువాత గణపతిముని రమణమహర్షి యొక్క కరుణాకటాక్షాల గొప్పయనుభవము పొందాడు. తిరువత్తియూరు గణపతి దేవాలయంలో ధ్యానం జేస్తుంటే యాతని మనసు పరిపరివిధముల చాంచల్యం పొందగా, ముని  రమణుల దర్శనాన్ని మరియు  వారి సహాయాన్ని తీవ్రంగా కోరుకున్నాడు. ఆక్షణాన  దేవాలయంలో రమణులు ప్రత్యక్షమైనారు. గణపతిముని   పాదాభివందనముజేసి పైకి లేస్తుండగా వాని తలను  మహర్షి మృదువుగా స్పృశించారు. ఆమృదుస్పర్శచే  గణపతిముని శరీరంలో విపరీత విద్యుత్తులాంటి శక్తిపాతము జరిగినది. ఆవిధముగా రమణమహర్షి స్పర్శనుఆశీస్సులను పొందినధన్యజీవి గణపతిముని.)  

Your feedback greatly helps for improvement of the blog , please write your opinion in the comments section below and share if you like.  ( మీ సలహా  మిగుల విలువైనది, క్రింది కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయము తెలియపరచగలరు. నచ్చితే తెలిసినవారితో  పంచుకోండి.)

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి


శ్రీరాముని పాదస్పర్శచే అహల్య శాపవిమోచన 



Comments

  1. మానవాళికి మార్గదర్శులైన ప్రపంచమందలి సద్గురువు లెల్లరకు పాదాభివందనము !

    ReplyDelete

Post a Comment