సాయి కథలు - ఆహారశుద్ధి

శ్రీసాయినాథాయనమః 

సాయి కథలు - ఆహారశుద్ధి 

" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము 
       
 ఆత్మశుద్ధిలేని ఆచారమదియేల ?
 భాండశుద్ధిలేని పాకమేల?
 చిత్తశుద్దిలేని శివపూజలేలరా?
 విశ్వదాభిరామ వినురవేమ.                                                          

ఆహారవిషయమై మహాత్ముల అభిప్రాయములను, భగవద్గీత సందేశమును తెలిసికొందము. ముందుగా సాయిబాబా యీవిషయమై ఏమిచెప్పారో చూచెదము. " ఒక అనుభవములేని యోగసాధకుడు, నానాసాహెబు చాందోర్కరునితో కలసి మసీదుకుబోయి సాయిను జూచుసరికి  బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి. దీనిని చూడగనే అతనికి మనస్సున ఒక యాలోచన మెదలెను. ' రుచిలేని రొట్టెను పచ్చి యుల్లిపాయతో తినువాడు నాకష్టముల నెట్లు తీర్చగలడు? నన్నెట్లు ఉద్ధరించగలడు? ' సాయిబాబా యతని మనసున మెదిలిన ఆలోచనను గ్రహించి , నానాసాహెబుతో నిట్లనియెను.  " నానా!  యెవరికైతే  ఉల్లిని జీర్ణించుకొను శక్తిగలదో వారే దానిని తినవలెను. "  ఇదివిని యోగి మిగుల ఆశ్చర్యపడి బాబాను సర్వస్య శరణాగతికోరి బాబా ఊదీ, ప్రసాదములతో తిరిగివెళ్ళాడు. "  శ్రీ సాయి సచ్చరిత్రము 23వ అధ్యాయము.
" సాయిబాబా ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు. మరొకప్పుడు మాంసపు పులావు వండేవారు. శాకాహారులకు శాకాహారము, మాంసాహారులకు మాంసాహారము పెట్టెడివారు, ఎవరినీ బలవంతము జేసెడివారుగాదు. "  శ్రీ సాయి సచ్చరిత్రము 38వ అధ్యాయము

ఆహారవిషయమున రామకృష్ణ పరమహంస యోచన లేక బోధ
ఓ పర్యాయము కలకత్తాలోని  మార్వాడీ భక్తులు శ్రీరామకృష్ణ పరమహంసను దర్శించారు. వస్తూ వారికి సమర్పించుటకై  బాదాం, పిస్తా, ఎండుద్రాక్షలు మరియు వివిధరకాల స్వీట్స్  తెచ్చారు. కాని రామకృష్ణులు వానిలో ఏ ఒక్క దానిని స్వీకరింపలేదు. అంతేగాక పక్కనున్న వారి శిష్యులకు కూడా పంచలేదు. కొంతకాలం తర్వాత వారిశిష్యులతో  రామకృష్ణులిలా చెప్పారు, "  ఏమీ ఆశించకుండా కానుకలెలా తేవాలో వారికి తెలియదు.  ఓ మహాత్మునికి తాంబూలము సమర్పించాలంటే దానికి పదహారు కోర్కెల జతజేస్తారు. ఎవరైతే అలాంటి ప్రాపంచిక మనుష్యులు సమర్పించిన వానిని  తింటారో వారి పుణ్యం, భక్తి నశిస్తాయి . "  మరి అపుడు  ఆయా పదార్ధములనేమి జేయాలనే ప్రశ్న కలుగుతుంది. " నరేంద్రుని (స్వామి వివేకానందునకు) కివ్వండి, తినిననూ వానికెలాంటి హాని జరుగదు. "  రామకృష్ణులన్నారు.
ఓరోజు నరేంద్రుడు హోటల్లో భోంచేసి తాను నిషిద్ధాహారము తినినట్లు రామకృష్ణులకు తెలియబరచుతాడు. అటులజేయుటలో, రామకృష్ణులు వానిని తాకక దూరంగా వుంటారనేది వాని యోచన. అందులకు రామక్రిష్ణులెలాంటి వ్యాఖ్యజేసారో చుడండి, " దానివలన నీకెలాంటి హానిజరుగదు. దేవునిపై మనసు లయంజేసిన వ్యక్తి ఎలాంటి మాంసాహారము తినినప్పటికీ యది పరమాన్నం  తినుటతో సమానము.  అలాగే ప్రాపంచిక కోర్కెల మునిగిన వ్యక్తి కందమూలాలు లేక కూరగాయలు తిన్నప్పటికీ వాడు మాంసాహారము తిన్నట్లే !  కావున నీవెలాంటి నిషిద్ధాహారము తినిననూ యేదోషం కలుగదు. ఇదే మిగతా శిష్యులెవరు జేసినా వారిని తాకేవానిగాను ". నరేంద్రుడు నిత్యసిద్ధుడు, ధ్యానసిద్ధునిగా రామకృష్ణులు చెప్పేవారు. నరేంద్రుడు తినెడి ఆహారపదార్ధముల దోషములు వాని ప్రజ్వల  జ్ఞానాగ్నిలో  దహింపబడతాయి. కావున  ఎచటనైనా, యెలాంటిదైనా తినెడి ఆహారము వాని శుద్ధమనసును కలుషపరచజాలదు. నరేంద్రుడు తన జ్ఞాన ఖడ్గముచే మాయను చీల్చిచెండాడుతాడు గావున  మహామాయ వానిని బంధింపలేదు, మోహింపలేదు.

భగవద్గీతలో మూడు విధముల ఆహారములు వివరింపబడినవి, అవి వరుసగా సాత్విక, రాజసిక మరియు  తామసిక  ఆహారములు.  మరియును మనుజుల గుణములు మూడువిధములుగ  గీతయందు జెప్పబడినవి. అవి సాత్విక, రాజసిక, తామసికములు. సాత్విక గుణప్రధానులు సాత్వికాహారమును , రాజసిక ప్రవృత్తిగలవారు రాజసికాహారమును, తామసిక స్వాభావికులు  తామసికాహారము నిష్టపడేదరనియు  వివరింపబడినది.
(  విభీషణుడు సాత్వికగుణానికి, రావణుడు రాజసిక గుణానికి, కుంభకర్ణుడు తామసిక గుణానికి సంకేతంగా నిలుస్తారని రామాయణంలో   చెప్పబడినది. ) ఆహారముకంటెను గుణమే ప్రధానమని బోధించడమైనది. కేవలము తినెడి ఆహారముచే వ్యక్తి  యొక్క ప్రవృత్తిమారదనెడిది సర్వులెరిగిన సత్యము.

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి! 

శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ మహాసమాధి , నవంబర్ 13, 2010 

Comments

  1. మంచి ఆలోచనలతో, ఆశయాలతో మనసు పవిత్రమౌతుందికాని కేవల ఆహారనియమాలతో కాదు !

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)