సాయి కథలు - గురుస్పర్శ ప్రభావము 2

శ్రీసాయినాథాయనమః

సాయి కథలు - గురుస్పర్శ ప్రభావము  2

" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము
" సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి  భేదభావమును నశింపజేసి, అప్రాప్యమును ప్రాప్తిపజేయును."  

దైవస్పర్శ ప్రభావము మరియు  శక్తి,   రామాయణ మహాభాగవత సద్గ్రంధములందు సోదాహరణముగా వివరింపబడినది. శ్రీరామచంద్రుని పాదస్పర్శచే శిలారూపము దాల్చిన అహల్య సుందరమూర్తిగా శాపవిమోచనం పొందినది. శ్రీకృష్ణుడు కురూపి కుబ్జను తాకి సౌందర్యరూపిణిగా మార్చారు.
ఈభాగమునందు శ్రీరామకృష్ణ పరమహంస  నరేంద్రుని (స్వామి వివేకానంద) స్పృశించి తమశక్తిని చొప్పించి వానికి దివ్యదైవదర్శనం కల్గించిన  వివరములను పరిశీలించెదము.
శ్రీరామకృష్ణ పరమహంస వివేకానందుల ప్రధమ కలయిక
ఎల్లప్పుడూ దైవావస్థలో విలసిల్లే రామకృష్ణులకు వారు కాంక్షించే  తమ రాబోయే మరియు కాబోయే శిష్యుల ఆగమన వివరములు బాగుగ తెలియును. కలకత్తాలోని సిమ్లా ప్రాంతానికి చెందిన సురేంద్రనాథ్ మిత్ర దక్షిణేశ్వరిలోని రామకృష్ణుల మొట్టమొదట దర్శనముతోనే  మిగుల ఆకర్షితుడైనాడు. ఆపిదప రామకృష్ణులను తమయింటికి ఆహ్వానించి గొప్ప పండుగసంబరం ఏర్పాటు జేశాడు. ఆవేడుకలో చక్కగా భక్తిపాటల  పాడెడు  గాయకుడు లభింపనందున తనపొరుగువాడగు విశ్వనాధ్ దత్త పుత్రుడు నరేంద్రను ఆహ్వానించాడు. మహాగురుశిష్యుల దైవయోగ ప్రధమ కలయిక ఆవిధంగా 1881 నవంబరు మాసంలో  సంభవించినది. నరేంద్రుడపుడు తన
F. A.  పరీక్షకు సిద్ధమౌతున్నాడు. ప్రధమ దర్శనంతోటే రామకృష్ణులు నరేంద్రునిపట్ల మిగుల ఆకర్షితులైనారు, దక్షిణేశ్వర్ కు ఆహ్వనించారు. ఆపై కొంతకాలానికి నరేంద్రుడు,  సురేంద్ర దత్త   మరికొందరు మిత్రులతో దక్షిణేశ్వర్లో  రామకృష్ణుల దర్శించాడు. తన రూపురేఖలు, ధరించిన  బట్టల కెలాంటి ప్రాధాన్యత నివ్వక తీవ్ర వైరాగ్యభావంతో  నిండిన నరేంద్రునిజూసి రామకృష్ణులు మిగుల చకితులైనారు. రామకృష్ణుల సమీపంలో నేలపై నరేంద్రుడు కూర్చొన్నాడు. రామకృష్ణుల కోరికపై తనకొచ్చిన బెంగాలీ పాటలలోని ఓభక్తిగీతాన్ని మిగుల తన్మయత్వంతో,  మధురకంఠంతో పాడారు. రామకృష్ణులు అదుపులేని  ఆనందంతో పరవశించారు. పిదప నరేంద్రుని చెయ్యిపట్టుకొని వేరొకగదిలోనికి తీసికెళ్ళి ఏకాంతంగా, "  నీవు ఇంత ఆలస్యంగానా వచ్చేది? ఇది సబబా? నేనునీకొరకై యెంత వేచియున్నానో తెలుసా? ప్రాపంచిక మనుష్యుల సంభాషణలతో నాచెవులు పగిలిపోతున్నాయి. నీవెవరవో నాకుతెలుసు. నీవు నారాయణావతార  ప్రాచీన ఋషి నరుడవు. మానవాళి దుఃఖోపశమనానికై భూమిపై జన్మించావు.....  " అంటూ  వ్యధాభరిత హృదయంతో  రోదించారు. వారిమాటలకు నరేంద్రునికి నోటమాటరాలేదు, ' ఏమి? ఈయన పిచ్చివాడా? ' యనుసందేహం కలిగినది.    నరేంద్రుడు వెడలినపిమ్మట రామకృష్ణులు అతి వ్యాకులతనొంది  వానిని  మరలమరల జూడ దలచారు, ఎవరో తనగుండెను పిండినంత క్షోభ చెందారు. బయట సమీప వనంలోకి వెళ్లి ఏకాంతంగా,  " బిడ్డా ఎపుడొస్తావు ?  నినుజూడక నేను జీవింపలే "ననుచూ మిగుల దుఃఖించారు.
నరేంద్రుని ద్వితీయ పర్యటన.  ఈ పర్యాయము నరేంద్రుడు కలకత్తానుండి  కాలినడకన దక్షిణేశ్వర్ వెళ్లి నేరుగా రామకృష్ణుల గదిలోకి నడచాడు. రామకృష్ణులు తీవ్రధ్యానస్థితిలో కూర్చొనియున్నారు. నరేంద్రునిచూచినపిమ్మట ప్రేమతో దగ్గరకు పిలిచి తమ పక్కన కూర్చొనబెట్టారు, గురుదేవులు మిగుల పరమానంద స్థితిలో ఓలలాడుచున్నారు. తన ముందటి పర్యటనానుభవమే  మరలజరుగునేమోయనే ఆలోచన  మనసులో మెదిలిన క్షణంలోనే రామకృష్ణులు తమ పాదాన్ని నరేంద్రుని దేహంపై నుంచారు. నరేంద్రునిమాటలలోనే , వాని యనుభవము, "  వెనువెంటనే నాకొక అద్భుత  యనుభూతి కలిగినది. నాకనులు మిగుల తెరవబడియే
యున్నాయి .  గదిలోని గోడలతోసహా ప్రతివస్తువు నాచుట్టూ పరిభ్రమిస్తున్నాయి. అదేక్షణంలో నా చైతన్యము ( యెరుక )  మరియు సమస్త విశ్వచైతన్యము,  అనంత శూన్యంలోకి లయం కాబోతుంది. నాచైతన్య రాహిత్యతస్థితి  మరణంతో సమభావం కల్గిస్తుంది. చావు అంచులలోకి వెళ్లినటుల భయం కమ్మేసింది.  నాదేహం స్వాధీనం తప్పినది, ' ఆ...  ఏంచేస్తున్నావ్, యింటివద్దనాకు తలిదండ్రులున్నటుల తెలియదాయేమి ? ' అంటూ పెద్దగా అరచాను.  రామకృష్ణులు పెద్దగా నవ్వారు. ' అటులనే ఇంతటితో యిది ఆగిపోగాక !  ఒకేరోజులో అంతా కాజాలదుగదా, తగుసమయంలో జరుగుతుంది.' యనుచూ రామకృష్ణులు నరేంద్రుని హృదయాన్ని తాకారు. నరేంద్రుడంటాడు  " నాకే  మిగుల ఆశ్చర్యం కల్గిస్తూ, ఎంత వేగంతో యనుభవం కలిగిందో అదేవేగంతో అదృశ్యమైనది. నేను  సాధారణస్థితికొచ్చాను. పరిసరాలలో మార్పులేదు.  వివరణకింత సమయంపట్టినా నా  వాస్తవానుభావము కొద్దిక్షణాల్లోనే జరిగినది. "
నరేంద్రుని మూడవ పర్యటన. రామకృష్ణుల నిజస్థితియేమిటో తెలిసికోవాలనెడి ప్రబల కాంక్ష నరేంద్రునిమనసును తొలిచివేస్తుంది. నిదుర, ఆహారాదుల రుచి కోల్పోయాడు. మూడవసారి రామకృష్ణుల దర్శించాడు. కాళీ దేవాలయానికి దక్షిణంగానున్న జాదూ మాలిక్ ఉద్యానవనానికి రామకృష్ణులు, నరేంద్రుడు వాహ్వాళి  కెళ్లారు. సమీప గంగానదీ తీర మాలిక్  వనంలో నడుస్తూ రామకృష్ణులొకచోట కూర్చొని సమాధిస్థితిలోకెళ్లారు. వారిని పరిశీలిస్తూ సమీపానకూర్చున్న నరేంద్రుని వెంటనే రామకృష్ణులు  స్పృశించారు. నరేంద్రుడు మిగుల జాగరూకతతో యున్నప్పటికీ ఆస్పర్శకు  వివశుడయ్యాడు. మునుపటిలా కొద్దిగా  కాకుండా ఈపర్యాయము పూర్తిస్పృహను కోల్పోయాడు. ఆపై కొద్దిసేపటికి నరేంద్రుడు స్పృహలోకొచ్చుసమయాన, రామకృష్ణులు   నవ్వుచూ  వాని ఛాతిని  మిగుల మృదువుగా  నిమురుచున్నారు. బాహ్యస్మృతి కోల్పోయినప్పుడు తనకు కలిగినయనుభవమును నరేంద్రుడు వివరించలేదు. ఆపై కొద్దికాలానికి  రామకృష్ణులే తమ యితర  శిష్యులకావివరాలు వెల్లడించారు.
" ఆరోజు నరేంద్రుడు బాహ్యస్మృతి కోల్పోయినప్పుడు వానిని నిజముగా  తానెవ్వరు, ఎచటినుండి వచ్చాడు, ఎందులకీజన్మ పొందాడు, మరెంత కాలమీలోకంలో కొనసాగుతాడు మున్నగు   పెక్కు ప్రశ్నలడిగాను. నరేంద్రుడు తన సహజ మూల రూపస్థితిలోనికెళ్లి  నేనడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానము చెప్పాడు. అంతకుముందుగనే నరేంద్రునిగూర్చి  వివిధ దృశ్యములలో నేనుగ్రహించిన విషయాలను  వానిసమాధానములు పూర్తిగా ధ్రువపరచాయి. ఆ వివరాలను నేను వెల్లడించగూడదు, కాని ఒక్క విషయం చెప్పగలను, అదేమన: తానెవరో తెలిసికొన్న రోజున నరేంద్రుడు ఈలోకంలో జీవింపలేడు. తన  తీవ్రసంకల్ప బలంచే, యోగశక్తిచే తన దేహం త్యజిస్తాడు. నరేంద్రుడు పరిపూర్ణ ధ్యానయోగం సిద్ధించిన గొప్ప ఆత్మ. కొంతకాలం పిమ్మట రామకృష్ణులు తాను నరేంద్రునిగూర్చి చూసిన  దృశ్యముల వివరాలను  శిష్యులకు వివరించారు.  నరేంద్రునిగూర్చి రామకృష్ణుల ఆ ఆశ్చర్యకర అద్భుత   దృశ్య విశేషాలను వేరొకచోట వివరింపబడినది (Refer to  www.saishakthitelugu.blogspot.com; సాయికథలు - పైలోకాలున్నయ్యా ? dated November 21, 2019)
Your feedback greatly helps for improvement of the blog , please write your opinion in the comments section below and share if you like.  ( మీ సలహా  మిగుల విలువైనది, క్రింది కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయము తెలియపరచగలరు. నచ్చితే తెలిసినవారితో  పంచుకోండి.)

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి

కురూపి కుబ్జకు సుందరరూపము 

Comments

  1. "మానసభజొరే గురుచరణం, దుస్తరభవసాగరతరణం"

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)