సాయి కథలు : రామకృష్ణ పరమహంస - జీసస్ క్రీస్తు

 శ్రీసాయినాథాయనమః 

ప్రియ పాఠకమహాశయులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు ! 

సాయి కథలు :  రామకృష్ణ పరమహంస - జీసస్ క్రీస్తు
" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము

మతములను పారే  పావన జీవ  నదులుగా భావిస్తే, ఆధ్యాత్మికతపరిపూర్ణతనును  సాగర సంగమంగా తలచవచ్చును.  అవతారపురుషుల, మహాత్ముల  జీవితవిశేషాలు పవిత్రసంగమాన్ని పోలియుంటాయి. శిరిడీ సాయిబాబా, తామే సర్వ దేవీ, దేవత, యోగి, సర్వమత  ప్రవక్త,  సర్వజీవ, విశ్వమంతా వ్యాపించిన చేతనాచేతన సృష్టి రూపులుగా భక్తులకనుభవమిచ్చారు. సాయి జీవనానికి సమాంతరంగా  రామకృష్ణ పరమహంస జీవితం గోచరిస్తుంది. ఎవరు రాముడో, యెవరు కృష్ణుడో అతడే ప్రస్తుతం ఈదేహం ధరించాడని వారే చెప్పారు. అంతేగాక అన్నిమతముల మూలసత్యమొక్కటేయని తాము స్వయంగా అనుభవం పొంది యున్నారు. రామ,కృష్ణ, హనుమ, రాధ, చైతన్య,  ప్రవక్త మహమ్మద్, జీసస్ మొదలుగాగల ప్రవక్తల ఏకరూప దైవత్వాన్ని  పరమహంస స్వయంగా పొందియున్నారు. సాయిబాబా, జీసస్ క్రిస్తు ఒకరే యనెడి ఓ భక్తురాలి అనుభవమును ' సాయీ నీవే జీసస్ ' పోస్ట్ నందు ( https://saileelatelugu.blogspot.com/, అక్టోబర్ 7, 1918) చూడగలరు.  ప్రస్తుత వ్యాసంలో శ్రీరామకృష్ణ,  జీసస్ తో ఏకాత్మభావము పొందిన వివరముల తెలిసికొందుము.  ఈసంఘటన  షుమారు 1864వ సంవత్సరంలో జరిగినది. ఈవివరాలను వారి ప్రత్యక్ష శిష్యుడు స్వామి శారదానంద " Sree Ramakrishna  And His Divine Play " యనెడి మహత్తర గ్రంధంలో పొందుపరచారు.
జగన్మాతలీలగా రామకృష్ణ పరమహంస వేదమార్గమైన అద్వైతానుభవము, తంత్రయోగసిద్ధి, ఇస్లాంమత సాధనాలక్ష్యం   యనుభవపూర్వకముగా పొందినపిమ్మట, ఆ దివ్యశక్తి జగన్మాతను క్రైస్తవమత మార్గంద్వారా దర్శింప దలచారు. ఆసమయంలో వారికి శంభూచరణ్ మల్లిక్ యను క్రైస్తవమతస్తునితో పరిచయం తటస్తించినది. అతడు రామకృష్ణునకు పవిత్ర బైబిల్ గ్రంధం చదివి వినిపించెడివాడు. ఆవిధంగా జీసస్ పావనజీవితవిశేషాలతోపాటు, క్రైస్తవమత విశ్వాసాలనుగూడ సంపూర్ణగా తెలిసికొన్నారు. క్రైస్తవ మతసాధనచేయతలచిన రామకృష్ణులకోరికను జగన్మాత ఎట్టిశ్రమలేక కేవల లీలామాత్రంగా సునాయాసంగా   పూరించినది.  దక్షిణేశ్వర్ కాళీ దేవాలయానికి దక్షిణంగా మల్లిక్ యొక్క  గార్డెన్ హౌస్ యుంది. రామకృష్ణులపుడపుడూ మల్లిక్ యింటికి వాహ్వాలిగా నడిచివెళ్లేవారు. ప్రధమదర్శనమునుండే  మల్లిక్ మరియు వానితల్లికి రామకృష్ణులపైన అపార ప్రేమ, గౌరవభావములు నెలకొన్నాయి. వారు ఇంట్లో లేనిసమయంలోగూడా రామకృష్ణులు వారింట ప్రవేశించి విశ్రమించేవారు. ఇంటి గోడలపై గొప్ప చిత్రపటాలు వేళాడుతుండేవి. వానిలో ఒకటి బాలయేసు తనతల్లిఒడిలో ఇమిడిన చిత్రం. ఓరోజు రామకృష్ణులు ఆచిత్రాన్ని తదేకంగా చూస్తూ జీసస్ యొక్క అద్భుత జీవిత చర్యలగూర్చి యోచిస్తున్నారు. ఆక్షణంలో వారికాచిత్రం సజీవంగా, మిగుల ప్రకాశమానంగా గోచరించింది. తల్లి మేరీ, బిడ్డ జీసస్ ల దేహాలనుండి వెలువడిన కాంతికిరణాలు రామకృష్ణుల ఆలోచనా ధోరణుల మార్చివేసేవిధంగా వారి హృదయలోతులలోనికి చొచ్చుకొనిపోయాయి. వారి హృదయమంతా నిండిన హిందూమత భావాలు క్రమంగా మాయమౌతున్నాయి, కొత్తభావాలు ప్రకటమౌతున్నాయి. ఎన్నోవిధముల వాటిని నిరోధించుటకు ప్రయత్నించారు. ఎందుకిలాజరుగుతుందని జగన్మాతను మరిమరీ వేడుకొన్నారు. కాని బలమైన ఆనూతన ఆలోచనా తరంగాలు వారి హిందూధర్మ ఆలోచనలను పూర్తిగా ముంచివేశాయి. హిందూ దేవీ దేవతలపట్ల వారికున్న భక్తిప్రేమలు పూర్తిగా అదృశ్యమయ్యాయి. జీసస్ మరియు క్రైస్తవమతంపట్ల పూర్తి విశ్వాసం, గౌరవం పెంపొందాయి. ఓ చర్చిలో జీసస్ కు పూజారి సుగంధ పరిమళాలను, వెలిగెడి దీపాల సమర్పించు దృశ్యాన్ని చూసారు రామకృష్ణులు.  ఆపై తాను రోజూపూజించెడి కాళీయ  దేవాలయానికొచ్చారుకాని జీసస్ నుగూర్చి వారి యనుభవమే వారి హృదయాన్నంతా కబళించింది. జగన్మాతను సేవించుట పూర్తిగా మరిచాడు. క్రైస్తవ మత భావతరంగాలు  మూడురోజులు పూర్తిగా వారిని వూపివేసాయి.
మూడవరోజు సాయంత్రము రామకృష్ణులు పంచవటీ ప్రాంతంలో నడిచే సమయాన వారికొక పరిచయములేని అందమైన దైవపురుషుడు దర్శినమిచ్చాడు. ఆ ఆగంతకుడు రామకృష్ణులనే తదేకంగా జూస్తూ, వారివైపునకడుగులు వేస్తున్నాడు. వానినొక విదేశీయునిగా, మరోజాతి వ్యక్తిగా రామకృష్ణులు గుర్తించారు. వానికనులు విశాలంగా, అందంగా వున్నాయి. ముక్కుకొన కొద్దిపాటి ఫ్లాట్ గా యున్నప్పటికీ, వాని అందానికది అడ్డుకాదు. వానిముఖంపై నెలకొన్న దైవత్వానికెంతో  తన్మయుడై , ' ఎవరబ్బా ఈతడు ? '  యని ఆశ్చర్యపడ్డాడు.  ఆ నూతనవ్యక్తి సమీపించునపుడు, రామకృష్ణుల హృదయంనుండిఈవిధముగా మాటలు వెలువడ్డాయి, " ఈయన జీసస్ క్రీస్తు, గొప్పయోగి, దేవునితో సమానమైన దైవపుత్రుడు. మానవాళి దుఃఖవిముక్తికై తనహృదయ రక్తాన్ని చిందించాడు."   అపుడా దేవపురుషుడు జీసస్ రామకృష్ణుల  కౌగలించుకొని వానిలో విలీనమైనాడు. ఆ పారవశ్యంలో బాహ్య స్పృహ కోల్పోయి సాకార దైవంతో ఏకమైనారు రామకృష్ణ పరమహంస. ఈ అనుభవంతో జీసస్ ను అవతారపురుషునిగా నమ్మారు.
Your feedback greatly helps for improvement of the blog , please write your opinion in the comments section below and share if you like.  ( మీ సలహా  మిగుల విలువైనది, క్రింది కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయము తెలియపరచగలరు. నచ్చితే తెలిసినవారితో  పంచుకోండి.)

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!







Comments

  1. దేవదూతలెల్లరూ పరమాత్మ స్వరూపులు. సాయిబాబా, రామకృష్ణ పరమహంస, జీసస్ క్రిస్తులు ధర్మరక్షకులుగా అవతరించారు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

శ్రీసాయిసందేశామృతము 51 (Nectar of Sri Sai's message 51)

విష్ణుమాయ.