సాయి కథలు - కుండలిని శక్తి

శ్రీసాయినాథాయనమః
Image result for kundalini chakras photos

సాయి కథలు - కుండలిని శక్తి
" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము

భగవంతుని జేరుటకు మన శాస్రములందు వేరు వేరు మార్గములు చెప్పబడినవి. ఆయా మార్గములను  యోగములనియు యందురు, ఉదాహరణకు కర్మ, భక్తి, జ్ఞాన, రాజయోగమార్గములు మొదలగునవి. కుండలినీ యోగమార్గముగూడ భగవంతునిజేరు యొకదారియని సిద్ధయోగులు వచించినారు. . సాయిబాబా విషయమున కుండలినీ సాధన వివరములు గుహ్యమైనప్పటికీ, వారు పరిపూర్ణ యోగసిద్ధులుగ అందరికి తెలిసిన విషయమే.  వారి జీవనము కుండలినీ యోగము సిద్ధించిన యోగులజీవితమును బోలియుంటుంది. 
అందరిలో నిద్రాణమైన దైవశక్తియే కుండలినీశక్తిగా చెప్పబడినది. ఆశక్తి మనిషి  వెన్నెముక క్రిందిభాగంలోని మూలాధారచక్రమందు చుట్టచుట్టుకొని  నిదురించెడి సర్పంగా యోగులు అనుభవపూర్వకంగా లోకానికి తెలియజేసారు. సాధారణ మానవుడు దైవమును జేరు మార్గములలో ఇది యొకటిగా పేర్కొనబడినది. కుండలిని తంత్రయోగమునకు సంబంధించినది. నిదురించెడి శక్తిని సద్గురుని సహాయముచేతగాని, యోగసాధనముచేగాని మేల్కొలిపి, వెన్నెముక క్రిందభాగమునయున్న మూలాధారచక్రమునుండి వెన్నెముక పైభాగముపైగల సహస్రారచక్రముజేర్చి సమాధిస్థితి పొందుట కుండలినియోగ ముఖ్య యుద్దేశ్యము. కుండలినీ వెన్నుపాములో ఇమిడిన సుషుమ్న నాడిలోని  ఏడు శక్తిస్థానములలో చలిస్తుంది. ఆస్థానములు వరుసగా 1) మూలాధార, 2) స్వాధిష్టాన, 3) మణిపుర, 4) అనాహత, 5) విశుద్ధ, 6) ఆజ్ఞ, 7) సహస్రార. కుండలినీ వివరములు మన శాస్త్రములలో వివరింపబడినప్పటికీ, ఆ శక్తిని మేల్కొలిపి ఆ వివరములను  సామాన్య మానవుల పరిజ్ఞానమునకు అందించిన సంఘటనలు మిగుల అరుదుగా తలంచవచ్చును. శ్రీరామకృష్ణ పరమహంస కుండలిని శక్తిని మేల్కొలిఫై, స్వానుభవరూపంగా శాస్త్రసత్యముల ధ్రువపరచి ఆ వివరములను మానవాళికి తెలియపరిచారు. ఈవివరణలు ఒకింత జటిలమైనను, తెలియగోరు ముముక్షువులకు ఆసక్తిగా వుంటాయి గనుక, ఈవ్యాసంలో నాజ్ఞానపరిధిలో ఆ విషయముల పొందుపరచడమైనది. రామకృష్ణుల సాక్షాత్తు శిష్యులైన స్వామి శారదానంద రచించిన " Sree Ramakrishna And His Divine Play " నుండి ఈవిశేషములు గ్రహించడమైనది.
ప్రస్తుతజన్మనందుగాని  , గతజన్మలగాని వ్యక్తిలో విలసిల్లిన  మానసిక ప్రవృత్తులు మరియు  భావాలు  బహుశక్తివంతమైన ప్రేరణా బలంగా   వానిలో  నిగూఢంగా దాగియుంటాయి.  పతాంజలి మున్నగు ఋషులు ఆ ప్రబలశక్తిని కుండలినీ శక్తిగా పేర్కొన్నారు. సామాన్య బద్ధజీవులలో  కుండలిని శక్తి పూర్తిగా నిద్రాణంగాగాని లేక  అప్రకటితంగా గాని  యుంటుందని యోగులు చెబుతారు. కుండలినీ నిదురస్థితిలో యుండినను మనిషిలోని జ్ఞాపకాలు, ఊహలు మరియు యితర `ఆలోచనలు కొనసాగుతాయి. ఆనిద్రాణశక్తిని సద్గురుని సాయము లేక  ఏదేని యోగ ప్రక్రియతో మేల్కొలిపినచో, ఆదివ్యశక్తి  ఆధ్యాత్మిక మార్గంలో పయనించే మనుజుని   దైవసాక్షాత్కార దిశగా నడిపిస్తుంది. కుండలిని నిద్రావస్థలో యున్నప్పటికీ, మనిషి ఇంద్రియజ్ఞానము కొనసాగుతుంది.
ఇపుడు,  మేల్కొన్న కుండలిని చలనము ఆరు చక్రాలను ఛేదించి సమాధిస్థితి కలుగజేయు విధానమును పరిశీలించెదము. శిరస్సుపైనున్న బ్రహ్మరంధ్రంలో సచ్చిదానంద పరబ్రహ్మ, పరమాత్మ విలసిల్లుతాడని యోగుల అనుభవ జ్ఞానము. వెన్నుపాము క్రిందిభాగాన చేతనా రహితంగా పడియున్న కుండలినీశక్తి  సర్వవ్యాపక పరమాత్మ పట్ల మిగుల ఆకర్షణ కలిగియుంటుంది. దీనిభావం దైవం సదా కుండలినీశక్తిని తనవైపుకు సదా లాగుతుంటాడు లేక ఆకర్షిస్తుంటాడు. నిదురించే కుండలిని దైవం యొక్క ఆకర్షణను పొందలేదు. కాని మేల్కొన్న  మరుక్షణమే  దైవాకర్షణకు లోనై, దైవం వైపునకు పయనిస్తుంది. అలా కుండలిని పయనించు మార్గం ప్రతి ఒక్కరి సొంతం. మెదడుతో మొదలిడిన మార్గం వెన్నెముక అట్టడుగు  మూలాధార స్థానము వరకు వ్యాపించియున్నది.  ఈమార్గాన్ని  సుషుమ్న నాడిగా యోగశాస్త్రములయందు చెప్పబడినది. ఈమార్గంద్వారానే  పరమాత్మనుండి వేరైన  కుండలిని మూలాధార స్థానమును  జేరినది. ఇదేమార్గంలో ఒకదానిపై యొకటి యిమిడిన ఆరు శక్తి చక్రాల ఛేదిస్తూ తిరిగి కుండలిని  సహస్రారమును (మెదడును) చేరుతుంది. మేల్కొనిన కుండలిని ఒకస్థానమునుండి లేక చక్రమునుండి వేరొకస్థానము లేక  చక్రమువైపుకు ఊర్ధ్వంగా పయనించునపుడు వ్యక్తికి కొత్తకొత్త అనుభూతులు కలుగుతాయి.  తుదకు కుండలిని సహస్రారము జేరునప్పుడు ఆత్మరూపునిగా యున్న వ్యక్తి,  పరమాత్మశక్తిలో అద్వైత అనుభవము, జీవిత పరమావధి,  లేక  ఐక్యత పొందుతాడు.
కుండలినిగూర్చి  శ్రీరామకృష్ణ పరమహంస అనుభవపూర్వక వివరణ వారిమాటలలోనే గ్రహించెదము. " చూడండి, క్రింది పాదాలనుండి పైనున్న శిరసువరకు యేదో జలతరింపుతో కదులుతుంది. ఆ కదలిక శిరసు లేక సహస్రారము జేరకమునుపు వరకు నేను సాధారణ స్పృహలో వుంటాను. సహస్రారము జేరిన మరుక్షణమే నేను చైతన్యము పూర్తిగా కోల్పోయి, నన్ను నేను మైమరిచెదను. కనులు, చెవులు పనిచేయని స్థితి, మాట్లాడే ప్రసక్తే లేదు. మాట్లాడే దెవరు? నేను నీవనే భావం పూర్తిగా అదృశ్యమౌతుంది. కొన్ని సమయాలలో ఆ స్థితిలోని  నా యనుభవాన్ని మీరెల్లరకు వివరించాలని మిగుల తపన పడతాను.    కుండలిని నా హృదయస్థానం లేక ఆపైనున్న  కంఠ స్థానం జేరువరకు మాట్లాడగలను. కాని కంఠమును దాటిన మరుక్షణమే ఎవరో గొంతు  గట్టిగాపట్టిన విధంగా నేను మాట్లాడ జాలను. ఆపై నాబాహ్య స్పృహ, నియంత్రణల   కోల్పోతాను. "
శ్రీ రామకృష్ణులు వివరములను కొనసాగించారు, "  కుండలినీ సుషుమ్న మార్గంద్వారా సహస్రం వైపు పయనించునపుడు కలుగు పులకింతలు లేక  జలతరింపులు వేరువేరు వ్యక్తులకు  వేరువేరు  ఐదు రకాలుగా ఉంటాయి. అవి ఆహారంమోస్తు ఒకేవరుసలో కదిలే చీమల చలనం, కప్పగంతులా, భయపడిపరిగెత్తు పాము పరుగులా, ఒకోసారి ఆకాశంలో మిగుల ఎత్తులోను మరోక్కపుడు భూమికి సమీపంలోను  ఎగురుతూ పయనించే పక్షిచలనంలా, మరొక్కప్పుడు కుప్పిగంతులువేస్తూ కొమ్మలుదాటి గమ్యంజేరే కోతి రీతిగా ఐదు రకాల అనుభూతులు కలుగుతాయి.   కుండలినీ యేడు తలముల  పయనిస్తుందని  వేదాంతము చెబుతుంది. ఒక్కో స్థానంలో యనుభవం ఒక్కోరకంగా యుంటుంది. మనిషి చైతన్యం సాధారణంగా క్రింది మూడు మూలాధార ( ఆసన స్థలం) , స్వాధిష్ఠాన ( జననాంగ ప్రాంతం), మణిపుర ( నాభి ప్రాంతం) స్థానాల్లో పైకి క్రిందికి నడుస్తుంది. ఆకలి, నిదుర, భయము, మిధునము లాంటి సాధారణ లోక క్రియలలో విహరించేవారి చైతన్యం యీ పైమూడు స్థానాలకు పరిమితం, అనగా పైవిషయాల్లో మనసు సంచరిస్తుందటే కుండలినీ ఈమూడు తలములకే పరిమితమని తలంచవచ్చును. ఏదేని కారణంచే మనిషి చైతన్యం ఈమూడు స్థానాలదాటి 4వ స్థానమైన హృదయభాగం ( అన్హత ) వరకు చలిస్తే వానికి దివ్య వెలుగుల దృశ్యాలు గోచరిస్తాయి. కాని హృదయస్థానంనుండి కుండలిని మరల క్రిందిస్థానాలకు పడిపోతుంది.  హృదయస్థానంనుండి ఏదేని కారణంచే కుండలిని పై కంఠభాగానయున్న విశుద్ధ కేంద్రాన్నిచేరితే  ఆవ్యక్తి లోకవ్యవహారాలగూర్చి ఏమాత్రం మాట్లాడజాలడు.  కేవలము భగవంతునిగూర్చిమాత్రమే మాట్లాడగలడు. ఆరోజుల్లో ఎవరైనా నాముందు లోకవ్యవహారాలు మాట్లాడితే, తలపై పెద్దకర్రతో మోదినట్లుండేది. వారి భాషణలు వినలేక పంచవటి వైపుకు పరుగులు తీసేవాడను.  వారినుండి భయపడి దాగెడివాడను. ఆలోకవిషయాలు మాట్లాడేవారు బంధువులైనను, పరామశత్రువులుగా కనపడెడివారు. మిగుల వ్యధచెంది చావును సమీపించినట్లుగా తలచెడివాడను. వారినుండి దూరమైనపుడే ప్రశాంత పొందేవాడను. కాని మనసు ఆ విశుద్ధ చక్రము నుండి తిరిగి మూలాధార చక్రమునకు గాని, లేక తక్కువస్థాయి వేరే చక్రములకు పడిపోగలదు. విశుద్ధి చక్రమునుండి పైస్థానమునయున్న కనుబొమ్మలమధ్య ఆజ్ఞ చక్రము వరకు కుండలినీ జేరితే వ్యక్తి కిందికి పడి పతనం జెందు భయముండదు. అతనికి భగవంతుని సంపూర్ణ కలిగి, సమాధిస్థితిలోనికెళతాడు. ఆజ్ఞ చక్రమునకు ఆపై వేయిరేకుల విలసిల్లిన సహస్రచక్రమునకు మధ్య ఉల్లిపొరలాంటి ఓ పలుచటి తెరమాత్రముంటుంది. ఆజ్ఞ స్థానమునుండి కుండలిని కేవలము విశుద్ధ లేక అన్హత స్థానముల వరకు  మాత్రమే పడిపోగలదు కాని, మరింత కింది స్థాయిలకు పడిపోదు. ఆజ్ఞాచక్రము దాటి ఆపై సమాధిస్థితిని పొందిన  సాధారణ జీవకోటికి చెందిన వ్యక్తులు కిందికి రాలేరు, ఆపై 21 దినముల సమాధి స్థితియనంతరము దేహము వీడి ఏడవస్థానమైన సహస్రచక్రములో లయమగుదురు.  కాని మహాత్ములు, అవతారపురుషులు, సద్గురువులు ఆజ్ఞ చక్రమునుండి కిందికి వచ్చినప్పటికీ భయములేదు, వారు మరల పైస్థానములకెళ్లి సమాధిస్థితిని జేరెదరు. "  రామకృష్ణ పరమహంసకు పరిపూర్ణ కుండలినియోగము  సిద్ధించినది. పైన పేర్కొన్న ఏడు స్థానములు  లేక చక్రములు  యేడు క్రిందివైపుకుముడుచుకొనిన కమలములుగా చెప్పబడినవి. అనహత 12 దళములు, విశుద్ధ 16 దళములు, ఆజ్ఞ 2 దళములు, సహస్రారము 1000 దళములు కలిగిన కమలములుగా యోగులు గుర్తించారు. రామకృష్ణ పరమహంస కుండలిని యోగ సాధనజేయునపుడు, కిందివైపుకు ముడుచుకొన్న కమలములు క్రమంగా  పైవైపునకు తిరిగి పూర్తిగా వికసించిన  యనుభవము పొందారు.  మనలో నిద్రాణమైన కుండలినీశక్తిని మేల్కొలిపి సహస్రారము వైపుకు నడిపించి సమాధిస్థితి ఆపై భగవంతునిలో ఐక్యమగుటకు కొన్నిమార్గములు చెప్పబడినవి. అవేమన నిత్యదైవస్మరణ, నిత్యహరినామ జపము, గురునామ జపము, పుణ్యకార్య ఆచరణ, సత్సంగము, సద్గ్రంథపఠనము, ధర్మకార్యాచరణ, దైవంపట్ల మిగుల మిగుల వ్యాకులత మున్నగునవి.  సద్గురు పవిత్రనామస్మరణ జేస్తూ మన ఆధ్యాత్మిక శక్తిస్థాయిల పెంపొందించుకొనెదము, వారికృప మనపై సదా ప్రసరించుటకు వారిని శరణు వేడెదము గాక!
(ఈవిషయమునకు సంబంధించిన శిరిడీలోని శక్తిస్థానములగూర్చి  ఈ బ్లాగ్ లోని  ' షిర్డీలోని శక్తి స్థానములు '   www.SaishaktiTelugu.blogspot.com dated April 11, 2019 పోస్టును  చూడగలరు.)

Your feedback greatly helps for improvement of the blog , please write your opinion in the comments section below and share if you like.  ( మీ సలహా  మిగుల విలువైనది, క్రింది కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయము తెలియపరచగలరు. నచ్చితే తెలిసినవారితో  పంచుకోండి.)

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
సాయిబాబాయోగశక్తి  ధౌతి క్రియ




Comments

  1. మనిషిలో నిద్రాణమైన కుండలినీ శక్తిని మేల్కొలిపి సహస్రారచక్రమున లయింపజేసిన సమాధిస్థితి సిద్ధిస్తుందని యోగశాస్త్రములలో చెప్పబడినది.

    ReplyDelete

Post a Comment