సాయి కథలు - గురుస్పర్శ ప్రభావము 4
శ్రీసాయినాథాయనమః
సాయి కథలు - గురుస్పర్శ ప్రభావము 4
" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము
ఇంతకుముందు గురుస్పర్శ మహిమను గురించి, శక్తిని గురించి వివరించుకొన్నాము (https://saishakthitelugu.blogspot.com, dated 11/28/19, 12/5/19, 01/01/20) ఇచట ఒక ప్రశ్న ఉదయిస్తుంది, అదేమన ' ప్రస్తుతం సాయిబాబా సశరీరులుగా లేరుగదా, మరివారి స్పర్శానుభవమునెలాపొందాలి? ' యనెడిది. ఇందులకు సమాధానమును బాబాయే సూచించారు, తమగురుప్రసాదమైన ఇటుకను తమ తలగడగా నిత్యం ఉపయోగించారు. అదేవిధంగా మనం శిరిడీ సందర్శించినప్పుడు వారు సశరీరులుగా యున్నప్పుడు స్పృశించిన, ఉపయోగించిన, దినచర్య కొనసాగించిన యిత్యాది పెక్కు వస్తువులను చూడగలము. సాయిశక్తిచే అవన్నియు పునీతములై మహాశక్తి సంతరించుకొన్నవి. ఈవివరములను మరింత విశ్లేషించుకొందాము.సాయిబాబా మొట్టమొదట ఖండోబా గుడివద్ద పెండ్లివారి బండినుండి దిగి తమ పాదస్పర్శచే ఆస్థలాన్ని పవిత్రం జేశారు. ఆపై గురుస్థానము, వేపచెట్టు, తాకియా మున్నగుప్రదేశముల నివసించినపిమ్మట ద్వారకామాయిగా ప్రసిద్ధికెక్కిన పాతమజీదున రమారమి 60 సంవత్సరములు నివసించారు. మజీదులో సాయి వాడిన తిరుగలి, వంటజేసిన పొయ్యి, కూర్చొన్న శిలావేదిక మున్నగు వస్తువులన్నియు సాయి తాకుటచే పునీతమయ్యాయి. బాబా తమచేతులమీదుగా ద్వారకామాయిలో ధుని వెలిగించి , అందలి యూది గా పిలువబడు విభూతిని భక్తులకు పంచెడివారు. విభూతి మహిమలు లెక్కలేనన్నివి. ఇప్పటివరకు ధుని నిరంతరం మండుచునే యుంది, అందలి విభూతిని భక్తులు మిగుల భక్తిశ్రద్ధలతో ధరించి పెక్కు అనుభవముల పొందుచున్నారు. అనగా సాయిబాబా స్పర్శ ప్రభావం 100 సంవత్సరములకుపైగానే కొనసాగుతుంది. సాయి నిత్యం ఓప్రత్యేక మార్గాన రోజూ లెండివనం నడచివెళ్లి తిరిగి వచ్చెడివారు, ఆ దారియంతయు సాయి పవిత్ర పాదస్పర్శను పొందియున్నది. లెండివనంలో సాయి నాటిన వృక్షాలు, వారువెలిగించిన నంద దీపము సాయి స్పర్శను సంతరించుకొన్నవే. సాయి రోజు విడచి రోజు చావడిలో నిదురించెడివారు, వారిశయనముచే చావడి యెంత పావనమైనదోకదా? శిరిడీలో సాయి నడచిన పావనభూమి కణకణం సాయి స్పర్శానుభవము, దివ్యశక్తిని సంతరించుకొన్నాయి. సాయి బాబా వాడిన కఫనీ, చిలుము, వంటపాత్రలు, పాదరక్షలు, వింజామరలు, పల్లకి మున్నగు వస్తువులను సాయి సంస్థాన్ వారు మ్యూజియంలో భద్రపరచారు, ఆ వస్తువులనన్నిటినీ తిలకించి పులకించవచ్చును. ప్రస్తుత వివరణకందని ఎన్నో చేతనాచేతన సముదాయము శిరిడీలో సాయితపోశక్తిని పాలుపంచుకొన్నాయి. చివరిగా మరణానంతరము సాయిబాబా దేహముంచిన సమాధిమందిరము మరియు వారిసమాధి మహిమల వర్ణింపలేము. వారి వెముకలు మాట్లాడుచున్నాయి, సమాధినుండే సర్వుల రక్షిస్తున్నారు. అంతటిది సాయిబాబా యునికిచే పునీతమైన శిరిడీ, అందలి నేల, అందలి గాలి ! శిరిడీ దర్శించువేళ ఈ భావనల స్మరించి, ఆయా సాయి సంచార పావనస్థలముల విహరించి, వారు స్పృశించిన వస్తువుల తాకి, భకిశ్రద్ధల ప్రణమిల్లి , ధుని యూదిని మిగుల విశ్వాసంతో శిరసునదాల్చి సాయి కృపకు పాత్రులగుదముగాక!
సద్గురుస్పర్శ శక్తి వాహకము, తమభక్తులలోనికి శక్తిపాతమును కలుగజేస్తుంది! స్వామి వివేకానందుని యనుభవము జగద్విదితము !
ReplyDelete