చేదుమాత్ర.
శ్రీసాయినాథాయనమః
సాయి కథలు - చేదుమాత్ర
" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము
పైచెప్పబడిన భావమును ధ్రువపరచు సంఘటనలు శ్రీ సాయి సచ్చరిత్రములో పెక్కుచూడగలము. బాబా ప్రియభక్తుడు దాము అన్నా, మిత్రుని సలహాపై ప్రత్తి, ధాన్యముల వ్యాపారముజేసి మిగుల లాభముపొంద యోచించెను. కాని వాని భవిష్యత్తు తెలిసిన బాబా అందులకు నిరాకరించుటచే దాము వ్యాపారము చేయకుండెను. పెట్టుబడిపెట్టి వ్యాపారముజేసిన వానిమిత్రుడు కొంతకాలము పిమ్మట విపరీతముగా నష్టపోయెను. దాము అన్నా రక్షింపబడెను. క్షయవ్యాధి పీడితుడు భీమాజీ పాటిలును బాబా అంత సదుపాయముకాని భీమాబాయి యింటిలో బసచేయించెను, వాని ఆరోగ్యమునకది సరిపడునదికాదు. అటులనే మిగులబాధాకరమైన రెండుస్వప్నములను పాటిలు యనుభవించెను. కలలో తాననుభవించిన బాధచే వాని చెడుకర్మతొలగి రోగముక్తుడాయెను. తనస్వగ్రామముజేరి కొత్తగా సాయిసత్యవ్రతమును జేయనారంభించెను. అమీర్ శక్కర్ సాయిభక్తుడు. బాంద్రాలో కమీషను వ్యాపారిగా పనిజేసెను. అతడు కీళ్లవాతముచే బాధపడి, వ్యాధినివారణకై బాబాను శరణువేడెను. చావడిలో యుండుమని బాబా వాని నాదేశించెను. ఎల్లప్పుడు తేమగానుండు చావడి సరియైన స్థలం కాదు. మజీదు వచ్చుటకు బాబా యనుమతివ్వలేదు. కావున యతడు చావడిలో కొనసాగేను. ఈ బాబా యాజ్ఞ వానికెంతో మేలుగూర్చెను. రోజు విడచి రోజు సాయి చావడిలో నిదురించుటచే అమీర్ శక్కర్ బాబాయొక్క సాంగత్యమును పూర్తిగా పొందగలిగెను. కొంతకాలముపిమ్మట రోగముక్తుడాయెను. మహల్సాపతి సాయికి మిగుల యంకిత భక్తుడు, సన్నిహితుడు, సాయితో మజీదున నిదురించిన పుణ్యాత్ముడు. మహల్సాపతి బాబాను మొట్టమొదట ఖండోబాగుడిలో ' సాయీ ' యని పిలచి స్వాగతించినవాడు. కాని యతడు మిగుల పేదవాడు. బాబా యెందరో భక్తులకు సిరిసంపదలు ప్రసాదించినా మహల్సాపతికెలాంటి ధనసహాయం కల్పింపలేదు. హంసరాజను భక్తుడు మహల్సాపతికి కొంత ద్రవ్యమివ్వ దలచినా బాబా నిరాకరించుటచే స్వీకరింపలేదు. మహల్సాపతి తన స్వర్ణకారకులవృత్తిని మానుకొని బాబా ఆదేశంచే భిక్షాటనము జేసినాడు. కాని సాయి అగ్రశ్రేణి భక్తుడుగా, సేవకుడిగా 60 యేండ్లు కొనసాగి చరిత్రలో చిరస్మరణీయుడైనాడు. సాయిబాబా పేరు నిలిచినంతకాలం సాయిభక్తులు మహల్సాపతిని స్మరించుకొంటారు. వడిదుడుకులు, కష్టాలు, దుంఖాలు పాపకర్మ నశించుటకు మాత్రమేయను పెద్దలమాటల విశ్వసించి సాయిని సదాసేవించి వారికృపాపాత్రులమయ్యెదముగాక!
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
ఆరోగ్యముపొందుటకే చేదుమాత్రలు, సుఖాలుపొందుటకే అష్టకష్టాలు !
ReplyDelete