మహమ్మారినుండి రక్షణ !

శ్రీసాయినాథాయనమః 

సాయి కథలు - మహమ్మారినుండి రక్షణ! 

" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము చేయుటయే ! శ్రీ సాయి సచ్చరిత్రము 


ప్రస్తుతకాలంలో కరోనా వైరస్ (కొవిడ్ -19 ) మహమ్మారి ప్రపంచదేశాలన్నింటిని వణికిస్తుంది. ఎంతో ప్రాణనష్టం, ధననష్టం జరుగుతుంది. నివారణకై ఎందరో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, వైద్యులు యుద్ధప్రాతిపదికపై రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. త్వరలోనే ఈ భయానక వైరస్ కు వాక్సిన్ లభించగలదని ఆశిస్తూ, సర్వమానవాళి  రక్షణకై శ్రీ సమర్ధ సద్గురు సాయినాథుని హృదయపూర్వకంగా ప్రార్ధిస్తున్నాను.  ఎందుకనగా సాయిబాబా జీవితకాలంలోకూడా  కలరా, మశూచి, ప్లేగు వంటి భయంకర మహమ్మారీ వ్యాధులు లక్షల ప్రజల ప్రాణముల హరించినవి. ఆ విపత్తర కాలంలోనూ యెందరో భక్తులు సాయినాథుల ఆశీసులతో తమ ప్రాణముల రక్షించుకొన్నారు. ఈవివరములను శ్రీ సాయి జీవితచరిత్రలో  చూడగలము, కొన్నింటి నిచట పరిశీలించెదము.
అమరావతి నివాసి దాదాసాహెబ్ ఖాపర్డే భార్య తన చిన్నకొడుకుతో కలిసి శిరిడీలో కొంతకాలముంది. ఓరోజు ఖాపర్డే పుత్రునికి తీవ్రజ్వరమొచ్చి పిదప ప్లేగు జ్వరంకింద మారింది. తల్లిమిక్కిలి భయపడి సాయిబాబాను శరణుకోరింది. బాబా భయపడవలదని ఆమెతో యిట్లన్నారు, " ప్రస్తుతము ఆకాశము మబ్బుపట్టియున్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదరిపోయి ఆకాశము నిర్మలమగును." అట్లనుచు సాయి కఫ్నీని పైకెత్తి, చంకలో కోడిగుడ్లంత నాలుగు ప్లేగు బొబ్బలను చూపుతూ, " నా భక్తులకొరకు నేనెట్లు బాధపడెదనో చూడుము! వారి కష్టములెల్ల నావే! " ఆపై ఖాపర్డే పుత్రుడు జ్వరముక్తుడైనాడు. మరొక సంఘటన సాయి అంకిత భక్తుడు శ్యామా తమ్మునిభార్య విషయం. ఒకనాడు ఆమెకు ప్లేగువ్యాధిసోకి తీవ్రజ్వరమొచ్చింది. శిరిడీకి సమీప గ్రామం  సాహుల్ విహిర్ లో నివసించే  తమ్ముడు పరుగులవచ్చి     శ్యామా సహాయము నర్ధించాడు. శ్యామా సాయి శరణు   కోరగా, బాబా వాని తమ్మునిద్వారా ఊది పంపించారు. ఆమె  బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లలో కలిపి తాగించారు. వెంటనే ఆమెకు చెమటలు పట్టి జ్వరం తగ్గుముఖం పట్టింది. మరుసటి ఉదయానికి పూర్తిగా నయమైంది. ఇలాగె నాసిక్ లో నివసించే ధుమాల్ యనే భక్తుని పరివారాన్ని ప్లేగు మహమ్మారినుండి కాపాడారు.
సాయిబాబా వద్ద మశీదులో ఒకమూల తిరగలుండేది. బాబా అప్పుడప్పుడు నేలమీద ఓ గోనెపరచి దానిపై తిరుగలిపెట్టి గోధుమలు విసిరేవారు. ఆపిండి భక్తులకిచ్చి ఊరి పొలిమేరలో చల్లమనేవారు. ఒకసారి కారణమడిగితే, " ప్లేగు, మశూచి దేవతలు ఊరిలో కొందరిని పొట్టనపెట్టుకోవాలని చూస్తున్నాయి. వారికి బదులు ఈపిండి తీసుకొమ్మని వాటినాజ్ఞాపించాను. " అన్నారు. ఓ పర్యాయం 1911 లో భక్తులు సాయిసమర్థుల  ఆదేశం పాటించలేదు. కొద్దిరోజుల్లో శిరిడీలో ప్లేగు ప్రబలింది. తెల్లవారుతూనే సాయి వంటిమీదకూడా 7 ప్లేగు బొబ్బలు కనిపించాయి. భక్తులు భయపడి వాటికి చికిత్స తెలుపమంటే ఆయన, " ఈ బొబ్బలు శిరిడీలో ప్లేగుతో ఏడుగురు మరణిస్తారని సూచిస్తున్నాయి. నాకే చికిత్స అవసరం లేదు " అన్నారు. భక్తులు వత్తిడి చేయగా, కాల్చిన దూది నూనెలో తడిపి అద్దమన్నారు. తర్వాత గ్రామంలో ఏడుగురు ప్లేగుకు బలి అయ్యారు. బాబా వంటిమీద బొబ్బలు తగ్గేసరికి గ్రామంలో వ్యాధి అదృశ్యమైంది.
ఈవిధంగా బాబా ప్రకృతి విపత్తులనుండి ఎందరినో రక్షించారు. ఈవిషయమై  శ్రీసాయినాథుల రక్షణ పొందుటకు, సాయి పూజ, అరతులతోపాటు  శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ ఎంతో ఉపకారియనెడిది పెక్కుభక్తుల అనుభవము.  శ్రీ సాయి సచ్చరిత్రలో క్రిందివిధంగా పేర్కొనబడినది.
" ఎవరైతే భక్తిప్రేమలతో నీ అధ్యాయములోని కథలను నిత్యము పారాయణము చేసెదరో వారు కష్టములన్నిటినుండి విముక్తులగుదురు. "  11వ అధ్యాయము
" ఎవరైతే యీ అధ్యాయమును భక్తిశ్రద్ధలతో నిత్యము పారాయణము చేసెదరో వారికష్టములన్నియు శ్రీ సాయినాథుని కృపచే తొలగును. "  15వ అధ్యాయము
భక్తులెల్లరు శ్రీ సాయినాథుని భక్తిశ్రద్ధలతో సేవించి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తిని ఆరోగ్యమును, రక్షణను పొందెదరు గాక! శ్రీ  సమర్ధసాయినాథులు,  కొవిడ్-19 మహమ్మారినుండి ప్రపంచప్రజల కాపాడుటకై  హృదయ పూర్వకముగా ప్రార్ధిస్తున్నాను! అందరమూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసికొంటూ, ధ్యాన ప్రార్ధనాదుల జోడిస్తూ,  ఆరోగ్యసూత్రముల పాటిస్తూ కొవిడ్  మహమ్మారినుండి రక్షింపబడెదముగాక!

ప్రేరణ: శ్రీ సాయి సచ్చరిత్రము, శ్రీ సాయి లీలామృతము.

నీవున్న నాకెంతొ బలిమయ్య సాయి

నీవున్న నాకెంతొ బలిమయ్య సాయి
లేకున్న జీవితమె తృణమయ్య సాయి
తృణమయ్య  తృణమయ్య తృణమయ్య సాయి

నీవున్న పనులెన్నొ సులువయ్యసాయి
నీవున్న మనసెంతో తేలికయె  సాయి
నీవున్న బహుచింత దూరంబె సాయి
శరణంబు శరణంబు శరణంబు సాయి

నామంబు నీదేంతో ఘనమయ్య సాయి
గానంబు నీదేంతో మధురంబు సాయి
సాయంబు నీదేమొ తక్షణము సాయి
శరణంబు శరణంబు శరణంబు సాయి

( If you like this post please share with your friends, relatives and well wishers. ఈ పోస్ట్ నచ్చితే, మీ బంధుమిత్ర, శ్రేయోభిలాషులతో పంచుకొనగలరు! )

శ్రీ సాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి! 

Comments

  1. కోవిడ్ - 19 మహమ్మారినుండి, ప్రపంచప్రజలను సమర్ధ సద్గురు శ్రీసాయినాథులు రంక్షించుటకై ఆర్తితో ప్రార్ధించెదను !

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)