సాయి బోధనా సూక్తులు - వివిధయోగములు!

శ్రీ సాయినాథాయనమః 

శ్రీసాయి విశ్వభక్త పరివారానికి   గురుపూర్ణిమ శుభాకాంక్షలు, బాబా ఆశీసులు !

సాయి బోధనా సూక్తులు - వివిధయోగములు!
" సాధనగూర్చి సాయిచెప్పిన ఈ సూక్తులు పరమపవిత్రమైనవి. ఒకవిధంగా భగవద్గీతా సారాంశాన్ని బాబా మనకందించారు. ఫలాపేక్షరహితమైన కర్మ, కష్టించి పనిచెయ్యి, అది కర్మయోగము. దేవునినామ ముచ్ఛరించు, స్మరణ మనన, నిధిధ్యాసములు , అవి భక్తియోగము.  సద్గ్రంథాలు చదువు. సద్గ్రంథపఠనం వల్ల సద్గురునిపై మనసు లగ్నమౌతుంది. అదే గురుభక్తి, దానివల్ల జ్ఞానం కల్గుతుంది. అదే జ్ఞానయోగం. వీటన్నిటివల్లకూడా నిశ్చలభక్తి లభించలేదో అనుభవం ప్రసాదించి మనలను ఉద్ధరిస్తారు శ్రీసాయి. అదే విశ్వరూప సందర్శన యోగం. "  
సాయి సూక్తి - ఆచార్యవాణి 

సాయి తమ భక్తులకు బోధించినది కేవలము వాచకము అనగా నోటిమాటల బోధకాదు. వారు చెప్పినసూక్తులను సాయి స్వయంగా ఆచరించిచూపారు  , భక్తులకు సరియగు అవగాహనగూర్చుటకు తదనుగుణ అనుభవాన్నికూడ  ప్రసాదించారు, అందులకే వారు అనుభవాన్నందించే  సద్గురువులు. భగవద్గీతలో వివిధయోగములగూర్చి  వివరణ చెప్పబడినది. అవి వరుసగా కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన, రాజ  మున్నగు యోగములు. సాయిబాబా జీవితమును నిశితంగా పరిశీలిస్తే పై చెప్పబడిన యోగమార్గముల కూడలి లేక మిశ్రమం వారి పావన జీవనం. శ్రీసాయిసచ్చరిత్రము నాధారంగాజేసికొని పైన పేర్కొనబడిన యోగములు శ్రీసాయిబాబాలో  యెలా ప్రతిబింబించాయో తెలిసికొనెదము  

" గీతకు భాష్యం జెప్పిన రూపం, దీనుల గీతల మార్చిన రూపం 
           గీతయె తానుగ జూపినరూపం, తత్ప్రణమామి గురూసాయినాథం "   
శ్రీసాయి అష్టకము  
సాయి అసమాన, సాటిలేని  నిష్కామకర్మయోగి.  ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించక అనునిత్యం భగవదార్పణ బుద్ధితో దైవానికి దాసునిగా తననుతాను భావించుకొని పరులమేలుకొరకు పాటుపడువాడే నిష్కామకర్మయోగియని  భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. కాని అలాంటివ్యక్తి నిజజీవితంలో మనఉహకుకూడ అందడు. మరి యీ పోలికలున్న మహావ్యక్తిని చూసేదెలా? ఆయనగూర్చి తెలిసికొనేదెలా? ఇందులకు సమాధానం శ్రీ సాయిబాబా పావన జీవితం పరిశీలించిన మనకు లభింపగలదు. శ్రీ సాయి సద్గురువు, అవతారమూర్తియేగాక భక్తకోటి సేవాతత్పరుడు, విశ్రాంతినెరుగని నిత్యశ్రామికుడు  ఆశ్రితరక్షణా   ధురంధరుడు.  అరువది సంవత్సరాల ద్వారకామాయి నివాసంలో ఒక్కరోజుకూడ పగటిపూట కునుకుతీసి యెరుగరు, కనీసం గోడకుకూడ ఆని కూర్చుండెడివారు కాదు. శిరిడివచ్చిన తొలిరోజుల్లోనే  నేటి గురుస్థానానికి సమీప ఖాళీస్థలం చదునుజేసి   రహతా గ్రామమునుండి పూలమొక్కల దెచ్చి  మూడుసంవత్సరాలలో  చక్కని తోటను పెంచారు. ఆస్థానములో నేడు బాబా సమాధిమందిరం వెలసింది. నిత్యం గ్రామంలో భిక్షజేసి తమసహచర్యులు  ఇతరజీవ జంతువులతో కలసి భోంజేసేవారు. క్రమంతప్పక రోజూ సాయంకాలవేళ లెండీవనానికి వెళ్లివచ్చేవారు. ఓ సందర్భంలో సాయే జెప్పారు, తాముజేసిన కష్టానికి యజమాని మిగుల సంతుష్టి చెంది అంతకు ముందు జేసిన ముగ్గురుపనివారల మొత్తానికి రెట్టింపుగా ఆరు వందలరూపాయలిచ్చి, కొత్తబట్టలతో సత్కరించారని. తాముజేసినది అల్లికపని యని సాయి జెప్పారు. నూలుపోగులులాంటి సాధారణవ్యక్తులను తీర్చిదిద్ది చక్కని శాలువగా నేసి దైవానికి సమర్పించారనుటకు సంకేతం ఈపోలికయని కొందరు బుధజనులు  వ్యాఖ్యానించారు. తామునివసించే ద్వారకామాయిలో దునిస్థాపించి నిత్యాగ్ని హోత్రాన్నినెలకొల్పారు.   భక్తుల పాపాల, చెడుకర్మల మండింపజేసేవారు. అందుండి వచ్చెడి  బూడిదను విభూతిగా భక్తులకు పంచి  వేరువేరు  వ్యాధులను దూరంజేసేవారు. క్షయ, కలరా, ప్లేగు, రాచకురుపు, మలేరియా లాంటి విషజ్వరాలు, పాముకాటు,  పెక్కుదేహవ్యాథులు వారి ఆశీసులతో దూరమయ్యేవి.   ఆ విభూతి శక్తి, మహిమలు మనఉహకందవు. నిత్యం గోధుమలు విసరి భక్తులకర్మల పొడిపొడిజేసేవారు, వారి మనోవిచారముల శుద్ధిజేసెడివారు.   మహాతపస్సంపనులైన సాయి మాటయే మంత్రము. తమ ఆశీర్వాదములతో కుంటివానికి నడకను, గుడ్డివానికి చూపును సమకూర్చారు. గ్రహబలాన్ని తుడిచివేసి తమ అనుగ్రహబలంతో  సంతానాన్ని సమకూర్చేవారు, పేదవాని ధనవంతుని జేసేవారు, నిరుద్యోగికి కొలువు గూర్చెడివారు, ప్రకృతి విపత్తులనుండి శిరిడీ గ్రామవాసులు రక్షించేవారు.  భక్తులను వ్యాపార లావాదేవీల నష్టంనుండి కాపాడేవారు, సౌభాగ్యం సమకూర్చేవారు. దక్షిణల స్వీకరించి భక్తుల రుణముక్తులజేసెడివారు. కర్ణునిమించినది సాయి దానగుణం, భక్తులనుండి వచ్చిన కానుకలను ఏరోజుకారోజు అందరికి పంచేవారు. మహాసమాధిరోజున వారివద్ద నున్నది కేవలం ఏడు రూపాయలు మాత్రమే! సాయి జీవనవిధానం సాధారణమానవుల నిత్యజీవితాలతో మిళితమై యుండేది. ద్వారకామాయిలో తోటివారలతో వినోదకార్యక్రములు తిలకించెడివారు, ప్రతిగురువారం చావడి ఉత్సవంలో పాల్గొనెడివారు. రామనవమి, గురుపూర్ణిమ, ఉర్సుఉత్సవముల ప్రోత్సహించెడివారు. అరతినిచ్చే భక్తులతో మమేకమై వ్యవహరించేవారేగాని తమఘనతనెన్నడు చాటుకోలేదు. ఆకలిబాధ సాయి కి తెలుసుగావున ద్వారకామాయిలో స్వయంగా వంటజేసి పేదసాదలకు, వికలాంగులకు పెట్టి తోటిభక్తులతో భుజించెడివారు. తాత్యాతల్లి బాయిజాబాయి పట్ల మిగుల ప్రేమ, సోదరీభావములతో వ్యవరించెడివారు. భక్తురాలు రాధాకృష్ణ ఆయి సేవలను ప్రోత్సహించెడివారు. లక్ష్మీబాయి షిండేని ఆఖరిక్షణాల్లో తమవద్దే వుండేలా జేసి నవభక్తికి సంకేతంగా తొమ్మిది నాణా లిచ్చారు.  శిరిడీ గ్రామవాసులతో మిగుల ఆత్మీయతతో వ్యవరించేవారు. ఎపుడైనా మధ్యాన్నం తీరికదొరికితే తమకుముందు అడ్డుగా ఓగుడ్డ తెరగా  కట్టి చేతిసంచినుండి కొన్ని పాతనాణాల దీసి, కొందరిపేర్లు జెప్పుచూ  తమచేతులతో రుద్ది శుద్ధిజేసెడివారు. భక్తుల సంస్కారముల   శుద్ధిజేసి దైవానికి అప్పజేయునటుల ఆ చర్యజూచువారు తలచేవారు.   మహల్సాపతి తాత్యాలతో కలసి మజీదున నిదురించెడివారు. మజీదునుండే దూరదూర భక్తుల రక్షించేవారు, వారిబాధల తమపై వేసుకొనెడివారు. సాయి సన్నిధిలో రాజు  పేదలకు తేడాలేదు. సాయి కేవలం తమసంకల్పంతో భక్తులకు ప్రేరణ నిచ్చి తమతమ కార్యముల నిర్వహించెడివారు. కోటీశ్వరుడు బూటీచే సమాధిమందిర నిర్మాణం జేయించారు. దాసగణుకీర్తనలచే, చాందోర్కర్ ఉపన్యాసములచే తమ ఖ్యాతిని దూరదూరాలకు వ్యాపింపజేశారు. అన్నా సాహెబ్ దబోల్కరునకు హేమాద్రిపంతను బిరుదునిచ్చి శ్రీసాయిసచ్చరిత్ర పావన గ్రంధాన్ని రచింపజేశారు.దూరదూరమందున్న తమభక్తులను వేరు వేరు మిషలతో శిరిడీకి లాగెడివారు.  అంతటి అసమాన  గంభీర కరుణామూర్తి అపుడపుడూ భక్తులను వినోదపరచేవారు. ఓ భక్తుడు తెచ్చిన జానెడు వెడల్పు నాలుగు మూరల చెక్కబల్లను  సన్నని గుడ్డపీలికలతో  మజీదుకప్పుకు కట్టి నలువైపులా దివ్వెలుంచి కనులుతెరచి నిదురించెడివారు. బాబా ఆ బల్లనెక్కుట దిగుట నెవ్వరు గమనింపలేకుండిరి. జనులు ఆవింతను చూచుటకు తండోపతండంగా తరలిరాగా, చివరకు ఆ బల్లను ముక్కలుజేసి ధునిలో వేశారు. వేరొకసందర్భంలో  హేమాద్రిపంతు ఆదివారం సంతరోజున మజీదుకు వచ్చాడు, పక్కనున్న ఓ భక్తుడు వాని చొక్కానుతాకగ  శనగలు జలజలా రాలిపడ్డాయి. పక్కవారు వాటిని యేరు కొన్నారు. పంతుకు ఒక్కడే తినే చెడు అలవాటుందని  చమత్కరించారు, ఎల్లప్పుడూ తాను పక్కనుంటాననే సత్యాన్ని జెప్పారు. సాయి హృదయం కల్లాకపటమెరుగని బాలల హృదయం, చిన్నపిల్లలతో కలసి పిల్లవానిలా  గోళీలాట ఆడేవారు.  వారికి ఫలహారములు పంచెడివారు.   సాటిలేని  శ్రీ సాయి నిష్కామకర్మ అనంతం, అఖండం, అభేదం, అనుమపానం. వారిమహిమలను, దివ్యశక్తులను సాధారణ నాలుకతో యేమని వర్ణింపగలము  స్తుతింపగలము?  దేహము చాలించినా  సాయి అనంత నిష్కామకర్మ కొనసాగటం మహాద్భుతలీల! అందుకేనేమో శ్రీకృష్ణ పరమాత్మ యోగులను తమ ఆత్మగా వర్ణించాడు. 

 ఇక సాయి చూపిన భక్తియోగం గూర్చి చూద్దాము. సాటిలేనిది తమగురువుపట్ల  సాయిభక్తి.  తమప్రతిభ కంతటకు తమగురువే కారణముగా జెప్పెడివారు.  మిగుల శ్రద్ధాసహనములతో నిద్రాహారాలు మరచి గురుని పన్నెండేడ్లు  సేవించి పరిపూర్ణ గురుకృపకు పాత్రులయ్యారు.  సర్వసమర్ధ సద్గురువులైనప్పటికి  తాము దైవానికి బానిసగ  అభివర్ణించుకొనెడివారు. 
" అల్లాహ్ మాలిక్ "  యనగా " దైవమే సర్వానికి యజమాని " యను భావము వారి నిత్యస్మరణ మంత్రము. సాయి నిరాడంబరత, వ్యవహారశైలి వారిభావమును ప్రకటించెడివి. నానావళికై తమగద్దెవిడచి నిలబడ్డారు,  జౌహర్ ఆలి తనకుతాను గురువుగా ప్రకటింప వానిని  మిగుల యణుకువతో  సేవించారు. గురువునుండి పొందిన ఓ ఇటుకరాయిని గురుప్రసాదంగా జీవితాంతము తమవద్దనుంచుకొన్నారు. ఆ యిటుకను తలగడాగజేసి నిదురించెడివారు. హిందూదేవతల పట్ల మిగులభక్తిశ్రధ్ధలు జూపి, శిరిడీలోని దేవాలయముల నుద్ధరింపజేశారు. దైవాన్ని మిగుల విశ్వాసం, ఓరిమిలతో సేవించాలని బోధించేవారు. ఎలాంటి మంత్రోపదేశాలు చేయలేదు, పూజాక్రతువుల యవసరంలేదని బోధించెడివారు. ఉపవాసముల నిరసించారు. ఇతరగురుభక్తులకు వారి గురువుని మిగుల నమ్మకంతో సేవించాలని జెప్పారేగాని తనను సేవించమని యెన్నడూ పలుకలేదు. తాము తమ గురుని సేవించినటుల తమభక్తులుగూడ గురుసేవ చేయాలని సూచనమాత్రంగా చెప్పరేగాని యెవరిని నిర్బందించలేదు. మహల్సాపతి, కాకాసాహెబు దీక్షిత్, మేఘా, దాసగణు, అన్నాసాహెబ్ దబోల్కర్, నానాసాహెబ్ చాందోర్కర్ , నరసింహస్వామి, భరద్వాజ మాస్టారు,  రాధాకృష్ణ ఆయి, లక్ష్మీబాయి షిండే, శ్రీమతి తార్ఖడ్, శ్రీమతి ఖాపర్డే    మున్నగు భక్తులలో గురుభక్తిని విశేషంగా  ప్రతిష్టించారు.  సమాధియనంతరము తమభక్తరక్షణ కొనసాగుతోందని ఆనందరావు పాఖాడే యనుభవంద్వారా దీక్షితుకు సందేశమిచ్చారు. 

సాయిబాబా వారి  జ్ఞానయోగానుభవాలగూర్చి పెద్దగా తెలియదు. కాని గురుసన్నిధిలో తమకు సర్వం విదితమైనదని, తాను సర్వం తెలిసికొన్నానని చెప్పారు. అంతకుమించి సాయి మరేవివరాలు చెప్పలేదు. జ్ఞానమార్గంలో అభిరుచిపెంచుకొన్న భక్తులకు  తదనుగుణంగా  సాయి మిగుల  మార్గదర్శకులైనారు. ఆధ్యాత్మరామాయణము, ఎకనాథభాగవతము, జ్ఞానేశ్వరి, పంచదశి, ఈషా ఆది  ఉపనిషదుల సద్గ్రంథ పఠనముల ప్రోత్సహించారు. కొన్నిసమయాల్లో నిత్యజీవిత ఉదాహరణలతో భక్తులకు జ్ఞానబోధజేశారు. ఈశోపనిషదుపై వ్యాఖ్యానము వ్రాసాడు దాసగణు మహారాజు, కాని ఆ ఉపనిషత్తు సందేశం ఏమాత్రం అవగాహనకు రానప్పుడు విల్లెపార్లే లోని దీక్షితు నింటికి పంపించి యచటి పనిపిల్లచే సందేహనివృత్తిజేశారు. నానాసాహెబ్ చాందోర్కర్ యను వేరొక భక్తుడు, విద్యావంతుడు భగవద్గీత పై పెక్కువ్యాఖ్యానముల చదివాడు, కాని బాబా అడిగిన ఓ చిన్న శ్లోకానికి అర్ధం చెప్పలేక తడబడ్డాడు. ఆ  అర్ధం సాయి వివరించినపుడు బాబా సంస్కృత జ్ఞానానికికబ్బురపడ్డాడు నానా, అహంకారం కూడా అణగిపోయింది. వేరొక భక్తుడు బీ.వీ.దేవ్ జ్ఞానేశ్వరి గ్రంధాన్ని  తనంతట తాను చదువుటకు పెక్కు అడ్డంకులు గలుగ సాయిని ఆశ్రయించాడు. సాయి ఆశీసులతో ఆపై జ్ఞానేశ్వరి పఠనం సులభమైనది. సాఠే యనువాడు తన జీవితంలో మనఃశాంతి కోల్పోయి బాబాను దర్శించి మిగుల శాంతి పొందాడు. సాఠే  గురుచరిత్ర గ్రంధ పారాయణాన్ని ఏడు రోజుల్లో పూర్తిజేయ బాబా స్వప్నదర్శనమిచ్చి మరొక్కపారాయజేయమని అందుచే మిగుల ప్రయోజనం కలుగుతుందని దీక్షితు యను వేరొక భక్తునిద్వారా సందేశమిచ్చారు.   ఓ పర్యాయం బాబానుజూచుటకు బీజాపూర్ నుండి కొందరు మహమ్మదీయ భక్తులొచ్చారు. వారిలో ఓ మహిళ అందమైనముఖంజూసి   వ్యాకులుడైనాడు  బాబా వద్దనున్న నానా సాహెబ్ చాందోర్కర్. భక్తులు వెళ్ళినపిమ్మట నానాకు చక్కని బొదజేశారు బాబా. దైవం సర్వత్రా వ్యాపించియున్నాడని అన్ని అందచందాల వెనుకనున్న భగవంతుని చూడమని, దైవసృష్టిలోని సౌందర్యం చూడడం తప్పుకాదని  ఓ చురకంటించారు. ఓ ధనికుడు మిగుల పిసినారి, బ్రహ్మజ్ఞానం కోరి బాబాచెంతకురాగా ధనంపై పేరాశ మరియు బ్రహ్మజ్ఞానం ఉత్తర దక్షిణధృవాలని  పలికి ఆ పై బ్రహ్మజ్ఞానం పొందుటకు కావలసిన  పది ముఖ్యాంశాలగూర్చి  చాల విపులముగా బోధించారు. తమ ఖజానా లేక జ్ఞానభాండారం నిండుగా నున్నదని, యోగ్యతగలవారికి పంచుతానని, మజీదులో  తానెన్నడూ అసత్యమాడనని నొక్కిచెప్పారు. తమను జూడవచ్చిన  వి.హెచ్. ఠాకూర్ మరియు అనంతరావు పాటంకర్ యను భక్తులతో,   కేవలం పుస్తకజ్ఞానం  చాలదని, గ్రంథవిషయాల నభ్యసించి ఆచరించాలని, గుర్వనుగ్రహం లేని పుస్తకజ్ఞానం వ్యర్థమనే  పరిష్కార  మార్గాన్ని సూచించారు సద్గురు సాయి.  వెలిగే దీపం జ్ఞాన సంపదకు నిదర్శనం, అందుకే మజీదులో  సాయి నిత్యం దీపాలవెలిగించేవారు. 

సద్గురుసాయి ధ్యానయోగమున పరిపూర్ణుడు. తమ గురుసేవనిలా   వర్ణించారు, " నిరంతర ధ్యానములోనున్న వారిని ఇంద్రియశక్తులన్నిటిని ఏకంజేసిన కనులతో జూచుచుండెడివాడను. మేమిద్దరం ఆనందములో మునిగెడివారము. రాత్రియంబవళ్ళు నిద్రాహారములులేక నేను వారివైపు దృష్టి నిగిడ్చితిని. వారినిచూడనిదే నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము, వారి సేవ తప్ప  నాకింకొకటి లేకుండెను. వారే నాయాశ్రయము. నా మనస్సు ఎల్లప్పుడు వారియందే నాటుకొని యుండెడిది. నా గురువును అట్లు 12 సంవత్సరములు సేవించితిని. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండెడివారు. తాబేలు తన పిల్లలను కేవలము తన దృష్టితో పెంచునట్లు, నన్నుగూడ మా గురువు తమ దృష్టితో పోషించుచుండెడివారు. "   సాయి ధ్యానము అంత తీవ్రమైనది కావునే గురుకృపపొందారు. తమ సామర్ధ్యమునకు గురుకృపే కారణమని తమ గురుభక్తిని చాటారు. భక్తులు తమనెలా ధ్యానించాలో వివరిస్తూ నిలా జెప్పారు, " ఆత్మసాక్షాత్కారానికి ధ్యానమవసరము. దాని నలవరచుకొన్నచో వృత్తులన్నియు శాంతించును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానింపుము! అదియే జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో రేపగలు మీరు  చూచుచున్న నాయీ యాకారమును ధ్యానించుడు. " అంతియేగాదు సాయి యోగిరాజులు, అష్టాంగయోగ ప్రావీణ్యులు. ధౌతి ఖండయోగ మున్నగు క్రియలయందు  సిద్ధులు. 

సమర్ధ సద్గురు శ్రీ సాయినాథులు తమ భక్తులకు విశ్వరూపమును సందర్శింపజేశారు. సర్వజీవులపట్ల సాయివిశ్వ ప్రేమకు కులమతములు, దేశ విదేశ భేదములు, సరిహద్దులు ఉచ్చనీచములు లేవు. సర్వులకూ వెలుగు ప్రదర్శించే సూర్యభగవానుడే సాయిదేవుడు.   సర్వ దేవీ దేవతలు , యోగులు, సమస్తప్రాణికోటి తామే ననెడి యనుభవాన్ని భక్తులకు ప్రసాదించారు. శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా, పండరీపుర విఠలునిగా,  పరమశివునిగా, గణపతిగా, హనుమగా, ఆదిశక్తిగా దర్శనమిచ్చారు. అక్కల్కోటస్వామి వారిలాంటి దత్తస్వరూపములు తామనెడి అనుభవాన్ని భక్తుల కందించారు. చీమ దోమ ఈగ గేదె కుక్క మున్నగు జీవులన్నీ తమచైతన్య రూపమనే సత్యాన్ని దర్శింపజేశారు. తమ చిత్రము, విగ్రహము, తాము ఒక్కటే యనెడి సత్యానుభవాన్ని రుజువుజేశారు.  ఎల్లలులేని ఖండ ఖండాంతరముల వ్యాపించి తమయునికిని నమ్మినవారలకు కల్గించుచున్నారు. సాయి మహిమలు, లీలలు వారి మహాసమాధి యనంతరము ప్రపంచమున నలుచెరగులా  వ్యాపించి కొనసాగుతున్నాయి. మహాభారత యుద్ధంలో అర్జునునకు విశ్వరూపం ప్రదర్శించిన శ్రీకృష్ణ పరమాత్మలా సాయి  తమ భక్తులకు అసమాన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. సాయిని సేవించి, శరణాగతి పొందినవారల జన్మయే ధన్యము గదా ! సాయి రక్ష  శ్రీరామరక్ష. సమర్ధ సద్గురువు, సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపులు, రాజాధిరాజయోగిరాజులు, సర్వవ్యాపకులు, సర్వజ్ఞులు   దయాసముద్రులు శ్రీ  సాయినాథులు విశ్వమానవాళికి ఆయురారోగ్యసౌభాగ్యములు, సుఖశాంతుల  ప్రసాదించి సదాకాపాడుటకై  హృదయపూర్వకముగా ప్రార్ధిస్తున్నాను. 

సాయిలీలల చదవండి, చదివించండి పదుగురితో పంచుకోండి, సాయి కృపకు పాత్రులుకండి! 

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి! 

ఓం మంగళం సాయినాథాయ మహనీయగుణాత్మనే సర్వలోక శరణ్యాయ శ్యామరక్షాయ మంగళం!
లోకస్తమస్తా సుఖినో భవంతు!
ఓం శాంతి శాంతి శాంతిః !




Comments

  1. ఈపవిత్ర గురుపౌర్ణమి సందర్భంగా సర్వమానవాళికి సమర్ధసద్గురు సాయినాథుల ఆశీసులు రక్షణ పరిపూర్ణంగా లభించుగాక ! ( Praying for Sadguru Sai Baba's blessings and protection to the entire humanity.)

    ReplyDelete

Post a Comment