ఉపవాసం అంటే?
శ్రీసాయినాథాయనమః
ఉపవాసనియమాన్నిగూర్చి సాయిబాబా సందేశం!
సాయిబాబా తమభక్తులకు ఉపవాసాన్ని నిరసించారు, అలాఅని రుచులకుపోతూ అతిగాతినవద్దనికూడా చెప్పారు. భగవద్గితయందునా, ఆహారవిషయంలో మితంగాను, హితంగాను ఉండాలని చెప్పబడినది. సాయిభక్తి సాధనారహస్యం లో శ్రీసాయినాథుని శరత్ బాబూజీగారిలా అంటారు, " ఉపవాసమంటే మనసును వ్యర్ధమైన విషయాలతో నింపక ఖాళీగా వుంచుకొని అందులో ఉపాసనా దైవాన్ని ప్రతిష్ఠించుకొని ఆయనకు అంతరంగంలో దగ్గరవడమన్నమాట, సమీపంగా వసించడమన్నమాట " ! అనగా బాహ్య ఆహారనియమాలకంటే అంతరంగ భావాలను నియంత్రించుకోవాలనేది సాయి సూచన. ఈవిషయమై శ్రీసాయి సచ్చరిత్రలోను, యితర సాయిగ్రంధాలలోను యెన్నో ఉదాహరణలను చూడవచ్చును. వాటిలోకొన్నింటినిపుడు స్మరించుకొందాము.
సంగమనేరు గ్రామంలో నివసించే రాధాబాయి యను ముసలమ్మ బాబా పేరుప్రతిష్ఠలువిని వారినిదర్శించి మిగుల సంతోషపడినది. మనసులో సాయిబాబాను తనగురువుగా నిర్ణయించుకొని వారు ఏదేని మంత్రోపదేశమిచ్చువరకు ఉపవసించాలని ఆహారం తినుట మానినది. అలా మూడురోజులు గడిచాక భక్తుడు శ్యామా మిగులఁభయపడి బాబాకావిషయం తెలియపరచి ఆమె ప్రాణాలరక్షింపమని వేడుకొంటాడు. అపుడు దయాళు సాయి ఆమెను పిలిపించి మిగుల ప్రేమతో యిలా మాట్లాడారు, " ఓ తల్లీ, నాగురువునుండి మంత్రోపదేశమాసించి పన్నెండేడ్లు వారిని మిగులభక్తిశ్రధ్ధలతో అనుక్షణం సేవించాను. నామనసు వారియందే నాటుకొన్నది. నాగురువు నన్ను సర్వవేళలా కాపాడుచుండెడివారు. తల్లితాబేలు తన బిడ్డల కేవలం ప్రేమమయ చూపులతో పెంచిపెద్దజేసినటుల నాగురువు నన్ను కరుణాకటాక్షాలతో వీక్షించి మిగుల ప్రేమవర్షం కురిపించారేగాని ఎలాంటి మంత్రోపదేశమివ్వలేదు. కావున నీవును ఏ మంత్రమునాశింపక నన్ను శ్రద్ధావిశ్వాసములతో సేవింపుము, నీవు చేయు అన్నిపనులను ఆలోచలను నాకర్పింపుము" . ఈప్రకారముగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించారు. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసము విరమించినది.
ఒకరోజు సాయిబాబా కేల్కర్ తో , " ఇపుడు సిమోగా పండుగకదా, బిడ్డలను ఉపవసింపనివ్వను! " అన్నారు. ఆయన మాటలెవ్వరికి అర్ధం కాలేదు. కొద్దిసేపట్లో శ్రీమతి గోఖలే శిరిడీ చేరి, కేల్కరింట్లో సమానుపెట్టి మసీదు చేరింది. అపుడు సాయి నెమ్మదిగా , " ఈ ఉపవాసము, తవపాశము ఎందుకు? దాదా కేల్కరింటికెళ్లి పోళీలుచేసి మనం తినాలి. దాదాకు, అతని బిడ్డలకు పెట్టాలి " అన్నారు. సరిగ్గా అదేసమయంలో కేల్కర్ భార్య బహిష్టు అయింది. ఇంట్లో వంటచేసే వారెవరూలేరు. కనుక శ్రీమతి గోఖలేనే ఆయింట్లో వంటచేసి ఆ కుటుంబానికిపెట్టి తినవలసివచ్చినది. నిజానికి ఆమె మొదట శిరిడీవెళ్లి సాయి సన్నిధిలో 3 రోజులు ఉపవసించాలనుకొన్నదట.
ఒకసారి దీక్షితు యావజ్జీవితమూ రాత్రి ఉపవసించాలని నిశ్చయించుకున్నాడు. నాటిసాయంకాలము అతడు మసీదు చేరగానే సాయి, " రాత్రి భోజనానికి ఏమి చేయిస్తున్నావు? " అన్నారు. " మీరేది చెబితే అది! " అన్నాడు దీక్షితు. " మాములే రొట్టెలు, కూర చేయించి, అక్కడే నైవేద్యంపెట్టి నీవూ తిను అన్నారు బాబా" ఈరోజు అలానేచేస్తాను, రేపటినుంచినేను రాత్రిభోజనం చేయను. " అన్నాడు దీక్షితు. బాబా అప్పుడేమీ మాట్లాడలేదు గాని, రోజూ సాయంకాలం అలానే హెచ్చరిస్తున్నారు. అంతటితో ఆనియమం మానుకున్నాడు దీక్షితు.
ఒకరోజు అందరూ ఆరతికి మసీదుకు వెళ్ళినపుడు బల్వంత్ నాచ్నెను వెళ్లి భోజనం చేయమన్నారు సాయి. ఆరోజు ఏకాదశి. సాటి భక్తులిద్దరూ ఉపవసిస్తుంటే తాను తినడం బావుండదని, అతడారోజు భోజనం చేయనన్నాడు. నిజానికి అతడెన్నడూ ఉపవసింపడు. బాబా అతని సహచరులను చూపి, " వీరు పిచ్చివాళ్ళు. నీవైనా వాడాకుపోయి భోజనంచేసిరా ! " అన్నారు. వంటవాడు చికాకుపడి, ఆరతి అయితేగాని భోజనం పెట్టనన్నాడు. నాచ్నే మసీదు చేరగానే " భోజనం చేసావా? అన్నారు బాబా. అతడు జరిగినది చెప్పక ఆరతి అయ్యాక తింటానన్నాడు. బాబా పట్టుదలగా , ' భోజనమయ్యాకే ఆరతి జరుగుతుంది! ' అన్నారు. వంటవాడు వడ్డించక తప్పలేదు. భోజనం తర్వాత నాచ్నే చేత తాంబూలం తినిపించారు బాబా.
'సాయి భక్తి సాధన రహస్యం' లో శ్రీ శరత్ బాబూజీ గారు ఉపాసన విషయమై సాయిని ప్రత్యక్షంగా సేవించిన బాబా భక్తాగ్రగణ్యుడు, తీవ్ర తపస్వి , సిద్ధపురుషుడుయగు ఉపాసనీబాబానుగూర్చి విస్మయపరచే విషయాలను వివరించారు.వాటిని క్లుప్తంగా తెలిసికొందాం. " 1911వ సంవత్సరంలో ఉపాసనీ మహారాజ్ సాయిని దర్శించినపుడు బాబా ఆయనను నాల్గుసంవత్సరాలు శిరిడీలో వుండమని ఆదేశించారు, పరిపూర్ణసిద్ధికూడ లభిస్తుందని హామీ ఇచ్చారు. నాలుగేండ్లు తానెలాంటి ఆధ్యాత్మ సాధనచేయాలని అడిగాడు శ్రీఉపాసనీ. దానికి బాబా, ' ఏమీ చేయనక్కరలేదు, రొట్టెకూర తిని ఉరక కుర్చుంటేచాలు! మిగిలినదంతా నేను పూర్తిజేస్తా ' నన్నారు. ఇచట బాబా ఆహారవిషయంకూడ నొక్కి చెప్పడం గమనార్హం. శిరిడీలో కొందరు సాయిభక్తులు నిర్వహిస్తున్న భోజనశాలలో మొదట భోజనం జేసేవాడు శ్రీఉపాసనీ. కాని కొంతకాలం గడిచాక ఆభోజనశాల నిర్వాహకులకు శ్రీఉపాసనీకి ఏవో మనస్పర్థలు కలిగాయి. భోజనశాల నిర్వాహకులు తనను అవమానం చేసారని వారిపై కినుకతో భోజనం మానేసి పస్తులుండటం ప్రారంభించాడు శ్రీఉపాసనీ. సాటి సాయిభక్తులు ఎంత నచ్చజెప్పజూసినా, స్వయంగా బాబానే ఎన్నోసార్లు చెప్పినప్పటికీ శ్రీఉపాసనీ తన ఉపవాసదీక్షను విరమించలేదు. నిరసన వ్రతాన్ని దైవం నిర్ణయించిన ఓ తపోదీక్షగా భావించి మొండిగా మూర్ఖంగా కొనసాగించాడు శ్రీఉపాసనీ. తనకై తాను విధించుకున్న కఠిన ఉపవాస దీక్షను చూసిన గ్రామస్తులు ఆయనను ' ఉపవాసీ ' బాబాయని పిలిచేవారు. దీర్ఘకాలం కఠిన ఉపవాసాలవల్ల శ్రీఉపాసనీ దేహారోగ్యమేగాక మానసిక స్వస్థతగూడ దెబ్బతిన్నది. 1913 ఏప్రిల్ లో చాలా ప్రమాదకరంగా పరిణమించిందికూడా. శ్రీసాయిఅనుగ్రహవిశేషము మార్గదర్శకత్వము లేనట్లయితే శ్రీఉపాసనీ శాశ్వతంగా పిచ్చివాడై అలానే మరణించి వుండేవాడేమో! శ్రీఉపాసనీని ఆ ప్రమాదస్థితినుండి తప్పించి, స్వస్థతచేకూర్చడానికి శ్రీసాయి తమ దివ్యశక్తితో ఏం చేసారో మనకు అగోచరం. శ్రీఉపాసనీ స్వస్థుడవడానికి బాహ్యంగా మాత్రం బాబా చేసిన చికిత్స, ఇచ్చిన ' ఔషధం ' మాత్రం ఆహరం! "
పైన పేర్కొన్న ఆహారానియమ విషయానికి దగ్గర సంబంధంగల ఓ ఘటన శ్రీసాయి సచ్చరిత్ర 36 అధ్యాయంలో చెప్పబడినది. 30 వేలరూపాయల నగదు పోగొట్టుకొని మిగుల దుంఖిస్తున్న వ్యక్తికి బాబానే ఓ పరిచయంలేని ఫకీరుగా ప్రత్యక్షమై తనధనాన్ని తిరిగిపొందుటకు ఓ ఉపాయం చెబుతాడు. అదేమన శిరిడీ సాయి యను ఔలియాకు మొక్కు కొమ్మని , వారిని దర్శించువరకు తనకు ఇష్టమైన ఆహారము తినవద్దని. ఆ వ్యక్తి అటులనే జేసి తనధనం తిరిగి పొంది సాయిబాబాను దర్శిస్తాడు. ఇచట వ్యక్తి మానిన ప్రియమైన ఆహారం ఉపవాసంకిందకు రాదు, కేవలం సాయి పై విశ్వాసం పాదుకొనుటకు చెప్పబడిన నియమంగా తలచవచ్చును. పూజ్యశ్రీ ఆచార్య భరద్వాజగారు తమ సత్సంగప్రసంగంలో భక్తులడుగు పెక్కు సమస్యలకో చక్కటి పరిష్కారం సూచించారు. " సాయిని మనసారా ఆర్తితో ప్రార్ధించి తమసమస్యను మనసులో బాబాకు చెప్పుకొని, సమస్యతీరేవరకు ఇష్టమైన ఆహారపదార్ధం తినడం మానవలె! " ననెడిది ఆ సందేశ సారాంశం. కేవలం ఇష్టమైన పదార్ధమేగాని, భోజనం మానడం కాదుసుమా !
సాయిబాబా అక్టోబరు 15,1918 న మహాసమాధి చెందారు, అనగా తారీఖులప్రకారం నేటికి 102 సంవత్సరములు గడచినవి. సాయిలీలల స్మరించి వారికృపకు పాత్రులమయ్యెదముగాక!
ReplyDelete