'' మాటకై ప్రాణమిస్తాను '' సాయిబాబా !

 ఓంశ్రీసాయిమాత్రేనమః 


పాఠకభక్తులెల్లరకు విజయదశమి శుభాకాంక్షలు! 
( శిరిడీలో ఓభక్తునికి సాయి ' బాల ' గా దర్శనమిచ్చారు.)

నేడు సాయిబాబా మహాసమాధి పుణ్యతిధి.
 " శరీరమే తామను భ్రమించే పామరులకు జనన మరణాలుంటాయి. మృత్యువుపై విజయం సాధించినవారే మహాత్ములు. సాయి సశరీరులుగా వున్నప్పుడే మనలా శరీర పరిమితులుగా లేరు, అన్నిరూపాలలో వున్న పరమాత్మగా జీవించారు. అలాంటివారికి మరణమెలా సంభవం? ". ఆచార్యవాణి 

'' మాటనిలుపుటకై,  నాప్రాణమిస్తాను '' సాయిబాబా !

ద్వారకామాయిలో తమను సందర్శింపవచ్చిన భక్తులతో సాయిబాబా తరచుగా , " నేను మజీదులో కూర్చుని సత్యమునే పలికెదను, నా భక్తులరక్షించుటకై వేలమైళ్ళు వెళ్లెదను, సప్తసముద్రముల దాటెదను, చివరికి నావాణ్ణి కాపాడుటకై ప్రాణములసయిత మిచ్చెదను." యని పలుకుచుండెడివారు. సాయి మాటలు నూటికి నూరుపాళ్లు సత్యమని ధ్రువపరచుటకు  శ్రీసాయి సచ్చరిత్ర లో పెక్కు ఉదాహరణలున్నాయి  ఆయా విషయాలను క్లుప్తంగా స్మరించుకొందాము, ఏలయన స్మరణముకూడ నవవిధభక్తులలో ఓ భక్తిమార్గంగా చెప్పబడినదికదా! 

ముందుగా శ్రీసాయి సచ్చరిత్రములోని 40వ అధ్యాయములొ చెప్పబడిన ఓ అద్భుత సంఘటన చూచెదము. బి.వి.దేవు గారు దహనులో మామలతదారుగా పనిచేస్తుండేవారు, ఆయన సాయి కి అంకితభక్తుడు. ఓ పర్యాయం వారి తల్లి  పెక్కు నోములు నోచినది, ముగింపుగా కొన్నివందల బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసియున్నది. ఈ విషయమై దేవుగారు సాయిబాబాను మిగుల ప్రేమతో  ఆహ్వానిస్తూ జోగ్ యనుభక్తునిపేర లేఖవ్రాసారు. జోగు చదివినలేఖవిని తాము మరిద్దరితో కలిసి సంతర్పణమునకు వచ్చెదమని బాబా  జాబు వ్రాయించారు. సంతర్పణమునకు కొన్నిరోజులముందు ఓ పరిచయంలేని సన్యాసి చందాలవిషయమై దేవు ని కలువ మరికొన్నిరోజులపిమ్మట రావలసినదని దేవు చెబుతాడు. సంతర్పణపు రోజున  సరిగ్గా 12 గంటలకు ఆ సన్యాసి మరిద్దరితో వచ్చి భోంచేసివెళ్తాడు. కార్యక్రమం పూర్తయిన పిమ్మట దేవు  జోగుకు,  బాబా మాటతప్పారని విందుకు రాలేదని నిష్టురంగా లేఖవ్రాసాడు. ఆ విషయం గ్రహించిన బాబా జోగు లేఖ చదువకమునుపే యిలా చెబుతారు , '' హా! వాగ్దానముజేసి, దగాజేసితిననుచున్నాడు. ఇద్దరితోకూడ సంతర్పణమునకు వచ్చిననన్ను పోల్చుకొనలేకపోయెనని వ్రాయుము.  నామాట నిలబెట్టుటకై ప్రాణములనైన విడచెదను. నా మాటలను నేనెప్పుడూ పొల్లుచేయను. "  ఈవిషయం జోగు,  లేఖద్వారా దేవుకు తెలియజేస్తాడు. లేఖచదివిన దేవు మిగుల ఆనందాశ్చర్యాలకు లోనవుతాడు. అనవసరంగా బాబాను నిందించినందులకు మిగుల పశ్చాత్తాప పడతాడు. 

ఇపుడు శ్రీసాయి చరిత్రము,  46వ అధ్యాయములో చెప్పబడిన మరొకలీలను సింహావలోకనం జేసుకొనెదము. బాబాకు మిక్కిలి సన్నిహితభక్తులు కాకాసాహెబు దీక్షితు, నానాసాహెబ్ చాందోర్కరులు నాగపూరు మరియు గ్వాలియరుల లోని తమగృహములజరుగు శుభకార్యములకు బాబాను స్వయంగా రావాలని  బలవంతం జేస్తారు. బాబా వారికి శ్యామాను దీసుకొని పోవలెననియు " కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామాకంటె ముందుగనే గయలో కలిసికొనెద " నని చెబుతారు. పిమ్మట శ్యామా బాబాయనుమతి ఆశీసులతో అప్పాకోతే యను మరొకనితో కలసి వారి వారి శుభకార్యాలకు  హాజరైన  పిదప కాశీ అయోధ్య తీర్ధయాత్రలుజేసి ఆపై గయ వెళ్లి యచటి పాండా ఇంటిలో దిగుతారు. పాండా ఇల్లు  చాలా పెద్దది, యింటిముందు భాగంలో మధ్య నమర్చబడిన బాబా అందమైన పెద్ద చిత్రపటం జూసి శ్యామా మిగుల చకితుడవుతాడు, బాబాపలుకులు  జ్ఞప్తికివచ్చి కన్నుల ఆనందబాష్పాలు నిండుతాయి. 12 సంవత్సరాల పూర్వము శిరిడీ దర్శించిన పాండా బాబాయనుమతితో,  శ్యామానుండి ఆ అందమైన చిత్రపటాన్ని పొందుతాడు. అదే శ్యామా తన యింట అతిధిగా తెలిసికొన్న పాండా మిగుల సంతోష ఆశ్చ్యర్యములకు లోనై శ్యామాను మిగుల గౌరవించి గజారోహణము జేస్తాడు. గయలో చిత్రపటరూపంలో శ్యామాకు దర్శనమిచ్చి బాబా తమ మాటను నిలుపుకున్నారు, తమకు తమచిత్రపటానికి తేడాలేదనే సత్యాన్ని  మరొక్కసారి భక్తులకు తెలియజెప్పారు. 

సాయిప్రేమ, రక్షణ  కేవలం మానవజాతికి మాత్రమే  పరిమితంకాదు. వారి కరుణాకటాక్షాలు సమస్త జీవజంతువులపై వర్షిస్తుంటాయి.  ప్రస్తుత విషయానికి  సంబంధించిన మరొక అద్భుతలీలను శ్రీసాయి సచ్చరిత్రములోని 47వ అధ్యాయములలో చూడగలము. సాయి స్వయంగాజెప్పిన ఈ లీల మిగుల సంభ్రమాశ్చర్యాల కలిగిస్తుంది. అది ఓ పేరాశ ధనికుని, యాతని పరివారానికి సంబంధించిన కథ. ఊరిలోని శివాలయం మరమ్మత్తులకై  గ్రామప్రజలు చందాలుపోగుజేసి పరమలోభియగు ఓ ధనికునికి ఆ సొమ్మప్పగించారు. కాని ఆ పిసినారి ఆడబ్బుతో దేవాలయం బాగుజేయక యూరకున్నాడు. తనకు కలలో కనబడిచెప్పిన పరమశివుని సందేశం మేరకు దేవాలయ మరమ్మత్తులకు వానిభార్య వేయిరూపాయలు విలువజేయు తన బంగారు నగలనివ్వ, ధనికుడు ఆమెను మోసంజేసి ఎలాంటి పనులుఁజేయక దుబాకియను ఓ పేదరాలు 200 రూపాయలకు  కుదువబెట్టిన పనికిరాని నేల నిస్తాడు. ఎలాంటి ఆదాయంలేని ఆభూమి పూజారి అధీనంలో వుంటుంది. కాలచక్రంలో కొన్నాళ్లకో చిత్రం జరుగుతుంది. గొప్ప తుఫాను సంభవించి పిడుగుపాటుచే లోభి,  వానిభార్య మరణిస్తారు. మరుజన్మలో లోభి వీరభద్రప్ప యనుపేర  పేదబ్రాహ్మణుడుగాను, వానిభార్య గౌరి నామంతో  పూజారికూతురుగాను జన్మిస్తారు.  పేదరాలైన దుబాకి మందిర గొరవ గృహంలో చెన్నబసప్పగా పురుషజన్మనెత్తుతుంది. విధి వారందరిని మరల కలుపుతుంది, వారందరు బాబాకు సన్నిహితులౌతారు. బాబా సమ్మతితో గౌరీని వీరభద్రప్ప వివాహమాడతాడు. పూర్వజన్మలో పూజారికి సంక్రమించిన భూమిధర మిగులపెరిగి లక్షరూపాయలకు విక్రయమై, పూజారికూతురు గౌరి ఆ డబ్బుకు వారసురాలౌతుంది. లోభి ధనదాహం ఈ జన్మలోకూడ కొనసాగి భార్యధనాన్ని పొందగోరుతాడు. గౌరీని హక్కుదారుగా  నిర్ణయించి, చెన్నబసప్ప సహకారంతో దేవాలయాభివృద్ధికి కొంత ఖర్చుజేయమని బాబా  పలుకుతారు. ఇందులకు వీరభద్రప్ప మిగులకోపించి బాబా,  భార్య గౌరి మరియు  చెన్నప్పలపై మిగుల ద్వేషం పెంచుకొంటాడు. ఓ రోజున  ద్వేషి భద్రప్ప పిరికివాడగు బసప్పపై దాడిజేసి వానిని చంప ప్రయత్నింప బసప్ప సాయిని శరణు వేడుతాడు.  కోపిష్టి భద్రప్పనుండి   రక్షిస్తానని బాబా వానికి వాగ్దానం జేస్తారు. జన్మలుమారి వీరభద్రప్ప  పాముగాను, చెన్నబసప్ప  కప్పగాను జన్మలెత్తుతారు. కాని వారిమధ్యనున్న పూర్వవైరం కొనసాగుతుంది. పామునోట కప్పజిక్కుతుంది. సరిగా కప్ప ప్రాణాపాయ సమయంలో బాబా అచట ప్రత్యక్షమై తానిచ్చిన మాటప్రకారం పామునోటినుండి కప్పను  రక్షిస్తారు. ఈ కథలో మరికొన్ని నిజాల  మనం గ్రహింప గలము, వ్యక్తులమధ్య నున్న ద్వేషము, వైరము మరుజన్మలోను  కొనసాగుతుందని, లోభికి అధోగతి తప్పదని. ఈ నిజాల వెలుగులో మన జీవితాల  సరిదిద్దుకోమ్మనెడిది బాబా సందేశంగా తలచవచ్చును. 

సాయి ఆడి తప్పని హరిశ్చంద్రుడు. బాబా తామిచ్చిన  మాటకు తమ ప్రాణాన్నే ఫణంగాపెట్టిన అత్యద్భుత సంఘటన శ్రీసాయి సచ్చరిత్రములోని 42,43,44 అధ్యాయాలలో చూస్తాము. సాయి శిరిడీకి వచ్చిన మొదటిరోజులలో అచటిప్రజలకు వారి ఘనతతెలియదు, చాలామంది బాబాను పిచ్చివానిగా తలచేవారు, కొందరు రాళ్లుకూడ విసిరేవారు. ఆ వాతావరణంలో సాయికి అన్నపానాదులెవరు సమకూరుస్తారు?  ఆసమయంలో శిరిడీలో బాయిజాబాయి యనే ఉత్తమ ఇల్లాలుండేది. బాబాను మిగులప్రేమాదరములతో సేవించెడిది, ఆకువేసి అన్నంపెట్టి తినిపించేది, సొంత తమ్మునిగా ఆత్మీయతతో వ్యవహరించెడిది. సాయికూడ ఆమెను అక్కాయని సంభోదించేవారు. ఆమెకో కొడుకుండేవాడు, పేరు తాత్యా. అతడుకూడ బాబాను మామాయనిపిలుస్తు మిగుల అన్నోన్యంగా  మెదిలేవాడు. బాయిజాబాయి తనఅంత్యకాలంలో తన కొడుకుగూర్చి మిగులవ్యాకులతపొందెడిది.  చివరి క్షణాలలో సాయి ఆమెకో మాటిస్తారు, తాత్యాను కంటికి రెప్పలాచూస్తానని, వాని ప్రాణానికి తన  ప్రాణం అడ్డువేస్తానని. బాయిజాబాయి కాలం జేస్తుంది. కొంతకాలానికి బాబా,  శిరిడీలో  జబ్బుపడ్డ  రామచంద్ర పాటిలుకు దర్శనమిచ్చి  తాత్యా  రెండేళ్ల తరువాత 1918వ సంవత్సరము విజయదశమి రోజున  మరణిస్తాడని సూచించారు. చెప్పినప్రకారం  విజయదశమి  ముందు రోజులలో  తాత్యా మిగులజబ్బుపడి మరణానికి దగ్గరౌతాడు. కాని సరిగా అదేసమయానికి బాబా సమాధిపొందుతారు, తాత్యా రోగముక్తుడై పిదప పెక్కుకాలం జీవిస్తాడు. సాయి వాక్కు సత్యవాక్కు గదా! తాత్యాకై బాబా తమ ప్రాణాలర్పించారని పెక్కుమంది భక్తులు విశ్వసిస్తారు. శ్రీసాయిబాబా మహాసమాధిచెంది నేటికి 102 సంవత్సరములు పూర్తయినవి, కాని సాయి నిత్యసత్యుడు, సర్వవ్యాపకుడు. వారి మహిమాన్వితలీలలు నిత్యనూతనములై నేటికీ  విశ్వవ్యాప్తంగా ఖండఖండారంతరముల  కొనసాగుతున్నాయి. శ్రీ సాయిబాబా     అభయవాక్యానుభవముల   భక్తులునేటికిని పొందుచున్నారు.   సాయిలీలల స్మరించి పునీతులమయ్యెదముగాక!  సాయి కృపకు పాత్రులమయ్యెదముగాక!!

శ్రీసాయిబాబా అభయవాక్యములు! 

1. శిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. 
2. ఆర్తులైననేమి నిరుపేదలైన నేమి ద్వారకామాయి ప్రవేశించినంతనే సుఖసంపదల నొందగలరు. 
3. ఈ భౌతిక దేహానంతరము నేనప్రమత్తుడనే. 
4. నా భక్తులకు రక్షణంబు నా సమాధినుండియే వెలువడును. 
5. నా సమాధినుండియే నా మానుష శరీరము మాటలాడును. 
6. నా సమాధినుండియే నేను సర్వకార్యముల నిర్వహింతును. 
7. నన్నాశ్రయించినవారిని,శరణుజొచ్చినవారిని రక్షించుటయే నా  కర్తవ్యము. 
8. నా యందెవరికి దృష్టియో వారియందే నా కటాక్షము. 
9. మీ భారములు నాపై బడవేయుడు. నేను మోసెదను. 
10. నా సహాయముగాని నా  సలహాగాని కోరిన తక్షణమొసంగ సంసిద్ధుడను. 
11. నా భక్తుల యింట 'లేమి' యను శబ్దము పొడసూపదు.  

శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక 1
అందరికిశుభమగుగాక !
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!

Comments

  1. విజయదశమి శుభసందర్భమున శ్రీసాయిబాబా ఆశీసులు, వారి రక్షణ సర్వమానవాళికి సదా లభించుటకు మనఃపూర్వక ప్రార్ధన!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)