దీపావళి.
శ్రీసాయినాథాయనమః
పాఠకభక్తులెల్లరకు దీపావళి శుభాకాంక్షలు, సాయిబాబా దివ్యాశీసులు !
దీపావళి కర్ధం వెలిగే దివ్వెల వరుసని. సాయిబాబాకు నిత్యం ద్వారకామాయిలో దీపాలువెలిగించడమంటే యెంతో ప్రియం, ఎంత ఇష్టమన శిరిడీలో రోజువారీ నూనెనిచ్చే వర్తకులు ఓరోజు నూనెలేదన నీళ్లతో దివ్వెల వెలిగించి ద్వారకామాయినంత తేజోమయం జేశారు. తప్పు నెరిగిన వ్యాపారులను కరుణామయి సాయి క్షమించారు. బాలసాయి వివరములు తెలియగోరిన శిరిడీ వాసులు ఖండోబా ఆవేశించిన ఓ వ్యక్తిని ప్రశ్నింప, వేపచెట్టుకింద తవ్వమన్నాడు. తవ్విచూడగా ఓ పెద్దబండరాయి దానికింద భూగృహము అందు వెలుగుచున్నదీపాలు యితర పూజాపరికరాలు కనిపించాయి. సాయి అది తమగురుస్థానమని అందు తాము పన్నెండేళ్ళు గురుసేవ జేసామని, కావున దానిని రక్షించాలని చెప్పినమీదట గ్రామస్తులలానే జేసి మునుపటిలా మూసివేశారు. వేరొక సందర్భంలో ఓక భక్తుడు చెక్కబల్ల సమర్పింప సాయి దానిని గుడ్డపీలికల సాయంతో మజీదుకప్పుకేలాడవేసి, దానికి నాలుగువైపులా దీపాలనుంచి నిదురించే సాయిని జూసి భక్తులు మిగుల విస్తుపోయేవారు. భక్తుల తాకిడి పెరుగగా బాబా దానిని విరచి ధునిలోవేసారు. ఒక పర్యాయం దీపావళికి ముందురోజు దూరానయున్న ఓపసిబిడ్డ మండుచున్నకొలిమిలో పడగా, ద్వారకామాయిలోధునిలోసాయిబాబా తమచేయిపెట్టి కాల్చుకున్నారు, అదేక్షణాన దూరాన బిడ్డరక్షింపబడినది.
సాయిబాబా తమనుగూర్చిచెబుతూ వ్యక్తుల నామరూపాల కతీతంగా అందరిలో దాగియుండే చైతన్యమే తామన్నారు. వేరు వేరు కట్టెలలో దాగియుండే అగ్నిలాంటిది సాయి విశ్వచైతన్యం. అందులకే అందరిలో తామున్నామని, యెవరిని హింసించినా ద్వేషించినా తాము మిగుల బాధపడతామని పెక్కుసార్లు చెప్పేవారు. ఈ దీపావళి శుభసమయాన వారి సందేశాన్ని స్మరిస్తూ ఆచరణకు ప్రయత్నించెదముగాక, వారుజూపిన జ్ఞానమార్గపు వెలుగులో పయనించెదముగాక, మన హృదయదీపాల వెలిగించెదముగాక !
వెలిగే దీపప్రకాశం జ్ఞానానికి సంకేతం, ఆ కాంతిమార్గంలో పయనించి మననిర్దేశ గమ్యాన్ని క్షేమంగా జేరుకొందుముగాక!
ReplyDelete