నాటకదీపము.

 శ్రీసాయినాథాయనమః 


" తమసోమా జ్యోతిర్గమయా " 

నేడు కార్తీకపౌర్ణమి, వెలుగువైపు ప్రయాణానికి సంకేతం ! 
( దీపాన్నిగూర్చి ఆధ్యాత్మ పరంగా  " పంచదశి "  యను వేదాంతగ్రంధంలో చెప్పబడిన కొన్ని ఆసక్తికర విషయముల నిచట  చర్చించడమైనది. )

" జీవితం ఓ రంగస్థలం, మనుషులంతా పాత్రధారులే ! "  విలియం  షేక్స్పియర్ 

శిరిడీసాయిబాబా సద్గ్రంథపఠనమును మిగుల ప్రోత్సహించేవారు. తమ తమ విరామసమయంలో వివిధభక్తులు భావార్ధరామాయణము, జ్ఞానేశ్వరి, ఎకనాథభాగవతము, భగవద్గీతాది సద్గ్రంధాలను చదువుచూ తోటివారికి వినిపించెడివారు. దాదాసాహెబ్ ఖాపర్డే  అమరావతికి చెందిన ప్రఖ్యాత లాయరు, విద్యావేత్త, స్వాతంత్ర్యోద్యమకారుడు, తిలక్ కు కుడిభుజంలాంటివాడు. అతడు శిరిడీలో నాలుగుమాసములుండి బాబాను మిగులసేవించిన ధన్యాత్ముడు. ఖాపర్డే విద్యారణ్యస్వామిచే  14వ  శతాబ్దంలో వ్రాయబడిన పంచదశి యనెడి ఆధ్యాత్మగ్రంధము చదువుచూ యితరులకు వివరించెడివారు. పంచదశి 15 అధ్యాయములతోకూడిన అద్వైతవేదాంతగ్రంధము సంస్కృతభాషలో వ్రాయబడినది.  అందు 10వ అధ్యాయముపేరు నాటకదీపము, పాఠకులకులకు మిగులప్రియమైనది. ఈఅధ్యాయంలో నిగూఢమైన వేదాంతవిషయములు సాధారణ నిత్యజీవిత ఘటనలతో పోలుస్తూ  అందరికి సులభంగా అర్ధమయ్యేరీతిన చెప్పబడినవి. ఈ విషయములను సంషిప్తంగా పరిశీలించెదము. 

సినిమాలు, టీవీలు లాంటి ఆధునిక వినోదకార్యక్రమములు లేనిపూర్వకాలంలో ప్రేక్షకులకు నాటకశాలలు లేక రంగస్థలములు ( థియేటర్లు ) వినోదమును సమకూర్చెడివి, ప్రస్తుతంకూడ యీప్రక్రియ అతితక్కువుగా కొనసాగుతుంది.   రంగస్థల వివరణను కొద్దిగా ఉహించెదము. నాటకశాలలొ  తమ చక్కటి ఆసనంపై ప్రదర్శన పోషకుడు (సాధారణంగా ఆ దేశపు రాజు ) నాటకాన్ని తిలకిస్తున్నాడు. ఎదుట నర్తకి బహుసుందంగా  నాట్యంజేస్తుంది. వివిధవాద్యకారులు తమ వాద్యములను చెవులకింపుగా వాయిస్తున్నారు,  గ్యాలరీలోని ప్రేక్షకులు తన్మయులై కన్నార్పకుండ చూస్తున్నారు. వీటన్నిటి వెనుకగా మిగులప్రకాశవంతమైన ఓ దీపం నాట్యశాలను తేజోమయం జేస్తుంది. ఆ దీపకాంతిలో కార్యక్రమ పోషకుడు, నర్తకి, ప్రేక్షకులు మిగుల అందంగా కనబడుచున్నారు. నాటకా రంభానికి  ముందుగా రంగస్థలప్రాంతమంతా శూన్యము.  కేవలం దీపం ఆప్రదేశాన్ని వెలుగులతో నింపుతోంది, నాటకప్రారంభంతో క్రమంగా నాట్యశాల నిండినది.  ఇదీ సందర్భ వివరణ, ఊహకందే విషయమే!  

ఇదే ప్రస్తుతవిషయాన్ని విద్యారణ్యులు,  వేదాంతపరంగా   మిగుల మనోహరంగా పోల్చిచెప్పారు. పైన చెప్పబడిన పోషకుడు,  ప్రేక్షకుడు నర్తకి  మరియు ప్రకాశమయ దీపము వేరువేరుగా గాక అందరూ ఒకేవ్యక్తిలో దాగియున్నారనే విషయం మిగుల ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది,  అదెటులనో చూచెదము. 

ఈవివరణలోని  పోషకుడు వ్యక్తిలోదాగిన నేనే సర్వంజేస్తున్నాననే  అహంకారము.  ఎదురుగా కూర్చున్న ప్రేక్షకులు పలు వేరు వేరు ఇంద్రియవిషయములు. నర్తకి వ్యక్తిలోని బుద్ధి. వివిధ వాయిద్య కళాకారులు కన్ను ముక్కు  చెవి  నాలుక మరియు స్పర్శలాంటి ఇంద్రియములు. చివరిగా ప్రదర్శనను ప్రకాశింపజేసే తేజోమయదీపం వ్యక్తిలో నిగూఢమైన అంతర సాక్షి లేక సాక్షీభూత పరమాత్మ. దీపకాంతిలో నాట్యగత్తె వివిధ విన్యాసాలుజేసినట్లు అంతఃసాక్షి ప్రకాశంలో బుద్ది పలురకాలుగా నర్తిస్తుంది. అన్నిటిని,  అందరిని ప్రకాశింపజేసే రంగస్థలదీపం కదలక ఒకేచోటున యుండునటుల,  అంతరసాక్షి తానెటుల చలింపక వ్యక్తియొక్క అన్నిచర్యలను ప్రకాశింపజేస్తుంది. సాక్షి ప్రకాశంలేక చేసేపనులన్నీ చీకటిలోజరిగే గందరగోళంగా వ్యక్తిని అయోమయంలోకి నెట్టేస్తాయి, సినిమామధ్యలో కరెంటు పొతే ప్రేక్షకులకు కలిగే గడబిడలా! ప్రస్తుతం పవిత్ర కార్తీకమాసం నడుస్తోంది, ఈమాసంలో దీపోత్సవాలు జరుగుతాయి, భక్తులు నిత్యం దీపం వెలిగిస్తారు. జ్ఞానమార్గానికి సంకేతమైన కార్తీకదీపపు వెలుగులో మనపనుల చక్కదిద్దుకొనెదముగాక,  మనసులలోదాగిన  చీకటిభావాలను పారద్రోలెదము గాక, ఆనందమయజీవితంవైపు అడుగులువేసెదము గాక ! 

మరింత అవగాహనకు క్రిందనిచ్చిన అనుబంధము చదువగలరు. 

అనుబంధము : పూర్వకాలపు రంగస్థల వర్ణన, నిజజీవితంతో అన్వయ వివరణ. 

నేటికాలపు విద్యుత్తులేని పూర్వపురోజులలో గృహాలు, దేవాలయాలు, యితర సామజిక ప్రదేశాలు  దీపాలతో ప్రకాశించెడివి. నృత్య, సంగీత, నాటక మున్నగు  ప్రదర్శనలు  జరిగెడి థియేటర్లలో వేదికపై ఓ పెద్దప్రకాశమయ దీపమునుంచేవారు.  సాధారణంగా రాజు ఆయాప్రదర్శనలను పోషించెడివాడు. ప్రదర్శనకుముందు ప్రేక్షకులెవ్వరూలేని ఖాళీ  ఆ ప్రదేశాన్ని వేదికపై నమర్చిన దీపము తేజోమయం జేస్తుండేది. నటీనటులు, సంగీతకళాకారులు వారిసహాయకులు ప్రదర్శనకు సన్నాహాలు జేస్తుండేవారు. క్రమంగా ప్రేక్షకులతో హాలు నిండెడిది,  ప్రత్యేక రాజుగారి  రాకకై అందరూ నిరీక్షించేవారు. రాజుప్రవేశించినంతనే తెరతొలగి ప్రదర్శన ప్రారంభమయ్యేది. కళాకారిణి భంగిమలకనుకూలంగా వాద్యకారులు మనోహరంగా తమతమ వాయిద్యాలను శృతిజేసేవారు. నవయవ్వన కళాకారిణి మిగుల ప్రావిణ్యురాలు, తనవిన్యాసాలతొ ప్రేక్షకుల మంత్రముగ్దుల జేసెడిది. ప్రేక్షకుల కరతాళధ్వనులతో ఆ హాలంతా మారుమోగేది. నర్తకి చూపులన్నీ రాజుపైనే, ఆతని ప్రసన్నతకై ఆమె ఆరాటం. వారందరి మెప్పుకోళ్లు ఆమెకెంతో ప్రోస్తాహాన్నిచ్చేవి. ఎంతమంది ప్రేక్షకులుంటే ఆమెకంత ఉత్సాహం, రాజుగారికానందం. రాజు తన యిచ్చానుసారం  వేదికదిగి  వెళ్లినంతనే తెరపడి నాటకం సమాప్తమయ్యేది. క్రమంగా నర్తకి , సంగీతకళాకారులు, ప్రేక్షకులు వెళ్లిపోవడంతో హాలంతా మునుపటిలా శూన్యం. కాని దీపమలానే వెలుగుతుంది. ప్రదర్శనసమయంలోనూ వారందరిపై వెలుగు ప్రసరింపజేసినది. ఆ దీపపు వెలుగులో సమీప  రాజు, నర్తకి,  యెంతో మెరిశారు, మురిశారు. ఆ వెలుగులేనిదే, నాటకప్రదర్శన మసాధ్యం. ఈ సందర్భంలో ముఖ్యంగా గమనించవలసిన విషయమేమంటే ప్రదర్శనలో రాజు, నర్తకి, కళాకారులు మరియు ప్రేక్షకులు పరస్పరం  ఒకరిపై నొకరు ఆధారపడియున్నారు. కాని వేదికపై ప్రకాశించే దీపంమాత్రం వారెవ్వరిపై ఆధారపడలేదు. వారున్నా, లేకున్నా అన్నిసందర్భాలలో వెలుగులతో నిండియే వుంది. 

పైన చెప్పుకొన్న వినోదకార్యక్రమాలు మన నిజజీవితంలో నిరంతరం కొనసాగుతూ వుంటాయి. మనలోని అహంకారమే రాజు, వానికొరకే నాటకప్రదర్శన. నిదురలేచిన మనిషిలా రాజుప్రవేశంతోనే నాటకారంభం. నిద్రించిన వ్యక్తి లా నాటకసమాప్తి. అహం, తాను నటింపక బుద్ధి(నర్తకి ) చే నాట్యం జేయిస్తుంది.  కన్ను ముక్కు చెవి లాంటి ఇంద్రియములు బుద్ధిజేసే  నాట్యానికి సంగీతం సమకూర్చుతాయి, సంగీత లయకనుగుణంగా నర్తకి నాట్యం వేగాన్నందుకొంటుంది.  ఇంద్రియభావాలకనుగుణగా మిగుల చురుకైన బుద్ధి కోపతాపాలకు, రాగద్వేషాలకు లోనవుతుంది. బుద్ధి చతురత ఈజన్మలో నేర్చిన  కళకాదు, ఎన్నోజన్మలనుండి సంతరించుకొన్నది. ఇంద్రియ విషయాలు ( ప్రేక్షకుల సంఖ్య ) పెరిగినకొలదీ రక్తికట్టే నాటకంలా బుద్ధి, అహంకారముల సంబరం రెట్టింపవుతుంది.  వ్యక్తిలో దాగిన  సాక్షీభూత చైతన్యం (నాటక దీపంలా) తనసమీపపు అహంకారము, బుద్ధులను  ప్రకాశింపజేస్తుంది. అనగా అంతరసాక్షి వెలుగుతోడనే వ్యక్తి అహంకారముగాని, బుద్ధిగాని ప్రకాశిస్తాయి (వాటి ఉనికికి మూలం అంతరసాక్షి). గాఢనిదురలో అహంకారం అగుపించదు , ఇంద్రియాలు మనసు అలసి విశ్రాంతిపొందుతాయి, యింద్రియవిషయాలు లేక కోరికలు కనుమరుగౌతాయి. కాని శూన్యాన్ని ప్రకాశింపజేసిన దీపంలా వ్యక్తిలోని సాక్షి( చేతనత్వం ) యొక్క ప్రకాశం గాఢనిదురలోనూ నిశ్శబ్దంగా చలనంలేక   కొనసాగుతోంది.  సహజంగా మన ఎఱుక ,  ఇంద్రియవిషయాలు లేక కోరికలపై   సంచరిస్తుందికాని వాటినన్నింటిని ప్రకాశింపజేసెడి సాక్షిపై దృష్టిని  మరల్చదు, ఎంతటి విచిత్రమోకదా !  నిత్య సాధన సత్సంగాల ద్వారాకాని, సద్గురుకృపద్వారాగాని, ఇతర ఆధ్యాత్మిక ప్రక్రియలద్వారాకాని,  శక్తిపొంది  ఎరుకను అంతరసాక్షి వైపు మరల్చెదముగాక! మనలో దాగిన  ప్రకాశమయ ఆత్మజ్యోతిని తిలకించెదముగాక! 

Ref: ' PANCHADASI ' By Swamy Tejomayananda of Chinmaya Mission. 

శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక 1
అందరికిశుభమగుగాక !
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!





Comments

  1. " కార్తీక దీపపు వెలుగుజిలుగులలో జీవితముల తేజోమయం జేసికొనెదముగాక! "

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)