నీ గురునే నమ్ముకో!

 శ్రీసాయినాథాయనమః 


" " ఈ లోకములో అనేకమంది యోగులు కలరు. గాని మనగురు వసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును. కాని మనము మన గురువుయొక్క పలుకులను మరువరాదు. వేయేల! హృదయపూర్వకముగ నీగురువును ప్రేమించుము. వారిని సర్వస్య శరణాగతి వేడుము. భక్తితో వారి పాదములకు మొక్కుము. అట్లు చేసినచొ సూర్యునిముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు." శ్రీ సాయిబాబా. ఒకనాడు పంతు  అను ఓ భక్తుడు తనబంధుమిత్రులతో కలసి సాయిబాబా దర్శనం చేసికొన్నాడు. ( పంతు వేరొకరిని తనగురువుగా నమ్ముకొన్నాడు). బాబాను చూడవచ్చిన భక్తులతో ద్వారకామాయి ఎంతో సందడిగా, ఆనందమయంగా  వుంది. కాని బాబా దర్శనానంతరం పంతుకు హఠాత్తుగా మూర్ఛవచ్చి క్రిందపడిపోయాడు. బాబా దయచే కొంతసేపటికి యాతనికి తెలివి వచ్చినది. సర్వజ్ఞుడగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి, నిర్భయముగా నుండుమని ధైర్యము చెప్పుచు వానితో పై మాటలన్నారు. ఈ సందర్భంలో గురుశిష్యుల సంబంధాన్నిగూర్చి కొద్దిగా పరిశీలిద్దాము. భక్తుని భగవంతుని పెళ్ళిజేసే పూజారి గురువని శ్రీరామకృష్ణ పరమహంస తెలియజెప్పారు. తమ ప్రతిభకు తమగురువే మూలకారణమని సాయిబాబా భక్తులతో చెప్పుచుండెడివారు. గురుకృపలేనిదే పరమాత్ముని చేరలేమని శ్రీపరమహంస యోగానంద సెలవిచ్చారు. ఇందరు మహాత్ముల బోధ ఏమన ఆధ్యాత్మిక  జీవనయానంలో సద్గురుని ఆశ్రయింపక వ్యక్తి పరమాత్మను లేక పరమశాంతిని పొందలేడని. 
నదులు వేరువేరు మార్గాల్లో ప్రవహించినా సముద్రంలో కలిసేవరకూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తాయి, సాగరంలో  కలిసినపిమ్మటే ఆయానదులు తమయునికిని కోల్పోయి సముద్రంలా మారిపోతాయి. అదేవిధంగా  భక్తులు  తమకు నిర్దేశింపబడిన గురుని పొందేవరకు వారి ప్రయాణం కొనసాగుతుందనే సత్యం ఎందరో మహాత్ముల జీవిత చరిత్రలలో చూడగలము చూడగలము. శ్రీ బీ.వి. నరసింహస్వామి తమజీవితంలో జరిగిన ఓ విషాద సంఘటనతో మనఃశాంతిని కోల్పోయి రమణమహర్షి లాంటి మహాత్ముల నాశ్రయిస్తాడు. కాని వానికెలాంటి ప్రశాంతత లభింపలేదు. తుదకు శిరిడీలోని బాబా సమాధి దర్శనముతోనే పరమశాంతి పొంది పరమసాయిభక్తుడుగా మారిపోతాడు. శ్రీ ఎక్కిరాల భరద్వాజ తమకెంతో ప్రియమైన అన్న పుత్రుని మరణంచే వికలమనస్కుడై, ఎలాంటి సాధనలద్వారా సమాధానం పొందక   సాయిసమాధి దర్శనంచే పూర్తిగా మారిపోయి మరో జన్మపొందుతాడు, పరమసాయి భక్తుడుగా, ఎందరో జనులను  సాయిమార్గంలో నడిపించారు. గణపతి ముని ప్రసిద్ధిచెందిన సంస్కృతభాషా పండితుడు, మహాజ్ఞాని. కాని వానికి తెలియరాని అసంతృప్తి, దేనికోసమో తపన. ఎందరినో ఆశ్రయించినా గణపతిమునికి సమాధానం లభింపలేదు. తుదకు ఆతడు రమణమహర్షిని దర్శించి వారికృపచే పరమశాంతిని అనుభవించాడు. రమణమహర్షిని భగవానునిగా గుర్తించి లోకానికి తెలియజెప్పాడు. సాయిబాబాకూడా తమగురుని పొందేవరకు తోటిస్నేహితులతో అరణ్యాలలో సంచరించి మార్గాన్ని కోల్పోయాడు. నిర్దేశింపబడిన తమ గురువులభించినపిమ్మట, నిద్రాహారాలు మాని గురుసేవజేసి దైవాంశ సంభూతుడైనాడు. 
ఈ సందర్భంలో గురుశిష్యుల సంబంధాన్నిగూర్చి కొద్దిగా పరిశీలిద్దాము. భక్తుని భగవంతుని పెళ్ళిజేసే పూజారి గురువని శ్రీరామకృష్ణ పరమహంస తెలియజెప్పారు. తమ ప్రతిభకు తమగురువే మూలకారణమని సాయిబాబా భక్తులతో చెప్పుచుండెడివారు. గురుకృపలేనిదే పరమాత్ముని చేరలేమని శ్రీపరమహంస యోగానంద సెలవిచ్చారు. ఇందరు మహాత్ముల బోధ ఏమన ఆధ్యాత్మిక  జీవనయానంలో సద్గురుని ఆశ్రయింపక వ్యక్తి పరమాత్మను లేక పరమశాంతిని పొందలేడని. పరమహంస యోగానంద తమ గురువు శ్రీ యుక్తేశ్వర్ లభించేవరకు ఎందరో యోగులను, మహాత్ములను దర్శించాడు. స్వామి వివేకానంద జీవితచరిత్ర పరిశీలించినా ఈ సత్యమే రుజువగుతుంది. దేవుని వునికినే ప్రశ్నించే వివేకానంద శ్రీరామకృష్ణ పరమహంస దర్శనముచే దైవానుభూతి పొందుతాడు. తమ జీవితమంతా పరమహంస బోధలను ప్రపంచానికి చాటిన మహాపురుషుడు శ్రీ స్వామి వివేకానంద. 
జీవనగమనంలో ఎందరో మహాత్ములు తారసిల్లినా,  మనసంస్కారాలకు తగినవిధంగా  మన సమస్యలకు పరిష్కారముజూపి మనఃశాంతిని, సుఖజీవనాన్ని అందించగల సద్గురువు లభించనయెడల, వారినే పరిపూర్ణ భక్తివిశ్వాలతో సేవించి, వారుజూపిన మార్గంలో పయనించడం యెంతో శ్రేయస్కరం కదా! దీనిని  సరిపోల్చు ఓ ఉపమానం వాడుకలోవుంది, " పదిచోట్ల తక్కువలోతు బావి త్రవ్వుటకంటె,ఒకేచోట నీరులభించేవరకులోతుగా తవ్వడం లాభదాయకంకదా! "
ఇచట మనకో సందేహం రాకమానదు. అదేమన మనకు మనసంస్కారాలకు తగిన గురువులభించేదెలా యని. అందులకు శ్రీ భరద్వాజ మాస్టరుగారు ఓ చక్కని పరిష్కారం సూచించారు. గురుచరిత్ర ( శ్రీ దత్తాత్రేయ చరిత్ర) గ్రంథ పారాయణం మిగుల భక్తిశ్రద్ధలచే  జేస్తే దత్తస్వామి అనుగ్రహం కలిగి మనం తగిన గురుని సేవింపగలుగుతాము. సరియైన గురుని సాన్నిహిత్యం లభిస్తుంది! అటులగాక  అజ్ఞానంచే కపటగురువుల నాశ్రయిస్తే జన్మ పరంపరలు పాడవుతాయని శ్రీ భరద్వాజ మాస్టారు  హెచ్చరికగాసెలవిచ్చారు ! 

శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక1
అందరికిశుభమగుగాక !
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!

Comments

  1. దైవాన్ని నమ్మినవానికి నమ్మినంత ఫలం, ఇది పెద్దలవచనం!

    ReplyDelete

Post a Comment