సద్గురువు- భక్తుల బాధానివారణ !

శ్రీసాయినాథాయనమః
పాఠక సాయిభక్తులెల్లరకు శ్రీరామనవమి శుభాకాంక్షలు! సాయిబాబా శ్రీరామచంద్రుడు కరుణాసముద్రుడు, సర్వులకు వారి రక్షణ సదా లభించుగాక! శ్రీసాయిబాబా సమర్ధసద్గురువులు! భక్తులు తమ మనస్సు వాకు మరియు చర్యలచే తెలిసో తెలియకో చేసిన చెడుకర్మల ఫలితాలనుండి వారిని రక్షించి తమ మార్గంలో నడిపిస్తారు. ఇదే సాయిబాబా యొక్క ముఖ్యఅవతార కార్యంగా శ్రీ సాయి సచ్చరిత్ర లోని అసంఖ్యాక భక్తుల అనుభవాలు ధ్రువపరుస్తున్నాయి. సద్గురువులు తమ శిష్యుల కర్మఫలాలనెలా తొలగించెదరో లేక తగ్గించెదరో తెలిసికొనుట చాల ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. " ఓ యోగి ఆత్మకథ! " గ్రంధంలో శ్రీ పరమహంస యోగానంద, సద్గురువులు తమశిష్యుల దుష్కర్మ ప్రభావములనెలా పోగొట్టెదరో చాలావిఫులంగా వివరించారు. ఆ వివరాలనిచట స్మరించుకొందాము. శ్రీ యోగానంద కాలేజ్ లో చదివే రోజుల్లో తమ గురువు మరియు కొందరు స్నేహితులతో కాశ్మీరు పర్యిటిస్తారు. కాలేజీ తెరియుటచే ముందుగనే బెంగాలు తిరిగి వచ్చేస్తారు. శ్రీ యుక్తేశ్వర్ మరికొంతమంది శిష్యులు తమ పర్యటన కొనసాగిస్తారు. ఇంటికి వచ్చిన వెంటనే ఓ అశుభవార్త వింటారు యోగానంద. శ్రీయుక్తేశ్వర్ తీవ్రంగా జబ్బుపడ్డారని, ప్రాణాపాయమని స్నేహితుడు టెలిగ్రామ్ పంపాడు. ఈ చెడువార్తకు తాళలేక మిగుల దుఃఖంతో ప్రాధేయపడుతూ తనకోసమై ప్రాణాల నిలుపుకోవాలని గురువుగారికి తంతిపంపుతాడు యోగానంద. శిష్యుని విన్నపం స్వీకరించి కొద్దిరోజులకు మిగుల బలహీనస్థితిలో సగమైపోయిన దేహంతో కాశ్మీరునుండి తిరిగివస్తారు వారి గురువు.శిష్యుల అదృష్టం కొలది, శ్రీ యుక్తేశ్వర్ వారి పాపాలను తీవ్రజ్వరం రూపంలో అనుభవించి మిగుల చిక్కి శల్యమయ్యారు, ఈవిధంగా శిష్యుల పాపక్షయం జరిగినది.సద్గురు సాయిబాబా విషయంలోకూడ ఇలాంటి పెక్కుసంఘటనలు నిత్యం జరుగుతుండేవి. భక్తుల వ్యాధులను బాధలను సాయి స్వీకరించి వారిని పాపముక్తులను, రోగముక్తులను జేసెడివారు, సంతాన సౌభాగ్యాల ప్రసాదించేవారు, మానసిక అలజడులను రూపుమాపి పరమశాంతిని సమకూర్చెడివారు. ఇలాంటి భక్తుల పెక్కు అనుభవములు మిగుల ఆశ్చర్యాన్ని ఆవేదనను కలిగిస్తాయి. ఈ విషయాలు తెలిసినపిమ్మట మనసులో ఓ ప్రశ్న ఉదయించక మానదు, అదేమన సద్గురు భక్త పాపనివారణ వెనుక రహస్యమేమిటని? సద్గురుని భక్తవత్సలత మరియు కారుణ్యమని అందరికి తెలియును. ఆ దైవ కారుణ్య కార్యాన్ని సద్గురువులెలా నిర్వహిస్తారనె డి విషయాన్ని శ్రీ యోగానంద తమ ఆత్మకథలొ మిగుల విపులంగా వివరించారు. ప్రస్తుతం ఆ వివరణ క్లుప్తంగా తెలిసికొనెడి ప్రయత్నం చేయడమైనది. ( పూర్తి వివరాలను " ఓ యోగి ఆత్మకథ. " ప్రసిద్ధ గ్రంధమున పొందవచ్చును). " రోగమార్పిడి క్రియ ప్రాచీనకాలము నుండి పరమయోగులకు తెలిసిన విద్య! మోయలేని పెనుభారాన్ని, బలహీనుడు బలవంతుని సాయంతో మోసిన విధంగా తమ భక్తులు అనుభవింపలేని పాపభారాన్ని సద్గురువులు స్వీకరించి వారిబాధలను తగ్గిస్తారు. ఇదెలాంటిదంటే తన పుత్రుఁడుఁజేసిన అప్పులను ధనవంతుడైన తండ్రి తీర్చి వాని రుణముక్తునిజేసినటుల! కేవల తమకారుణ్య కారణంచే సద్గురువు తనదేహారోగ్యాన్ని రోగగ్రస్తుడైన శిష్యునకందించి వాని రోగ భారాన్ని చాలావరకు తగ్గిస్తారు. సద్గురువు ఓ నిగూఢ యోగ ప్రక్రియద్వారా తన మనసును మరియు సూక్ష్మదేహాన్ని ( Astral Body ) రోగగ్రస్తుని మనోసూక్ష్మ దేహాలతో ఏకత్వాన్ని పొందుతాడు. పూర్తి వ్యాధిగాని లేక వ్యాధి పెక్కుభాగం కాని యోగి లేక సద్గురుని, దేహంలో ప్రవేశిస్తుంది. దైవంతో ఏకత్వం పొందిన సద్గురువునకు ఎలాంటి దేహస్పృహ వుండదు. సద్గురుని దేహం వ్యాధిగ్రస్తమైనప్పటికి వాని మనసుపై నెలాంటి ప్రభావముండదు. పైగా యెదుటివాని బాధ తొలగించినందులకెంతో తృప్తి సంతోషముల పొందుతాడు. ఈ విధంగా సద్గురువు దైవంతో ఏకత్వం పొందటానికి, తనదేహాన్ని పరోపకారంకోసం వినియోగిస్తాడు. సద్గురుని అవతారకార్యమేమన మిగుల బాధపడు మానవాళికి, ఆధ్యాత్మిక పరంగాగాని, బోధనాపరంగాగాని, తనసంకల్ప బలంతోగాని లేక యెదుటివారి బాధల తమ దేహంపై స్వీకరించడం ద్వారాకాని సేవజేయడము. తన సంకల్ప మాత్రంచే సమాధిస్థితి లేక భావాతీత స్థితి పొందునట్టి సద్గురువు అట్టి సమాధిస్థితిని పొంది తన దేహ రోగాన్ని, బాధను పోగొట్టుకొంటాడు. వానికెలాంటి దేహభావముండదు. కొన్నిసందర్భాలలో నిజంగా బాధలననుభవించి శిష్యులలో మానవతను మేల్కొల్పెదరు, కర్మఫలమనుభవింపక తప్పదనే సూత్రాన్ని బోధించెదరు. ఇప్పటివరకు చెప్పబడిన భక్తులాబాధానివారణ పద్ధతులన్నీ శ్రీసాయిబాబా జీవితంలో మిక్కిలి స్పష్టంగా గోచరిస్తాయి. ఇందులకై శ్రీసాయి ఎన్నో ప్రక్రియలనాచరించేవారు; ధునివెలిగించుట,యూది పంచుట తిరుగలిలొ గోధుమలు విసరుట, భక్తుల ఇండ్ల బిక్ష స్వీకరించుట, భక్తులనుండి దక్షిణ పొందుట, ధౌతి మరియు ఖండయోగముల లాంటి యోగ పద్ధతుల ఆచరించుట, రోగగ్రస్తుల బాధల నేరుగా తమ దేహంపైకితీసికొనుట, తమఅమృత హస్తముచే ఆర్తుల స్పృశించుట, తమమాటలే మంత్రంగా ఆశీర్వదించుట, అదృశ్యసంచారంజేసి భక్తుల జేరుట, స్వప్న సందేశాలు స్వప్న ఆదేశాల నిచ్చుట మున్నగునవి భక్తులెల్లరకు తెలిసిన విషయమే! బాయిజామాయి కిచ్చిన మాటప్రకారం ఆమె పుత్రుడు తాత్యా కొరకై ప్రాణత్యాగం సయితం జేసిన సాయిబాబా త్యాగనిరతి శ్రీసాయిసచ్చరిత్రలో చూడగలము. ఇంతియేగాక మన ఊహలకు, ఆలోచనలకు అంతుపట్టని పెక్కుమార్గాలద్వారా శ్రీ సద్గురుసాయి నిరంతరం భక్తరక్షణ గావిస్తున్నారు, వారి కర్మ నివృత్తిజేసి ఉన్నతమార్గాలలో నడిపిస్తున్నారు. వారి మహాసమాధి అనంతరం ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సద్గురుసాయినాథుల సర్వస్య శరణాగతి కోరి వారి చత్రఛాయలో సదా రక్షణ పొందెదము గాక! సమర్ధ సద్గురు శ్రీసాయినాథమహారాజ్ కి జై! శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుఁగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి! Ref: " Autobiography of a Yogi " by Paramahansa Yogananda, " Sree SaiSaccharitra " by Annasaheb Dabholkar. Please share with friends if you like.

Comments

  1. Sad Gurus incarnate for making the lives of humanity happy and blissful. They take their sins and sufferings on their own bodies, thus reducing the inevitable weight of Karma! Sai Baba is such a most compassionate Sad Guru!

    ReplyDelete

Post a Comment