సాయిలీలా విశ్లేషణ - భీమాజీపాటిల్ క్షయరోగ నివారణ.

శ్రీసాయినాథాయనమః!
" నా కథలు వినినచో సకలరోగములు నివారింపబడును." శ్రీ సాయిబాబా. భీమాజీ పాటీలు క్షయరోగముక్తుడైన వివరములు శ్రీసాయిసచ్చరిత్రము 13వ అధ్యాయమునుండి గ్రహించడమైనది. ఈ సాయిలీలా మహిమను క్లుప్తంగా నిచట విశ్లేషించుకొనెదము. భీమాజీ పాటీలు మహారాష్ట్ర పూనా జిల్లాలోని నారాయణగామ్ నివాసి. అతడు ఊపిరితిత్తుల వ్యాధిబాధితుడై క్రమంగా క్షయవ్యాధి గ్రస్తుడైనాడు. మందులెన్నివాడినప్పటికీ ఉపశమనము పొందక భగవంతుని తీవ్రంగా ప్రార్ధిస్తాడు. ఆ దీనప్రార్ధన ఫలితమేమోగాని ఆతనికి బాబాకి అత్యంతసన్నిహితభక్తుడు నానాసాహెబ్ చాందోర్కర్ కు ఈ విషయమై లేఖవ్రాయు సంకల్పం కలుగగా వివరములతో ఉత్తరంరాస్తాడు. సాయి సాయం స్నేహితులు, శ్రేయోభిలాషుల ద్వారా లభించునటుల సాయిబాబాను శరణువేడమని భీమాజీకి నానానుండి లేఖ వస్తుంది. ఆపై భీమాజీ కుటుంబీకులు వానిని శిరిడీకి దెచ్చి ద్వారకామాయిలోని బాబాముందు కూర్చుండబెట్టారు. అదేసమయంలో నానా, శ్యామా మున్నగు భక్తులుకూడ అచటనేయుండుట కాకతాళీయం గావచ్చు. పాటిలును చూడగానే బాబా వానిజబ్బు పూర్వజన్మ కర్మఫలంబని, తానేమి జోక్యముఁజేసుకోనని జెప్పారు. బాబా సర్వాంతర్యామి మనుజుల జన్మలు, కర్మలు సర్వము వారికి తెలియును. ఎవరికర్మకు వారేబాధ్యులు కర్మఫలానుభవము తప్పదని శాస్త్రవాక్యము. ఇలాంటి సందర్భాలలోనే సద్గురుని సాయమవసరమౌతుంది. మరి ఆసాయాన్ని సద్గురునుండి పొందాలంటే వారిని సర్వస్య శరణు కోరక తప్పదు. అదేసూత్రాన్ని భీమాజీ పాటించాడు. తాను పూర్తిగా అసహాయుడనని, బాబాతప్ప వేరెవరు తనకు దిక్కులేరని మొరపెట్టుకొని సాయికటాక్షానికై వేడుకొన్నాడు. గజేంద్రుడు నీట మొసలిబారినపడి, అసహాయుడై దీనంగా ప్రార్ధించినపుడు విష్ణుమూర్తి వాయువేగంతో పయనించి వానిప్రాణాల కాపాడినట్టి భాగవతకథ మనకిచట స్మరణీయము! కరుణా కటాక్షాలకు మారుపేరు సాయిబాబా కదా, రోగి విన్నపానికి హృదయం ద్రవించింది. భక్తులు మోయలేని భారాన్ని తానుమోస్తానని సాయి అభయమిచ్చారుకదా! ఎలాంటి చింతవలదని ఎవరైతే ద్వారకామాయి మెట్లెక్కెదరో వారికష్టములు తొలగిపోవునని బాబావానికభయమిచ్చారు. ఇచట మెట్లెక్కడమంటే వ్యక్తి తన అహంకారాన్ని తగ్గించుకొని, సాయిసామర్ధ్యానికి తలయొగ్గి వారిని శరణు కోరడం. " ఈ ఫకీరు మిక్కిలి దయార్ద్రహృదయుడు, వారీరోగమును తప్పక బాగుచేయును, ఈ ఫకీరు అందరిని దయతోను ప్రేమతోను కాపాడును. " ఈ సందర్భంలో సాయి వానితో పలికిన మాటలు భక్తులకు ఆర్తులకు యెంతో వూరటనిస్తాయి. ఈమాటలు పలికిన కొద్దిసేపటికే పాటీలు రోగం వెనుదిరిగింది, రక్తం గ్రక్కుట ఆగిపోయినది, సాయిరక్షణ తక్షణమే! కొన్నిసందర్భాలలో భక్తులకు సాయి విధించే నియమాలు వింతగా ఉంటాయి. ఆరోగ్యానికంతగా సరికాని భీమాబాయి యింటిలో వానినుంచారు. భక్తులకు కర్మవశాన జరగవలసిన బహుపెద్దప్రమాదాలను అతిచిన్నప్రమాదాలుగా మార్చగలగడం సమర్ధసాయినాథుల ప్రత్యేక లక్షణం ! సాయి సాయం, వారి సందేశం కలల రూపంలోనూ భక్తులకందుతుంది. బాబా రోగికి రెండు స్వప్నానుభవాల నిచ్చి వాని రోగనివారణ జేశారు. మొదటి స్వప్నంలో విద్యార్థిగా పద్యాలు సరిగా వల్లించక ఉపాధ్యాయునితో దెబ్బలు తిన్నాడు. రెండవ స్వప్నంలో ఛాతిపై పెద్దబండనువేచి క్రిందకు మీదకు త్రోయుటచే మిక్కిలిబాధననుభవించాడు. కలలో కలిగిన ఈ బాధలననుభవించి భీమాజీ రోగముక్తుడైనాడు. ఇచట రోగి తనకర్మఫలాన్ని కేవలం కలలో అనుభవించాడుఅంటే యెంతటి తేలిక వ్యవహారం. బాబా వాని అనుభవభారాన్ని యే ప్రమాణంలో తగ్గించారో మన ఊహకందని విషయం. కొన్నిసమయాల్లో మనుషులు అతిపెద్దప్రమాదాలనుండి బహుచిన్నగాయలతో బయటపడే వార్తలు వింటుంటాము. ఆయా సందర్భాలలో వారికి భగవంతుని లేక సద్గురుని రక్షణ శ్రీరామరక్షగా లభిస్తుందేమో! రోగముక్తుడైన భీమాజీపాటీలు తనస్వగ్రామం వెళ్లి సాంప్రదాయక సత్యనారాయణ వ్రతంలా సాయిసత్యవ్రతాన్ని ప్రారంభించి బాబాపట్ల తన కృతజ్ఞతను, భక్తివిశ్వాసములను చాటుకొన్నాడు. బాబా భక్తులనుండి కోరేది ఆయా లక్షణాలనేగదా! కర్మఫలానుభవాలగూర్చి మహాత్ములందరిదీ ఒకే భావన. వివిధ పాపములు వాటిఫలములవలన కలగు ు వివిధరోగములగూర్చి శ్రీస్వామిశివానంద చెప్పిన ఆసక్తికర వివరణ క్రిందివిడియోలో చూడగలరు. శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికీ శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!
భీమాజీపాటీలు

Comments

  1. శ్రీసాయిబాబా ఆరోగ్యప్రదాత! బాబా ఆశీసులతో పరిపూర్ణ స్వస్థత పొందెదముగాక!

    ReplyDelete

Post a Comment