సాయిలీలా విశ్లేషణ - పదిజన్మల బాధేల ? పదిరోజులే చాలు.
శ్రీసాయినాథాయనమః
" Before you act you have freedom, but after you act, the effect of that action will follow you whether you want it to or not. That is the law of karma. You are a free agent, but when you perform certain act, you will reap the results of that act. " Paramahansa Yogananda, SRF Lessons.
శ్రీసాయిబాబ అనంతకరుణాసాగరులు. వారిమనసు నవనీతం, భక్తుల బాధలకు కష్టాలకు కరిగిపోతుంది. వారిదానగుణమెన్నదగినది. భక్తులు తమకిచ్చే ప్రతి రూపాయకు తాను పదిరూపాయలిస్తానని, వారు తమవైపుకు ఒక్క అడుగువేస్తే తాను వారివైపుకు వంద అడుగులు వేస్తానని ప్రతిఙ్ఞజేసియున్నారు. ఆవిధంగా సాయిభక్తిమార్గంలో పయనించేవారి ఆయురారోగ్య ఐశ్వర్యములు మిగుల వృద్ధినొందుట పెక్కుభక్తుల అనుభవం. ఈ సందర్భంలో మనమొక ప్రత్యేక విషయం గమనిస్తాము. అదేమంటే భక్తుల సేవకు పెక్కురెట్లు ప్రతిఫలమిచ్చినరీతిగా భక్తులబాధలను పలురెట్లుగా తగ్గిస్తామనెడి బాబా అభయవాక్యము. ఈ సత్యాన్ని ధ్రువపరిచే ఓ భక్తుని అనుభవం శ్రీసాయిసచ్చరిత్ర 34వ అధ్యాయంలో చూస్తాము. ప్రస్తుతమా లీలను విపులీకరించుకొనిదెము. డాక్టరు పిళ్లే సాయిబాబాకు అత్యంత సన్నిహిత భక్తుడు. ఓ పర్యాయమీతడు నారిపుండుచే మిగుల బాధననుభవించాడు. కర్మఫలంచే తనకు కలిగిన భరింపలేని ఆ బాధనాపుజేసి రాబోయే పదిజన్మలకు విభజింపమని సాయికి విన్నవించవలనదిగా కాకాసాహెబు దీక్షితును వేడుకొంటాడు. విషయాన్ని వివరింపగా బాబా హృదయం మిగుల ద్రవించి కాకాసాహెబుతో నిటులంటారు " నిర్భయుడుగా నుండుమనుము. అతడేల పదిజన్మలవరకు బాధపడవలెను? పదిరోజులలో గతజన్మపాపమును హరింపజేయగలను. నేనిక్కడుండి యిహపరసౌఖ్యము లిచ్చుటకు సిద్ధముగానుండ అతడేల చావును కోరవలెను. అతని నెవరి వీపుపయి నయిన తీసికొనిరండు. అతని బాధను శాశ్వితముగా నిర్ములించెదను." అటుపిమ్మట తోటివారు పిళ్ళేను తెచ్చి బాబాకు దగ్గరగా కూర్చుండబెట్టారు. ఆసమయంలో బాబావానితో అన్నమాటలు భగవద్గీతలోని గీతాచార్యుని బోధను తలపిస్తాయి. ఇచట పునర్జన్మ గూర్చి చెప్పబడినది. ఈజన్మలోనికర్మఫలాలనేగాక పూర్వజన్మ పాపములగూడ అనుభవింపవలెను. మన కష్టసుఖములకు కర్మయే కారణము. బాధలనోర్చుకొనక తప్పదు. దైవమే ఆర్చితీర్చువాడు. వానినెల్లప్పుడు ధ్యానించి వారిని సర్వస్యశరణాగతి కొరవలెను. శ్రీకృష్ణపరమాత్మ తనను పరిపూర్ణ శరణాగతికోరవలసినదిగా అర్జునునితో చెప్పినమాటలిచట స్మరణయోగ్యములు, " సమస్త కర్తవ్యకర్మలను నాకు సమర్పింపుము. సర్వశక్తిమంతుడను, సర్వాధారుడను పరమేశ్వరుడను ఐన నన్నే శరణు జొచ్చుము. అన్నిపాపములనుండియు నిన్ను నేను విముక్తుని గావించెదను. నీవు శోకింపకుము. " శ్రీమద్భగవద్గీత 18:66. అల్లాను శరణుకోరవలె నన్నారేగాని తమను కాదని చెప్పడంలో బాబాయొక్క అహంకారరాహిత్యం తేటతెల్లమవుతుంది. " అల్లా మాలిక్." బాబా నిత్యం పఠించేమంత్రం గదా! నానాసాహెబ్ కట్టుగట్టినా తగ్గకపోవడమిచట గమనింపవలసిన విషయం. కట్టువిప్పమని అప్పుడే ఓ కాకివచ్చిపొడుస్తుందని బాబాచెప్పినటులే మజీదు శుభ్రంజేసే అబ్దుల్లాకాలు పిళ్ళేకురుపుపై పడి పురుగులు బయటపడటం సాయి సర్వజ్ఞతకు మరోనిదర్శనం. పిళ్లే తాత్కాలికంగా బాధననుభవించినా త్వరలోనే బాధతగ్గి నవ్వసాగాడు, సాయిసాయం వెనువెంటనేగదా! కాకికోసంఎదురుజూసే పిళ్ళేకి అబ్దుల్లానే కాకిగా పోల్చి చెప్పడంలో బాబా చతురత చూడగలము. ఊది పూయుట మరియు తినుటవలన పిళ్లే బాధ పదిరోజుల్లోనే మటుమాయమవడం మందులకు మించిన ఔషధము బాబాచేతి యూది మహిమగా నెరుగగలము! శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికీ శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!
DR.Chidambaram Pille
Sad guru overwrites the 'Law of Karma' of His devotees. He takes away much of their suffering.
ReplyDeleteSad Guru is a skilled mathematician. He multiplies the happiness and divides the suffering of His devotees by tenfold or more!
ReplyDelete