సాయిలీలా విశ్లేషణ - రాచకురుపు నయమగుట.

శ్రీసాయినాథాయనమః!
శ్రీసాయిబాబా వైద్యులకు వైద్యుడు, మహావైద్యుడు, సాక్షాత్తు నారాయణుడు. 'వైద్యోనారాయణోహరి' నానుడి సాయి పట్ల పరిపూర్ణముగా సార్ధకమైనది. ప్రస్తుత విషయము శ్రీసాయిసచ్చరిత్ర 34 అధ్యాయమునుండి గ్రహించడమైనది. ఇందు శ్రీసాయినాథుల భక్తకారుణ్యము, సామర్ధ్యము, ద్వారకామాయి ప్రాశస్థ్యము, బాబా మాటలమంత్రాక్షరాలు, ఉదీమహిమ మున్నగు విషయములను పాఠకులు తెలియగలరు. ఈవిశేషములనిచట క్లుప్తముగా పరిశీలించెదము. ఓ కుఱ్ఱవాడు నయముకాని రాచకురుపువ్యాధిచే బాధపడుచున్నాడు. ఆతని మేనమామ నాసిక్ జిల్లాలోని మాలేగాంలో పెద్దవైద్యుడు. మానవప్రయత్నము కొంతవరకుమాత్రమే విజయవంతమగునటుల, ఆ డాక్టరుతో పాటు మరికొందరు వైద్యులు మిగులప్రయత్నించినప్పటికీ వాని వ్యాధి తగ్గలేదు. బంధుమిత్రుల సలహాపై తల్లిదండ్రులు కుర్రవానిని బాబాచెంతకు తెచ్చి బిడ్డనుకాపాడమని మిగులవినయవిధేయతలతో వేడుకొన్నారు. వారినోదార్చి శ్రీసాయినాథులిట్లన్నారు, " ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడు వ్యాధిచేబాధపడరు, కురుపుపై ఉదినిపూయుడు. దేవునిపై నమ్మకముంచుడు. ఇది పాతమజీదుకాదు, ద్వారవతి. ఇందుకాలిడినవారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు. వారికష్టములు గట్టెక్కును". ఇట్లనుచు రోగిశరీరంపై కరుణాపూరిత దృక్కులతో సాయి తమ చేతిని తిప్పారు. బాబామాటలే మంత్రాక్షరాలుగా బాలుని కొద్దిరోజులలోనే రాచకురుపు పూర్తిగామానిపోయినది. పూర్వకర్మఫలితంగా సంభవించిన కుఱ్ఱవానివ్యాధిని కర్మధ్వంసి సాయి దూరంజేశారు. విషయమింతటితో సమాప్తంకాలేదు. సాయి వేరు వేరు మిషలతో తమభక్తులను చెంతకులాగెదరను విషయమందరికీ తెలిసినసినదే! మేనల్లునివ్యాధి తగ్గుటచే డాక్టర్ మిగుల ఆశ్చర్యపడి సాయిబాబాను చూడదలచాడు. కాని కొందరి మధ్యవర్తులమాటలచే వాని విశ్వాసం సన్నగిల్లి తనప్రయాణం మానుకున్నాడు. కాని సాయిసంకల్పంముందు వానిసందేహమేపాటిది? వానికి బొంబాయిలో మూడురాత్రులు వరుసగా నొకకంఠధ్వని 'ఇంకను నన్నునమ్మవా!" యని వినిపించింది. అంతియేగాక ఆ డాక్టర్ చూస్తున్న రోగి అంటువ్యాధి ఊహింపనివిధంగా ఒక్కరోజులోనే నయమయింది. ఈవరుస అనుభవాలతో డాక్టర్ వెంటనే శిరీడీ వెళ్లి సాయిబాబా ఆశీసులుపొంది గొప్ప బాబాభక్తుడయ్యాడు. ఒక పక్షంరోజులలో అతనిని బీజాపూరుకు హెచ్చుజీతంపై బదిలీజేశారు. ఆవిధంగా మేనల్లునిరోగము విశ్వసింపనిమామ సాయిభక్తుడుగా మారుటకు దోహదమైనది. ఉహలకందనిసాయిలీలల నెవరు తెలియగలరు? సమర్ధసద్గురు శ్రీసాయినాథ్ మహారాజుకు జేజేకారములు! శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికీ శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!

Comments

  1. సాయిబాబా మనుజుల ఆంతరంగిక భవరోగమునేగాక, బాహ్యదేహ రోగముల సయితము మాన్పగల సర్వసమర్థులు!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)