శ్రీకృష్ణభగవానుడు చెప్పిన భక్తుని లక్షణములు.
శ్రీసాయినాథాయనమః!శ్రీకృష్ణపరమాత్మనేనమః!
పాఠకమహాశయులెల్లరకు జన్మాష్టమి శుభాకాంక్షలు!
సాధారణంగా జనులు తమకు నచ్చినవిధంగా తమతృప్తికి ఆనందానికి అనుగుణంగా దేవుని పూజిస్తారు. దేవునిపై భావంకూడా ఉహాజనితమే! మనకు ఇష్టమైన విధంగాగాక భగవంతునికి ప్రీతికలుగునటుల మన నిత్యవ్యవహారములను సరిదిద్దుకొనుట ఆధ్యాత్మిక ప్రగతికెంతో ముఖ్యమైన విషయము. భగవంతుడనగా ధర్మము. ధర్మానికనుగుణంగా నడచుకోగలిగితే దైవానికి ఇష్టమైనవారలమే గదా! భగవద్గీత పన్నెండవ అధ్యాయం భక్తియోగములో శ్రీకృష్ణపరమాత్మ తమకు ప్రియమైన భక్తలక్షణాలను అర్జునకు వివరించాడు. అసందేశం సర్వులకు వర్తిస్తుందనే వుద్దేశ్యంతో శ్రీకృష్ణజన్మాష్టమి శుభసందర్భమున స్మరించుట మిగుల సమంజసముగాతలచి శ్రీకృష్ణసందేశమిచట మిగుల క్లుప్తముగా వ్రాయడమైనది. ప్రియభక్తుని లక్షణములు వరుసగా 1)సర్వభూతములను అనగా యెవరిని ద్వేషింపనివాడు. 2)మిత్రధర్మము కలవాడు. 3)కారుణ్యము కలవాడు. 4)మమకారములేనివాడు. 5)అహంకారరహితుడు. 6)సుఖదుఃఖములయందు సమభావము కలిగినవాడు.7)ఓర్పుకలవాడు.8)నిత్యసంతోషి.9)ధ్యానానుష్ఠానపరుడు. 10)మనోనిగ్రహము కలవాడు.11)దృఢమైన జ్ఞానముకలవాడు.12)భగవంతునియందర్పించిన మనసు బుద్ధికలవాడు.13)భగవంతుని మిగుల ప్రేమించువాడు.14)వానివలన జనము భయమనొందనివాడు .ు15)లోకమునకు భయపడనివాడు.16)సంతోష భయ ద్వేషములచేత కలత చెందనివాడు.17)ప్రక్రుతి వస్తువులు,విషయాలపట్ల ఎలాంటి ఆసక్తిచూపనివాడు.18)తనకు వెలుపల లోపల అనగా శారీరకంగా, మానసికంగా పరిశుద్ధుడు.19)కార్యసమర్దుడు.20)దేనియందు తగులుకొనని మనసుకలవాడు.21)మనోవ్యాకులత లేనివాడు.22)లోకాడంబర పనులకు మిగుల దూరంగా వుండేవాడు.23)తనకిష్టమైన వస్తువులు లభించినపుడు సంతోషింపనివాడు. 24)అనిష్టవస్తువులు సంభవించినపుడు ద్వేషింపనివాడు.25)ప్రియవస్తువుల వియోగమునందు పరితాపము నొందనివాడు.26)ప్రాప్తముగాని వస్తువులను కోరనివాడు.27)శుభాశుభ కర్మలచే విడువబడినవాడు.28) భగవంతునియందు సదా భక్తికలవాడు.29)శత్రుమిత్రులయందు,మానవమానములయందు,శీతల ఉష్ణము,సుఖదుఃఖములయందు సమభావం కలవాడు.30)నిందయందు, స్థుతియందు సమానుడు.31)మౌనము అనగా దేనినైనను సహించు స్వభావముకలవాడు.32)శరీరము నిలబడుటకు తగిన ఏ ఆహారము లభించినను సంతోషించువాడు.33)ప్రత్యేక నివాసములేక ఏది లభించిన దానిచే సంతోషించువాడు.34)పరమార్ధజ్ఞానవిషయమై సుస్థిరమనసు కలవాడు.35)భగవంతుని యందు అనన్యభక్తికలవాడు. (పైన పేర్కొనబడిన కొన్నిలక్షణములు మరలమరల చెప్పబడుట గమనింపగలరు).ఈపై చెప్పబడిన భక్తలక్షణములు సాధారణభక్తులలో చూడలేము,కేవలము తీవ్రభక్తిమార్గపరులకుమాత్రమే సాధ్యము. కాని శ్రీసాయిసచ్చరిత్ర చదివిన సాయిభక్తులు ఓ విషయాన్నిగమనించగలరు. అదేమన శ్రీకృష్ణపరమాత్మ ప్రవచించిన భక్త లక్షణములెల్ల శ్రీసాయినాథునయందు పరిపూర్ణముగా మూర్తీభవించాయి.సాయిబాబా తామెన్నడూ భగవంతుడనని చెప్పలేదు, కేవలము తాము దైవానికి విశ్వాసపాత్రుడైన సేవకుడని చెబుతుండెడివారు. అందులకనుగుణంగా ఎల్లప్పుడూ "అల్లా మాలిక్" అంటూ జపిస్తూండేవారు. "అల్లా మాలిక్" లోని అక్షరములు మంత్రాక్షరములుగా తలచవచ్చును. పైచెప్పబడిన భక్తలక్షణముల సారాంశమిందు నిక్షిప్తమైయున్నది. తనకు తన భక్తునికి తేడాలేదని చెప్పిన భగవంతుని వాక్యముచే శ్రీకృష్ణుడు,శ్రీసాయి ఒక్కరుగా తలచవచ్చును.
శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!
విషయమూలము : మహర్షి సద్గురు శ్రీమలయాళస్వామి విరచిత శ్రీమద్భగవద్గీత.
భగవంతుడే తనకిష్టమైన భక్తుని లక్షణాలు వివరించాడు, ఆయా లక్షణములు కలిగియుండుట సర్వులకు మిగుల శ్రేయస్కరము!
ReplyDelete