సాయిలీలా విశ్లేషణ - సర్వస్యశరణాగతి.
శ్రీసాయినాథాయనమః.
శ్రీసాయిసచ్చరిత్రలో పెక్కుమంది సాయి అంకితభాక్తులగాథలను చూడగలము. వారెల్లరు సాయిబాబాను తమదైవంగా భావించి పూజించేవారు. ఓసందర్భంలో సాయి వారి భక్తినిపరీక్షింపదలచి ఓ చిన్న పరీక్ష పెట్టారు. ఈవివరములన్నియు పాఠకులు 23వ అధ్యాయమున చూడగలరు. ఒకప్పుడు శిరిడీలో కలరావ్యాధి మిగుల వ్యాపించినది. ఆకారణంగా గ్రామపెద్దలు వ్యాధి నిర్మూలనకై రెండు షరతుల విధించారు. గ్రామస్తులు కట్టెలుకొనరాదు, మేకను కోయరాదనెడివి ఆ నియమాలు. ఆచట్టములు చాదస్తమనితలఁచి బాబా వాటిని లక్ష్యపెట్టక తమ నిత్యధునినిర్వహణకై కట్టెలు కొన్నారు. రెండవ నియమోలంఘన ప్రస్తుత చర్చయనియాంశ విషయము. నిబంధనలమలులో నున్నపుడు యెవరో చావుకుసిద్ధమైన ఓముసలి మేకను ద్వారకామాయికి తెచ్చారు. తమభక్తుల విశ్వాసాన్ని పరీక్షింపదలచి బాబా ఓచక్కని కథనడిపారు. బాబాచే మిగులగౌరవము పొందువాడు మిగులసన్నిహితుడగు బడేబాబాతొ ఆ మేకను నరుకవలసినదిగా సాయి చెప్పారు. కాని కారణమేమీలేక మేకనుచంప బడేబాబా నిరాకరించాడు. అప్పుడు సాయిబాబా శ్యామాను ఆపనిచేయమన్నారు. శ్యామా రాధాకృష్ణమాయివద్దకుపోయి కత్తిదెచ్చి బాబాముందు పెట్టాడు. విషయముతెలిసిన రాధాకృష్ణమాయి కత్తినితెప్పించుకొన్నది. మరొక కత్తితెచ్చుటకు శ్యామా వాడాకు వెళ్ళాడుకాని త్వరగా రాలేదు. తరువాత కాకాసాహెబు దీక్షితు వంతు వచ్చినది. వారికి బాబాపట్ల మిగుల భక్తి విశ్వాసాలున్నాయి. కాని అవి ఏ పాటివో పరీక్షింపదలచి కత్తితెచ్చి నరుకమని బాబా ఆజ్ఞాపించారు. అతడు సాఠేవాడాకుపోయి కత్తితెచ్చి మేకను నరుకుటకుసిద్ధమై బాబా ఆజ్ఞకై వేచియున్నాడు. పవిత్రబ్రాహ్మణ కుటుంబమున పుట్టి చంపుట హింసించుట నెరుగని కాకా మేకనరుకుటకు ు సిద్ధమగుటచూసినవారలు మిగుల ఆశ్చర్యానికి గురైనారు. " ఏమి ఆలోచించుచుంటివి? నరుకుము.ఆజ్ఞాపించారు బాబా. దీక్షితు చేతిలోని కత్తి మేకపై పడుటకు సిద్ధముకాగా బాబావానిని వారించి " ఎంతటి కఠినాత్ముడవు? బ్రాహ్మణుడవై మేకనుచంపెదవా? యని వారించారు. బాబా ఆజ్ఞనుపాలిస్తు దీక్షితు కత్తిని కిందపెట్టి బాబాతో యిట్లన్నాడు " నీ యమృతమువంటి పలుకే మాకుచట్టము. మాకువేరే చట్టము తెలియదు. నిన్నే సదా జ్ఞప్తియందుంచుకొనెదము, మీరూపము నెల్లపుడు ధ్యానించుచు మీఆజ్ఞల పాటింతుము. అది ఉచితమా, సరియైనదా యనునది మాకుతెలియదు. మేము విచారించము వాదించము చర్చింపము. అక్షరాల గురువాజ్ఞ పాలించుటయే మావిధి, మాధర్మము." ఈపై సంఘటనుగూర్చి విచారించిన మనకెన్నొ విషయములు తేటతెల్లమగును, ముఖ్యముగా గురువాజ్ఞనెలా పాటించాలో తెలియగలదు. మహమ్మదీయుడు, బాబాచే మిగులగౌరవింపబడే బడేబాబా, బాబాను సాక్షాత్తు తన ఇష్టదైవం శ్రీకృష్ణునిగా భావించి సేవించే రాధాకృష్ణ ఆయి, బాబాను నిత్యం నీడలా యనుసరించుచు మిగుల సన్నిహితంగా మెలిగే శ్యామా మేకనరుకుటకు వెనుకాడిగురుభక్తి నిరూపించుకోలేకపోయారు. సాయి మార్గంలో నడిచే భక్తులెల్లరు కాకా దీక్షితు భక్తివిశ్వాసల నలవరచుకొన్నచో యెంతో శ్రేయస్సు అచిరకాలంలో పొందగలరనుట అతిశయోక్తికాదు!
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!
గరునిపై పూర్తి భక్తివిశ్వాసములుంచి మనసు మాట చేయుపనుల వారియాజ్ఞ పాటించుట మిగుల శ్రేయస్కరముకదా!
ReplyDelete