సాయిబాబా- నిత్యసత్యుడు, అనంతశక్తిస్వరూపుడు.

శ్రీసాయినాథాయనమః!
పాఠకభక్తులెల్లరకు విజయదశమి శుభాకాంక్షలు! శ్రీసాయిబాబా శివ, శక్తి తత్వముల తనలో పరిపూర్ణముగ నింపుకొన్న మహాశక్తిస్వరూపుడు! నేడు బాబా మహాసమాధిచెందిన పుణ్యతిధి, 103 సంవత్సరములపూర్యము బాబా తమభౌతికరూపము చాలించారు. కాని సాయిబాబా నిత్యసత్యులు, ఈవిషయమై ముందుగా శ్రీసాయిసచ్చరిత్రము ఉపోద్ఘాతమున చెప్పబడిన కొన్ని అక్షరసత్యవాక్యముల స్మరించెదము. శ్రీ బీ.వీ . నరసింహస్వామిగారు తమ 'భక్తులయనుభవములు' పుస్తకము మొదటిపేజీలో ఓ హైకోర్టు జడ్జిగారి యనుభవమిలా వ్రాసారు. " నేను సాయిబాబాను సృష్టిస్థితిలయకారకుడుగా భావించెదను. 1918వ సంవత్సరములో వారుసమాధిచెందకముందు నేనట్లు భావించితిని. ఇప్పటికి నేనటులే భావించుచున్నాను. నాకుమాత్రము వారు సమాధిచెందినట్లు లేరు. నాదృష్టిలో వారు అన్నిపరిమితులకు అతీతులు. వారు మామధ్య యున్నప్పుడు వారిమానవశరీరము మాకనులముందు సంచరించుచుండెను. ఒక్కొక్కప్పుడది మాదృష్టిని విశేషముగా నాకర్షించెడిది. కాని ఎక్కువభాగము మా ఎరుకలో నిలబడినదిమాత్రము వారి అనంతతత్వమే. శాశ్వతము-అశాశ్వతముల అద్భుతసమ్మేళన రూపమైన యొక మానసిక ప్రతిబింబమువలే వారు మాకు భాసించేవారు.అశాశ్వతమైన తమమానవదేహము నొక్కొక్కప్పుడు మా ముందర తళుకుమని మెరిపించేవారు. ఇప్పుడు అశాశ్వతమైన ఆదేహము మాయమై, 'సాయిబాబా' యను శాశ్వతమైన అనంతశక్తి మాత్రము నిలిచియున్నది." సాయి యెల్లప్పుడు ఉండువారు, ఈసత్యమునుతెలుపుచు శ్రీసాయిసచ్చరిత్రము 43-45 అధ్యాయములలో రచయిత హేమాద్రిపంత్ వ్రాసిన వివరముల జూసెదము. " బాబా మూడు మూరల శరీరమా లేక లోపలనున్న యాత్మయా? పంచభూతాత్మయగు శరీరము నాశనమగును. శరీర మశాశ్వతముగాని, లోనున్న యాత్మ పరమసత్యము, అమరము, శాశ్వతము. అదియే సాయి. అదియే ఈ జగత్తునందుగల వస్తువుల వ్యాపించి పాలించునది. అవతారకార్యము ముగిసినపిమ్మట శరీరమును విడిచెను. సాయి యెల్లప్పుడు ఉండువారు". సాయిబాబా తమ యునికినిలా తెలియపరిచారు, " నన్ను వెదకుటకు నీవు దూరముగాని మరెచ్చటికిగాని పోనక్కరలేదు. నీ నామము, నీ యాకారము విడిచినచో నీలోనేగాక యన్నిజీవులలోను చైతన్యము లేదా యంతరాత్మయని యొకటి యుండును. అదేనేను. ఈవిషయము గ్రహించి అన్నిటిలోను నన్నుజూడుము". భక్తులు సాయిమహిమల యనుభవముల సమాధిముందుకంటే యెన్నోరెట్లు ప్రస్తుతమనుభవిస్తున్నారు. సాయిభక్తి, సాయిశక్తి దేశాంతరముల, ఖండాంతరముల నిత్యం వ్యాపిస్తునేవున్నాయి. అనునిత్యం వేల, లక్షల సంఖ్యలో భక్తులు శిరిడీ సందర్శిస్తున్నారు, తమసమస్యలకు సమాధానం పొందుతున్నారు. ఎందరో నాస్తికులు సాయిమార్గమెంచుకొని పురోగమిస్తున్నారు. మరెందరో తమ తమ కుల మత వర్గ జాతి హద్దుల చెరపి సాయి బోధలపట్ల యాకర్షితులై, విశ్వమానవులుగా పరిణితి నొందుచున్నారు. విజయదశమి శుభసందర్భాన సమర్ధసద్గురు శ్రీసాయినాథులకు హృదయపూర్వక శతకోటివందనముల నర్పించెదము , సర్వమానవాళిశ్రేయస్సునకై మనఃపూర్వకముగా ప్రార్ధించెదము. శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!

Comments

  1. నిత్యప్రకాశ విశ్వాత్మస్వరూపుడు శ్రీసాయిబాబా! విజయదశమినాడు తమదేహసీమ దాటి అనంతాత్మరూపుదాల్చిన మహామహితాత్ముడు శ్రీసాయి!

    ReplyDelete

Post a Comment