పవర్ అఫ్ అటార్ని !

శ్రీసాయినాథాయనమ! శ్రీరామకృష్ణాయనమః!
" పవర్ అఫ్ అటార్ని" అంటే ఏమిటో సాధారణంగా అందరికి తెలిసినవిషయమే. న్యాయస్దాన పరమగు తనసర్వహక్కులను వేరొకరికి సమర్పించుట. ముఖ్యముగా ఆస్తిపాస్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారాలలో ఓ వ్యక్తి తాను స్వయంగా హాజరుకాలేనపుడు తనతరఫున నమ్మకమైన వేరొకవ్యక్తికి తన పూర్తిహక్కులను సమ్పరిస్తాడు. రెండవవ్యక్తి మొదటివ్యక్తి తరఫున పనిపూర్తిజేస్తాడు. ఇదే విషయం ఆధ్యాత్మికరంగంలో గురుశిష్యులకు కూడ వర్తిస్తుందనేది ప్రస్తుత వ్యాసములోని విషయము. శిష్యుడతనతనగురువునెలా సేవించాలో తెలిపే ఆధ్యాత్మిక అంశములుండుటచే భక్తులకిది సహాయకారి కాగలదని తలచి వ్రాయడమైనది. శ్రీరామకృష్ణ పరమహంస మరియు ఆతని ప్రియశిష్యుడు గిరీష్ చంద్రఘోష్ లకు సంబంధించిన విషయమిది.అప్పట్లో గిరీష్ (1844-1912)బెంగాల్ రాష్ట్రంలో మిగుల పేరొందిన రంగస్థలనటుడు కళాకారుడు రచయిత దర్శకుడు.ఇతడు శ్రీరామకృష్ణను పెక్కుమార్లు దర్శించి వారికి మిగుల సన్నిహితభక్తుడైనాడు. ఓ రోజు గిరీష్ పరమహంసనిలా అడిగాడు, " స్వామీ! ఇప్పటినుండి నేనెలాంటి సాధనచేయాలి? " అందులకు శ్రీరామకృష్ణ సమాధానంగా " ప్రస్తుతం జీవనమే కొనసాగించు. ఓ చేత్తో దైవాన్ని పట్టుకొని , మరోచేత్తో లోకాన్ని పట్టుకో. కాలక్రమంలో లోకం నీ చేయిజారినపుడు జరుగవలసినదేదో జరుగుతుంది. కనీసం ఉదయం మరియు సాయంకాలం ఓసారి దైవాన్ని స్మరించు." అంటూ గిరీష్ వంక జూశారు. అందులకు గిరీష్ మిగుల బాధపడి, ఈ నియమం ఇతరులకు మిగుల సులభమైనప్పటికి వృత్తిపరంగా తనకసాధ్యంగా తలచాడు. తనగురునకు మాటిచ్చి నిలుపకుంటే పాపమంటుకొంటోందని భావించాడు. ఎలాంటి ప్రత్యేక నియమాలను పాటింపలేని బలహీన మానసికస్థితి యాతనిది. గతంలో యతని అనుభవమిది.ఇలా ఆలోచిస్తూ మౌనంగావుండిపోయాడు. మౌనం దాల్చిన గిరీష్ మనసునెరిగిన పరమహంస " అది అసాధ్యమైతే భోంజేసేముందు, పరుండేముందు దైవాన్ని స్మరించు." అన్నారు. కాని అతడు వేళకానివేళ భోంచేస్తాడు, వేళకానివేళ నిదురిస్తాడు. ఎన్నో వ్యాపకాలతని చుట్టుముడతాయి. గురువడిగిన బహుచిన్న నియమాలనుకూడ పాటింపవీలుకాని తనబలహీనతకు మిగులసిగ్గుపడి మాట్లాడకున్నాడు గిరీష్. శ్రీరామకృష్ణ యాతనివంక నవ్వుతూ " ఓ ఈ నియంకూడా పాటింపలేకున్నావా. సరే! అలాగైతే నీ పవర్ అఫ్ అటార్ని నాకివ్వు." అంటూ భావాతీత పారవశ్య స్థితిపొందారు. గిరీష్ నకిది ఆమోదమగుటచే మిగుల తృప్తిచెందాడు, పెనుభారంనుండి విముక్తుడైనటుల తలచాడు. దయాసాగరురామకృష్ణుల పట్ల అత్యంత ప్రేమ విశ్వాసాలాతని ముప్పిరిగొన్నాయి. "ఎలాంటి నియమాల సంకెళ్ళపనిలేదు,ఎలాంటికఠినసాధనలు ు లేవు ఇపుడు నేనేమిజేసినా గురువు తనఅనంతశక్తిచే సదా రక్షిస్తాడనే నమ్మకం నాలో మిగుల బలపడింది." ఇలా ఆలోచింపసాగాడు గిరీష్. కాని పవర్ అఫ్ అటార్ని సమర్పించిన ఆ క్షణంలో అతడోవిషయం గ్రహింపలేకపోయాడు, అదేమన యిష్టపూర్వంగా గురునిపట్ల సర్వస్య శరణాగతి యనెడి బలమైన పాశాన్ని తనమెడకు వేసుకొన్నాడు. ఈ ప్రేమపాశం పాటింపలేని కఠిననియమావళికంటే నూరురెట్లు బలమైనదిగా గ్రహింపలేకపోయాడు. ఆవిధంగా గిరీష్ చంద్ర గురుని సర్వస్యశరణాగతి కోరాడు. క్రమంగా అతనిలో పెనుమార్పులు రాసాగాయి.అంతవరకు బాధించే ఆలోచనలన్నీ తోలగిపోయాయి, సదా అపారరామకృష్ణుల కృప తనపై ప్రవహిస్తుందనే యనుభవమతనికి కలగసాగింది. వాని ఆంతరంగికశక్తి నూరురెట్లు పెరిగింది. " ప్రజలు తనగూర్చెలాగైనా మాట్లాడనీ, తనపట్ల యెలాగైనా వ్యవహరింపనీ, సదా గురుకృప ప్రసరించే తనకేమి భయం? మరేంకావాలి? ఎవరికి భయపడాలి? " ఇది ప్రస్తుత గిరీష్ చంద్ర ఆలోచనా స్థితి. ఎన్నోజన్మల పుణ్యఫలంచేకాని లభింపని భావస్థితి యాతనికి ప్రాప్తమైనది. అప్పటినుండి అతడు భోంచేస్తున్నా విశ్రమిస్తున్నా కూర్చొన్నా నిల్చొన్నా ' శ్రీరామకృష్ణులు సదా తన పూర్తిబాధ్యత వహించార' నేది వాని ఆలోచన. శ్రీరామకృష్ణుల నిరంతరస్మరణ అతనిలో సదా అప్రయత్నముగా కొనసాగినది. అప్పటినుండి వాని ఆలోచనలు మారాయి, చేసేపనులలో మిగుల మార్పు వచ్చినది. ఆతని అంతరంగం మిగుల ఆనందతరంగాల పొంగిపోయేది. క్రమంగా ఆతని అహంకారం బలహీనమై ఏ పనైనా దేవుని సంకల్పం మేరకే జేస్తున్నటుల భావించేవాడు. కాలక్రమంలో శ్రీరామకృష్ణ పరమహంస పరమపదించారు(1886). కాని భక్తులపై వారి అనంతకరుణ సదా ప్రసరిస్తూనేవుంది!పరమహంస నిత్యసత్యులు! గిరీష్ చంద్ర జీవితంలో కొన్ని కష్టాలొచ్చాయి, యాతని భార్య, పుత్రుడు మరణించారు. ఐనప్పటికీ అతడేమాత్రం తన గురునిపై విశ్వాసం కోల్పోలేదు, తుదిక్షణంలో శ్రీ రామకృష్ణ పరమహంసల చిత్రపటంచూస్తూ, హృదయానికి హత్తుకొని శ్వాసవిడిచాడు. ఈ పరిణతియే ఆతనికి తన సద్గురువునుండి లభించిన అమూల్య బహుమతి! శ్రీసాయి,శ్రీ రామకృష్ణుల కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి! Ref: Sree Ramakrishna and His Divine Play by Swami Saradananda, Swami Chetanananda.
గిరీష్ చంద్ర ఘోష్

Comments

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)