కల్పతరు.

శ్రీసాయినాథాయనమః!నేడు శ్రీస్వామివివేకానంద జయంతి! Happy Youth Day.
" భగవంతుడు సర్వ జీవులను సృష్టించి సర్వులకు తండ్రి అయ్యాడు. తానే పంచభూతాలై తననుండి జీవులందరికీ దేహాలు, పోషణ యిచ్చి తల్లి అయ్యాడు. వేదాలు మొదలుకొని సర్వ శాస్త్రాలు అనుగ్రహించి ఆప్తవాక్యం చెప్పే మిత్రుడయ్యాడు. సకల సృష్టినీ తన అధీనంలో ఉంచుకోవడం వలన జీవులకు ఈశ్వరుడయ్యాడు. మహనీయుల రూపంలో అవతరించి గురువయ్యాడు. భూమిమీద తన ప్రతిరూపమైన సద్గురువు రూపంలో ఆయన అవతరించినపుడు తననాశ్రయించిన వారందరికీ కల్పవృక్షము, కామధేనువు,చింతామణి అవుతాడు." శ్రీసాయి లీలామృతము. శ్రీసాయిసచ్చరిత్ర గ్రంధంలో సాయిబాబాను ఆశ్రితుల కోర్కెలదీర్చెడి కల్పతరువుగా రచయిత హేమాద్రిపంతు వర్ణించాడు. వివిధ కోర్కెలతో బాబాను చూడవచ్చినవారలగూర్చి, అలా వచ్చుట సబబా యన్న ఓ భక్తునితో బాబా, " మొదట అందరు అలానేవస్తారు, ఓ స్థాయిచిక్కినపిమ్మట నా మార్గంలో నడుస్తారు." యని అన్నారు. బాబా వివిధ భక్తుల బాధలను అవసరాలను దీర్చెడివారు. అన్నవస్త్రాల గూర్చెడివారు, రోగనివారణ జేసెడివారు, సంతాన సౌభాగ్యములు ప్రసాదించెడివారు. సత్వగుణముల పెంపొందించి చక్కటి నడవడి నేర్పెడివారు. అజ్ఞానుల హృదయాలలో జ్ఞానజ్యోతుల వెలిగించెడివారు. భక్తులు వారిసాన్నిధ్యంలో అణుకువ, నిరాడంబరత, పరోపకారము, సర్వస్య శరణాగతి మున్నగు ఉన్నత లక్షణములు నేర్చుకొనెడివారు. అందులకే సాయిబాబాను కల్పతరువుగా గ్రంధకర్త వర్ణించాడు. అవతార్ మెహర్ బాబా, సృష్టియంతటినీ 72 మంది సద్గురువులు పర్యవేక్షిస్తుంటారనియు, వారందరిలో సాయిబాబా అగ్రగణ్యులని చెప్పియున్నారు.సద్గురు లెల్లరు వారి వారి ఆశ్రిత భక్తులకు కల్పతరు సమానులే! సమర్ధ సద్గురు సాయిబాబా తో సరిపోల్చదగిన మరియొక మహనీయుడు శ్రీరామకృష్ణ పరమహంస. శ్రీ పరమహంస తమభక్తులకు ఇంద్రియాతీత యనుభవముల ప్రసాదించి వారిని దైవమార్గంలో నడిపించిన అవతారపురుషులు. ప్రస్తుతము కల్పతరుబోలు శ్రీరామకృష్ణ జీవితములోని ఓ ప్రముఖ సంఘటనను స్మరించెదము. ఈ ఘటన జనవరి మొదటిరోజు 1886న జరిగినది. ఆ సమయంలో శ్రీరామకృష్ణ తమ మహాసమాధికి కొన్నినెలలముందు గొంతు కాన్సర్ వ్యాధిచే బాధపడుతూ, చికిత్సకై కలకత్తా నగరంలోని కాసిపూర్ ఉద్యానవన గృహంలో నివసిస్తున్నారు. ఆరోజు సాయంసమయాన తమభవనం వెలుపలి ఉద్యానవనంలో విహారానికై శ్రీపరమహంస బయలువెడలారు. అదే సమయంలో కొందరు శిష్యులు సమీపచెట్లకింద గుమిగూడారు.వారందరూ శ్రీరామకృష్ణకు నమస్కరించారు. వారిలో గిరీష్ చంద్ర ఘోష్ ఒకరు. ఘోష్ ని సమీపించి శ్రీరామకృష్ణ ఇలా ప్రశ్నించారు, " నాగురించి నీ వేమనుకొంటున్నావు? తెలిసినవారందరికి నేను అవతారపురుషుడనని జెబుతుంటావు, నన్నేవిధంగా అర్ధంజేసుకొన్నావు? " యని. అందులకు గిరీష్ ఏమాత్రం తొట్రుపడక మిగుల వినమ్రతతో మోకాళ్లపై ప్రణమిల్లి గద్గద కంఠంతో ఇలా అన్నాడు, " మిమ్ములగూర్చి నేనేమి చెప్పగలను? వ్యాస, వాల్మీకాది మహాఋషులే మీఖ్యాతి కొనియాడలేకున్నారు? మానవజాతిపై మిగుల దయతో భూమిపై అవతరించిన దైవంగా మిమ్ముల విశ్వసిస్తాను." వాని మాటలకు ు దయాసాగరులైన పరమహంస మిగుల చకితులై , " ఇంతకుమించి నేనేమి చెప్పగలను? మీరెల్లరికీ నా ఆశీసులు. మీరందరూ జాగృతి నొందెదరుగాక, మేల్కొనెదరుగాక! ( ఆత్మసాక్షాత్కారమొందెదరు గాక!). ఇలాఅంటూ ూ పరమహంస భావాతీత పారవశ్యతనొంది వారందరిని వరుసగా స్పృశింప నారంభించారు. ఆ దైవ స్పర్శతో వారెల్ల బహువిధములైన పరమానందానుభూతి నొందారు, వర్ణింపసాధ్యమా? ఎవరిపరమానందం ం వారిది! ఎవరి యనుభూతివారిది! వైకుంఠ యను భక్తుడు ఆ పారవశ్య ప్రవాహానికి తలనొగ్గి తననిత్యకృత్య కార్యక్రమాల చేయలేకపోయెడివాడు. తనకు పిచ్చెత్తినటుల భయపడ్డాడు. వాని యనుభూతి కొన్నిరోజులు కొనసాగింది. ( సాయిబాబా సన్నిధిలో ఎందరోభక్తులిలాంటి యనుభూతినొందారు!). రామచంద్ర దత్త యను వేరొకభక్తుడు శ్రీరామకృష్ణులను కోర్కెలదీర్చెడి కల్పతరువుగా అనుభూతినొంది ఆ దివ్యానుభవముపొందిన రోజును " కల్పతరు " రోజు గా నామకరణజేసాడు. దైవానుభవానికి ప్రతీకగా ఆ రోజునుండి నేటివరకు జనవరి మొదటిరోజను కల్పతరు పండుగదినంగా ప్రపంచవ్యాప్త శ్రీరామకృష్ణ భక్తులు, బెంగాలీ ప్రజలు జరుపుకొంటున్నారు. ు శ్రీరామకృష్ణుల ముఖ్యశిష్యులలో నొకరైన స్వామి శారదానంద ఈ సంఘటనను భవనపు పైభాగమునుండి తిలకించి పరవశించారు. కల్పతరువు ఆశ్రితులకు మంచి మరియు చెడు దీర్చెడి వృక్షము కాగా, శ్రీరామకృష్ణులు కేవలము మంచినే ప్రసాదించు దైవరూప సద్గురునిగా అభివర్ణించారు, భయమును పారద్రోలు అభయప్రదాతగా శ్లాఘించారు. సద్గురుదేవుల కరుణా కటాక్షములు మనందరిపై ప్రసరించుగాక! అందరికీ శుభమగుగాక! ఓంసాయి! శ్రీసాయి! జైజైసాయి! Ref: Sri Ramakrishna and His Divine Play.

Comments

  1. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవేనమః!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)