సాయిలీలా విశ్లేషణ - పదిరూపాయలు.
శ్రీసాయినాథాయనమః!
సాయిలీలలకు అంతులేదు. ఎవరిని ఏయే విధంగా తమమార్గంలోకి లాగెదరో ఊహకందని విషయము. ప్రస్తుతము శ్రీసాయిసచ్చరిత్రములోని బాబా చమత్కారలీలనొకటి స్మరించెదము. ఇది అప్పాసాహెబు కులకర్ణి, ఠాణా నివాసి యనుభవము, వివరములు 33 యధ్యాయమున చూడగలము. సాయిబాబాను ఎప్పటినుండో చూడదలచినను చూడలేకపోయాడు. బాలాసాహెబు భాటే నుండి బాబా ఫోటోపొంది నిత్యం మిగులభక్తితో పూజజేస్తున్నాడు. మనసులో బాబాను చూడాలనే ప్రబల ఆకాంక్ష. కులకర్ణి ఓ వారంరోజుల పనిపై భీవండి వెళ్ళవలసి వచ్చినది. మూడవరోజు మధ్యాహ్నం కులకర్ణి లేనిసమయాన వారింటికి సాయిని బోలిన ఫకీరు వచ్చాడు. ఫకీరు సాయిబాబాయా? యనెడి సందేహం కులకర్ణి భార్యాబిడ్డలకు కలుగుటచే, తాను కేవలం దేవుని సేవకుడనని, దైవజ్ఞచే వారి యోగక్షేమముల తెలిసికొనుటకై వచ్చానని ఆ ఆగంతకుడు చెప్పాడు. ఓ రూపాయి దక్షిణపొంది వారికో విభూతి పొట్లామిచ్చి ఫకీరు కనుమరుగయ్యాడు. ఇపుడో యనుకోని విషయం జరిగింది. భీవండిలో గుఱ్ఱము జబ్బుపడుటచే మూడవరోజు సాయంకాలానికే కులకర్ణి తన పర్యటన మధ్యలోనేమానుకొని యింటికి వచ్చాడు. భార్యాబిడ్డలనుండి ఆ రోజు ఫకీరు రాక వివరములు గ్రహించి తాను ఫకీరును చూడకుండుటకు మిగుల బాధపడి, తానుండిన కనీసము పదిరూపాయలు దక్షిణ ఇచ్చువాడనని తలచాడు. ఇకనేమాత్రం ఆలశ్యం జేయక భోజనవిషయంకూడా మరచి ఫకీరుకై చుట్టుప్రక్కల వెదికినా ఫలితం లభించలేదు. ఇల్లుజేరి భోజనంజేసి చిత్రేయను మిత్రునితో వహ్వాళికి బయలుదేరాడు. వింతగా మునుపటి ఫకీరే వారికెదురై మొత్తంగా పదిరూపాయలు వానినుండి దక్షిణ పొంది వెళ్ళిపోయాడు. విభూతి పొట్లము విప్పిజూచిన అప్పాకు ంు పువ్వురెక్కలు, అక్షింతలు కనబడ్డాయి. ఈ బాబాలీలను ు నిశితముగా పరిశీలిస్తే పెక్కు ఆశ్చర్యకర విషయములు తెలియగలవు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, పరిచితులు, అపరిచితుల ద్వారాకాని. సత్సంగాది సామూహిక కార్యక్రమాలద్వారాకాని లేక మరేదైన మిషద్వారాకానీ సాయిబాబా భక్తుల జీవితాలలో ప్రవేశిస్తారనేది భక్తుల అనుభవ సత్యం. బాలేభాటే ద్వారా కులకర్ణి సాయిమార్గంలోకి లాగబడ్డాడు. ప్రప్రధమంగా తెలిసే విషయమేమంటే అప్పా బాబానెన్నడూ చూడనప్పటికీ కేవలం వారి ఫోటోను మాత్రమే పూజించినా మిగుల ఆశ్చర్యకర యనుభవముల పొందాడు. అనగా బాబాకు వారి చిత్రానికెలాంటి భేదం లేదనే అద్భుతవిషయం. ఏ రూపంలో బాబా భక్తులకు దర్శనమిస్తారో ఊహించడం మిగుల కష్టం. కులకర్ణి ఇంటివద్దలేనిసమయాన వాని భార్యాబిడ్డలకు దర్శనమిచ్చి దక్షిణపొంది వారిని ఆశీర్వదించి విభూతినిచ్చారు. యజమాని చేయు పూజలు వాని పరివారాన్నికూడా రక్షిస్తాయి. ఒక్కొక్క సారి మనమనుకొన్నపనులు జరుగవు, అయినా అదిమనమేలుకొరకే! కులకర్ణి గుఱ్ఱం జబ్బుపడి మధ్యలో మూడవరోజుకే యింటికొచ్చాడు, వింతగా అదేరోజున బాబా ఫకీరుగా దర్శనమిచ్చారు. ఆరోజాతడు రాకుంటే దర్శనమయ్యేది కాదేమో? భోజనంచేయక ఆకలి కడుపుతో చేయు పనులు సాయికిష్టముండదు. అప్పా భోజనం చేసినపిమ్మటే వానికి సాయి దర్శనమయ్యింది. సాయి సర్వజ్ఞులు భక్తుల ఆలోచనలు, అవసరాలు వారి కెరుకే! కులకర్ణి పది రూపాయలివ్వ దలచినా ముందుగా ఒక్కరూపాయి మాత్రమే యిచ్చాడు, కాని బాబా మరల వరుసగా 2,3,3 రూపాయల మొత్తం 9 రూపాయల దక్షినడిగి అదియును చాలక చివరకు అప్ప తలచిన పదిరూపాయల నోటుస్వీకరించి ంు ముందుపొందిన 9 రూపాయలను అప్పాకు తిరిగి యిచ్చారు.(అనుకున్నంత, అనుకొన్నవిధంగా మొక్కులు తీర్చుకోవలెను. సప్తశృంగి దేవి మొక్కుల దీర్చుటకై శ్యామాను వణి పంపించారు బాబా. భక్తులు తాము ు మొదట మనసులో తలచినంత దక్షిణివ్వనపుడు ఇవ్వదలచిన మొత్తమునడిగి మరీ పొందెడువారు సాయి). 9 రూపాయలు నవవిధి భక్తికి సంకేతం. దక్షిణ సమర్పణతోకాని పూజ పూర్తికాదు యన్నట్లు అప్పా పొట్లము విప్పిజూస్తే అందు పువ్వురెక్కలు అక్షింతలున్నాయి. సాయి విభూతినలా పువ్వులు అక్షింతలుగా మార్చివేశారు. అప్పా తనపూజాఫలంగా శిరిడీలో సాయిని దర్శించి వారివెంట్రుక ుు పొంది విభూతితోకట్టి దేహంపై ధరించాడు. ఒక్కరూపాయకు తాను పదిస్తాననెడిది బాబా వాక్యంకదా! బాబాను దర్శించిన పిమ్మట వాని ఆదాయమెన్నోరెట్లు పెరిగింది. వాని భక్తిశ్రద్ధలు, పలుకుబడి మిగుల పెంపొందాయి. శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికీ శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!
అనంత విశ్వరూపుడు సాయిబాబా! ఏరూపంగానైనా భక్తులకు ఆసీసులివ్వగల సమర్థులు.
ReplyDelete