సాయికథలు-అక్కాచెల్లెళ్లు.
శ్రీసాయినాథాయనమః
" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము జేయుటయే! " శ్రీసాయిసచ్చరిత్రము.
శ్రీసాయిసచ్చరిత్ర 15వ అధ్యాయంలో సాయిచెప్పిన ఓ చక్కని అక్కాచెల్లెళ్ల కథ ఇది. బాబాకు మనుషుల బంధుత్వమేగాక , జంతువుల పశువుల. క్రిమికీటకాదులు వరుసవాయలు బాగుగ తెలియును. సాయికి, మేకలుగా పుట్టిన అన్నదమ్ముల కథతెలుసు, పాము కప్పలుగా జన్మలెత్తిన వీరభద్రప్ప చెన్నబసప్పల గాధ తెలుసు. అదేవిధంగా అక్కచెల్లెళ్లుగా చమత్కరించిన రెండు బల్లుల విచిత్ర కలయిక బాబాకు తెలియును. ఈవివరముల నిచట స్మరించెదము. ఓకరోజు ద్వారకామాయిలో బాబా భక్తులతో ముచ్చటించే సమయాన కప్పుపైనున్న ఓ బల్లి టికుటిక్కుమంటూ కూసింది. ఎదురుగా కూర్చున్న భక్తునికి ఆ కూత శుభమా, అశుభమా యను సందేహమొచ్చి బాబాను వివరణమడిగాడు. తన చెల్లి ఔరంగాబాదునుండి వచ్చుచున్న కారణాన బల్లి ఆనందపడుతుందని బాబా చెప్పగా ఆఅడిగిన వ్యక్తి మిగుల ఆశ్చర్యపడ్డాడు. కొంతసేపటికి ఔరంగాబాదునుండి ఒక వ్యక్తి బాబాదర్శనానికై గుఱ్ఱంపై వచ్చాడు. ఆకలిగానున్న వాని గుర్రానికి ఉలవలు తెచ్చుటకై తనదగ్గరున్న సంచిని విదిలించగా, అందులోనుండి ఓబల్లి క్రిందపడి అందరూ చూచుచుండగా గోడనెక్కి తనసోదరివద్దకు వెళ్ళింది. చాలకాలం పిమ్మట కలిసిన అక్కాచెల్లెళ్లు ఒకరినొకరు కౌగలించి ముద్దాడుకొన్నారు. ఇదంతా చూస్తున్నభక్తులు మిగుల నిర్ఘాంతపోయారు.
ఈ అక్కాచెల్లెళ్ల కథపరిశీలిస్తే మనకెన్నో విషయాలు బోధపడతాయి. బాబాకు దూరము దగ్గరలకు భేదంలేదు, ఎచటి ఔరంగాబాదు ఎచ్చటి శిరిడీ. మరి సాయికి బల్లిభాష తెలుసా యనెడి సందేహమొస్తుంది. సాయికి సర్వభాషలు తెలియును. జీవులన్నీ ఘనీభవించిన సృష్టి చైతన్య రూపులు. జీవుల చైతన్యస్థాయినుండి స్పందన ఉద్భవిస్తుంది, ఆ స్పందననుండి భావం మొలకెత్తుతుంది. ఆ భావమే భాషగా వ్యక్తీకరణనొందుతోంది. జీవుల భాషలు వేరైనా వివిధస్థాయిలలోని వారందరి మూలచైతన్యమొక్కటే! ఆ మూలచైన్యమే సాయి సహజ స్థితి. సాయికి రెండు బల్లుల అంతరంగం తెలుసు, గుర్రమెక్కి వచ్చిన వ్యక్తి మనోభావం తెలుసు, గుర్రం ఆకలి తెలుసు, ప్రశ్నించిన ఎదుటి భక్తుని అంతరంగం తెలుసు. గుర్రంపై వచ్చే సమయం సాయికి సరిగ్గా తెలుసు, గుర్రానికి ఉలవలు తెచ్చెడి అవసరం తెలుసు, అంతేగాక దుమ్ముపోవుటకు సంచిని విదిలించెడిచిన్నపనియు ూ సాయికి తెలుసు. ఇదే విధంగా ఆలోచిస్తే సాయికి భక్తుల మనసులలోని ఆశలు, ఆలోచనలు, అవసరాలు ఎలా తెలుస్తాయో బోధపడుతుంది. సాయి సర్వజ్ఞత, సాయి సమర్ధత అనుభవమగుటచే రోజురోజుకి భక్తులసంఖ్య అనూహ్యంగా వృద్ధినొందుతుంది. మరొక కోణంలో ఆలోచిస్తే యమ, నియమ, ఆసన,ప్రాణాయామ,ప్రత్యాహార,ధారణ,ధ్యాన,సమాధులతోగూడిన అష్టాంగయోగము లేక రాజయోగము నందు సాయి బహునిపుణులు. సాయి ఆశింపకయే అష్టసిద్ధులు వారినాశ్రయించాయి. ఆయా సిద్ధుల మహిమచే సర్వ జీవుల భాషలు సాధకునికి తెలుస్తాయని పతాంజలి యోగసూత్రాలలో చెప్పబడియుంది. సాయి సహజసిద్ధ పురుషులు కావున వారికి బాహ్య యోగాది సాధనలతో పనిలేదు. జీవులందరిలో దాగిన మూల చైతన్యము లేక ఆత్మ వారే. అందులకే, "అందరిలో నేనున్నాను, ఎవరిని బాధించినా నేను బాధపడతాను." అన్నారు సాయిబాబా.
శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికీ శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!
For further reading please visit "సాయి కథలు -అక్కచెల్లెండ్ర అనురాగము." post of this blog; dated June 29,2019.
సర్వ చరాచర జీవ చైతన్యమే శ్రీ సాయిబాబా! విశ్వమంతయు వారి ఎరుకలోనిదే!
ReplyDelete