సాయిలీలావిశ్లేషణ : ప్రేమ - పగ.
శ్రీసాయినాథాయనమః!
పెద్దలు జీవితాన్ని పరమపదసోపానపటం లేక పాము,నిచ్చెనల ఆటతో పోల్చిచెబుతారు. సాత్విక గుణములు కలిగి మంచిపనులు జేయువారు క్రమంగా వృద్ధిచెంది నిచ్చెనలనెక్కినట్లు ఉన్నతమార్గంలో పయనించి క్రమంగా జన్మజన్మకు వృద్ధినొంది దైవసన్నిధికి జేరుతారు. అదేవిధంగా రాక్షసస్వభావం కలిగి చెడుకర్మలుజేస్తూ ఇతరులకు హానిజేయువారు తమకు ప్రాప్తించిన మానవజన్మనూ కోల్పోయి పాము కరిచిన విధంగా పాతాళానికి నెట్టవేయబడి పాపజన్మల నెత్తుతారు. శ్రీసాయిసచ్చరిత్రమునందు ఇందులకు చక్కని ఉదాహరణలు చూడగలము. కొందరు పుణ్యాత్ములు సాయిని జన్మజన్మల సేవించి ఉన్నతస్థితిని పొందగా మరికొందరు భాగ్యహీనులు సాయికి సన్నిహిత వ్యక్తులుగా జన్మలనెత్తినప్పటికీ ధర్మాన్నితప్పి పరులకు కీడుజేస్తూ ఆపై హీనజన్మలపోందారు.ఈవిషయాన్ని వివరంగా తెలుసుకొందాము. మొట్టమొదట దాదాసాహెబ్ ఖాపర్డే భార్యను గూర్చిన విషయము. ఖాపర్డే గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ స్వాతంత్ర సంపాదనకై బాలగంగాధర తిలక్ కు కుడిభుజంగా పనిజేసాడు. ఖాపర్డే సాయి అనుగ్రహము రక్షణ పొందిన అదృష్టశాలి. భార్యాభర్తలిరువురు సాయిని మిగులభక్తిశ్రద్ధల సేవించారు. శిరిడీలో ఖాపర్డే నాలుగుమాసములుండగా వాని భార్య ఏడుమాసములుండి సాయిని సేవించిన పుణ్యాత్మురాలు. ఆమె ప్రతిరోజూ ు బాబాకొరకు నైవేద్యం తెచ్చేది. దానిని సాయి ఆమోదించిన తరువాతే భుజించెడిది. ఓరోజు ఆమె పెక్కువంటకాలతో బాబాకై రుచికరభోజనం ద్వారకామాయికి తెచ్చినది. బాబా ఆమె భక్తిశ్రద్ధలకు మిగుల సంతసించి ఇతరులు దెచ్చిన వంటకాలనేమాత్రం ముట్టక ఆమెతెచ్చిన పళ్ళెమునుండి భోజనం మిగుల ఆత్రంగా తినుట ప్రారంభించగా, సమీపాన కూర్చున్న శ్యామా మిగుల అసూయచెంది అలా ఎలాజేస్తున్నావని సాయి నడిగాడు. అపుడు భక్తుల జన్మలనెరుగు సర్వజ్ఞుడైన సాయి ఖాపర్డేభార్య పూర్వజన్మలగూర్చి అందరికీ ఒకింత ఆశ్చర్యం కలిగించేవిధంగా వివరించారు. " పూర్వజన్మలో ఈమె బాగుగా పాలిచ్చెడి ఓ వర్తకుని ఆవు. మరుజన్మలో తోటమాలి ఇంటిలో జన్మించినది. మూడవజన్మలో క్షత్రియగృహంలో జన్మనెత్తి ఒక వర్తకుని వివాహమాడినది. తరువాత ఓ బ్రాహ్మణకుటుంబంలో జన్మించినది. చాలాకాలం పిమ్మట యామెను చూసాను. " అంటూ ఆమెతెచ్చినభోజనంను మిగుల ప్రేమతో భుజించి తమగద్దెపై కూర్చున్నారు సాయిబాబా. ఆపై ఆమె బాబాను సమీపించి వారి కాళ్ళను మిగుల ప్రేమతో పిసుకుచుండగా వారు మిగుల వాత్సల్యంతో ఆమె చేతుల మర్దించారు. ఆమె యదార్ధమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువుగా ఆకర్షించు కంఠంతో " రాజారామ్ " యను మంత్రాన్ని ఎల్లవేళలా జపించమన్నారు. ఈపై వృత్తాంతాన్ని వివరించుకొంటే ఎన్నో విషయాలు అవగతమవుతాయి. ఆమె ప్రారంభంలో పవిత్రమైన గోవు జన్మనెత్తినది. ఆగోవు పాలను బాబాస్వీకరించేవారని తోస్తుంది. అందుకే ఆమెపై బాబాకంతప్రేమ. ఆ పుణ్యఫలంచేతనే ఆమె ఉన్నతమైన మానవజన్మలనెత్తి తుదకు పావన బ్రాహ్మణకుటుంబలో జన్మించి, ఆపై ఉన్నతవిద్యావంతుడు, ధనికుడు, స్వాతంత్య్రయోధుడు మరియు సాయిభక్తుడైన ఖాపర్డేను వివాహమాడి అంతిమంగా సాయిబాబాను దర్శించి సేవించి ధన్యురాలైనది. ఖాపర్డే భార్య కథ పరమపదసోపానపటంలో నిచ్చెనను స్మరింపజేయక మానదు.ఈమెజీవితానికి భిన్నమైన వృత్తాంతముల నిపుడు పరిశీలించెదము. మొదట రెండుమేకల గాధ జూచెదము. ఓకరోజు ఉదయం బాబా లెండివనంనుండి వస్తూ మేకలమందనుజూసారు. ఆమందలోని రెండుమేకలపై దృష్టి పడగా వానినిష్టపడి 32 రూపాయలకు కొని వాటిని లాలించి తమడబ్బుతోనే 4సేర్ల శనగపప్పు తినిపించారు. దగ్గరున్నభక్తులు అంతధర కేల కొన్నారని ఆక్షేపింపగా ఆమేకలను యజమానికి తిరిగి యిచ్చివేసి ఆ మేకల వృత్తాంత్తాన్ని భక్తులకిలా వివరించారు. పూర్వజన్మలో ఆ రెండుమేకలు సోదరులు. వారి యదృష్టమేమోగాని సాయితో జీవించి వారితో స్నేహితులుగా మెలిగేవారు. మొట్టమొదట వారిరువురూ పరస్పరం ప్రేమతో వ్యవహరించిననూ క్రమంగా ఒకరిపైనొకరు ద్వేషం పెంచుకొని ఒకరినొకరు చంపుకొని మరుజన్మలో మేకలగా జన్మించి సాయిబాబా కంటపడ్డారు. ఈ కథను వివరించుకుంటే రత్నాల్లాంటి బాబా సందేశాలెన్నో లభిస్తాయి. మొట్టమొదట మేకలుగా పుట్టిన సోదరుల జన్మలు బాబాకిట్టే యెరుక. ఇది వారి జన్మాంతరజ్నానానికో మచ్చుతునక. ధర్మమార్గంలో నడవకుంటే సాయి సన్నిధి కూడ నిష్ఫలమౌతుంది. సోదరులలోని కామక్రోధాది రాక్షస గుణములు సాయి రక్షణ పొందకుండాజేశాయి. ఆయా దుర్గుణాలే వారిని పవిత్రమానవజన్మ నుండి దూరంజేసి హీన జంతుజన్మలకు కారణమయ్యాయి. వారి పాపకర్మలెంతటి బలీయమంటే మేకలుగా పుట్టిన గతసోదరులను సాయి తమ దగ్గరుంచుకోలేకపోయారు. సాటివారి మాటలచే మేకలను యజమానికిచ్చివేశారు. పాము నిచ్చెనల ఆటలో పాము కరిచిన పావు పైగడి నుండి క్రిందకి జారినట్లు సోదరులు తమ దుర్గుణాల సర్పంగాటుకు గురై మనిషి జన్మనుండి మేకలజన్మ పొందారు.ఋణానుబంధ మెంత బలీయమైనదోగదా? పూర్వజన్మ బంధంచే యిరువురూ మందలో కలిసే తిరుగుతున్నారు. ఇక రెండవ ఆశ్చర్యకరమైన కథ వీరభద్రప్ప చెన్నబసప్పల గూర్చి. ఈ గాథ సాయిబాబా ముఖతః వెలువడిన విచిత్ర జన్మజన్మల వృత్తాంతము. ఇచట ముఖ్యపాత్రలు పేదబ్రాహ్మణుడు వీరభద్రప్ప, పూజారి, వాని కూతురు గౌరి, ఆలయపరిచారిక కుటుంబలో జన్మించిన చెన్నబసప్ప, తుదకు మూలసూత్రధారుడు శ్రీసాయిబాబా. వీరిపూర్వజన్మ వివరాలు కొద్దిగా వివరించుకుందాము. వీరభద్రప్ప గ్రామంలోని ధనికుడు, పరమపిసినారి. గౌరి వానిభార్య. చెన్నబసప్ప కడుపేదరాలు దుబాకి. గ్రామంలోని శివాలయ పునరుద్ధరణకై గ్రామస్తులనుండి, భార్యనుండి, దుబాకీనుండి పొందిన సొమ్మును ఆలయాభివృద్ధికి వెచ్చించక తానే స్వాహాజేసి పిడుగుపాటుచే దుర్మణం పొందాడు ధనికుడు. భర్తతోపాటే మరణించింది వాని భార్య. కాలగతిలో అసువులు బాసింది దుబాకి. ఋణానుబంధంచే, కర్మఫలంచే మరు జన్మలో వారు మువ్వురు భద్రప్ప, గౌరీ, బసప్పలుగా పునర్జన్మల పొందారు. గౌరీ పూర్వపుణ్యఫలంచే ధనికుడైన పూజారికూతురుగా జన్మపొందినది. గతజన్మలోని పిసినారి ధనికుడు తానుజేసిన పాపకర్మచే పేదబ్రాహ్మణుడు వీరభద్రప్పగా జన్మనెత్తాడు. సాయిబాబా కరుణచే భద్రప్పకు గౌరిచే వివాహంజరిగి, వారిరువు పూర్వజన్మ భార్యాభర్తల బంధాన్ని కొనసాగించారు. గతజన్మ వాసనలు అంతతేలికగా పోవు. భద్రప్ప ధనపిపాస కొనసాగి భార్య గౌరి ఆస్తికై దురాశపడ్డాడు. పూర్వ పుణ్యంచే గౌరి ఆస్తి విలువ వంద రెట్లు పెరిగినది. భద్రప్ప దురాశ మరీ పదింతలైనది. ప్రస్తుతజన్మలో వారి మువ్వురకూ సాయి సాన్నిహిత్యపుణ్యం లభించింది. గౌరీ ఆస్తిపై భద్రప్పకు హక్కులేదనియు, బసప్పతో కలిసి శివాలయాభివృద్ధికై కొంత ఖర్చుజేయాలని బాబా జెప్పుటచే, భద్రప్ప మిగుల కుపితుడై సాయి, భార్య గౌరి, సేవక బసప్పపై మిగుల ద్వేషం పెంచకున్నాడు. ు బలహీనుడు బసప్ప తనను కడదేర్చ బయలుదేరిన భద్రప్పనుండి రక్షణకై సాయిని శరణుకోరాడు. శత్రువుబారినుండి కాపాడెదనని వానికి వాగ్దానంజేశారు బాబా. కాలచక్రగతిలో వారిజన్మలు మారాయి. పూర్వజన్మల వైరంమరింత కొనసాగి వీరభద్రప్ప చెన్నబసప్పలు పాము కప్పలుగా హీనజన్మలెత్తారు. సరైన సమయానికొచ్చి కబళించబోయిన పామునోటినుండి కప్పనురక్షించాడు సాయిబాబా. ఇపుడు చూచాంకదా సాయి సాన్నిహిత్యం లభించినా, భద్రప్ప బసప్పల కొరిగినదేమీలేదు. సోపానపటంలోని పెనుపాముచే కాటువేయబడ్డ పావులుగా ఉన్నత మానవజన్మనుండి హీనజన్మలకు తోసివేయబడ్డారు భద్రప్ప మరియు బసప్పలు. అందులకే ఋణము, శత్రుత్వము,హత్యలకు బదులుంటుందన్నారు సాయిబాబా. శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికీ శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!
Dharma (Rightousness) sustains the creation. The violation of Dharma invites annihilation. This stands valid for people and nations as well.
<
ధర్మో రక్షతి రక్షితః! ( ధర్మాన్ని రక్షించు, ధర్మం నిన్ను రక్షిస్తుంది. Save Dharma, Dharma will save you).
ReplyDeleteThe explanation of SAI LEELA is very clear and true. This type of narration is very useful for the devotees of SAI BABA.
ReplyDelete