అమ్మల మిన్న యమ్మ సాయి మాయమ్మ !

శ్రీసాయినాథాయనమః! నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవము (Mothers Day).
" Mothers were created by God to show us that He loves us with or without cause. " Paramahansa Yogananda. అంతర్జాతీయ మాతృదినోత్సవ వేడుక సందర్భమున మాతృమూర్తులెల్లరకు శతాధిక వందనములు. తల్లి ప్రేమ తల్లికే తెలుస్తుంది, ఆ ప్రేమ ఉహకందదు, వర్ణలకు చిక్కదు. కాని అట్టి ప్రేమను గూడ మించునట సద్గురువు ు తన భక్తులపై జూపెడు ప్రేమ. తల్లిప్రేమను వేయి రేట్లు మించునని స్వామి సమర్ధ అక్కల్కోట్ మహారాజ్ వచించారు. సాయిప్రేమ అలాంటిదే! మాతృమూర్తి ప్రేమానురాగాలు కేవలం తన బిడ్డలకే పరిమితమైతే సాయి ప్రేమ శరణాగతి కోరిన సమస్తమానవాళిపైనే గాక , జీవజంతువులపైనా, సమస్త చరాచర జగత్తుపైనా సదా ప్రసరిస్తుంది. నేటి ప్రత్యేక శుభ సమయమున ఎల్లలెరుగని సాయి తల్లిప్రేమనిచట స్మరించుకొనెదము. తమను జూడ వచ్చిన భక్తుడు బాబాసాహెబ్ మిరీకర్ తో సాయి యిలా అన్నారు, " నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి, ఎవరైతే ఆమె ఒడిలో కూర్చొనెదరో వారిని ఆమె కష్టములనుండి యాతురతలనుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాల దయార్ద్ర హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని ఆపదలనుండి రక్షించును". ఈవిధంగా బలికి వానిని సర్పగండమునుండి కాపాడారు. నయంకానట్టి రాచకురుపుతో బాధపడు డాక్టరు మేనల్లుని వాని తల్లిదండ్రులు బాబా వద్దకు తీసుకొనిరాగా వారినోదార్చి యిట్లన్నారు. " ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడు ఈజన్మలో ఏవ్యాధిచేతను బాధపడరు. ఇది మసీదుకాదు ఇది ద్వారవతి. ఎవరైతే ఇందు కాలుమోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు1 ". ఊది పూయగా కుఱ్ఱవాని వ్యాధి కొద్దిరోజులలో మానిపోయినది. బాబా దయగల తల్లివంటివారు. తనభక్తుల భవిష్యత్తు వర్తమానముల లాభములగూర్చి బాగుగ తెలిసినవారు. పత్తి, ధాన్యము వ్యాపారముల జేయదలచి సాయి యనుమతి గోరిన దాము అన్నాకు అనుమతి నివ్వక వానిని పెద్ద నష్టములనుండి కాపాడారు. శిరిడీకి చాలదూరమున యున్న కమ్మరివానింట్లో భర్తకు సాయంగా కొలిమి నూదు తల్లి ఒడినుండి బిడ్డ పొరపాటున కొలిమిమంటలో పడగా మజీదులోని సాయి తమ చేతిని ధునిలోకి చొప్పించి బిడ్డను రక్షించారు. తమ చేయి కాలినందుకు బాధపడక బిడ్డను కాపాడినందుకు ఆనందపడ్డారు. తల్లి ఏమరచినా సాయితల్లి ఎల్లవేళలా అప్రమత్తమే! శిరిడీలో ఖాపర్డే కుమారునికి ప్లేగువ్యాధిసోకగా వాని తల్లి మిగుల తల్లడిల్లి సాయి శరణు వేడగా దయామయి సాయి, బిడ్డ వ్యాధిని తమదేహంపైకి తీసికొని వానిని రోగముక్తుని జేశారు. తల్లి సాయం కొంతవరకే, అనంతమే సాయి సాయం!నీమ్ గావ్ లోని డేంగలే కుటుంబంవారు సాయి భక్తులు. బాబా కృపచే నానాసాహెబ్ డేంగలే కు సంతానం కలిగినది. ఒక రోజు ఆతడు పొలం పనులు చేయిస్తున్నాడు. ఒక కూలి మనిషి తన బిడ్డను ఒక చెట్టుక్రింద నిద్రపుచ్చి పనిజేస్తుంది. అకస్మాత్తుగా వర్షం ఆరంభమయ్యేసరికి అందరూ పక్కనున్న పాకలోకి పరుగెత్తారు. వెంటనే ఆతల్లికి తన బిడ్డ గుర్తుకువచ్చి పరుగున వెళ్లేసరికి, బిడ్డపక్కనే బాబా నిలబడి కాపలా కాస్తున్నారు. సాయి ఆమెను జూస్తూనే, బిడ్డసంగతి మరచినందుకు మందలించారు. ఆ తల్లి ఆత్రంగా బిడ్డనెత్తు కొనే లోగా అదృశ్యులయ్యారు. కన్నతల్లి మరచినా సాయి మరువరు. ఏమరుపాటెరుగనిది సాయి రక్షణ! తెండూల్కర్ కుటుంబము వారు బాబాకు భక్తులు. వారి పుత్రుడు వైద్యపరీక్షకు కూర్చున దలచి కష్టపడి చదువుచుండగా జ్యోతిష్యులు గ్రహబలం అనుకూలంగా లేదని చెప్పారు. వాని తల్లి శిరిడీ వెళ్ళి సాయమర్ధింపగా సాయిలా అన్నారు, " నాయందు నమ్మకముంచి తన పాఠములను చదువుకొనమని చెప్పుము. అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును. నాయందే నమ్మకముంచుమనుము. " కరుణామయి సాయి సాయంచే కుఱ్ఱవానికి అదేసంవత్సరం సీటు వచ్చినది. సాయి బలం ముందు గ్రహబలమేపాటిది? తాను తిన్నా తినకున్నా వంటజేసి బిడ్డలకు కడుపునిండా భోజనం పెడుతుంది కన్నతల్లి, సాయి అన్నదానం కూడా అలాంటిదే. స్వయంగా వంటజేసి అచటివారాలకెంతో ప్రీతిగా తినిపించేవారు. సాయి ప్రేమ, సాయి రక్షణ కేవలం మనుష్యులకే పరిమితంగాదు. పూర్వజన్మలో సాయి సహచర్యులుగా మెలిగిన సోదరులిద్దరూ పరస్పరం కలహించి ఒకరినొకరు చంపుకొని మరుజన్మలో మేకలుగా జన్మించగా వాటి నాదరించి తిండిపెట్టారు సాయి. కర్మ ఫలంచే కప్పగా పుట్టిన చెన్నబసప్పను పాముగా జన్మనెత్తిన పూర్వ శత్రువు వీరభద్రప్పనుండి కాపాడారు. ఆకలికొన్న కుక్క ఆకలిని తాము యనుభవించారు. భక్తురాలు విసిరిన రొట్టెముక్కతో సంతృప్తి పడ్డారు. శ్యామకర్ణ యను గుఱ్ఱపు దేహంపైనున్న యజమాని కొరడాదెబ్బల గాయాల బాధను సాయి అనుభవించారు. హద్దులెరుగనిది సాయి సాయం, తల్లి బాయిజాబాయి కిచ్చిన మాటనిలుపుటకై ఆమె పుత్రుని మరణమును తాము పొంది మహాసమాధి చెందారు. నిదురెరుగని సాయి యెరుక నిత్యం అప్రమత్తం, భక్తకోటి యనుభవాలే ప్రత్యక్ష సాక్ష్యం! మాతృదినోత్సపు ఈశుభవేళ దయామయి సాయి తల్లికి శతకోటి ప్రాణామములు. శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజై సాయి

Comments

  1. మాతృదేవోభవ! మాతృదేవోభవ!! మాతృదేవోభవ!!!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

అధ్యాత్మరామాయణము : అహల్యస్థుతి.