ఈశోపనిషత్తు పరంగా శ్రీసాయిబాబ స్థుతి.
శ్రీసాయినాథాయనమః. పాఠక భక్తులెల్లరకు గురుపూర్ణిమ శుభాకాంక్షలు, సాయిబాబా దివ్యాశీసులు!
సర్వజ్ఞత సర్వవ్యాపకత సర్వశక్తిమంతమునైన నైన ఆ పరబ్రహ్మ శక్తి సదా పరిపూర్ణమైనది. రూపరహితమైన బ్రహ్మమునుండి మానుషరూపం దాల్చి శిరిడీలో సాయిబాబాగా నడయాడిన పరాశక్తి పరిపూర్ణమైనది. హే సాయినాథా! పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మమనెడి యచ్చులో పోయగా దానినుండి యోగులలో నలంకారమూగ నీవు ఉద్భవించినావు. మహాసమాధియనంతరము నిరంతరం కొనసాగుతున్న నీ నిర్గుణ నిరాకార శక్తి పరిపూర్ణమైనది. హే పరాత్పరా, సాయిదేవా శరణు శరణు. అశాశ్వితము సదా పరిణామశీలమైన జగత్తులో సంపూర్ణ త్యాగనిరతితో నీవు జీవించినావు. నీ త్యాగబుద్ధి అద్భుతము అమోఘము. దీన జనోద్ధరణమే నీ అవతార కార్య రహస్యము. నీవు నిష్కళంక కర్మయోగివి. భక్తులనుండి ఒక్కటిపొంది వారికి పదింతలగ , నూరింతలగ సాయముగూర్చు దానశీలి శరణు శరణు. నీదివ్యశక్తి,సృష్టి నడుపునట్టి ఆత్మస్థితి. సర్వజీవరాశులయందు చైతన్యరూపుడవై విరాజిల్లు ఓ సాయినాథా శరణు శరణు. ఉపనిషత్తులు ఆత్మఒక్కటిగా పేర్కొన్నవి. ఆత్మ కదలదు, కాని మనసుకన్నా వేగంగా చరించును. ఇంద్రియములకు పట్టుబడదు. చలనరహితముగా నిలబడినను పరుగులెత్తు వాటినన్నింటిని అతిక్రమించును. ఆత్మయే సర్వజీవుల పోషించు మూలశక్తి. ఆత్మ అతి సమీపము, మరియు సుదూరముగ వ్యాపించినదియును. నీవు మజీదునుండి బయటకు కాలుమోపకయే సప్తసంద్రములావలియున్న భక్తులజేరి వారికి క్షేమముగూర్చెదవు. ఏ రూపముగ నీవు భక్తుల జేరెదవో మాయూహకందని విషయము. జీవరాసులెల్లర లోపల వెలుపల విరాజిల్లు ఓ ఆత్మస్వరూపా సద్గురుదేవా శరణు శరణు. కుక్క ఆకలి గొన్న నీ కడుపు మండును. యజమాని గుఱ్ఱమును కొట్టిన ఆ వాత నీ దేహంపై రుధిరం స్రవించు గాయము. భక్తుని జ్వరం వెంటనే నీవంటిపైన. ఏమిటీ ఎల్లలెరుగని నీదయ, నిన్నేరీతి పొగడుదు? నీవు స్వయంభువుడవు. సర్వత్రా వ్యాపించియున్నఓ పరమపావనా శరణు శరణు. నీలో ఎలాంటి దేహభావము కానరాదు. సర్వజ్ఞుడవు, సర్వసాక్షిభూతుడవు. నీవు అజ్ఞానులకు అహంకారులకు అందవు. కపటమెరుగని అమాయక భక్తులంటే నీకెంతో ప్రేమకధా, వారిని వెన్నంటి కాచెదవు. నీ భక్తులకు లోకజ్ఞానమును ఆత్మజ్ఞానమునొసగెదవు. వారి ఇహపర సౌఖ్యముల బాధ్యత నీదేకదా! హే భక్తజన చింతామణి, కామధేనూ శరణు శరణు. నీ నిజ తత్వమెరుగని అజ్ఞానులు దైవమునెన్నడూ గాంచలేరు, వారు స్వహితమునెరుగలేరు. హే దీనబంధూ, దయాసింధు మాపై కరుణజూపుము, మా జ్ఞాననేత్రముల తెరిపించుము. సదా నీమార్గమున చరించు శక్తియుక్తుల ప్రసాదించుము. హే కోటిసూర్య తోజో ప్రకాశమా నీ నిజరూపమెరుగ కున్నాను , ఈ నీ దాసుని కరుణించి స్వస్వరూపము ప్రకటింపుము. నా నిజరూపమును దర్శించు శక్తి నొసగుము. ఆత్మసాక్షాత్కార వరము ప్రసాదింపుము. ు హే సమర్ధసద్గురు సాయిదేవా శరణు శరణు.హే సచ్చిదానంద సద్గురూ ఏ క్షణంలో ఈ ధుని వెలిగించినావో? నేటికిని సదా మండుతూనే వుంది, భక్తజనుల పాపములు హరింపబడుతూనే యున్నాయి. నిను శరణుకోరిన ఈ దీనుని దురితమలు ఆ పావన నిత్యాగ్నిలో భస్మమై పోనిండు. పరిశుద్ధాత్మ సాయినాథా ఈ దాసుని కలుషముల హరించి ు నీ నిత్యానందసాగరంలో లయింపుము. శరణు శరణు సాయినాథా నీకివే శతకోటి ప్రణామములు. శ్రీ సాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!
ఈశోపనిషత్తు మూలార్థము. అగోచరమైన బ్రహ్మము పరిపూర్ణము. దృగ్గోచరమైన ఈలోకము పరిపూర్ణము. ఆ పరిపూర్ణ బ్రహ్మమునుండి ఈ పరిపూర్ణ లోకము ఉధ్భవించినది. పూర్ణమునుండి పూర్ణముద్భవించినను మిగిలేది పరిపూర్ణబ్రహ్మమే. క్షణభంగురమైన ఈ జగత్తులో శాశ్వితముగానిదంతయు ఈశ్వరునిచే ఆవరింపబడి యున్నది. ఈ లోకంలో సుఖము ననుభవించవలెనంటే త్యాగముజేసి యనుభవింపుము. (అనగా ఓ చేత్తో దైవాన్నిపట్టుకొని మరోచేత్తో లోకాన్ననుభవించాలి.) పరులధనమున కాశపడరాదు. ఈవిధంగా దైవపరంగా పనులు జేస్తూ నూరేళ్లు ఆనందమయంగా జీవించాలని కోరుకోవాలి. అలాజేస్తే కర్మకళంకము అంటుకొనదు. మరేవిధముగను వీలుపడదు. ఆత్మపరంగా జీవింపక అహంకర భావంతో తమ ఆత్మను చంపుకొని జీవిచేవారు మరణానంతరం ఘోరాంధకారంతో నిండిన రాక్షసలోకానికి పోయెదరు. ఆత్మ ఒక్కటే. అది కదలదు, కాని మనసుకన్నా వేగంగా పోవును. ఇట్లు పరుగిడుచు, ఇంద్రియాలకు పట్టుబడదు. నిశ్చలముగా నిలబడును, కాని పరుగిడు వాని నన్నింటిని అతిక్రమించును. దాని ఉనికి వలన ప్రాణులు అన్నింటినీ పోషించు సామర్ధ్యం విశ్వశక్తికి కలిగినది. అది కదులును, అదికదలదు. అది అతిదూరము, అది అతి సమీపము. అది ప్రతిదానియందు ఉన్నది, అన్నిటి వెలుపలాయున్నది. ఎవ్వడు సర్వసృష్టిని తన ఆత్మకు భిన్నం గాని దానిగ జూచునో, సర్వ సృష్టియందు తన ఆత్మను జూచునో, ఆకారణముచేత అతడు ఎవరినీ ద్వేషింపడు. సర్వ జగత్తు తన ఆత్మయేనని తెలిసికొని ఏకత్వం మాత్రం చూచువానికి మోహమెక్కడిది, దుఃఖమెక్కడిది? ఆత్మ (పరమాత్మ) స్వయంగా ప్రకటితమైనవాడు. సర్వత్ర వ్యాపించియున్నవాడు, శుద్ధుడు, దేహభావము లేనివాడు, కళంకరహితుడు, పావనుడు, పాపరహితుడు, సర్వ సాక్షి, సర్వజ్ఞుడు, అన్నిటినీ పరివేష్టించి యున్నవాడు, విశ్వశక్తులకు వారివారి బాధ్యలనప్పగించినవాడు.
అజ్ఞానము నుపాసించువారు కటిక చీకట్లోకి ప్రవేశిస్తారు. ఆత్మజ్ఞానంలేకయే తమ పాండిత్యమునకు గర్వించువారు అంతకుమించిన చీకట్లోకి పోతారు. పై జెప్పబడిన వారికి ఒక ఫలితముంటుంది, వారికి భిన్నంగా వ్యవహరించు లోకోపకార ఆత్మజ్ఞానులకు వేరొక ఫలితముంటుందని ధీమంతులు వివరింతురు. ఆత్మజ్ఞాన సిద్ధులు అజ్ఞానమనెడి మృత్యువును జయించి అమరత్వము పొందెదరు. జగత్తును బ్రహ్మముకన్న విడిగా తలచి కొలుచువారు కటికచీకట్లోనికి ప్రవేశిస్తారు. జగత్తుతో నెట్టి సంబంధములేక సమాజహితమునకు దూరంగా, స్వార్ధము, స్వానుభవాలకై తపించుచు తపముజేయు తపస్యులు మరింత అంధకారంలోకి వెళ్ళెదరు.( కావున వ్యక్తి ముక్తికి లోకహిత కార్యములు, స్వహిత ఆత్మజ్ఞానము రెండునూ అత్యావశ్యకములు. ఈ రెండు ముక్తియనే ఒకే నాణానికి రెండువైపులు ). ఈపై జెప్పబడిన విషయ జ్ఞానానుభవము కలవాడు ఒక ఫలితము పొందును, విషయజ్ఞానానుభవము లేనివాడు భిన్న ఫలితముపొందును. ( అనగా మొదటివ్యక్తి ముక్తిని రెండవవ్యక్తి మృత్యువును పొందెదరని యర్థము). హే ప్రభో, హే సమస్థ సృష్టి పోషకా నీ వదనము మిగుల తేజోవంతమై మిరుమిట్లుగొల్పుచూ, చూడశక్యము గాకయున్నది. నాయందు మిగులదయజూపి, కనికరించి నీ తేజోమయ రూపాన్ని ఉపసంహరింపుము. ఈ భక్తునికి నీ నిజరూప దర్శనాన్ననుగ్రహింపుము.హే దేవా, హే సర్వాంతర్యామి, హే జగత్పాలకా,హే భక్తజన మందారా! వీక్షింపలేని నీ ఉజ్వల ప్రకాశమువెనుకయున్న నీ నిజరూపాన్ననుగ్రహింపుము. నామ రూపములకు వెనుకదాగియున్న నా నిజస్వరూపమునెరిగించి కరుణించుము. హే భక్తసింధూ! ఈ నా తాత్కాలిక దేహం దహింపబడుగాక, ఈశ్వాస అనంతవాయువులలో కలియుగాక! హే దీనబంధూ! ఈ నీభక్తుడొనరించిన పుణ్యకార్యములనొకసారి స్మరించి తరింపజేయుము. ఓ అగ్నిదేవా! మా సుకృత ఫలాలను అనుభవించుటకు మము మంచి పథములపై కొనిపొమ్ము. మా అందరి చర్యలు నీకు తెలియును. మాలోని కపటము తొలగింపుము. మా వాక్కులతో పదే పదే నమస్కరింతుము.
ఉపనిషత్తులలోని ప్రబోధములను, తమ ఆచరణ రూపమునజూపి , యనుభవపూర్వకముగా నిర్ధారణ జేసిన సమర్ధ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ మహారాజునకు గురుపూర్ణిమ సందర్భంగా శతకోటి ప్రణామములు. విశ్వవ్యాపి సమర్ధ సాయి అందరిని రక్షించుగాక!
ReplyDelete