గోధుమలు విసరుట, వేదాంతభావము. (The significance of Saibaba grinding wheat.)
శ్రీసాయినాథాయనమః.
నేడు శ్రావణిపూర్ణమి, 1912 ఈ పవిత్ర తిధినాడు సాయిబాబా ఆశీసులతో గురుస్థానమువద్ద బాబాపాదుకలు ప్రతిష్టింపబడ్డాయి.
శ్రీసాయిసచ్చరిత్ర పావన గ్రంధంలో శ్రీసాయిబాబా తాము ద్వారకామాయిలో నివసించిన షుమారు 60 సంవత్సరముల కాలం తిరుగలిలో గోధుమలు విసిరినారని గ్రంధకర్త శ్రీహేమాడపంతు పేర్కొన్నాడు. ఇపుడు తిరుగలి, గోధుమలు, విసరుట, గోధుమపిండి వీని వెనుకనున్న వేదాంతభావమును పరిశీలించెదము. రచయిత ఈవిషయమై వేదాంతభావమును కొంతవివరించినా మరింత లోతుగా ఈ విషయమై తెలిసికొనుటకు జేసిన ప్రయత్నమే ఈ ప్రస్తుత వ్యాసరచన ముఖ్యోద్దేశము. పాఠక భక్తులు తమతమ ఆలోచనలకనుగుణంగా ఈవిషయాన్ని గ్రహించగలరు. బాబా విసరినది ముడి గోధుమలు, వాటిలో జీవమున్నది, అనుకూలపరిస్థితులలో తిరిగి మొలకెత్తి మరిన్నిగోధుమల నుత్పత్తికి కారణభూతము కాగలవు. కాని గోధుమలనొకసారి విసరి పిండిజేసిన వానిలో జీవము నశించి మొలకెత్తు పటిమ కోల్పోబడుతుంది. ఈ విషయంవెనుక దాగిన తత్వమేమిటి? ముడి గోధుమలు వ్యక్తుల అహంకారమునకు, పుణ్యపాప కర్మలకు, ఆయా కర్మఫలములకు విషయవాసనలకు, లోదాగిన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాది శత్రువులకు సంకేతము. గోధుమలు మొలకెత్తే విధంగా మనిషి తన అహంకార,కర్మఫలాల నివృత్తికై మరలమరల జన్మలెత్తవలెనని వేదాంత వివరణ. దీనికి సూచనగనే బాబా గోధుమలు విసిరారు. గోధుమ పిండిలో ఎంత శక్తిదాగుందోకాని శిరిడీ పొలిమేరల జల్లినపిమ్మట కలరాజాడ్యము తొలగినది. అనగా విసిరిన పిండి అంత శక్తి సంతరించుకొన్నదన్నమాట. ముడిగోధుమల బాబా పొలిమేరల జల్లింపనివిషయమిచట మరువరాదు. ఏ విధంగా బాబా సంకల్పము మరియు స్పర్శలచే శక్తిహీన గోధుమలు శక్తిని పొందాయో అదేవిధంగా సాయిని శరణుకోరిన ఆశ్రీతుల హృదయములలోని పై జెప్పబడిన పాపకర్మఫలాలు మున్నగు సకల దోషములు హరింపబడుటచే వారి అంతరంగములు శుద్ధినొందును. మలిన జలంలో కొన్ని చిల్లగింజల వేసిన మాలిన్యాలు అడుగునజేరి శుద్ధజలం శుభ్రమై పానయోగ్యమవుతున్న తీరున భక్తుల హృదయాలు పవిత్రమై ఆత్మప్రకాశాన్ని దర్శించు యోగ్యత ప్రాప్తిస్తుంది. అలాంటి పావన హృదయాలలోనే దైవం వసిస్తాడని మన గ్రంధాలుటంకిస్తున్నాయి. అంటే సాయి గోధుమలు విసరు నిత్య కృత్యంచే తమ భక్తుల దోషముల హరించి వారిని దైవంవైపు నడిపిస్తున్నారన్నమాట. ద్వారకామాయిలో సాయిబాబా యోగాగ్ని ధుని ప్రతిష్టించి, ముడి కట్టెల మండింపజేసి అందుండి వెడలిన మహిమల కాణాచి దివ్యవిభూతిని భక్తులకు తమ ఆశీర్వాదముగా పంచెడివారనువిషయమిచట స్మరణ యోగ్యము. ధుని విభూతి లీలలు కొల్లలు, భక్తుల యనుభవములే యిందులకు నిదర్శనము. తిరుగలిగూర్చి మరింత వివరణ చెప్పబడినది. తిరుగలి క్రింది కల్లు కర్మ, పైకల్లు భక్తి మరియు తిరుగలి పిడి జ్ఞానము. అనగా వ్యక్తులు ఫలాసక్తిలేక నిష్కామకర్మలనాచరింపవలెను, దైవంపై సదా భక్తికలిగియుండవలెను, దైవమె సర్వాధికారి లేక ' అల్లామాలిక్ ' యనే మరుపులేని యెరుక లేక జ్ఞానంతో సదా సద్గురుని, దైవాన్ని శరణు కోరవలె నన్నమాట!
శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!
Very very clear and suitable explanation and it enlights the minds of Baba's devotees.
ReplyDeleteMadhusudhana Rao, Guntur. (AP)
గతంలో ఈ అధ్యాయాన్ని అనేక సార్లు చదివినప్పటికీ ఇంతటి లోతైన విశ్లేషణ నాకు తెలియదు.
ReplyDeleteతెలుసుకున్నాక ఎంతో ఆనందాన్నిస్తోంది.
ఓం సాయిరాం.
మీవిలువైన అభిప్రాయములకు మిగుల ధన్యవాదములు. ఓంసాయిరాం.
ReplyDeleteReaders interested to share their experiences may contact or send their articles ( in English or Telugu ) to saisyam99@gmail.com. Thank you all.
ReplyDelete