అప్పడమువెనుక దాగిన వేదాంతభావము.

శ్రీసాయినాథాయనమః. శ్రీరమణ దేవాయనమః. పాఠక భక్త మహాశయులెల్లరికి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!
" నన్ను వెదుకుటకు నీవు దూరముగాని మరెచ్చటికిగాని పోనక్కరలేదు. నీ నామము నీ యాకారము విడిచినచో నీలోనేగాక యన్నిజీవులలోను , చైతన్యము లేదా యంతరాత్మయని యొకటి యుండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి, నీలోనేగాక అన్నిటిలోను నన్ను జూడుము." శ్రీ సాయిబాబా. " ఓ అర్జునా! నేను సకలభూతములయొక్క హృదయ కమలమందుండు ప్రత్యగాత్మ(Self)ను, సమస్తభూతములయొక్క ఆది మధ్యాంతములును నేనే". భగవద్గీత 10:20. క్లుప్తంగా శ్రీకృష్ణపరమాత్మ సందేశమునీవిధంగా గ్రహింపగలము,' ప్రతిమనిషి, తన దేహానికి , మనసుకు, బుద్ధికి మరియు అహంకారానికి అతీతంగా లోలోపరి పొరలలో దాగిన సత్ చిత్ ఆనంద రూప భగవంతుని ఉనికిని సాధనద్వారా గ్రహించి ఆపై ఆత్మానుభవము లేక ఆత్మసాక్షాత్కారము పొందుటయే మానవజన్మ పరమార్ధము'. తమభక్తులెల్లరు ఈ అనుభవాన్ని పొందుటకు, భగవాన్ శ్రీరమణమహర్షి ఓ చక్కని సాధనామార్గాన్ని క్రిందివిధంగా అప్పడరూపంలో సూచిస్తున్నారు. ప్రస్తుత అప్పుడపు కథ భగవాన్ శ్రీ రమణ మహర్షికి వారి దివ్యజనని అలగమ్మాళ్ కు మధ్యజరిగిన జ్ఞానసందేశము. 1914 లేక 1915 వ సంవత్సర కాలంలో భగవాన్ అరుణాచల విరూపాక్ష గుహలో తమ తల్లితో నివసించేవారు. రమణులు మంచివంట వారైనప్పటికీ ఆమె వారికై వంటజేస్తూ యుండెడిది. తరచూ మహర్షి తల్లికీవిషయమై సాయపడెడివారు. ఓ పర్యాయం వారి తల్లి అప్పడం జేస్తూ రమణుల సాయం కోరింది. ఆ సందర్భంలో సాయంజేసేబదులు అప్పడంగూర్చి తమిళ జానపదగేయ రూపంలో ఓ మంచి సందేశాన్ని ఆమెకు వినిపించారు. ఆ గేయభావాన్నిగూర్చి కొద్దిగా తెలిసికొందాము. " అప్పడాల కొన్నిచేయుటకు ప్రయత్నించు. తృప్తిగా వాటినారగించు. ఎరుక , సమాజస్పృహలేక లోకంలో సంచరించకు. సచ్చిదానందముల నెఱుక బరచు గురుని మాటపై శ్రద్ధపెట్టి ఈ చిరుసందేశాన్ని ఆలకించు. మనిషి పంచేంద్రియ దేహమనెడి క్షేత్రంలో మొలిచిన నేను లేక అహంకారమనెడి మినుముల పట్టుకురమ్ము. ' నేనెవరిని ' యనెడి విచారణ తిరుగలిలొ ఆ అహమనెడి మినుముల విసరి చక్కని మెత్తని పిండి జేయుము. ఆ పిండిలో జ్ఞానుల సాంగత్యమనెడి నల్లేరు రసము, మనో నిగ్రహమనెడి జీలకఱ్ఱ, ఇంద్రియ నిగ్రహమనెడి మిరియాల పొడి, వైరాగ్యమనెడి ఉప్పు, సద్వాసనలనెడి ఇంగువ వేసి చక్కని ముద్దజేయుము. పిమ్మట హృదయకుహరమనెడి రోటిలో పైన సిద్ధపరచిన పిండినుంచి అంతర్ముఖచిత్త మనెడి రోకటితో నేనునేననెడి ఆ యహమును గట్టిపాటి పోటులతో కూటుము/మెత్తబరుచుము. ఆలా తయారైన అప్పుడపు ముద్దను తన నిజరూపమనెడి అప్పుడపు పీటపై మౌనమనెడి అప్పడాలకర్రనుపయోగించి చక్కని గుండ్రని అప్పడముల సంతోషంతో అలుపెరుగక పెక్కుజేయుము.ఇపుడు ఆ అప్పడమును జ్ఞానమనెడి అగ్నిచే వేడెక్కిన అనంత మౌన దీక్షయను లోతైన పెనమున బ్రహ్మయనెడి నేతియందు బాగుగ వేయించవలె. ఇలా జేయ 'నేను నేననెడి' అహంకారము హరింపబడి తన నిజరూపమైన శుద్ధాత్మ లో లయమవుతుంది . అనగా అహంకారి ఆత్మజ్ఞానిగా పరిణితి చెందినాడన్నమాట. అంటే అహంకారమే తానుగా భావించిన సాధారణ మానవుడు నిరంతర సాధనాప్రక్రియలచే తనలో దాగిన శ్రీకృష్ణరూప శుద్ధాత్మలో లయమవుతాడన్నమాట! అలాజేసిన ఆత్మానుభవ అప్పడముల ు తాము తింటూ అందరికీ పంచమను దివ్య సందేశాన్ని వారి మాతృమూర్తి నెపంగా భక్తులెల్లరకుఅందిస్తున్నారు ంుు భగవానులు. భగవాన్ రమణుల బాట/బోధ నెంత మహత్తరమైనది. సద్గురుదేవుల కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! జై సాయినాథాయనమః! జై రమణదేవాయనమః!

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)