సద్గురువు-ఓవర్ డ్రాఫ్ట్.

శ్రీసాయినాథాయనమః. పాఠక భక్తులెల్లరకు విజయదశమి శుభాకాంక్షలు, సాయిబాబా ఆశీసులు!
సద్గురువు అలౌకిక బ్రహ్మజ్ఞానానికి, దైవత్వానికి ప్రతీక; ఓవర్ డ్రాఫ్ట్ లౌకిక డబ్బువ్యవహారాలకు సంబంధించిన అంశము. ఈ రెండూ ఉత్తర దక్షిణ ధృవాలలా, నీరూ నిప్పులా పరస్పరం వ్యతిరేక విషయాలు. మరీ రెంటికి సమన్వయమెలా కుదురుతుంది యనే సందేహం సాధారణంగా కలుగుతుంది. ఈ క్రిందటి వివరణ పరిశీలించిన పిమ్మట అసలు విషయం బోధపడగలదు. సద్గురువు సాక్షాత్తు దైవ స్వరూపుడు, భక్తులపట్ల వాని అవ్యాజ కరుణయే ఇచట పేర్కొనబడిన ఓవర్ డ్రాఫ్టు. ఈ విషయమై పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారిలా వచించారు, "సిరిసంపదలు తాను ఆర్జించిన పుణ్యం ధర్మం వల్లనే సంక్రమిస్తాయి. అది బ్యాంకు బ్యాలన్స్ లాంటిది. తానేమీ ఇవ్వకుండా, దానధర్మాలు చేయకుండా అవినీకు ప్రసాదించమని బాబాను కోరడం చిత్రాతిచిత్రం. ఈశ్వర సహాయం ఎప్పుడు? మనము ఇతరులకు సహాయ పడ్డప్పుడు మాత్రమే! సిరిసంపదలు కేవలం సుఖాలకు వెచ్చిస్తే అవి వ్యర్ధమే. అయినా అట్టి గత పుణ్యం లేకపోయినా, బాబాను ఆశ్రయించాము కనుక తిండికీ,గుడ్డకు ఓవర్ డ్రాఫ్ట్ శాంక్షన్ చేయించి, కరుణించటము ఆ ప్రేమమూర్తి అపార కరుణకు నిదర్శనము. " తమ ఖజానా నిండుగా పొంగిపొరలుచున్నదని సుపుత్రులు బండ్లపై తీసికెళ్లాలని బాబాయే ఓమారన్నారు. ఆధ్యాత్మిక ధనమే వారి ఖజానా! పిండికొద్ది రొట్టె. పుణ్యం కొద్ది సంపద, యనేది పెద్దల వాక్యం. ఆపేక్షతో, కోర్కెతో జేసే ప్రతికర్మ తప్పక ఫలితాన్నిస్తుంది. మంచిగాని చెడుగాని జరగడం ఆయా కర్మల ఫలితమే! అలా చేసెడి కర్మలన్నీ వ్యక్తిని కర్మవలయంలోకి నెట్టు తాయి. కేవలము ఫలాపేక్షలేక చేసెడి కర్మలే వ్యక్తిని బంధింపవు. ఇదియే సూక్ష్మంగా భగవద్గీతలో చెప్పబడిన కర్మసిద్ధాంతం. స్వామి వివేకానంద. మహాత్మాగాంధీ లాంటి అతికొద్దిమందిమాత్రమే ఫలాపేక్షలేక బహుజన సమాజసేవ జేసిన కర్మయోగులు, కారణజన్ములు. జన్మించిన ప్రతిజీవి శారీరకంగాగాని, మానసికంగాగాని సతతతం కర్మజేస్తూనే యుంటుందని, వేరొక అవకాశంలేదని , కర్మలే జీవుల బంధిస్తాయి, ఆ కర్మలే మనిషికి మోక్షాన్ని కూడ ప్రసాదిస్తాయనెడిది శ్రీకృష్ణపరమాత్మ గీతాసందేశము. నేను నేనను భావంతో, నేనే జేస్తున్నానను అహంకారంతో, చేయుపనులకు తానే కర్తగా తలచు అజ్ఞానంతో కూడిన కర్మలు బంధకాలు, నడిపించేది దైవం, నటించేది తానుగా తలచి జేసెడి కర్మలద్వారా ఎలాంటి సంకెళ్లను మనిషి సృష్టించుకోడు. కృష్ణార్పణం, అల్లా మాలిక్ గా తలచి జేసెడి పనులన్నీ ఈ కోవకు జెందుతాయి. స్వార్ధపూరిత సమాజంలో అజ్ఞానజనిత కర్మలు జేసెడివారే అత్యధికం. మరి వారికి మార్గమేది? అలాంటి వారికి మార్గదర్శిగానే సద్గురువులు అవతరించి మానవాళిని ఉన్నతమార్గాల నడిపించి వారిని కర్మసంకెళ్లనుండి ముక్తులజేస్తారు. దైవము లేక సద్గురువు ను శరణాగతి వేడక తానే కర్తగా దలచి జేయుపనుల ఫలితాలకు ఆ వ్యక్తే కారణము. ఆ మంచిచెడుల ఫలితాల బరువును ఆ మనిషే స్వయంగా భరించాల్సి యుంటుంది. ఇలాంటి వ్యక్తి విషయంలో కర్మసిద్ధాంతం ( లా అఫ్ కర్మ / law of karma ) నూటికి నూరుపాళ్లు పనిజేస్తుంది. మంచి జరిగితే మంచిదే గాని, చెడుజరిగితే మార్గమేది? ఈ సందర్భంలోనే సద్గురుని సర్వస్యశరణాగతి అత్యావశ్యకము. శరణుకోరిన వ్యక్తుల మోయలేని బరువును తాను మోస్తాడు, వారికర్మఫలముల తాను స్వీకరిస్తాడు. వారిని కర్మ బరువులనుండి, బంధములనుండి విమోచనం కల్గిస్తాడు. అందుకేనేమో సాయి తమను జేరిన ప్రతిపైసాను శుద్ధిజేసి దైవానికి లెక్కజెప్పవలెననెడి వారు. గురుని శరణువేడిన భక్తులకు law of karma వర్తించదు. వారిపై వేరొక సిద్ధాంతం పనిజేస్తుంది, అదియే law of Compassion లేక కారుణ్యయోగ సిద్ధాంతము. సద్గురుని కారుణ్యం భక్తుని గొడుగులా, రక్షణ కవచంలా కాపాడుతుంది. Ref: Satsangh talks by Guruji Sri.C.B.Sathapathi.
శ్రీసాయిసచ్చరిత్రములోని, శ్రీగురుచరిత్రలోని భక్తుల కథలన్నియు సద్గురు కారుణ్యయోగ గాథలే! విజయదశమి శుభసందర్భమున సద్గురు రక్షణ పొందిన కొందరి భక్తుల కథల నిచట స్మరించుకొనెదము. భీమాజీ పాటీలు క్షయరోగి. సాయిబాబాను శరణువేడగా రెండుకలల రూపంలో కర్మనశింపజేసి వాని రోగముక్తుని జేశారు బాబా. దాము అన్నాకు సంతానం కలుగలేదు, గ్రహాలు ప్రతికూలంగా నడుస్తున్నాయని జ్యోతిష్యులు జెప్పుటచే సాయిని ఆశ్రయించాడు. బాబా అనుగ్రహబలం గ్రహబలాన్ని జయించుటచే వానికి పెక్కు సంతానం కలిగింది. ఇదే విధంగా నాందేడు ధనవంతుడు రతన్ జీ వాడియా కు బిడ్డలులేరు, సాయి వానినుండి కొద్దిపాటి దక్షిణపొంది పుత్రసంతానం ప్రసాదించాడు. డాక్టరు పిళ్లే గినియా పురుగుల బాధచే మిగుల పీడితుడు. భరింపలేని బాధను పదిజన్మలకు పంచవలసిందిగా ప్రార్ధిస్తూ సాయి నీడజేరాడు. బాబా దయతో పదిజన్మల బాధ పదిరోజులలోనే సమసిపోయినది. శ్రీమతి సావిత్రీబాయి తెండూల్కర్ పుత్రుడు గ్రహస్థితి వ్యతిరేకమవుటచే తనకు వైద్యవిద్యకు ప్రవేశం రాదని తలచాడు, సాయి మాత దయచే అదే సంవత్సరం వానికి ప్రవేశం లభించింది. పేదవాడైన చోల్కరునకు ప్రభుత్వ ఉద్యోగ యోగంలేదు, తేనీటిలో పంచదార మాని సాయిని శరణుకోరి ఉద్యోగభాగ్యం పొందాడు. విషసర్పం కాటేయ, విఠలుని కాదని సాయిని సాయంకోరాడు శ్యామాయనే భక్తుడు. తన మాటే మంత్రంగా వాని విషం విరిచాడు సాయిదేవుడు. అన్నార్తులకు కన్నతల్లిలా అన్నం వండివడ్డించాడు సాయిబాబా. తన సంస్కృత పాండిత్యానికి గర్వపడే భక్తునికి గీతశ్లోకార్థము బోధించి వానికి జ్ఞానబోధజేసాడు సాయినాథుడు. కర్మఫలంచే మేకలుగా జన్మించారుగతజన్మలోని అన్నదమ్ములు. ఋణానుబంధంచే సమీపించిన ఆ రెండుమేకలకు మిగుల ఆదరించి తిండిపెట్టారు జన్మజన్మల బాంధవుడు. విసిరిన గోధుమల పిండి పొలిమేరల జల్లించి శిరిడీ వాసుల సామూహిక కర్మనశింపజేసి, ప్లేగువ్యాధినుండి వారల రక్షించాడు శిరిడీ దైవము. ఎచటో కొలిమి మంటలో జారిపడిన బిడ్డను లాగి తనచేతిని కాల్చుకున్న కరుణామయుడు సాయినాథుడు. ప్లేగువ్యాధి సోకిన బిడ్డను రక్షింపమని శరణుకోరినది సాయిమాతను ఓ తల్లి. క్షణాల నాలుగు ప్లేగుబొబ్బలను తమ దేహంపై జూపి ఆ బిడ్డ వ్యాధిబాధ దూరంజేసాడు దీనబంధు. ఆకాశంలోని తారల లెక్కింపగలముగాని సాయి భక్తరక్షణా లీలల వర్ణింపసాధ్యమా మనలకు? ఈ విషయమై శ్రీగురుచరిత్రలో ఓ ఘనమైన ఉదాహరణ గలదు. సావిత్రి యనెడి భక్తురాలి భర్తమరణింప ఆ దీనురాలు తీవ్ర వ్యధతో దత్తావతార మూర్తి శ్రీనృసింహస్వామిని శరణువేడ, ఆ దయామయుడు చనిపోయిన ఆ వ్యక్తి రాబోవు జన్మలోని 30 సంవత్సరముల ఆయుషును ప్రస్తుతజన్మకుమార్చి వానికి ప్రాణం పోసాడు. సాయిబాబా రక్షణా కార్యం ద్వారకామాయిలో మండే ధునిలా నిరంతరం కొనసాగుతుంది. తెలిసిన ఓ భక్తురాలి యనుభవంతో ప్రస్తుత వ్యాసం ముగిస్తాను. స్థలం విజయవాడ. ఆమె వృద్ధురాలు, భర్త మరణించాడు. పెండ్లీడు వచ్చిన కుమార్తె . అమ్మాయి విద్యావంతురాలైనప్పటికి పెద్దగా ధనంలేకపోవుటచే వివాహం ఆలస్యమవుతుంది. ఓ శుభదినాన ఆ అమ్మాయి తల్లి సమీప బాబామందిరానికి వెళ్లి సాయికి తన గాధను/బాధను వివరిస్తూ హృదయం పగిలేలా రోదించింది. సాయి తల్లి మనసు ద్రవించింది. ఒక వారంలోపే మంచి సంబంధం లభించింది. ఆ అబ్బాయి అమెరికాలో మంచి ఉద్యోగం జేస్తున్నాడు, సెలవులేకపోవుటచే పెళ్ళిజేసుకొని వెంటనే వెళ్లాలనే సంకల్పంతో వచ్చాడు. బంధుమిత్రుల సాయంతో కుమార్తె పెళ్లిని తానే నమ్మలేని స్థితిలో జరిపించిందాతల్లి. కొలదికాలంలోనే అమెరికా వచ్చి స్థిరపడిందాబిడ్డ. అంతా సాయి కరుణయే అంటుందాయమ్మ. తమను శరణుకోరిన భక్తుల కర్మఫలాల, కర్మ బలాల బాబా యెలాధ్వంసం జేసేవారో భావన కందిన పరిధిలో తెలిసికొనుటకు ప్రయత్నించెదము. భక్తుల పాపాల గాల్చుటకై ు ధుని స్థాపించామన్నారు బాబా. ధౌతి, ఖండయోగ క్రియలద్వారా తమను శుద్ధిపరచుకొనేవారని వారిచరిత్రలో జెప్పబడినది. భక్తుల వ్యాధుల బాధల స్వయంగా యనుభవించారు. తాత్యా రక్షణకై తమ ప్రాణాల నర్పించారనేది పెక్కు భక్తుల విశ్వాసము. సమర్ధ సద్గురు శ్రీ సాయినాథులు అనంతకోటి బ్రహ్మాండ నాయకులు! అనంత వ్యాపకులు! అనంత శక్తిమంతులు! సర్వజ్ఞులు! భక్తజన చింతామణి! ఆశ్రీత కల్పవృక్షము! మహామహితాత్ముడు. నిలువెత్తుమానవతామూర్తి! ఈ పవిత్ర విజయదశమి శుభ పర్వదినాన అనంత కరుణాసాగరునికి సహస్రకోటి హృదయ సుమాంజలుల నర్పించుటకంటే మన మేమివ్వగలము? సాయిదేవులు నిత్యసత్యులు, వారుజూపిన గురుసేవామార్గం మానవులందరికీ సదా ఆచరణయోగ్యము. వారు వేసిన, నేర్పిన బాటలో కొంతవరకైనా పయనించగలిగిన జన్మ సాఫల్యము కాగలదనెడిది ప్రగాఢ విశ్వాసము. ఇదే సద్గునిపట్ల జూపవలసిన కనీస కృతజ్ఞత! శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!

Comments

  1. Readers interested to share their experiences may contact or send their articles ( in English or Telugu ) to saisyam99@gmail.com.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

అధ్యాత్మరామాయణము : అహల్యస్థుతి.