మహామానవతామూర్తి శ్రీసాయిబాబా !

శ్రీసాయినాథాయనమః.
ముందుమాట. 1990-98 ప్రాంతంలో ఉద్యోగపరంగా ప్రయాణనిమిత్తమై తరచు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్ళేవాణ్ణి. అచటనున్న అన్నిరకాల స్టాల్ల్స్ లో శిరిడీసాయి బుక్ స్టాల్ నన్నెంతో ఆకర్షించేది. స్టాల్ అనడంకంటే ఓ చిన్న బాబాగుడి అంటే బాగుంటుందేమో! షాప్ వెలుపల ఓ పెద్ద బాబా ఫోటో, లోపల అనేక బాబా చిత్రపటాలు, అగరువత్తుల పరిమళాలు, చిన్న చిన్నదీపాల వెలుగు వరుసలు. అచటనున్న కాసేపు స్టేషన్ అనే భావమేమాత్రం కలిగేదికాదు. షాప్ యజమాని సుమారు 55 యేండ్లు పైబడిన పెద్దాయన. పొడుగాటి గెడ్డం, వ్యాపార దృష్టిలేని వ్యవహారశైలి, హృదయమంతా సాయిని నింపిన భక్తిభావం. ఆయన్ను చూడగానే చాల గౌరవభావం కలిగేది. తరచుగా కలియుటచే, చొరవతో ఓ పర్యాయం బాబాపట్ల అలాంటి భక్తిశ్రద్ధ లెలా కలిగాయని కుతూహలంతో ప్రశ్నించాను. క్లుప్తంగా తన యనుభవమిలా చెప్పాడు. తాను కేరళనుండి వచ్చానని , మొదట్లో కమ్యూనిస్టు పార్టీ భావజాలం నింపుకున్న పరామనాస్తికుడనని, కాని బాబాగురించి విన్నాక, చదివాక మరియు స్వానుభవంతో బాబాను తన యాలోచనలకు అతిదగ్గరైన మానవతావాదిగా గ్రహించానని క్రమంగా సాయిబాబా జీవితం, తనపై పెను ప్రభావం చూపిందని, సాయిలోని అత్త్యుత్తమ మానవతా లక్షణాలే తనను సాయి వైపు నడిపించాయని యెంతో గంభీర వదనంతో తన గత స్మృతులలోనికి నడిపించాడు. సాయి బాబానే అసలైన దైవంగా తానునమ్ముతానని పరిపూర్ణవిశ్వాసంతో నొక్కిచెప్పాడు. చాల ఆశ్చర్యకర విషయమనిపించింది. అంటే ప్రధమంగా బాబా వానిపై మానవతావాదిగా ప్రభావముజూపి తన మార్గంలోకి వాని జీవనగమనం మరల్చాడన్నమాట! ఇది అసాధారణ విషయంగా తోచింది.
సాయిబాబా భూతలంపై నడయాడిన మానుషరూప దైవమని ఎందరొ భక్తుల ప్రగాఢ విశ్వాసం. బాబాయనెడి బంగారునాణానికి ఓ వైపు సర్వజ్ఞత, సర్వవ్యాపకత, సర్వశక్తిమంతము లాంటి దైవలక్షణాలు; రెండవ పక్క పరిపూర్ణ కారుణ్యత, నిరాడంబరత, తోటి వారిపట్ల సమత,మమత, సహాయత , నిరహంకారత, అణుకువ మున్నగు పెక్కు మానవీయ లక్షణాలు సమంగా నిండియున్నాయి. సాయిని దైవంగా అంగీకరింపనివారు సయితం వారి అత్త్యుత్తమ జీవనవిధానమునుండి పెక్కువిషయముల గ్రహించి తమతమ జీవితాలను పునీతం జేసుకోగలరు. శ్రీసాయి సచ్చరిత్రలో వివరింపబడిన సాయిబాబా నిత్యజీవన విధానం భక్తులకు గొప్ప ప్రబోధామృతము. వారి చరిత్రలోని కొన్ని మణిపూసల స్మరించుట, సేకరించుట పాఠకుల మనందరికి మిగుల శ్రేయోదాయకముగదా! విపులంగా వ్రాయడంచే ప్రస్తుత వ్యాసం నిడివి పెరిగినది. మీ విలువైన సమయానికి, ఓరిమికి మిగుల ధన్యవాదములు.
" వారి చర్యలు, సామాన్య సంభాషణలే మనకు మౌనప్రబోధములు. శాంతి,క్షమ,వైరాగ్యము,దానము,ధర్మము, మనోదేహములను స్వాధీనమందుంచుకొనుట, అహంకారము లేకుండుట మున్నగు శుభలక్షణములను వారి ఆచరణలో చూచి, భక్తులు నేర్చుకొందురు. వారి పావనచరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును. " శ్రీసాయిసచ్చరిత్రము: 8-70. సాయిబాబా తోటివారిపట్ల మిగుల ప్రేమాభిమానముల జూపెడివారు. ఒక్కొక్కప్పుడు సన్నిహితభక్తులతోకలసి టాంగాలో రహతాలోని కుశాల్ చందునింటికి వెళ్లి వాని యోగక్షేమముల విచారించెడివారు. ఫకీరునే రాజుజేయగల సాయి శిరిడీలో భక్తుల యిండ్ల భిక్షను గ్రహించేవారు, ఇది వారి నిరాడంబరత, నిరహంకారములు గావా? నిరభిమానము వారి ధనము. ఆకలితో సమీపించి సాయమడిగినవానికి భోజనం పెట్టడం అందరికీ సాధ్యపడేవిషయంకాదు. ఇదే మూగజీవుల విషయమైతే చెప్పేనవసరమేలేదు. కాని మూగజీవులపట్ల సాయిజూపెడి దయ మాటలకందని విషయం. కుక్క ఆకలిని, గుర్రపువంటిమీది వాతను, జీవజంతువుల బాధలను వారి కారుణ్యం స్పృశించేది. అందరిలో నేనున్నాను, అందరి బాధలు నావే యని యంటుండేవారు బాబా. ఇది కేవలం మాటవరసకనెడి మాటకాదు. ఎక్కోడో దూరాన కొలిమిలో పడబోయిన బిడ్డను రక్షించుటకై ద్వారకామాయి ధునిలో తమ చేతిని కాల్చుకున్నారు. ఖాపర్డే బిడ్డ ప్లేగు వ్యాధిని తమదేహంపైకి స్వీకరించారు. ఈ సందర్భాలలో కరుణామయుడైన జీసస్ కారుణ్యం బాబా చర్యలలో ప్రతిబింబిస్తుంది.
సాయి స్వయంగా వంటజేసి యచటివారలకు బహుతృప్తిగా భోజనం పెట్టేవారు. ధనికులు దరిద్రులు ఒకేవరుసన భోంచేసేవారు. సోమరితనమనేది వారి చరిత్ర పుటలలో యెచ్చటా మచ్చుకైనను కనిపించదు. పగటిపూట ఎన్నడూ కునుకుతీసెరుగరు, కనీసం గోడనుకూడ తాకకుండ దూరంగా కూర్చునేవారు. పదునాలుగేండ్లు తాత్యా మహాల్సాపతులతోటి అతి సామాన్యునిలా నిదురించారు. మతవిశ్వాసాల బేధాలచే నిత్యం పోరాడే లోకంలో రాము,రహీములను సమంగా సేవిచారు సాయి. సమత మమతల పరాకాష్ట వారిజీవనం. తోటివానిని ఈసడించుకొనే నేటి రోజుల్లో ప్రతిజీవిలోను దైవాన్ని దర్శించేవారు బాబా. స్నేహితులు విరోధులు, కలిమిలేములు వారికి సమానము. కీర్తి,ధనము,నిరభిమానము,జ్ఞానము,మహిమ,ఔదార్యము మున్నగు దైవలక్షణములు వారిలో పుష్కలంగా విరాజిల్లినా, బానిసలకు బానిసగా, ఋణగ్రస్తునిగా తనను తాను తగ్గించుకున్నారు. గద్దెపట్ల ఎలాంటి మక్కువలేదు. నానావళికై తమ గద్దె దిగారు. భగవంతుడే యజమానని సదా 'అల్లా మాలిక్' మంత్రాన్ని స్మరించేవారు. వామనుడెంత పొట్టివాడైతేనేమి ముల్లోకాలనాక్రమించలేదా? జిహ్వ చాపల్యం బహుసాధారణ బలహీనత , నాలుక బహురుచుల కోరుకొంటుంది. కాని నాలుక కోరే రుచులపట్ల సాయి కెలాంటి అభిరుచి లేదు. వ్యక్తి మనసుకున్న ఆరు ప్రబల శత్రువులలో కామము బహు బలీయమైనది. కాని బ్రహ్మచర్య విషయమున హనుమంతుని వంటివారు సాయిబాబా. తనకోపమె తన శతృవనెడిది సామాన్యనానుడి, కాని సాయి కోపం తల్లికోపంలాంటిది, అది బిడ్డక్షేమం కొరకే! సాయి కోపం చే ఎందరో రక్షింపబడ్డారు, కొందరు మృత్యుముఖంనుండి బయటబడ్డారు. కోపం ఎదుటివానికి శ్రేయసుగూర్చితే మంచిదే గాని విపరీతమైతే మిగుల అనర్ధమే!ఉరగళ్ల నురగళ్ల ప్రవాహంతో సాగరంలో సంగమించే నదీనదాలు ు తమ యునికి కోల్పోయినటుల సాయి అంతరంగంలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలగు సర్వసాధారణ మానవ బలహీనతలు తమ రూపుకోల్పోయాయి. వారి ప్రేమ మిగుల నిష్కల్మషం. వారి అంతరంగం తుడిచిన మెరిసే అద్దం . ఎలాంటి కల్మషాలు లేనిది. అమాయకపు భక్తుడు డాక్టరు పండిట్ చే చందనసేవ చేయించుకున్నారు, కాని మక్కాయాత్రజేశాననే అహంకారంతో జూడవచ్చిన హాజి సిద్దిఖ్ ని నిరాదరించారు. హాజి మనసుమారిన పిమ్మటే ఆదరించారు. అలాంటి నిష్కల్మష హృదయాన్నే అందరినుండి సాయి కోరుకొంటున్నారు.
సాయిబాబా సాధనారహస్యాలు మిగుల నిగూఢములైనను, బాబా మహా తపఃసంపన్నులు. వారిపుణ్యరాశి యమోఘము. వారి తపఃశక్తిచే ఆశ్రీతులరక్షణ గావించేవారు. తీవ్ర తుఫాను నుండి శిరిడీ ప్రజల రక్షించారు, ధుని మంటలను మాటలతో, సటకా దెబ్బలచే చల్లబరచారు. ధనవంతులు, శక్తివంతులు అటులనే తమ ఆశ్రీతుల నాదరించవలెననెడిది సాయి సందేశం. మాయామోహాలకు బహుదూరుడైనను మాయ తనను పీడిస్తుందని, హరినామస్మరణయే దానికి విరుగుడని అతి సాధారణ మానవునిలా మాట్లాడేవారు. తమనుచూడవచ్చినవారలనుండి దక్షిణ స్వీకరించి మరల అదంతయు పంచి ప్రజల్లో దానధర్మాల ప్రోత్సహించేవారు. అందరు ఆనందమయజీవితం గడపాలని రామనవమి లాంటి పండుగలను చావడి ఉత్సవములాంటి వేడుకలను జరిపించేవారు. సాయి వస్త్రధారణే వారి నిరాడంబరతకు బాహ్యసంకేతం. ఆడంబర అలంకార వస్త్రధారణచే హరికథ జెప్పుటకై వెడలెడి దాసగణుని దుస్తులు మాన్పించి సాధారణ దుస్తులు ధరింపజేశారు. నేటి సమాజంలో పెక్కుమందికీసూత్రం వర్తిస్తుంది. సిరిసంపదలు, అధికారం తెచ్చే అహంకారాన్ని నిరసించేవారు. వారిసన్నిధిలో రాజు పేదకు తేడాలేదు. ద్వారములు లేని ద్వారకామాయి వారి నివాస మజీదు. వారినెవరైనా ఏవేళయినా దర్శింపవచ్చును. ఈరోజుల్లో మాములు అధికారినో లేక నాయకునో కలవడమెంత కష్టము? ఎకనాథభాగవతము, ఆధ్యాత్మరామాయణము లాంటి ఆధ్యాత్మిక గ్రంథపఠనాన్ని ప్రోత్సహించి ప్రజల్లో భక్తిబీజాల నాటేవారు. ఉపనిషదాది పుస్తకపఠనం కేవలం ఆత్మశాంతికోసమేగాక నిజజీవితంలో ఆయా లక్షణాలను అన్వయించుకోవాలనేది సాయి సందేశం. కలిమిలేములతో పనిలేక ఎల్లవేళలా ఆనందంగా జీవించాలని, భగవంతుడిచ్చిన దానితో తృప్తిపొందాలనే ఈశావాస్యోపనిషత్తు బోధను కాకా దీక్షితు పనిపిల్లద్వారా దాసగణుకు బోధించారు,విచారసాగరము లాంటి గ్రంథపఠనమేగాక అందలి సందేశాన్ని ఆచరణలో చూపాలని వి.హెచ్.ఠాకూర్ అనే భక్తునికి సూచించారు.ఇచటి బాబా మాటలు మనందరికీ వర్తిస్తాయి. పరనింద పరమ పాపంగా బోధించి ఎవరిని ద్వేషించేవారు కాదు సాయి. లోకంలోని మనకలయిక ఋణానుబంధకారణమని సమీపించిన ఏ వ్యక్తిని లేక ఏ జీవిని నిరాకరించక ఋణానుబంధ సూత్రాన్ని గుర్తించి వారిని సేవించాలనేది బాబా బోధ. మందలోని రెండుమేకలను సయితం ప్రేమతో ఆదరించి తిండిపెట్టారు.ఒకరినిగూర్చి చెడు చెప్పరాదని, అనవసర వ్యాఖ్యానము జేయరాదని, నూల్కరు మరియు బాబాను విమర్శించిన పండరీపుర ప్లీడరుకు హితబోధ జేశారు. ఆ బోధ మనకుగూడ వర్తిస్తుంది. ఇతరుల సేవను ఉచితంగా పొందరాదని మరియు కూలివానికి వానిశ్రమకుమించిన ప్రతిఫలమివ్వాలని తామే అలా వ్యవహరించి చూపించారు. మూఢనమ్మకాలకెలాంటి ప్రాముఖ్యతనిచ్చేవారుకాదు సాయి. శిరిడీలో కలరాచెల రేగిన వేళ పంచాయతీవారి నిర్ణయానికి వ్యతిరేకంగా కట్టెలను కొన్నారు. కట్టెలందరికి అవసరంగదా! చిన్న చిన్న ఘటనలద్వారా బాబా బోధ వ్యక్తమయ్యెడిది. హేమాడ్ పంతు శనగల సన్నివేశంద్వారా, తినుటకు ముందు ఆ తిండి సమకూర్చిన దైవాన్ని గుర్తుంచుకోవాలనేది సాయి సందేశం. ఆశ మానవ లక్షణం. కాని అది అత్యాశగా మారగూడదు. అత్యాశకుపోయి పత్తి ధాన్య వ్యాపారములు జేయదలచిన దాము అన్నాను ఆయా పనులనుండి విరమింపజేసి పెద్ద నష్టాలనుండి కాపాడారు బాబా.పెట్టుబడుల విషయంలో అత్యాసకపోకుండుట మిగుల శ్రేయోదాయకము, ఇది అందరికి వర్తించే సత్యమే! మనుషుల జీవితఘటనల వెనుక ఓ అగోచర కర్మసూత్రం పనిజేస్తుంటుంది. అలాంటి అవగాహనలోపముచే జేసే పనులకు మనిషే బాధ్యుడౌతాడు. తన కష్టాలనుండి బయట బడుటకై ఆత్మహత్యజేయ దలచిన అంబాడేకరును, చివరినిమిషంలో ఆ నిర్ణయాన్నుండి విరమింపజేశారు. ఆత్మహత్య మహాపాతకారి! పుస్తక పఠనం ఉపయోగకరమేగాని, అది మితిమీరి చాదస్తంగా మారకూడదనే సందేశాన్ని నిత్యం విష్ణుసహస్రనామము పఠించే రామదాసి ఘటనద్వారా మనకు తెలియజేసారు సాయి. నమ్మిన దైవంపై విశ్వాసాన్ని సదా నిలుపుకోవాలి. ఈ సందేశాన్ని మేఘుని కథద్వారా మనకందించారు బాబా. శివునిపై మేఘశ్యాముని నమ్మకమును పదిరెట్లు పెంపొందించారు సాయి.
'చిత్తం శివునిపైన, భక్తి చెప్పులపైన' ఇది మన పూర్వీకుల నానుడి. ధనమాశించి భజనజేసిన మద్రాసు భక్తసమాజము వారి యనుభవముద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు బాబా. అమాయకపు యజమాని భార్యకు రామ దర్శనము కాగా, యజమాని గొప్ప స్వప్నసందేశము పొంది తుదకు బాబాను విశ్వసించాడు. 'మనసుంటే మార్గాన్ని జూపుతాడు దైవం '. వణి సప్తశృంగి పూజారి కాకాజీ వైద్య సాయిని చూడాలని మిగుల తహతహ పడ్డాడు, సమయానికి శ్యామాను పంపి వాని సంకల్పాన్ని సఫలీకృతంజేశారు సాయి. నిస్వార్ధ సేవకు నిలువెత్తు అద్దం శ్రీసాయి జీవనం. కేవలం తమ మాటలచేతను, స్పర్శచేతను,ఊది ఆకుపసరులనుపయోగించి జనుల శారీరక మానసిక బాధల తొలగించేవారు. ప్రస్తుతకాలంలోని వైద్యులెల్లరు సాయిసేవాభావాన్ని అలవరచుకుంటే సమాజానికెంతో మేలుజరుగుతుంది. ఋణము,శత్రుత్వము,హత్యలు మహాపాతకాలని వాటికి మూల్యం తప్పక చెల్లించాలని సాయి పదేపదే భక్తులకు జెప్పెడివారు. పరస్పరం వైరం పెంచుకొని ఒకరినొకరు హత్యజేసిన సోదరురులు మరుజన్మలో మేకలుగజన్మించి ఋణానుబంధంచే సాయిని సమీపించారు. మిగుల కారుణ్యంతో సాయి మేకలకు తిండిపెట్టారు. వీరభద్రప్ప చెన్నబసప్పలు ఒకరినొకరు కలహించుకొని తదుపరిజన్మలో పాము కప్పలుగా జన్మనెత్తారు. సాయి స్వయంగా జెప్పిన యీ కథలనుండి మనకెంతో మేలగు సందేశం లభిస్తుంది. సాయి మాటలను విశ్వసించి ఆచరించితే సమాజంలో హత్యలు అత్యాచారాలు, పెద్ద పెద్ద బ్యాంకు అప్పుల ఎగవేతలుండవు. గోవానుండి వచ్చిన పెద్దలలో ఒకరినుండి దక్షిణపొంది వాని రుణముక్తునిజేసారేగాని రెండవవానినెలాంటి డబ్బు యడుగలేదు. సాయి తాను గొప్పగురువునని భక్తులు తమను సేవించాలని ఎన్నడూ చెప్పలేదు. వారిగురుసేవా వృత్తాంతము జెప్పుటచే భక్తులుగూడ ఆలా సేవించాలని కేవలం సూచనమాత్రంగా సూశించారేగాని నిర్బంధించలేదు. నేటికాలగురువులకిది మిగుల ఆచరణయోగ్యముకదా! వ్యక్తులకు సిరిసంపదలు పూర్వజన్మ కర్మఫలాలచే ప్రాప్తిస్తాయి కావున యితరుల భోగ్యభాగ్యాలపట్ల అసూయ చెందరాదని,వారితో పోల్చుకోరాదనెడిది బాబా హితవాక్యము. ఈ సూత్రపాలన సామాన్యమానవులకెంతో ప్రయోజనకారి కాగలదు. పొరుగువారితో పోలిక, పోరాటాలుండవు. సాయి రాజులకు రాజైనా ఫకీరులా జీవించారుగదా! కేవలం అనుభవజ్ఞులైన మహనీయులనుండో, పెద్దలనుండో నిజం గ్రహించాలేతప్ప కేవలం పుస్తకపఠనం లేక పాండిత్యంద్వారాకాదు. ఈ సత్యం నానాసాహెబు గీతా శ్లోకార్ధవివరణ చెప్పలేనపుడు మిగుల తేటతెల్లమయింది. భక్తుల,తోటివారల విశ్వాసాన్ని ఎవరూ తృణీకరించరాదు, మహాత్ముల గూర్చి చులకనగా మాట్లాడరాదు. సపత్నేకర్, తన సహచర విద్యార్థి షేవడే, సాయిపై వాని భక్తివిశ్వాసాలను హేళనజేసి తదుపరిజీవితంలో కష్టాలపాలయ్యాడు. తుదకు పశ్చాత్తాపంతో సాయిని సేవించి సంతానం పొందాడు. బాబా జీవితంలో మరో ముఖ్యాంశం, బంధాలు, అనుబంధాలగూర్చి . ఋణానుబంధంచే తల్లిదండ్రులు, బంధుమిత్రులు,ఇరుగుపొరుగు మున్నగువారేడ్పడతారని పెద్దలమాట. కాని ప్రస్తుతకాలంలో వ్యక్తులమధ్య ప్రేమానుబంధాలు, ఆత్మీయతాభావాలు బహు సన్నగిల్లుతున్నాయి. వేదమంత్రాలమధ్య వధూవరుల ప్రమాణామాలతో జరిగే వివాహాలే చివరికంటూ నిలబడలేకపోతున్నాయి. ఈ విషయమై సాయి ఏమన్నారో చూడండి, " నేను మీ జన్మజన్మల బంధువును. మనమధ్య సంబంధం 72 యేండ్ల పురాతనం. నేను మధ్యలోవిడువక చివరివరకు వెన్నంటి నడచి మిమ్ముల గమ్యము జేర్చెదను. " అలాంటి సద్గురువుపై భక్తిభావాలు పెంపొందించుకొంటే మనుషులలో మానవత్యం మరింత వికసిస్తుందనడంలో సందేహం లేదు. ఇలా స్మరిస్తూ పోతుంటే సాయిబాబానుండి మనం గ్రహించే నిత్యజీవన పాఠాలకు అంతుండదు. చివరిగా ఓ ముఖ్యవిషయంతో ప్రస్తుత వ్యాసం ముగిస్తాను. మేలు పొందినవారిపట్ల కృతజ్ఞత కలిగియుండటం ఓ గొప్ప మానవ లక్షణము. బాయిజాబాయి కిచ్చిన మాటపై ఆమె పుత్రుడు తాత్యకై స్వయంగా బాబా తమప్రాణాల నర్పించుట సద్గురు సాయిబాబా జూపిన మహామానవలక్షణం, కృతజ్ఞతకు పరాకాష్ట. ఈ పై విషయాల దృష్ట్యా శ్రీసాయి సచ్చరిత్ర నిత్య పారాయణ మనకెంతో శ్రేయస్కరము మరియు పుణ్యప్రదము. నిరంతర సాయి లీలా శ్రవణ పఠనలచే మన జీవితాలు మిగుల ప్రభావితమౌతాయి. మన సంస్కారాలు చక్కబడతాయి. తెలియకుండకయే మానవతా పుష్పాలు వెల్లివిరుస్తాయి. వ్యక్తి మారితే సంఘమదే మారుతుంది. అదే సాయి మననుండి ఆశించే నూతనసంవత్సర గురుదక్షిణ! శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!

Comments

  1. Om Sai Ram. Very very nice narration and clear explanation.
    Madhu, Guntur.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

శ్రీసాయిసందేశామృతము 51 (Nectar of Sri Sai's message 51)

విష్ణుమాయ.