అవిధేయతా నీమూల్యమెంత?
శ్రీసాయినాథాయనమః.
దైవసన్నిధి జేరుటకు సద్గురుశరణాగతి మిగుల ఆవశ్యకము. భక్తుని భగవంతుని కళ్యాణానికి పురోహితుడు గురువని శ్రీరామకృష్ణ పరమహంస వచించారు. భగవత్ప్రాప్తికి మార్గదర్శి సహాయము తప్పనిసరియని శ్రీసాయిబాబా నొక్కివక్కాణించారు. మరి అలాంటి సద్గురుని సాయమందుటకు భక్తులకు వారిపట్ల వినయవిధేయతలు, శ్రద్ధావిశ్వాసాలు తప్పనిసరి లక్షణాలుగా యుండవలెను. సాయిబాబా శ్రద్ధా,సబూరి యను రెండునాణెముల సమర్పించి తమ గురుని సేవించారు. వారిప్రతిభకు తమ గురుసేవయే కారణమని వినయంగా వివరించారు. అదేవిధంగా పెక్కుభక్తులు సాయిని పరిపూర్ణ భక్తివిశ్వాసాలతో సేవించి బహు అనుభవాలను, సాయి రక్షణను పొందారు. ఆయా భక్తుల వివరాలే శ్రీసాయిసచ్చరిత్ర పవిత్రగ్రంధ సారాంశము. ఇందులకు విరుద్ధంగా కొందరు వ్యక్తులు తమ అజ్ఞానంచే సాయిబాబా పట్ల అవిధేయత ప్రదర్శించి పెక్కు కష్టములు కొనితెచ్చుకొన్నారు. అలాంటి కొందరి అనుభవములు నిచట
పరిశీలించెదము. తాత్యా కోతే పాటిలు బాబాకు ప్రాణసమానుడు, అట్టివాడుకూడ ఓ పర్యాయము బాబా మాటను తృణీకరించి కోపర్గామ్
వెళ్లి కష్టాల పాలైనాడు. బొంబాయినుండి ఐరోపా దేశస్తుడొకడు యేదో ఉద్దేశంతో సాయిని దర్శించాడు. కాని బాబా యనుమతి లేనికారణంగా యతడు ద్వారకామాయిలో ప్రవేశించలేకపోయాడు. తనకు జరిగిన అమర్యాదకు అసంతుష్టుడై బాబా యాజ్ఞలేక శిరిడీ విడచి మార్గమద్యంలో
తన టాంగా బోల్తాపడి మిగులగాయాలతో కోపర్గామ్ ఆసుపత్రి పాలయ్యాడు. సపత్నేకరు తనతోటి సహచర సాయిభక్తుడైన షేవడే యనువానిని, వాని గురుభక్తిని శంకించాడు. కాలక్రమంలో మొదటి భార్యను, పుత్రుని కోల్పోయి మిగుల బాధలకు లోనయ్యాడు. తుదకు పశ్చాత్తాపంతో సాయిని సేవించి బాబాయనుగ్రహమును సంతానాన్ని పొందాడు. సాయిని మహమ్మదీయునిగా తలచిన మేఘాశ్యాముడు సాయిసేవకు దూరుడయ్యాడు. తనతప్పు నెరిగి మరల ద్వారకామాయి ప్రవేశించి సాయి యనుగ్రహానికి పాత్రుడయ్యాడు. మరొక సంఘటన. [ఇది మార్చి 10, 1911న ఉదయం జరిగినది.] అప్పటి బ్రిటిషు ప్రభుత్వ కేంద్రవిభాగానికి చెందిన కమిషనరు సర్ జాన్ కర్టిస్, వాని భార్య, మరియు అహమద్నగర్ కలెక్టర్ మెక్లిన్స్ దొర,తమ వ్యక్తిగత సమస్య పరిష్కారానికై చావడివద్ద సాయిని దర్శించారు. భిక్షాటనకు వెళ్లెడి సాయి వారిని మరింత సమయం వేచియుండమని రెండుసార్లు చెప్పుటచే, సహనం కోల్పోయి సాయిమాట వినక శిరిడీ విడచి వెళ్లారు. వారు సద్గురుని పట్ల తగు విధేయతను చూపలేకపోయారు. సంతానమాశించి సాయిని దర్శించిన కమీషనరు భార్య కోరిక ఫలించలేదు.మరోకోణంలో జూస్తే సాయిబాబా నిత్యాగ్నిహోత్రుడు, అగ్గివంటి దొర. మహిమల ధునిని స్థాపించి అహోరాత్రముల మండింపజేశారు. ఇప్పటికీ అలానే నిరంతరం జ్వలిస్తూనేవుంది. సాయి పరబ్రహ్మజ్యోతీ స్వరూపుడు. వారితోటి అపహాస్యం నిప్పుతో చెలగాటం లాంటిది. ఇందులకుదాహరణంగా ఓ భక్తుని కథ ప్రాచుర్యంలోయుంది. ముక్తారామ్ యనుభక్తుడు మిగుల వినయవిధేయతలతో సాయిని సేవించాడు. కాని బాబామహాసమాధి యనంతరం తనకు తాను బాబాకు వారసునిగా తలచి ద్వారకామాయిలో సాయి కూర్చొనెడి స్థలంలో కూర్చొన సాగాడు. ఇలా ఎన్నోరోజులు గడవకముందే వానిక్రిందిభాగమంతా సూదులతో గుచ్చినటుల తీవ్ర బాధననుభవించాడు. ఆపై మిగుల రక్తస్రావమై అతిత్వరలోనే మరణించాడు. సాయిదేవులకు వారసులు లేరు. తమకు తాము సాయికి వారసులమని భ్రమించి శిష్యులమోసగించు కుహనా గురువులు సాయికృపకు దూరులవుటయేగాక తగిన శిక్షకు బాధ్యులౌదురు. ప్రస్తుతకాలంలో సయితం సాయిభక్తులుగా తలచు కొందరు సాయి జూపిన సామరస్య మార్గాన్ని పాటింపక,తమ తమ నిత్యకృత్య వ్యవహారాలలో, మందిర నిర్వహణ తదితర సేవాకార్యక్రమాలలో సహచరులపట్ల వైషమ్యాలు,రాగద్వేషాలు పెంచుకొని పెక్కు సమస్యల పాలవుచున్నారు. సాయిభక్తులు సదా జాగరూకతతో వారి నిత్యకృత్యములను, ఆచార వ్యవహారాలను సాయిబోధతో సమన్వయ పరచుకొని బాబా జూపిన చక్కని పూలబాటలో పయనించుట మిగుల శ్రేయస్కరముగదా!
శ్రీసాయి కరుణకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!
శిరిడీ లెండీవనములోని దత్తాత్రేయ మందిరమునకు సమీపానున్న శ్రీముక్తారామ్ సమాధి. ఈ సమాధికి దగ్గరగా శ్యామ్ కర్ణ (బాబాను సేవించిన గుఱ్ఱము) మరియు బాబా భక్తుడు అమీదాస్ భవానీ మెహతా సమాధులున్నాయి.
Comments
Post a Comment