శ్రీసాయిబాబ సూత్రాలు, లీలలు.

శ్రీసాయినాథాయనమః.
1)"శిరిడీ ప్రవేశమే సర్వదుఃఖపరిహారము ". శ్రీ బీ.వీ నరసింహస్వామి తన ఇద్దరు పుత్రుల మరణంతో మిగుల దుఃఖితుడై 1936 లో బాబాసమాధి దర్శించి పరమశాంతిని పొందాడు.
2)"ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశించినంతనే సుఖసంపదలనొందగలరు". ఓ డాక్టర్ మేనల్లుడు రాచకురుపునుండి ముక్తుడైనాడు. బోడస్,అంబాడేకర్,సాఠే,చోల్కర్ మున్నగు భక్తులు బాబా కృపచే మిగుల సంపదల పొందారు.
3)"ఈభౌతిక దేహానంతరము నేనప్రమత్తుడనే ".దైవం ఉనికిని శంకించే శ్రీ ఎక్కిరాల భరద్వాజ బాబా సమాధివద్ద పరిపూర్ణ శాంతిని,తృప్తిని, తగిన సమాధానాన్ని పొందాడు.
4)"నా భక్తులకు రక్షణ నా సమాధినుండే వెలువడును ". నాగేష్ అనే భక్తుడు సమాధి ప్రక్క గదిలో నిద్రించేవాడు. అప్పుడతనికి,తోటివారికి సమాధినుండి రకరకాల సంగీతం వినిపిస్తుండేది. అంతటితో వారాగదిలో నిద్రించడం మానేసారు.
5)"నా సమాధి నుండియే నా మానుష శరీరము మాట్లాడును ". బాబా మహాసమాధి అనంతరం కాకాసాహెబ్ దీక్షిత్ మిగుల వ్యాకుల హృదయుడైనాడు. ఆనందరావు పాఖాడే, శ్యామాల సందేశం ద్వారా బాబా దీక్షితును శాంతపరచాడు.
6)"నా సమాధినుండియే నేను సర్వకార్యముల నిర్వహింతును". శ్రీమతి సుశీలమ్మ అనే భక్తురాలికి సంతానము,ఆరోగ్యము,జీవనోపాధి,కర్మనివృత్తి ప్రసాదించారు.
7)"నన్నాశ్రయించినవారిని,శరణుజొచ్చినవారిని రక్షించుటయే నాకర్తవ్యము ". పాముకాటువిషంతో ద్వారకామాయిలో శరణుజొచ్చిన శ్యామాకు ప్రాణదాత సాయిబాబ.
8)"నాయందెవరికి దృష్టియో వారియందే నా కటాక్షము ". లక్ష్మీబాయి షిండే,రాధాకృష్ణ ఆయి,శ్రీమతి సీతాబాయి తార్ఖడ్,శ్రీమతి ఖాపర్డే,శ్రీమతి సావిత్రిబాయి టెండూల్కర్ మున్నగు భక్తురాండ్రపై బాబా కరుణాకటాక్షముల పరిపూర్ణముగా ప్రసరింపజేశారు.
9)"మీ భారములు నాపై పడవేయుడు,నేను మోసెదను ". బహుబాధా పీడితుడైన డాక్టర్ పిళ్లే, బాబాకృపచే పదిరోజులలో వ్యాధి ముక్తుడైనాడు. ఖాపర్డే పుత్రుని ప్లేగు వ్యాధిని తమ దేహంపై తీసుకొని బిడ్డను కాపాడాడు కరుణామయుడైన సాయిబాబ. మండుచున్న కొలిమిలో తమచేతిని కాల్చి బహుదూరానున్న బిడ్డను కాపాడారు.
10)"నా సహాయముగాని, నా సలహాగాని కోరిన తక్షణమొసంగ సంసిద్ధుడను ". బహు దూరపు జాంనేరు లో మిగుల ప్రసవ వేదన యనుభవించుచున్న నానాసాహెబ్ చాందోర్కరు బిడ్డ మైనతాయికి సరియైన సమయాన ఊదీ నందించి ప్రాణరక్షణ జేశారు సాయిబాబ.
11)"నా భక్తుల ఇంట లేమి యనుశబ్దము పొడసూపదు ". బాబా తృప్తి శాంతులతో కూడిన సుఖమయ జీవనాన్ని ప్రసాదిస్తారనేది భక్తుల యనుభవము. లేమి యనునది వారింటయుండదు.సమకాలీన అంకిత సాయి భక్తులలో శ్రీ కె.వి. రమణి ముఖ్యులు. వీరు శ్రీ షిరిడీ సాయిసంస్థానానికి విశేషంగా విరాళాలిచ్చిన అపరకుబేరులు. తమ విశేష సంపదకు శ్రీసాయిబాబా కరుణే కారణమని బహు వినయంగా విన్నవించుకొంటారు. భక్తుడు మల్సాపతిని పేదవానిగా నుంచినా యది వాని శ్రేయసునకే! తానివ్వదలచిన ఆధ్యాత్మిక సంపదను మల్సాపతికి ప్రసాదించారు బాబా. బాబాచరిత్ర యున్నంతవరకు మల్సాపతి పేరు భక్తుల మదిలో సుస్థిరంగా యుంటుందనేది జనులెరిగిన సత్యము.
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

శ్రీసాయిసందేశామృతము 51 (Nectar of Sri Sai's message 51)

విష్ణుమాయ.