నవవిధభక్తులు.
శ్రీసాయినాథాయనమః.
భగవద్గీతలో కర్మయోగము,భక్తియోగముమరియు జ్ఞానయోగముల ఆచరణద్వారా భక్తుడు భగవంతుని జేరగలడని శ్రీకృష్ణపరమాత్మ అర్జునునికి ప్రబోధించాడు. ప్రధమంగా యోగమనగానేమో పరిశీలించెదము. యోగమునకు ముందుగా వియోగమంటే ఏమిటో తెలిసికొందాము. వియోగమనగా విడిపోవుట లేక దూరమగుట మున్నగు అర్ధములు గలవు. ప్రస్తుత విషయమును ఆధ్యాత్మిక పరంగా గ్రహించుటకు ప్రయత్నించెదము. పరిపూర్ణ విశ్వచైతన్యము లేక పరమాత్మ నుండియే కోటానుకోట్ల జీవరాశులుగా ఈ సృష్టి ఆవిర్భవించినది. కావున ప్రతిప్రాణి జన్మకు ఆ పరమాత్ముని విశ్వచైతన్యమే కారణము. కాని భగవంతుని లీలేమోగాని ప్రతిజీవి తనమూలము మరచి వ్యక్తిగత అహంకారంతో జీవిస్తుంటాడు. అదే వియోగము, దుఃఖకారణము. ఆలా విడిపోయిన వ్యక్తి చైతన్యము విశ్వచైతన్యముతో ఐక్యమగుటయే యోగమనబడును. ఈ ఏకాత్మభావమును నిష్కామ కర్మల జేయుటవలనను , నిత్యానిత్య విచారణా పూర్వక జ్ఞానవిచారణలద్వారాగాని లేక విశ్వశక్తి మయమగు , పరమాత్మకు సర్వస్య శరణాగతినొంది భక్తిమార్గంలో జీవించుటవలనగాని పొందవచ్చును. అలాపొందబడిన ఫలమే మోక్షముగా మన శ్రుతులు వివరించాయి. ప్రస్తుత వ్యాసంలో భక్తిమార్గమును గూర్చి క్లుప్తంగా తెలిసికొనుటకు ప్రయత్నము జేయడమైనది. మహాభాగవతము భక్తియోగ ప్రాధాన్యతగలిగినవిఖ్యాత పురాణము. ఇదేవిధంగా సాయిభక్తులకు శ్రీసాయిసచ్చరిత్రము భాగవతసమానము. ఇందు అనేక భక్తుల అపూర్వ అనుభవములను వివరించడమైనది. ఈ పవిత్రగ్రంధములలో భక్తి తొమ్మిదివిధములైన నవవిధభక్తులుగా వర్ణించడమైనది. అవి వరుసగా శ్రవణము కీర్తనము,స్మరణము,పాదసేవనము,అర్చనము,నమస్కారము,దాస్యము,సఖ్యత్వము మరియు ఆత్మనివేదనము.
1.శ్రవణము(భగవంతుని లీలలు వినుట). పరీక్షిత్తు మహారాజు యేడు దినములు పవిత్ర భాగవత గ్రంధమువిని మోక్షముపొందాడు. విజయేంద్రుడను మదరాసి సన్యాసి బాబా ప్రేరణచే భాగవత పారాయణమొనర్చి సాయిసన్నిధిలో సద్గతి నొందాడు.
2.కీర్తనము( భగవంతుని కీర్తించుట). పురాణ ప్రసిద్ధ కీర్తనకారుడు నారద మహర్షి. ఆయన నాలుకపై నిరంతరం నారాయణ మంత్రం నాట్యమాడేది. బాబా మహిమల కీర్తనకారుడు దాసగణు మహారాజ్. వాని భక్తికి సంతసించి బాబా తమపాదముల గంగాయమునల ప్రవహింపజేశారు. దాసగణు కీర్తనలద్వారా దూరదూరములకు బాబా లీలలు వ్యాపించాయి, ఎందరెందరో భక్తులై సాయిని దర్శించారు.
3.స్మరణము(జ్ఞప్తియందుంచుకొనుట). బాల ధ్రువుడు మిగుల పట్టుదలతో నారాయణ నామ స్మరణచే తపమొనరించి శ్రీమన్నారాయణుని సాక్షాత్కరించుకొన్నాడు. నానాసాహెబ్ నిమోన్కర్ బాబా భక్తుడు. నిరంతర సాయి ధ్యానం వలన అతనికి అందరూ సాయిరూపంగానే గోచరించేవారు. తనభార్యను గూడా సాయిబాబాయని సంబోధించేవాడు. ఆమె మిగుల ఆశ్చర్య పడుతుంటే అందరిలో వున్న సాయియే ఆమెలో నున్నాడని, ఆమె ఆయన రూపమేనని చెబుతుండేవాడు.
4.పాదసేవనము(పాదసంవాహనము). ప్రహ్లాదుడు నిరంతరం నిదుర మెలకువలలో విష్ణు భగవానునర్చించి నారాయణ లోక ప్రాప్తినొందాడు. మేఘాయనే భక్తుడు సాయిని శివునిగా నిరంతరం సేవించి సాయి లో ఐక్యమైనాడు.
5.అర్చనము(పూజ). పృధుమహారాజు అహర్నిశములు శ్రీహరిని పూజించి జీవిత పరమార్ధమును పొందాడు. బాంద్రా నివాసి శ్రీమతి సావిత్రిబాయి టెండూల్కర్ మిగుల భక్తిశ్రద్ధల సాయిని సేవించి వారి పరిపూర్ణ అనుగ్రహము పొందినది. బాబా తమను చూడవచ్చిన భక్తులతో తాను గత నాలుగు మాసములు శిరిడీలో లేనని బాంద్రాలో టెండూల్కర్ గృహానికి వెళ్లామని చెప్పారు.బాబా ఎపుడూ శిరిడీని విడువని విషయం అందరికి తెలిసిన విషయమే!
6.నమస్కారము(వంగి నమస్కరించుట). లక్ష్మీదేవి నిరంతరం క్షీరసాగరశయన నారాయణుని సేవించి వానిలో లీనమైనది. రాధాకృష్ణ ఆయి సాయిని కృష్ణునిగా భావించి మిగుల భక్తిభావముల సేవించి కృతార్థురాలైనది.
7. దాస్యము(సేవ). మనోవాక్కాయ కర్మల శ్రీరాముని సేవించిన హనుమంతుడు జగమెరిగిన భక్తాగ్రగణ్యుడు. వాని రోమరోమంలో రామనామం పరిపూర్నంగా నిండియున్నది. అబ్దుల్ సాయిని మిగుల భక్తిశ్రద్ధల సేవించిన ధన్యుడు. బాబానివసించెడి మజీదును, బాబా లెండీవనానికి వెళ్లే మార్గాన్ని ఊడ్చి శుభ్రపరచేవాడు. బాబానుండి యెన్నో ఆధ్యాత్మిక రహస్యాల నెరిగిన ధన్యజీవి.బాబాను మిగుల భక్తిశ్రద్ధల సేవించిన భక్తురాలు శ్రీమతి లక్ష్మీబాయి షిండే. ఈమె బాబాకి నిత్యం రోటి మరియు కూర సమర్పిస్తుండేది. రాత్రివేళలయందు సైతము బాబాను దర్శించగల స్వేచ్ఛ పొందిన ఏకైక భక్తురాలు. బాబా ఈమెసేవకు మిగుల ప్రసన్నులై తమ చివరి క్షణాలలో నవవిధి భక్తులకు సంకేతంగా 9 వెండినాణాలను దానం జేశారు.
8. సఖ్యత్వము(స్నేహము).శ్రీకృష్ణభగవానునితో మిగుల స్నేహభావంతో మెలిగిన అర్జునుడు ఎంత పుణ్యాత్ముడోగదా. పరమాత్మ వానికి నేరుగా గీతోపదేశం చేసాడు.
బాబాతో అతి సన్నిహితంగా మెలిగిన శ్యామా (మాధవరావు దేశపాండే) జన్మము మిగుల పావనము. బాబా శ్యామా మాటకు మిగుల విలువనిచ్చేవాడు. శ్యామా బాబాతో సన్నిహిత మిత్రునిలా వ్యవహరించేవాడు. సాయి శ్యామాకెన్నో బహుమతులనిచ్చాడు. బాబానుండి విష్ణుసహస్రనామ పుస్తకాన్ని పొందాడు శ్యామా.
9. ఆత్మనివేదనము(సర్వస్వము దైవమునకర్పించుట).బలిచక్రవర్తి వామనునికి తన సర్వస్వము నర్పించి పాతాళలోకంలో నివసించసాగాడు. ఖండోబా దేవాలయపు పూజారి మహల్సాపతి సాయికి నామకరణం జేసిన ధన్యుడు. బాబాతో పదునాలుగేండ్లు మజీదులో నిదురించాడు. తన స్వర్ణకార వంశవృత్తిని మానుకొని బాబా ఆజ్ఞచే భిక్షాటన జేసేవాడు. మిగుల పేదరికంలో మగ్గినప్పటికీ యెవరినుండి ధనాన్ని స్వీకరించేవాడుకాదు. సాయిబాబా చరిత్ర వున్నంత వరకు మహల్సాపతి పేరు భక్తుల హృదయాలలో మెదులుతూనే వుంటుంది.
శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికీ శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!
Comments
Post a Comment