శ్రీసాయిబాబ చిత్రవిచిత్ర సచ్చరిత్ర!
శ్రీసాయినాథాయనమః!
"నా చరిత్ర గానమే నీకు శ్రేయస్కరము. అది ఈ భూమిపై నా అవతార కార్యం యొక్క పరిపూర్ణతే! భావయుక్తంగా నా చర్యలు,శక్తులు, గుణాలు మరియు విభూతులను గానం చేసేవారిని , నేను సంపూర్ణముగా రక్షిస్తాను. నా మాట నమ్ము విశ్వాసంతో నన్ను కీర్తించి , నా లీలలు గానం చేసేవారికి పూర్ణమైన ఆనందము శాంతి ప్రసాదిస్తాను." శ్రీసాయిబాబ.
ముందుగా పాఠక మహాశయులందరికి నా హృదయపూర్వక నమఃసుమాంజలులు. శ్రీ సాయి సచ్చరిత్ర నా నిత్యపారాయణ గ్రంధము. పెక్కుసార్లు చదివిన పిమ్మట ఓ ఆలోచన కల్గింది. అదేమన నిత్య అధ్యాయ పారాయణము చేయుటకు సమయం లేనప్పుడు కనీసం ప్రతిఅధ్యాయంలోని ఓ లీలను లేక మహిమను స్మరించుకొంటూ సుమారు గంటలోపు పూర్తి లీలా చరిత్ర సారాన్ని సింహావలోకనం జేసిన బావుండునని! ఆ ఆలోచనే నన్నీ రచనకు ప్రేరణ. చిత్రం, వెయ్యిమాటలకు సమమంటారుగావున చదివే సమయంలో లీలను స్ఫురింపజేసే చిత్రాన్ని జతచేయడమైనది. కేవలం చదవడమేగాక రాగయుక్తంగా పాడుకోదలచు భక్తులకనుగుణంగా రచనజేయడమైనది. పాఠక భక్తులకీనా ప్రయత్నమేమాత్రం తృప్తికల్గించినా అది బాబాదీవెనగా భావిస్తాను.
వినుడు వినుడు శ్రీసాయికథ,చింతలుబాపే దివ్య కథ!
పంతును చెంతకు లాగెను,తనచరితంబును పాడెను!
లీలలు కొల్లలు తారలు,జీవన సాగరదారులు.
గంగ యమునలే పారగ , సంగమతీర్ధమె పాదము,బాబ పాదము.
స్వామి సమర్థులె సాయినాథలు వారి పాదుకలుదైవవేదికలు .
జలముతొ దివ్వెలు వెలిగెను , మహిమకు వణిజులు దాసులు బాబ మహిమకు వణిజులు దాసులు.
రామరహీములుఏకముగ నవమి ఉరుసుల వేడుకయె శిరిడిలో వేడుకయె.
కొలిమిన బిడ్డను లాగెను ప్లేగు బొబ్బలనెదాల్చెను బాబ దాల్చెను.
భక్తుల బిక్షను పట్టెను వారి బాధల కర్మల బాపెను.
నైవేద్యము తార్ఖడు మరచెను ,శిరిడీలో బాబకు తెలిసెను.
పీలిక బల్లపై నిదురయె, అణుకువ నందె అణువులె పరమణువులె!
పంచభూతములె తలవంచెనులె జడివానలు మంటలు లొంగేనులే !
గురు ఘోలపుయె శాస్త్రికి , శ్రీరాముడె సాయి డాక్టరుకు.
బాధయు భారము దూరమె, పాటిలు క్షయయే క్షీణము.
దక్షిణ లందుటే రక్షణకు నాందేడు వాసికి పెక్కు బిడ్డలు.
చోల్కరుపొందెను జీవన చక్కెర, బాబా కెఱుకయె బల్లుల భాషలు.
బ్రహ్మజ్ఞానము జటిలమెగ, లోభికి అందని చంద్రమెగ!
గురుని సాయముతొ సులువుకదా, దైవకటాక్షము తప్పదుగా!
ఉపవాసమేలను దేహపీడనము? ఉపదేశమేలను ఎదుట దైవము,సాయి ఎదుటి దైవము!
గురుని కన్నుల కలిపి చూడుము, అన్యములన్యము మరచి చూడుము.
గురుని దృష్టి యది కూర్మ న్యాయము చల్లని చూపుల తల్లి పాలనము.
రాధాబాయికి బాబ సందేశము, సందేహము తీరగ ఆమెకు సుఖము.
ఋణాను బంధమె మనల కలయిక దోషములెంచుట తగదుకదా!
చిరు బీజంబున మహావృక్షము సేవిక బాలిక చెప్పె వేదము.
ఈశ చదివినా భావ మెరుగడు, పనిపిల్ల పనులలో సూక్ష్మ మెరిగెను,గణు సూక్ష్మమెరిగెను.
పుస్తక జ్ఞానమె పూర్ణము కాదు, అనుభవాచరణలు తప్పక కావలె!
నవవిధ భక్తుల పొందుటె శ్రేయము, పాటంకరు కందెను బాబజ్ఞానము!
భక్తుల ఆపద బాబ నెరుగగ , తేలుపాముల భయము యేలను ?
మిరీకర్ శక్కరు పాము గండము, బాబ అండతో తొలగె చిత్రము!
బాబ మాటయె సిద్ధమంత్రము, విషము విరిగెను శ్యామ బ్రతికెను.
గురుని ఆజ్ఞ్యయె దైవచట్టము, ఆజ్ఞపాలనయె పరమ ధర్మమని
బ్రాహ్మణ దీక్షితు నరక బోయెను, మేకను నరక బోయెను.
హాస్యమాడుట బాబ నైజము, శనగల కథతో పంతుకు పాఠము.
మనోకర్మలు దేవార్పణమన విషయవాసనలెపలుచన నిజము!
భక్త రక్షణ బాబబాధ్యతె, దాము నష్టముల సాయి కాచెను.
భార్యలిద్దరు బిడ్డలు శూన్యము ఆమ్రలీలగ బహుసంతానము.
మూర్చరోగి పితళే పుత్రుడు, భయము లేదులే కరుణకు పాత్రుడు,
బాబ కరుణకు పాత్రుడు,భయరోగ విముక్తుడు!
పాపపుణ్యముల యనుభవింపవలె , ప్రాణత్యాగము ఘోర పాపము .
సాయిదేవుల తక్షణ సాయము, అంబాడేకర్ బ్రతుకుట చిత్రము.
గ్రంథ పఠనలు సాయితొ సులువు, విష్ణునామముల శ్యామ నేర్చెను.
భక్తుల బాబా బంధమె చిత్రము, ఖాపర్డే భార్యకు రామ మంత్రము,తారక రామ మంత్రము !
లక్ష్మీచంద్ మేఘాదులు సాయి జేరిన బడా పిచ్చుకలు.
మేఘకు శివుడు సాయిదేవుడు, త్రిశూల లింగముల పొందిన ధన్యుడు.
భావమెటులనొ భాగ్య మట్లుగా, మదరాసి మహిళకు బాబ రాముడే!
సందేహపు భర్తకు స్వప్నసందేశము, సాయి శక్తికి ఆతడు వశము !
గ్రహబలిమిని మించు గురు యనుగ్రహ బలము.
తెండూల్కర్ పుత్రుని పరీక్ష విజయము.
పిలుచుచు తానే దారిచూపును, కాకజి వైద్య శిరిడి జేరెను.
శ్యామ సాయముగ శిరిడి జేరెను , సాయి చెంత బహు శాంతి పొందెను !
సద్గురు సన్నిధి మోక్షద్వారమే, సద్గతి నొందిరి సన్యాసి మేఘలట!
నూల్కరు పులియు శ్వాస విడచిరి, సాయిపాదముల ఐక్యమొందిరి.
మార్గము చూపగ మార్గదర్శియె , అడవుల దారులు వాని కెరుకయె!
సాయి మిత్రులు సత్యము నెరుగక సొంత తెలివితో దారితప్పిరి.
గురు ఆతిధ్యము సాయి తాగొని శ్రద్ధసహనముల కాసు లిచ్చిరి.
పన్నెండేళ్లుగ గురుసేవించి సద్గురు శక్తిగ రూపుదాల్చిరి.
లెక్కల చుక్కలె ఊది మహిమలు, రాగ రోగముల బాపెడి తారలు.
జాంనేరు చేరెను బండివానిగ , తాయి వేదన యూదితొ మాయము.
ప్లేగుబొబ్బలు ప్రసవ వేదనలు కడుపునొప్పులు కాలివంపులు
రాచకురుపులు దేహబాధలు త్రుటిలొ దూరము ఊది అద్దగ.
సంశయ మనసుకు స్వాస్థ్యము లేదు, లీలల జూడగ వచ్చినాడట.
విత్తులు ద్రాక్షలో మాయముకాగా భక్తుని మిత్రుడు మహిమనెఱిగెను.
దక్షిణ రూకలు రుణమిముక్తికే, కాసు ఒక్కటికి వంద నిత్తురు.
బోడస్ భక్తుడు బాబకు ప్రియుడు, లక్ష్మిపుత్రుగ మారిన ధన్యుడు.
మజీదుమాయి బాకీ కోరగ , గోవపెద్ద దక్షిణిచ్చెను.
రెండవ పెద్దకు రుణము లేదుగ, పైసలందుకే బాబా కోరడు.
నారికేళము వరప్రసాదము , సఖారాం పత్నికి సంతానము.
వింత వింతలే బాబ మహిమలు, తర్కముకందవు సాయి లీలలు!
చావడి యాత్రయే బహుసంబరము,అంబర మందే అతి కోలాహము.
చూడగ చూడగ సాయి దైవము, పాండురంగని పరమతేజము.
యాత్రను జూసిన కనులె ధన్యము, యాత్రలో నడచిన పాదము ధన్యము.
పల్లకి బోయగ మారిన పున్నెము, నడచిన దారుల, సాయినడచిన దారులపొరలుట పరము.
అన్యదానములకన్న అన్నదానమె మిన్న!సాయి చేతుల వంట, నలభీముల దంట!
చలువమజ్జిగ ద్రావి పంతు లీలలు వ్రాసె,అమృతము మనకాయె ఆదివ్యకావ్యము!
గీత చదివిన నేమి? భావమెరుగడు నాన.
బాబ కృపతో నేర్చె అహపు గ్రహణము తొలగ!
సన్యాసి వేషమున దేవుతొవిందు,పటము రూపుతొ పంతుకు అతిథి!
రూపవేషములెన్నొ సాయికి భాయి, ఊహకందని దేహమే నోయి!
జలతారు సెల్లా సాయి నివ్వగ, పరుల సాయము పీలిక సమము,
జ్ఞానేశ్వరి జ్ఞాన మెరుగడు దేవు బాబ దయతొ దీర్చె వాని సందియము.
దేహ మోహముల తానెదాటుట జూడ సీమోల్లంఘన సాయి జేసెను.
చేసిన మేలు మరువడెన్నడు బాబ, నవనాణెములిచ్చె లక్ష్మికవి వరము.
కృతజ్ఞతకు మారురూపుయె సాయి, తాత్యరక్షకై ప్రాణభిక్షనిడె.
మురళీధర దేవళమె సాయికి సాయిదేవుడె కృష్ణరూపుడు
బూటి వాడాయె బాబమందిరము, భక్తబృందములకదె బృందావనము.
నిత్యసత్యము అతి అప్రమత్తము, మొక్కినంతనె గూర్చు బహు చిత్త శాంతము!
దేహము వీడిన సూక్ష్మ రూపుడె సాయి సమాధి నుండియె అప్రమత్తుడు సాయి.
వ్యాకుల దీక్షితు శంక బాపగ చూడ పాఖాడె మరిబంపి దీర్చె సందియము.
కాశి అయోధ్యల తానె దాటుచు వేగ శ్యామకు ముందుగ గయను జేరెను.
జన్మజన్మల బంధు సాయినాథుల పొందు , సోదరమేకలకు బాబ గూర్చెను విందు!
పాముకప్పల కథయె చిత్రము, నేరము వైరము వెంటాడుట నిజము.
జన్మలు మారినా కర్మలువిడువవు. నీడలా నిత్యము వెన్నంటుట తధ్యము.
శరణాగతి యొకటె మనకు శ్రేయస్కరము, సాయి శరణాగతి యొకటె మనకు శ్రేయస్కరము!
భక్తుని, బాబను హేళనజేసి సపత్నేకర్ బహు కష్టములొందెను .
పశ్చాత్తాపము నొందుచు తానె, సాయి జేరి బహు సంతానమొందెను.
పరీక్షజేయ వచ్చిన హరి కానోబా పాద రక్షలు మాయము.
దాంభికు దలచు సాధు యూహల, బాబ నెఱుగుటదియె బహు బహు చిత్రము
అందము జూసి మోహామొందిన నానా చపలచిత్తము సాయి హస్తగతము
జీవులందరి చేతన సాయి, భక్తులందరీ ప్రాణము సాయి.
తన వైకల్యము దూరముసేయగ దీక్షితు సాయిని జేరెను.
అనుభవముల బహు తాను పొందుచు తుదకు సాయిలొ లీనమాయెను .
టెంకాయను మరచిన పుండలీకుని దోషము లెంచడు బాబకదా!
బాబతొ బహు తరములబంధము భక్త ధురంధరు జన్మయె ధన్యము !
బాబ తాగిన చిలుము పీల్చగ దూరము దూరదూరము వాని ఉబ్బసము !
సంసార సంద్రము దాటుట జటిలము, సాయి నావతో బహు సులువు కదా! !
సాయిలీలల చదువుటే పున్నెము, భాగ్యములెన్నో మనకు కదా !
సాయిలీలల నిత్యపఠనము భక్తులకెంతో మేలు కదా!
సాయితలపులతో నిత్యము నిండుట శాంతికి తృప్తికి బాటకదా!
సమర్ధసద్గురు శ్రీసాయినాథుల కరుణాకిరణాలు భక్తులందరిపై ప్రసరించుగాక! అందరికీ శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!
Comments
Post a Comment