పుస్తకజ్ఞానము - అనుభవజ్ఞానము 2.

శ్రీసాయినాథాయనమః ! శ్రీరామకృష్ణ యతీంద్రాయనమః !
(Continued from previous post).పండిట్ శశిధర్ శ్రీరామకృష్ణుల కాలంలో పేరొందిన విద్వాంసుడు, విద్యావేత్త,గొప్ప వక్త. ఇతిహాస పురాణాల బాగుగ నెరిగినవాడు. శశిధర్ శ్రీరామకృష్ణ పరమహంస పేరుప్రఖ్యాతులు నెరిగి ఓ రోజు వారిని దర్శింప దక్షిణేశ్వర్ వచ్చాడు. వాని రాకనెరిగిన పరమహంస తమను నిరక్షరాస్యునిగ తలచి పండితునితో సరిగా మాట్లాడగలనొలేదొయని శంకిచి సాయంకోసం విద్యావంతులైన కొందరి శిష్యుల చెంత నుంచుకొన్నారు.కాని పండితుని చూసిన పిమ్మట రామకృష్ణులవారి భావం చిత్రంగా మారిపోయింది, బెరుకు సంకోచాలు మాయమయ్యాయి.ఆతని మందహాసంతో ఆహ్వానించి, మీరు పండితులుగదా ఏదైనా చెప్పండంటూ ఓ విధమైన పారవస్యస్థితిలోకి వెళ్లారు. అపుడాతడిట్లన్నాడు, " అయ్యా! నా మనసంతా పొడిబారిన మెట్టవేదాంతంతో నిండిపోయినది. మీనుండి ఓ లేశ భక్తిభావానుభవము నాశించి మీ చెంతకొచ్చాను. అమృతతుల్య తమ సందేశంకోసం ఎదురుచూస్తున్నాను, దయచేసి నాకో మార్గం చూపండి." అందులకు ఉద్రేక భావంతో శ్రీరామకృష్ణులిలా బదులిచ్చారు " నేనేమి చెప్పగలను, పరబ్రహ్మతత్వాన్నెవరు వివరించగలరు? ఆరంభంలో అర్ధనారీశ్వరంలా సగం పురుషరూపముు, మరోసగం స్త్రీరూపంగ ఆవిర్భవించింది. ఆపై అవరోహణక్రమంలో పురుషుడు మరియు ప్రకృతిలా రెండు విభిన్నరూపాల దాల్చింది. ఎప్పటివరకు మనిషి తన మనసు సచ్చిదానందమయమగు పరమాత్మలో విలీనంకాదో అప్పటివరకు భగవంతుని స్మరిస్తూ, తన ప్రాపంచిక బాధ్యతలు నిర్వహించాలి. ఎప్పుడైతే మనసు భగవంతునిలో పరిపూర్ణంగా లీనమౌతుందో ఇక ఆతనికి చేయవలసిన బాధ్యతలేమీ యుండవు. ఉదాహరణగా కీర్తనకారుని విషయం చూడు. ఆరంభంలో ఆతని ధ్యాసంతా కీర్తనలోని పదజాలంపైన, శృతిలయలపైన, ఆరోహ అవరోహణ రాగాలాపనపైన కేంద్రీకృతమౌతుంది. పిదప కీర్తనలోని భక్తిభావంతో ఎపుడు మనసు తాదాత్మ్యం చెందుతుందో అపుడు వాని శ్రద్ధ పదజాల విన్యాసానికి దూరమౌతుంది. క్రమంగా మరింత భక్తిభావానికి లోనైన వాని మనసు మూగవోతుంది. నోటివెంట మాటరాని అనుభవానికి లోనౌతుంది." అలా వివరిస్తూ పరమహంస స్పృహ కోల్పోయారు. నోటినుండి మాటలాగిపోయాయి, కదలకమెదలక దేహం స్థాణు వయ్యింది. ముఖం తేజస్సుతో వెలిగిపోతుంది. ఏమాత్రం బాహ్యస్పృహ లేదు. వర్ణనకందని వారి పారవశ్యస్థితి షుమారు పదిహేను నిమిషాలపాటు కొనసాగింది. స్పృహలోకొచ్చిన పిమ్మట పండితునితో సంభాషణకొనసాగిస్తూ," పండితుడా, నీమనోగతమంతా తిలకించాను. నీవో సత్పురుషుడవు. గృహిణి వంటజేసి భర్త, బిడ్డలకు వడ్డించి స్నానానికెళుతుంది.ఆమెకు మరల వంటింట్లోకెళ్లే అవసరముండదు. ఇదేవిధంగా ఎపుడైతే నీవు భగవంతుని కీర్తిస్తూ జనులలో దైవభక్తిని విస్తరిస్తావో, నీకు మరోజన్మంటూ వుండదు. " పండిట్ శశిధర్, రామకృష్ణుల కృపకు ప్రణమిల్లాడు. మరల మరల వారిపాదధూళిని ధరించాడు. నోటివెంటమాటరాని స్థితి వానిది. తనకింకా ఆత్మానుభవం కలగనందుకు కనులవెంట ఆగని కన్నీరు. కొంతకాలం పిమ్మట రామకృష్ణులవారు తమ శిష్యులకీసంఘటన వివరిస్తూ, " శశిధర్ ను జూసిన వెంటనే అమ్మ కాళి పండితుని అంతరంగాన్ని చూపించింది. వివేకవైరాగ్యాలు లేని వేదవేదాంత పఠనాలు వ్యర్థం! అపుడు నాలోకో దివ్యశక్తి ప్రవహించి భయాన్ని పారద్రోలింది. నానుండి మాటలు ధారాళంగా వెలువడ్డాయి. నేనేమి మాట్లాడానో ఏమాత్రమెరుగను. అంతా అమ్మ మాట్లాడించింది. బాహ్యస్ప్రుహ కలిగేటప్పటికి పూర్తిగా వివశుడై కన్నీరుకార్చేటి పండితునిజూసాను." విషయసేకరణ: " శ్రీరామకృష్ణుల దివ్యలీల" స్వామి శారదానంద, స్వామి చైతన్యానంద. శ్రీసాయి సద్గురువుల కరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)