అందమైన బాబాబడి 2.

శ్రీసాయినాథాయనమః!
(Continued from the previous post). గతవ్యాసంలో సాయిబాబా బడిలో ప్రవేశించినవిధం,ఆపై బావిలో తల్లకిందులుగా వ్రేలాడి అనిర్వచనీయఆనందం పొందిన రీతిని చూసాము. ఆపై జరిగిన వివరాలనిచట గ్రహించెదము. సాయి అనుభూతి విన్న గురువు ప్రసన్నుడై వీపుతట్టి తల్లిపక్షి పిల్లపక్షిని కాపాడినవిధంగా మిగుల ప్రేమించారట. ఆ ప్రేమమయ వాతావరణంలో సాయి తమ తల్లిదండ్రుల మరచి స్వాభిమానం సయితం కోల్పోయి బాహ్యప్రపంచానుభవాలనుండి ముక్తులయ్యారట. సాయి ఇంద్రియముల శక్తియంతయు వారి కన్నులలో కేంద్రీకరించి, ఆశక్తివంత నేత్రాలతో తదేకంగా గురుని వీక్షించేవారట. గురువియోగం క్షణమాత్రం భరింపలేని విరహవేదన యనుభవించారట. గురువే సాయి ధ్యానమూర్తి. అధ్యానస్థితిలో వారి మనోబుద్ధులు మూగబోయినవట. వారిగురువులు ఇతర స్వరూప సాక్షాత్కారరహిత గురువులకు భిన్నము. ఆ పవిత్ర గురుసన్నిధిలో ఎలాంటి శ్రమలేకయే ఆత్మజ్ఞానం సాయిలో ప్రకాశించినది. కాని సాయితో బయలుదేరిన మిత్రులు తమతమ పరిమిత జ్ఞానపంజరంలో బందీలై గమ్యాన్ని చేరలేకపోయారు, వారికర్మఫలమలాంటిది.ఇంతటి ఆత్మసాక్షాత్కారానుభవం పొందటానికి సాయి చెల్లించిన గురుదక్షిణేమిటంటే రెండు పైసలేనట! అవి మాములు పైసలు కావు, వెలకట్టలేని శ్రద్ధ మరియు సహనములే ఆ పైసలు. నిద్రాహారాలు మరచి గురుపైనిలిపిన గురియే శ్రద్ధ, ఎలాంటి ఫలితమునాశింపక కాలమునే మరచి చేసిన పన్నెండేడ్ల తపస్సే సహనము లేక సబూరి. తమ బడిలో విజయవంతంగా పట్టభద్రులై సాయి జేసిన ఉద్యోగమెలాంటిది? దీనజనోద్ధరణయె వారికొలువు. బట్టలు నేసేవారట. జీవులనే సన్న నూలుపోగుల చక్కని శాలువగా జేసి తమయజమాని అనగా దైవానికి సమర్పించారట! పూర్వముజేసిన వారలకు పెక్కురెట్లు మిన్నగా కష్టించి పనిజేసారట. యజమాని మిగుల ప్రసన్నుడై అపరిమిత ఖజానా బహూకరించారట. అది ఎన్నటికీ తరగని నిధి. అంచులు పొంగిపొరలే ఆధ్యాత్మిక సంపద. ఆ బహుమూల్య సంపదను స్వార్ధరహితులై తమతమ భక్తులకు ఉదారంగా పంచడానికి మిగుల వ్యాకులపడుతున్నారు. భక్తులు వారి వారి అర్హతలకనుగుణంగా ఆ అమూల్య ధనాన్ని పొందటం ద్వారకామాయిలో అహోరాత్రాలు ప్రజ్వలించే ధునిలా, నిరంతర ప్రక్రియ. సర్వస్యశరణాగతిచే వారిసంపదకు మనమెల్లరము వారసులమేకదా! శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!

Comments