జామపండ్లు , చిక్కుడుకాయలు.

శ్రీసాయినాథాయనమః!
సాయిబాబానుగూర్చి మాట్లాడుతుంటే ఈ జామపండ్లు , చిక్కుడుకాయలు ఎక్కడినుండి వచ్చాయనే సందేహం పాఠకులకు రాకమానదు. కాని శ్రీసాయిసచ్చరిత్ర చదివిన వారలకు ఈ విషయం కొద్దిగా తెలిసేవుంటుంది. అదేంటో పరిశీలిద్దాం. బొంబాయిలో నివసించే లాలాలక్ష్మీచంద్ బాబా స్వప్న దర్శనముచే ప్రేరణపొంది శిరిడీ వెళ్లాలని తలుస్తాడు. అదే రాత్రి ఆతని మిత్రుడు శంకరరావు తలుపుతట్టి శిరిడీ వస్తావా యని అడగ్గా మిగుల ఆశ్చర్యానికి లోనవుతాడు. పిమ్మట పినతండ్రి కొడుకువద్ద 15 రూపాయలు అప్పుజేసి మిత్రునితో బాబానుచూడ రైల్లో బయలుదేరాడు. తోటిప్రయాణీకుల నుంచి బాబా గొప్పతనము తెలిసికొన్నాడు.కోపర్ గాం లో రైలుదిగ గానే బాబాకై కొన్ని జామపండ్లు కొనాలనే ఆలోచనవచ్చింది. కాని అచటి ప్రకృతి సౌందర్యానికి పరవశుడై ఆవిషయం మరిచాడు. శిరిడీ సమీపిస్తున్నప్పుడావిషయం గుర్తొచ్చింది . అదేసమయంలో ఓ ముసలమ్మ నెత్తిపై జామపండ్ల బుట్టతో తమ గుఱ్ఱపుబండి వెంట పరుగెత్తుకొని రావడం గమనించాడు. కొన్నిజామపండ్లుకొని బాబాను దర్శించి మిగుల ఆనందభరితుడయ్యాడు. బాబాసన్నిధిలో లక్ష్మీచందు మరిన్ని అనుభవాల పొందాడు. లాలా కథద్వారా బాబా మనకెలాంటి సందేశమిస్తున్నారు? శిరిడీ వెళ్లాలనే ప్రేరణ కల్పించినది బాబాయే, మిత్రుని వానింటికి పంపించింది బాబాయే, డబ్బు సమకూర్చినది బాబాయే, జామపండ్లు కొనాలనే సంకల్పము కల్గించింది బాబాయే, వృద్ధురాలి పంపించి పండ్లు సమకూర్చినది బాబాయే,తన మనసులోని ఆలోచనలకనుగుణంగా అనుభవం కల్గించినది బాబాయే! ఈవిషయాలు చదివినపిమ్మట బాబాయొక్క సర్వజ్ఞత మరియు సమర్ధత అరచేతిలోని ఉసిరిపండులా తేటతెల్లమవుతున్నట్లు మరిచెప్పాలా? కేవలం మెలకువలోనేగాక స్వప్నాలలో కలిగిన సంకల్పాలను సయితం సమకూర్పగల మహిమాన్వితులు శ్రీసాయిబాబా. మరోభక్తుడు కాప్టెన్ హాటే బికనీరు నివాసి యనుభవము. కలలో బాబాను దర్శించి మిగుల ఆనందంతో ప్రణమిల్లాడు. వెంటనే తోటలోకెళ్లి చిక్కుడుకాయలు తెచ్చి స్వయంపాకము మరియు దక్షిణ సమర్పించుచుండగా కల చెదిరింది. కొన్నిరోజుల పిమ్మట బొంబాయిలోని తనమిత్రునికి స్వయంపాకానికై 2 రూపాయలు , దక్షిణకు 10 రూపాయలు పంపి బాబాకు సమర్పించమన్నాడు. ఆ స్నేహితుడు శిరిడీ వెళ్లి కావలసినవస్తువుల కొన్నాడు కాని చిక్కుడుకాయలు దొరకలేదు. కాని అనుకోని విధంగా కాసేపటికి ఓ స్త్రీ చిక్కుడు కాయలగంపతో వాని సమీపించింది. అతడు చిక్కుడుకాయలకొని స్వయంపాకం సిద్ధంజేసి కాప్టెన్ హాటే పక్షాన సమర్పించాడు. ఆరోజు యితరభక్తులు తెచ్చిన పదార్థములమాని కేవలం చిక్కుడుకాయకూర తిన్నారుబాబ! దీనిభావం పాఠకులు తేలిగ్గా గ్రహింపగలరు. సాయిబాబ రూపుదాల్చిన విశ్వచైతన్యము , సృష్టిలోని ప్రతికదలిక ఆయన హృదయస్పందన! భక్తుల మది కదిలే ప్రతి ఆలోచన సాయిసాగరఅల, అలలన్నీ సముద్రానికెరుకేగదా! సద్గురుసాయి కరుణాసాగరాన ఓచిరు అలగా జీవించిన జన్మము ధన్యముగదా! సమర్ధసద్గురు శ్రీసాయినాథ మహారాజునకు శతకోటి ప్రణామాలు ! శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
కాప్టెను హాటే దంపతులు!

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)