కల్లలుకాని కలలు ! పాఠక భక్తుల నూతనసంవత్సరపు కలలు శ్రీసాయిబాబా కృపచే సాఫల్యమగుగాక !
శ్రీసాయినాథాయనమః !
కలలు కల్లలంటారుగదా , మరిదీన్నిగూర్చి మాట్లాడుకోవడమెందుకనే ప్రశ్న పాఠకులకు రాకమానదు. లోకంలోని ఈ నానుడి నిజమైనా బాబా విషయంలో ఇందులకు విరుద్ధంగా తోస్తుంది. ఎందరో భక్తులకు బాబా కలల రూపంలో సందేశమిచ్చినట్లు శ్రీ సాయిసచ్చరిత్రలో చూడగలము. మనిషి చైతన్యం నాలుగు స్ధితులలో వ్యాపించినట్లు చెప్పబడుతుంది . అవి వరుసగా మెలకువ , స్వప్న , స్వప్నరహిత దీర్ఘ నిదుర మరియు ఈ మూడు స్థితులదాటిన నోటితో వివరింపలేని భావాతీత నాల్గవ స్థితి. ఈ భావాతీత స్థితి కేవలం అనుభవ గ్రాహ్యమేగాని ఎలాంటి వివరణకందని నిధి . భక్తులకు ఈ నాల్గు దశలలోను బాబానుండి సందేశాలు లభిస్తుండేవి,ప్రస్తుతకాలంలోను కొనసాగుతున్నవి. ఏకకాలంలో అన్నిస్థితులనున్న వివిధ వ్యక్తులకు,భక్తులకు సందేశమివ్వగల సర్వ సమర్థులు సాయిబాబ. సాగరం, ఏకకాలంలో వేర్వేరు ప్రదేశాలనున్న విభిన్నమైన నాలుగు నగరాల తాకగలదుగదా, అదేవిధంగా సర్వవ్యాపి సాయి అన్నిస్థితులనున్నవారికి తమబోధన సుత్రాన్నందింపగలరు . ప్రస్తుత వ్యాసంలో కలలరూపంలో బాబా సమకూర్చిన అమృతానుభవాలను స్మరించుకొనెదము . ఈ వివరములు శ్రీ సాయి సచ్చరిత్రమునుండి గ్రహించడమైనది.
రామభక్తుడైన ఓ డాక్టరు బాబా స్థానంలో శ్రీరాముని గాంచి పరవశించి ప్రణమిల్లాడు. రాత్రినిదురలో వానికి గొప్ప ఆధ్యాత్మికానుభూతికల్గి, అనిర్వచనీయమైన ఆనందాన్ననుభవించాడు . పిదప రామభక్తుడు సాయిభక్తుడైనాడు . రామునకు సాయికి అభేదమే సాయి బోధ ! అక్కల్ కోటవెళ్లి తమ గురు శ్రీస్వామి సమర్థుల పాదుకపూజ చేయ తలచిన భాయికృష్ణజీ కి స్వామి స్వప్నదర్శనమిచ్చి శిరిడీ వెళ్లి బాబాను సేవించామన్నారు . ఆపై ఆతడు శిరిడీలో సాయిని సేవించి బాబకు ప్రియ భక్తుడైనాడు . స్వామిసమర్ధ, సాయిబాబలు ఒక్కరే యనెడిది ప్రస్తుత సందేశం . కొందరికి కలలో 'గురుబ్రహ్మాది ' మంత్రములకు అర్ధాన్ని బోధించారు . ఒక త్రాగుబోతుకు స్వప్నములో కనిపించి ఛాతిపైన కూర్చుని అదుముతూ, ఇక యెన్నడు త్రాగనని అతడు వాగ్దానము చేసిన పిమ్మట వదిలారు. మరొకనిచే హఠయోగము మాన్పించారు బాబ.భీమాజీ పాటీలు భయంకర క్షయరోగపీడితుడు. అతనికి బాధాపూరిత రెండుస్వప్నానుభవముల కల్గించి రోగముక్తునిజేశారు సాయిబాబ. అప్పటినుండి సాయిసత్యనారాయణ వ్రతములారంభించి తన కృతజ్ఞతను చాటుకున్నాడు భీమాజీ . బాబాను గూర్చి ఏమాత్రము తెలియని లాలా లక్ష్మీచందు అనే భక్తునికి స్వప్నదర్శనమిచ్చారు బాబ. ఆపై యతడు దాసగణు కీర్తనకు వెళ్ళాడు . పూజఫోటోలోని బాబాపోలికలు తనకు కలలో కనబడిన వ్యక్తి పోలికలు కలియుటచే , వివరములనెరిగి మిగుల ఉత్సాహంతో శిరిడివెళ్లి బాబను దర్శించాడు లాలాచందు . బరహన్పూరు మహిళకు కలలో కనబడి కిచడీకోరారు . ఆమె మేల్కొనిచూడగ గుమ్మమువద్ద ఎవ్వరు లేకుండిరి . కొద్దికాలం పిదప ఆమె భర్తతో శిరిడీ వెళ్లి బాబాకి కిచిడీ సమర్పించింది . ఇతరులు తెచ్చిన పదార్థముల ముట్టక మిగుల ఆత్రంతో ఆమె తెచ్చిన కిచిడీ తిన్నారు . మేఘ యనే శివభక్తునికి నిదురలో దర్శనమిచ్చి త్రిశూలము గీయించారు. ఆపై వేరొక భక్తుడు తెచ్చిన శివలింగమును వానికిచ్చి త్రిసూలం ప్రక్కన ప్రతిష్టింపజేసి వానిలోని శివభక్తిని పెంపొందించారు . మద్రాసునుండి వచ్చిన భజనమండలి రామభక్తురాలికి శ్రీరామునిలా దర్శనమివ్వ ఆమె మిగుల పరవశించింది . ఈ దర్శనాన్ని విశ్వసించని ఆమె భర్తకు కలలో గొప్ప అనుభవాన్ని ప్రసాదించి తమభక్తునిగా మార్చారు బాబ. పదవీవిరమణ జేసిన సావిత్రిబాయి తెండూల్కర్ భర్తకు వచ్చెడి పింఛను చాలకుండుటచే మిగుల వ్యాకులపడ్డారు కుటుంబీకులు . బాబా సావిత్రిబాయికి కలలో కనబడి సరిపడ పింఛనువచ్చునటుల పలుక, ఆపై అటులనే జరిగినది . భక్తుడు బికనీరు వాసి కాప్టెను హాటే, కలలో బాబాను దర్శించి తాజాచిక్కుడుకాయల కూర మరియు దక్షిణ సమర్పించుచుండ మెలకువ వచ్చినది. కొన్నిదినముల పిమ్మట తన స్నేహితునికి డబ్బులు పంపించి వానిద్వారా బాబాకు చిక్కుడుకాయలతో స్వయంపాకం మరియు దక్షిణ సమర్పించాడు హాటే. భోజనసమయాన కేవలం చిక్కుడుకాయకూరమాత్రమే తిని మిగుల పదార్థముల వైపు చూడలేదు బాబ. విషయమెరిగిన భక్తుడు మిగుల సంతోషపడ్డాడు .
నాసిక్ జిల్లా వణిలోని సప్తశృంగి పూజారి కాకాజీవైద్య మిగుల అశాంతికిలోనై దేవతను ప్రార్ధించాడు . దేవత స్వప్నదర్శనమిచ్చి శిరిడీ సాయిని సేవించమన్నది. శిరిడీనిగూర్చి తెలియని పూజారింటికి ప్రియభక్తుడు శ్యామాను పంపించి శిరిడీ కీడ్చారు బాబ. సాయిసన్నిధిలో పరమశాంతిని పొందాడు వైద్య .
తెల్లవారుఝామున వచ్చిన కల నిజమగునని యందురు. ఇది సత్యమే కావచ్చు . కాని బాబా స్వప్నములకు కాలనియమము లేదు . రహతా వాసి బాబాభక్తుడు కుశాల్ చందు మధ్యాహ్నభోజనానంతరము నిద్రపోవుచుండగా వానికి స్వప్నంలో బాబా కనపడి శిరిడీకి వెంటనే రమ్మన్నారు . కాని ఆతురతో నున్న యాతనివద్ద గుఱ్ఱములేకుండెను. సరిగా అదేసమయాన బాబా పంపుటచే కాకాసాహెబు దీక్షితు టాంగాతో వచ్చి కుషాల్ చందును శిరిడీకి తీసికెళ్ళాడు . సంకల్పము, సాయము రెండూ సాయి కల్పించినవే ! బాబా అంటే ఎవరో తెలియని పంజాబి బ్రాహ్మణునకు కలలో సాయి కనబడి వానిని శిరిడీ రమ్మన్నారు. ఆనాడు సాయంకాలము వీధిలో పోవుచుండగా ఒకదుకాణంలో స్వప్నంలో జూసిన మహంతు పోలికలుగల బాబా ఫోటోను జూసి, ఆ వివరముల నెరిగి వెంటనే శిరిడీకి పోయి యచటనే తన చివరిక్షణం వరకున్నాడు . వేరొక భక్తుడు బాలారాం మాన్కర్ బాబా పంపుటచే సతారా జిల్లాలోని మచ్చింద్రగడ్ వెళ్లి తీవ్రంగా ధ్యానం జేస్తున్నాడు . కొన్నిరోజుల పిమ్మట ధ్యానించువానికి బాబా దివ్యదర్శనం లభించింది . ఆతనికి బాబా స్వయంగా ప్రత్యక్షమయ్యారు . బాబా కేవలం శిరిడీలోనే ఉంటారనే వాని సంశయమానాటితో తీరి, సాయి సర్వవ్యాపకతను కనులారా గాంచాడు . భక్త నారాయణరావు మిగుల జబ్బుపడి రేయింబవళ్లు బాబాను ధ్యానిస్తున్నాడు . ఓరోజాతనికి బాబా స్వప్నంలో కనబడి వారంలో జబ్బునయమగునని ఆశీర్వదించారు . ఆపై అట్లేజరిగింది. నయముకాని తనమేనల్లుని రాచకురుపు బాబా కృపచే తగ్గుటచే, సాయిని సందర్శింపదలచాడు మాలేగాం డాక్టరు . కాని ఎవరో బాబాకు వ్యతిరేకంగా చెప్పుటచే వాని విశ్వాసం సన్నగిల్లింది . బొంబాయిలో వానికి వరుసగా మూడు రాత్రులు నొక కంఠధ్వని " ఇంకను నన్ను నమ్మవ ! " యని వినిపించింది. వెంటనే యాతడు తనమనసు మార్చుకొని శిరిడీ వెళ్లి బాబా కృపకు పాత్రుడయ్యాడు . నౌకరు దొంగిలించుటచే పోగొట్టుకొన్న డబ్బును బాబాదయచే తిరిగిపొందిన గోవా పెద్ద శిరిడీ వెళ్లదలచాడు . ఆతలపు మరచిన యాతనికి కొన్నిరోజులపిమ్మట బాబా స్వప్నదర్శనమైనది. పూర్వవిషయం జ్ఞప్తికివచ్చిన యాతడు శిరిడీ వెళ్లి సాయికి ప్రణమిల్లాడు.
మనశాంతి మిగుల కోల్పోయిన సాఠే శిరిడీ వెళ్లి బాబా దర్శనంచే మిగుల చిత్తశాంతిపొందాడు . గొప్ప మనోబలం గల యాతడు వెంటనే గురుచరిత్ర పారాయణము మొదలుపెట్టి ఏడురోజుల్లో పూర్తిజేశాడు . వాని భక్తికి సంతసించినబాబా చివరిరాత్రి కలలో కనబడి మరొక్క వారం పారాయణజేసిన మిగుల ఫలితం లభిస్తుందనే సందేశమిచ్చారు .1917 వ సంవత్సరం హోలీపండుగ తెల్లవారుఝామున హేమాడ్ పంతుకు కలలో కనబడి భోజనానికి వస్తానని చెప్పారు బాబా . సరిగా యతడు బంధుమిత్రులతోడి భోజనముజేయు సమయాన చిత్రపటం రూపంలో వారింటికి వచ్చి విందారగించారు సాయి . సాయి ఏరూపంలోనైనా భక్తుల కరుణింపవచ్చును . దేవు అనే భక్తునికి జ్ఞానేశ్వరి పఠనమంత సులువుకాదు . 1914 వ సంవత్సరమున వానికి స్వప్నదర్శనమిచ్చి జ్ఞానేశ్వరినే విధంగా చదవాలో విశదీకరించారు బాబా .సాయి కృపతో సద్గ్రంథపఠనం మిగుల సులువుగదా ! సద్గురునిపై విశ్వాసముంచడం భక్తులకెంతో శ్రేయస్కరం , అలాంటి నమ్మకం లోపించినవారు మౌనంగా వుండటం ఫర్వాలేదుగానీ,నమ్మినభక్తుల విశ్వాసాన్ని చులకనజేయడం మిగుల ప్రమాదకరం.ు షేవడే బాగుగా చదువకున్నను బాబాదయతో న్యాయపరీక్షలో తప్పక కృతార్థుడ గాగలనని పూర్తిగా నమ్మినవాడు . ఆమాటవిని సహచర విద్యార్థి సపత్నేకర్, షేవడే మరియు బాబాల అవహేళన జేసి మిగుల కష్టాలపాలయ్యాడు . ఆపై మొదటిభార్య మరియు పుత్రుడు మరణించుటచే మిగుల దుఃఖంతో బాబాను దర్శించి నిరాదరణ పాలయ్యాడు. పిదప వాని రెండవభార్యకు బాబా స్వప్నంలో కనబడి వారిరువురని శిరిడీ కీడ్చారు . రెండవ పర్యాయం సపత్నేకర్ మిగుల పశ్చాత్తాపంతో, పరిపూర్ణవిశ్వాసంతో సాయిని వేడుకొని గురుకృపకు పాత్రుడయ్యాడు . ఆపై సాయి ఆశీసులతో ముగ్గురు పుత్రులకు తండ్రయ్యాడు . సాయి బాబా విశ్వచైతన్యులు , సంకల్ప సిద్ధులు . భక్తుల మనసుల ప్రేరణకల్గించి తమ తమ కార్యముల విజయవంతంగా నెరవేర్చు సర్వసమర్థులు . ఈ విషయం సమాధిమందిర నిర్మాణంలో మిగుల తేటతెల్లమైనది . దీక్షితువాడాలో నిదురించు బాపుసాహెబు బూటికి ఓ రాత్రి సాయి కలలోకనబడి ఓ వాడాను మందిరంతో సహా నిర్మించమని పలికారు. అచ్చట నిద్రిస్తున్న శ్యామాకు అదే స్వప్నసందేశం లభించింది . వారిరువురి కలలు ఒకటియగుటచే వాడ నిర్మింప దలచాడు బూటీ. ఆ పై సాయిసంకల్పంచే సమాధిమందిరనిర్మాణం సకాలంలో పూర్తయినది. మురళీధర విగ్రహఃముంచదలచిన స్థానమున శ్రీ సాయిబాబదేహాన్ని సమాధి జేశారు . సాయిబాబా మురళీధరుడనే భక్తుల నమ్మిక బలపడింది . సమాధినుండే భక్తులకు సమాధానమిస్తున్నారు సర్వసమర్ధ శ్రీ సాయిబాబ ! సమర్ధ సద్గురు శ్రీ సాయినాథమహారాజునకు సహస్రకోటి జయజయకారాలు !
Comments
Post a Comment