అధ్యాత్మరామాయణము : వాల్మీకి మహర్షి తో సమాగమము!

శ్రీసాయినాథాయనమః !
శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా గుహుని నావలో గంగానదిని దాటి భరద్వాజ ఆశ్రమము చేరి ఆ మునివర్యుని ఆతీధ్య, ఆశీసులపిమ్మట వాల్మీకి మహర్షిని సందర్శించి ప్రణమిల్లెను . అంత వాల్మీకి త్రిలోక సుందరుడు ,మన్మధాకారుడు, జటాముకుట శోభితుడు , కమలనేత్రుడు , రామనాథుడు యగు రాముని సీతాలక్ష్మణులతో చూచినవెంటనే లేచి , విస్మయముతో ,రెప్పవేయక చూచుచు , హర్షపులకాంకితుడై ,పరమానందస్వరూపుడైన రాముని కౌగలించుకొని ,జగత్పూజనీయుడైన అతనిని భక్తిగా ఆర్ఘ్యపాద్యాదులతో సత్కరించి ,మధురములగు కందమూల , ఫలాదులను భుజింపచేసి,వాత్సల్యముతో స్నేహముతో లాలించెను . అపుడు శ్రీరాముడు అత్యంత వినయముతో అంజలించి ,వాల్మీకి మహర్షితో " మేము మా తండ్రి ఆజ్ఞతో దండకారణ్యమునకు వచ్చితిమి . మీరు సర్వము తెలిసినవారే ! ఇక మేము కారణమేమని చెప్పుదుము? నేను సుఖముగా నివసింప ఉచితమగు స్థానమును మీరు తెలియచేయవలసినదని కోరుచున్నాను . మీరు నిర్దేశించిన స్థానమున నేను సీతతోడ కొంతకాలము గడిపెదను" అనెను . రాముడు ఇట్లు పలుకగా మునివరుడు చిరునగవుతో ఇట్లనెను . " రామా ! సమస్తలోకములకు నీవొక్కడవే నివాస స్థానము . ఈజీవులెల్లరు మీకు నివాసగృహములగువారే ! ఓ రఘునందనా !ఈవిధముగానేను మీకు సర్వసామాన్య నివాసస్థానము తెలిపితిని . కాని మీరు విశేషముగా సీతాసమేతులై వసించుటకు నిశ్చితమైన స్థానమేదో తెలుపుచున్నాను . వినుము . శాంతులై సమదర్శులై సమస్తజీవులయెడల ద్వేషరహితులై అహర్నిశము నిన్ను భజించువారి హృదయములు నీ ప్రధమ నివాసస్థానము . ధర్మాధర్మములను రెండింటిని వీడి ,నిరంతరము మిమ్మే భజించువాడెవడో ఆతని హృదయమందిరము సీతాసమేతుడవైననీకు సుఖపూర్వక వాసస్థానము . ఎవరు నీనామమంత్రమును జపింతురో , నీశరణమునే గోరుదురో,రాగద్వేషాది ద్వంద్వభావములులేక నిస్పృహులై యుందురో ,వారిహృదయమే మీకు సుందరమందిరము . ఎవరు అహంకార శూన్యులై,శాంతస్వభావులై,రాగద్వేషరహితులై, బంగారమును , రాతిని మట్టిని సమానముగా భావింతురో,వారిహృదయము నీకు నివాసస్థానము . ఎవడు నీయందే మనోబుద్ధులను లగ్నముచేసి సదా సంతుష్టుడై యుండునో, తన సమస్తకర్మలు నీకు అర్పించివేయునో, అతనిమనసే నీకు శుభావాసము. ఎవడు అప్రియముపొంది ద్వేషింపరో,ప్రియముపొంది హర్షింపరో,ఈసమస్త ప్రపంచము మాయకల్పితమని నిశ్చయముకల్గి సదా నీభజనము చేయుచుందురో వారిమనసు నీకు స్థానము . ఎవరు షడ్వికారములను ఆత్మయందుగాక ,శరీరమునందుమాత్రమే చూచునో ,ఆకలిదప్పులు,సుఖదుఃఖములు,భయానందములు మొదలగునవి బుద్ధివికారములుగా గుర్తించునో ,ఎవడు సంసారిక ధర్మములనుండి స్వయముగా విముక్తుడై యుండునోఅతని మనసే నీ నిజమందిరము . ఎవరు చిద్ఘనుడవు,సత్యరూపుడవు , అనంతుడవు , అద్వితీయుడవు,నిర్లేపుడవు , సర్వగతుడవు ,శ్రేష్ఠుడవు , పరమేశ్వరుడవు అయిన నిన్ను సమస్త అంతఃకరణములలో విరాజిల్లెడివానిగా చూచునో ,వారిహృదయకమలములందు నీవు సీతాసమేతుడవై నివసింతువుగాక ! నిరంతర అభ్యాసమువలన ఎవరి చిత్తము స్థిరత్వముపొంది యుండునో ,ఎవరు సర్వదా మీ చరణసేవలో నిమగ్నుడై యుండునో, మీనామకీర్తనమువలన ఎవరి పాపములు ప్రక్షాళనమగునో వారి హృదయకమలములు సీతాసమేతుడగు నీనివాసగృహము. రామా! దేనిప్రాభవముచే నేను బ్రహ్మర్షిపదము పొందితినో , ఆనామముయొక్క మహత్వము ఎవరైనా ఏవిధముగా వర్ణింపగలరు ? రామా ! నీనామప్రభావముచేతనే నేనిట్టివాడనైతిని . నేడు సీతాలక్ష్మణసమేతుడవైన కమలనయనుడవు నిన్ను నేను చూచుచున్నాను. ఆహా ! నిస్సందేహముగా నేను ముక్తుడను . రామా ! నీకు శుభమగుగాక ! రమ్ము ! మీరు వసించుటకు తగిన స్థానము చూపించెదను" అని వాల్మీకి ముగించెను . శిష్యసమేతుడై వాల్మీకి గంగానదీ చిత్రకూట శృంగముల నడుమ ప్రదేశము చేరి,అచట వారు నివసించుటకు ఋషివాసయోగ్యమైన విశాలమైన శాలను నిర్మింపచేసెను . ఆ దివ్యవాటికల సీతాసమేతులై రామలక్ష్మణులు దేవతలవలె నివసింపసాగిరి .సీతాలక్ష్మణహనుమత్సమేత శ్రీరామచంద్రుని కృపాకటాక్షములు సర్వులకు ప్రాప్తించుగాక ! శ్రీసాయిరాముని కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!
నేటి చిత్రకూటము .
" మీరెక్కడున్ననూ,ఏమిచేయుచున్ననూ నాకుతెలియునని బాగుగా జ్ఞాపకమునుంచుకొనుడు. నేనందరి హృదయముల పాలించువాడను. అందరి హృదయములలో నివసించువాడను. నేను ప్రపంచమందుగల చరాచర జీవకోటి నావరించియున్నాను. ఈ జగత్తును నడిపించకవాడను, సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను. త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియచాలకుడను నేనే, సృష్టిస్థితిలయ కారకుడను నేనే. ఎవరయితే తమ దృష్టిని నావైపు త్రిప్పెదరో వారికేహానిగాని బాధగాని కలుగదు.నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. " శ్రీ సాయిసచ్చరిత్రము

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

శ్రీసాయిసందేశామృతము 51 (Nectar of Sri Sai's message 51)

విష్ణుమాయ.