గురుపూర్ణిమ-సద్గురువాణి!

శ్రీసద్గురుభ్యోనమః!పాఠక భక్తులెల్లరకు గురుపూర్ణిమ శుభాకాంక్షలు.
శ్రీసాయిబాబ సందేశము. బాబా సశరీరులుగాయున్నపుడు,వారొక రూపుదాల్చిన భగత్స్వరూపముగా తమ భక్తులకు భాసిల్లుతూ,తమ లీలాప్రబోధాలద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపజేయుచుండెడివారు. వారి నశ్వర్యమైన దేహము మాయమైపోయినదిగాని, దానిలో అప్పుడుండిన 'బాబా' మాత్రము నిప్పటికిని అనంతశక్తివలె నిలిచి ,వారు సమాధిచెందకముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికిని వారినాశ్రయించు యసంఖ్యాత భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు. బాబా సశరీరులుగాయున్నపుడు,వారొక రూపుదాల్చిన భగత్స్వరూపముగా తమ భక్తులకు భాసిల్లుతూ,తమ లీలాప్రబోధాలద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపజేయుచుండెడివారు. వారి నశ్వర్యమైన దేహము మాయమైపోయినదిగాని, దానిలో అప్పుడుండిన 'బాబా' మాత్రము నిప్పటికిని అనంతశక్తివలె నిలిచి ,వారు సమాధిచెందకముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికిని వారినాశ్రయించు యసంఖ్యాత భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు. బాబా తాను సర్వాంతర్యామినని చెప్పెడివారు. అన్నిటియందు అనగా భూమి, గాలి, దేశము,ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారుగలరు. ఆయన అనంతుడు. ఆ కనిపించెడి మూడున్నర మూరల దేహమే బాబాయని అనుకున్నవారికి పాఠము చెప్పుటకే వారు ఈరూపముతో నవతారమెత్తిరి. బాబాకు సర్వస్యశరణాగతి చేసి, అహర్నిశలు వారినే ధ్యానించినచో ,చక్కెర- తీపి, కెరటములు-సముద్రము, కన్ను -కాంతి, కలిసియున్నట్లే శ్రీసాయితో తాదాత్మ్యతను పొందెదరు. భగవంతుని ప్రతిజీవియందు చూడుమని ఉపనిషాది గ్రంథములలో ప్రతిపాదింపబడిన తత్వమును అనుభవ పూర్వకముగ ప్రబోధించిన సమర్ధ సద్గురుడే శ్రీసాయియిబాబా. బాబా యిట్లు చెప్పెను. " సదా నా నిరాకార స్వభావమును ధ్యానింపుము. మీరిది చేయలేనిచో రాత్రింబవళ్లు మీరు చూచుచున్న నాయీ యాకారమును ధ్యానించుడు. అట్లు కొన్నాళ్ళు చేయగా ధ్యాని, బ్రహ్మముతో అభిన్నమగును." " ఎవరు అదృష్టవంతులో,ఎవరి పాపములు క్షీణించినవో,వారే నన్ను భజించుటయందు తత్పరులై నన్నెరుగగలరు.ఎల్లప్పుడు 'సాయి సాయి' అని స్మరించుచుండిన సప్తసముద్రములు దాటించెదను. ఈమాటలను విశ్వసింపుము. తప్పక మేలు పొందెదవు. పూజాతంతుతో నాకు పనిలేదు. భక్తి యున్నచోటనే నా నివాసము." " నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు లోటుండదు.నాయందే మనసు నిలిపి ,భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే యారాధించువారి యోగక్షేమముల నేను జూచెదను. ఎల్లప్పుడు నన్నే జ్ఞప్తియందుంచుకొనుము. చంచల చిత్తమునకు స్వాస్థ్యము చిక్కదు." "నా ముందర భక్తితో చేతులు జాపినచో వెంటనే రాత్రింబవళ్లు మీ చెంత నేనుండెదను.నా దేహము నిచ్చట నున్నప్పటికి సప్తసముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకుతెలియును. ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు. నేను మీచెంతనే యుండెదను. నా నివాస స్థలము మీ హృదయమునందే గలదు."
శ్రీరామకృష్ణ పరమహంస కథారూప సందేశము. పతివ్రతా మహాభక్తురాలూ ఐన ఒక స్త్రీ తన భర్తకూ పిల్లలకూ ఉపచారాలు చేస్తూ సదా తన మనస్సును భగవదాయత్తం చేసి గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తుండేది. కొంతకాలానికి ఆమె భర్త మరణించాడు. దహనక్రియ ముగిసాక ఆమె, తన గాజులను తీసివేసి వాటికి బదులు బంగారు మురుగులను ధరించింది. జనం ఆమె విపరీత చర్యను చూసి ఆశ్చర్య పోసాగారు. కాని ఆమె వారికిలా సమాధానం చెప్పింది: " ఇంతకు ముందు నా భర్త శరీరం గాజుపెంకుమాదిరే దుర్బలమై అస్థిరమై ఉండేది. ఇప్పుడా క్షణభంగురమైన శరీరం నశించింది. అందుచేత అతడిప్పుడు అన్నివిధాల వికారరహితుడై పరిపూర్ణుడై ఉన్నాడు. అతడి శరీరానికిక శైధిల్యం లేదు. కాబట్టి నేను సులభంగా చిట్లే గాజులను విస్మరించి అంతకంటె సుస్థిరమైన మురుగులను ధరించాను." ఇచట గాజులు అశాశ్వితమైన శరీరానికి, బంగారు మురుగులు శాశ్విత ఆత్మతత్వానికి సంకేతముగా సూచింపబడినవి.
శ్రీ రమణ మహర్షి జ్ఞానరూపసందేశము. సాధారణంగా మనిషి ఎరుక మూడు స్థాయిలలో ఉంటుంది. మెలకువ, స్వప్న, స్వప్నరహిత గాఢ నిదుర. మనిషి తన మెళకువస్థితిలోని అనుభవాలనే సత్యంగా నమ్ముతాడు. మిగిలిన అనుభవాలు భ్రమలుగా తలుస్తాడు. కాని ఆత్మానుభవము పొందిన జ్ఞాని, పై మూడు స్థితులకతీతమైన వేరొక స్థితిలో విహరిస్తాడు.అదియే తురీయస్థితి. అది ఎరుకతో కూడిన నిదురలాంటి స్థాయి. ఆ స్థితినే తురీయాతీతస్థితిగా కూడచెబుతుంటారు. అదియే ఆత్మసాక్షాత్కారస్థితి. తనముందు జరిగే సంఘటనలకు చలింపడు. పై మూడు స్థితులను క్షణభంగురాలుగతలుస్తాడు.అలాంటి అనుభవాన్ని స్వయంగా పొందుతాడు. జరిగేదంతా తెరపై నాటకంగా వీక్షిస్తాడు. తానే ప్రేక్షకుడు, తానే తెర,తానే తెరపై నర్తించే నటుడు యనెడి ఎరుక స్థితివానిది. అది ఎలాంటి దుఃఖాలకు,భయాలకు లోనుకాని స్థితి.మరింత విశ్లేషించాలంటే, మెలకువగా ఉన్న వ్యక్తి స్వప్న మరియు గాఢనిదుర స్థితులను తాత్కాలిక అనుభవ రాహిత్య ఘటనలగా తలుస్తాడు. స్వప్న దశలోని వ్యక్తికి మెలకువ మరియు గాఢనిదురలు అనుభవానికి అందని ఘటనలు. స్వప్న రహిత గాఢ నిదుర వ్యక్తికి మెలకువ మరియు స్వప్నముల జాడయే తెలియదు. అది ఒక విధంగా చైతన్యరహిత చీకటిగది నిదురలాంటిది. కాని తురీయస్థితిలోని జ్ఞాని ఈ మూడు స్థితులకు అతీతంగా సత్యాన్ని దర్శిస్తుంటాడు. వానికి ఈ మూడు స్థితులు అశాశ్వితములు, వాటిని నాటకాన్ని చూసే ప్రేక్షకునిలా దర్శిస్తుంటాడు. మెలకువ,స్వప్న,గాఢనిదుర అనుభవములు వానిని చలింపజేయజాలవు. సుఖదుఃఖములు,మానవమానములు,కామక్రోధాదులు వానిని ప్రభావితం చేయజాలవు. ఆ స్థితులన్నీ వానికి తెరపై కనబడే క్షణభంగురఘటనలు. కేవలం స్వప్నంలో సింహాన్ని చూసినంత మాత్రాన ఏనుగునకు మెలకువ వచ్చెడి విధంగా గురుకృప ప్రాప్తించిన వ్యక్తికి అలాంటి జ్ఞానావస్థ లభిస్తుంది. అట్టి దయామయుడు,కరుణామయుడైన సద్గురుకృపకు, సత్యదృష్టి పొందుటకు సర్వులము ప్రయత్నించెదము గాక! అందరిపై ఆ జ్ఞానభాస్కరుని కిరణములు ప్రసరించుగాక!

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)