శ్రీసాయిసందేశామృతము 12.
శ్రీసాయినాథాయనమః. సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము.
శ్రీసాయిసందేశామృతము: అధ్యాయము 12. సృష్టియందు మంచిచెడులు రెండూ వ్యాపించియున్నాయి . సృష్టికర్త రెండింటి పాలకుడు గావున వారికి ఆరెండింటినడుమ తారతమ్యముండదు . వాయువు సువాసన , దుర్వాసనల మోయుచందాన సృష్టియందు మంచిచెడులుంటాయని శ్రీరామకృష్ణ పరమహంస బోధించారు . సర్వజనోద్ధరణయే సాయి అవతారకార్యము . సాయిసంకల్ప ములేక వారినెవ్వరు చూడలేకుంటిరి,చూచినా తాము తలచినన్నిరోజులుండలేకుంటిరి. సాయి సంకల్పశక్తి యటువంటిది! శిరిడీలో వారము రోజులుండి గోకులాష్టమి చూడదలచిన కాకామహాజనిని మరునాడే పంపించారు . నిజంగా మహాజని యజమానికి వానియవసరం హఠాత్తుగా కావలసి వచ్చినది. సర్వులహృదయవాసికి వారి అవసరములు చెప్పవలెనా ? సాయిని దర్శించి నిఫాడు వెళ్లదలచిన లాయరు ధూమాలుని మరో వారముంచారు. అచటి మేజస్ట్రేటుకు కడుపునొప్పికారణాన కేసు వారంరోజులు వాయిదాపడినది . తుదకు ధుమలు కేసు గెలిచాడు . జబ్బుపడ్డ బిడ్డనుజూచుటకు నిమోన్కరు భార్య బేలాపూరు వెళ్లదలువ,భర్త మరునాడే రావలసినదని శాసించినా,సాయిదేవులు నాలుగురోజులుండిరమ్మని ఆశీర్వదించారు . పై ఉదాహరణలద్వారా అందరియవసరములు తానెరుగుదునని బాబామౌనంగా చెబుతున్నారు . సాయి మనమనసుల చదువుచున్నారు,మాటల వినుచున్నారు . భక్తులకున్న విశ్వాసంకొలది బదులిడుతున్నారు . అందరి తలరాతలెరిగిన సద్గురుసాయినాథుల చేతిరేఖల చదువదలచిన నాసిక్ వాసి ములేశాస్త్రికి తమచేయిచూపక, పురుషార్ధములకు సంకేతంగా నాలుగు అరటిపండ్లు వానిచేతిలో పెట్టారు . తమగురునిపైనే గురినిలిపి, సాయిని విశ్వసింపని ములేశాస్త్రికి వానిగురువు ఘోలప్ స్వామిలా దర్శనమిచ్చారు సాయి . పారవశ్యంతో సాయికి ప్రణమిల్లి దక్షిణ సమర్పించాడు శాస్త్రి . బాబా సర్వజ్ఞత , సమర్ధతలను యీలీలయందు తేటతెల్లము . జరగబోవు సంఘటన కవసరమన్నటుల ముందుగానే గేరు రంగు తెప్పించారు బాబా . మామలుతారు డాక్టరు స్నేహితుడు రాముని భక్తుడు సాయికి ప్రణమిల్లనని తలచి శిరిడీ వచ్చాడు . కాని ఆశ్చరంగా అందరికంటే ముందుగనే బాబాకు పాదాభివందనం జేశాడు . కారణమడుగ తనకు బాబా శ్రీరామునిలా దర్శనమిచ్చారని తన యనుభవం అందరికి వివరించాడు . ఈలీలతో డాక్టరుమనసులో బాబాభక్తి బీజమంకురించినది . ఈపై చెప్పబడిన భక్తులయనుభవముల సందేశమేమంటే సాయిసమర్థులు , సర్వగురు , సర్వదేవ స్వరూపులు . సాయికి సమర్పించిన దక్షిణ నమస్కారములు యోగులందరికి దేవతలందరికి సమర్పణములే ! శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
Comments
Post a Comment