శ్రీసాయిసందేశామృతము 14.

శ్రీసాయినాథాయనమః . సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము.
శ్రీసాయిసందేశామృతము : అధ్యాయము 14.సద్గురుని ప్రతిచర్య అత్యంత మధురము . ఏవిధంగా బంగారంతో జేసిన ఆభరణమేదైనా మెలిరంగుతో ప్రకాశిస్తున్నట్లుగ. బాబానిత్యకృత్యములే భక్తులకు మౌనప్రబోధకాలు. మానవజన్మ లభించుటయే మహాసౌభాగ్యము . జీవితపరమావధి నెరుగుటయే మానవజన్మ సాఫల్యము . నిత్యసాయిలీలల స్మరణమననములచే చంచలచిత్తము చాంచల్యముక్తమౌతుంది . చాంచల్యములేని మనసు శాంతివనమవుతుంది . అదియే ఆధ్యాత్మికజీవనానికి ప్రధమసోపానము . రతన్ జీ షాపుర్జీ వాడియా సకలైశ్వర్య సంపన్నుడు . కాని పుత్రసంతానలేమిచే మిగుల దుఃఖితుడు . తనబాధను తాను అత్యంత గౌరవించే దాసగణు మహారాజునకు విన్నవించి,వారిసలహాపై బాబాను దర్శించాడు . బహువినమ్రతతో బాబానుపూజించి తనమనసులోని కోరికను విన్నవించాడు . ఐదు రూపాయల దక్షినివ్వదలచిన వానిని అంతేమొత్తము అడిగారు బాబా . ఇదియొక ఆశ్చర్యవిషయముగదా ! బాబాప్రతిలీలలోను వారి సర్వజ్ఞత ద్యోతకమౌతుంది. ఈ సత్యమెరిగిన భక్తులెల్లరు మిగుల జాగరూకులై మెలగవలె ! ఐదు రూపాయలు దక్షినడిగినా, అప్పటికే మూడు రూపాయల పన్నెండు అణాలు ముట్టెనని కేవలం ఒక రూపాయి రెండణాల మాత్రమే స్వీకరించుట ఆలోచింపదగిన విషయము. బాబా ఎవరినుండి అనవసరంగా డబ్బుస్వీకరించేవారుకాదు. బాబాదర్శనానికి ముందు షాపుర్జీ వేరొక యోగిపుంగవుడు మౌలాసాహెబ్ సేవకై అంతేమొత్తము అంటే మూడు రూపాయల పన్నెండు అణాలు ఖర్చుజేసాడు . ఈవ్యవహారమంతా బాబాకు తెలియడం ఆశ్చర్యంగదా! ఈవిధంగా తమకు యోగి మౌలానాకు తేడాలేదని తాము సర్వయోగిశ్వరూపులమని నిశ్శబ్దసందేశమందించారు ." దిగులు పడకు ! నీ కీడు రోజులు ముగిసినవి . అల్లా నీ మనసులోని కోరిక నెరవేర్చు ' నని బాబా దీవించారు . బాబా మాటలు మంత్రాక్షరములు ! పిమ్మట అతనికి పుత్రసంతానము కలిగినది . రతంజీకి బాబాయందు స్థిరమైన నమ్మకము కలిగినది , భక్తి వృద్ధినొందినది . మరియొక భక్తుడు హరివినాయక సాఠే, బాబా ఆశీసులచే పుత్రసంతానము పొందిన మిగుల తృప్తిపరుడు . బాబా తరచుగా మజీదు భక్తులనుండి బాకీ కోరుతుందని చెప్పెడివారు . ధార్మికజీవనంలో రుణం ఓ అడ్డంకి . ఆ అడ్డురాతిని తొలగించుటకై భక్తులనుండి దక్షిణగ్రహించి వారిని రుణముక్తులజేసెడివారు . బాబాకు దక్షిణ సమర్పించుట వారిమేలుకొరకే ! పూర్వపుణ్యఫలంచే మనుషులు ధనవంతులుగా పుడతారు . అది దైవప్రసాదం. అలా ప్రాప్తించిన సంపదను చంద్రునికోనూలుపోగన్నట్లు కొంతవరకైనా దానధర్మాలకై వెచ్చించాలి . లేనియెడల పుణ్యఫలం క్షీణించినపిమ్మట మరుజన్మలో పేదరికాన్ననుభవించాలని ప్రాజ్ఞులు చెబుతారు . మరొకవిషయమేమంటే తానుపొందిన ప్రతిరూపాయికి వందరూపాయలిస్తాననెడివారు బాబా! అలా జూసినా దక్షిణ ప్రయోజనకారి . బోడసు యనువాడు తానుతెచ్చిన డబ్బంతా దక్షిణ సమర్పించాడు . అటుపిమ్మట జీవితంలో మిగుల భాగ్యవంతుడయ్యాడు . దక్షిణ కేవలం ధనమిచ్చుటయేగాదు ! హృదయగతంజేస్తూ గ్రంథపారాయణ జేయడం,వ్యక్తి తన అంతరంగంలోని కామక్రోధాది రాక్షసభావాలను పోగొట్టుగొనుట సైతము దక్షినిచ్చుటతో సమానమని బాబా బోధిస్తుండేవారు . బాబా వివిధ వ్యక్తులనుండి దక్షిణ పొందటం లేక నిరాకరించడం ఆయా వ్యక్తుల మనోభాలననుసరించి యుండెడిది మరొక ముఖ్యవిషయము. బాబా పొందెడి దక్షిణ స్వప్రయోజనముకొరకు గాదు. ఏరోజు వచ్చినడబ్బునారోజు ఉదారంగా పంచెడివారు . ఆవిధంగా వారికి సమర్పించే దక్షిణ పెక్కుమందికి సమర్పించినట్లే ! వారందరి హృదయవాసి సాయియేగదా ! ధనంపై పేరాశ వదులుకోవడం కోసం దక్షిణ స్వీకరించడము ; స్త్రీపట్ల వ్యామోహము పోగొట్టుకొనుటకై రాధాకృష్ణమాయి వద్దకు భక్తుల పంపడము బాబాపెట్టే రెండుపరీక్షలు . ఆ రెండడ్డంకుల తొలగించుకొనుటయే సాయిసందేశముగ తెలియగలము . శ్రీసాయికరుణాకిరాణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
" Whoever offers Me with devotion a leaf, a flower, a fruit, water, that I accept, offered by the pure-minded with devotion". The Holy Geeta: 9:26 ( " పరిశుద్ధమైన మనస్సుగల పురుషుడు భక్తిచేత సమర్పించు నట్టి పత్ర పుష్ప ఫలోదకములను నేను మిగుల ప్రేమతో నారగించుచున్నాను " . గీత : 9:26 )

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

అధ్యాత్మరామాయణము : అహల్యస్థుతి.