శ్రీసాయిసందేశామృతము 15.
శ్రీసాయినాథాయనమః . సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము.
శ్రీసాయిసందేశామృతము : అధ్యాయము 15.శ్రీహరిగానం జేయుటకు పెండ్లికొడుకులా చక్కగాముస్తాబై సెలవు పొందుటకై బాబావద్దకు వచ్చాడు దాసగణు మహారాజ్ . హరికథకు అలంకారలేలయని సాయి మందలించుటచే ఆదుస్తుల బాబా పాదాలవద్దనుంచాడు దాసగణు . ఆపై అతిసాధారణ వస్త్రాలధరించి నారదమునిలా కథలజెప్పెడివాడు . వినయవిధేయతలు , భక్తిశ్రద్ధలు బాబాకు ప్రియములు గాని ఆడంబరములుగావు . ఠాణా కౌపీనేశ్వరాలయంలో దాసగణు హరికథ వినుటకు చోల్కరుయనునాతడు వచ్చాడు . సివిల్ కోర్టులో తాత్కాలిక చిన్న ఉద్యోగం వానిది . భావపూరితమైన దాసగణు హరికథ విన్న యతనికి సాయిపై మిగుల విశ్వాసం కుదిరింది . పరీక్ష పాసై స్థిరమైన ఉద్యోగం లభిస్తే బాబాను దర్శిస్తానని మొక్కుకొన్నాడు . నమ్మకానికనుగుణంగా వాని ఆశ ఫలించింది . పేదవాడు కనుక శిరిడీ ప్రయాణానికై కుటుంబఖర్చులు తగ్గించుకున్నాడు . తేనీటిలో చక్కెరగూడ మాని పొదుపైన పైసలతో బాబాను దర్శించాడు . భక్తి ప్రపత్తులతో టెంకాయ సమర్పించి కలకండపంచాడు. సర్వమెరిగిన సాయికి చోల్కర్ అంతరంగం తెలియదా ? ఆవిషయం తెలుపుటకా యన్నటుల సమీపానున్న జోగుతో అతిధి చోల్కరుకు అతిచక్కెరతో టీనీరిమ్మన్నారు బాబా . చెమరిన కన్నులతో బాబాపాదాల వాలాడు చోల్కరు . చోల్కరు భక్తివిశ్వాసాలే వానిని బాబాచెంతకీడ్చాయి . మొక్కినమొక్కులు తీర్చుకోవడం మిగుల ఆవశ్యకం. ఈ సంఘటనతో బాబాసందేశాన్నీవిధంగా గ్రహింపగలము . " నాముందర భక్తితో మీచేతులు జాపినచో వెంటనే రాత్రింబవళ్లు మీ చెంత నేనుండెదను. నాదేహమిచ్చటనున్నప్పటికీ సప్తసముద్రములకవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియును . ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు. నేను మీచెంతనే యుండెదను . నానివాసస్థలము మీహృదయమునందే గలదు".బాబాచెప్పిన మాటలు అక్షరసత్యములు . దేశవిదేశాలలో నివసించెడి అనేక భక్తుల యనుభవాలీసత్యాన్ని నిరూపిస్తున్నాయి . సాయినాథులు సర్వవ్యాపకులు . ఇదే అధ్యాయంలో బాబా సర్వజ్ఞతను తెలిపే ఓ మనోల్లాస కథ చెప్పబడినది . అది రెండుబల్లుల కథ . ఒంటరిగా మజీదుగోడపై కూసే బల్లివద్దకు ఔరంగాబాదునుండి చెల్లివచ్చి కలుస్తుందని చెప్పారు బాబా . తరువాత చెప్పినవిధంగానే జరిగింది . ఔరంగాబాదునుండి మజీదుకు వచ్చినవ్యక్తి, , తనగుఱ్ఱానికి దాణా తెచ్చుటకై సంచివిదిలించాడు . అందుండి ఓ బల్లి వెల్వడి అందరూ చూస్తుండగానే గోడపైకి చెరచెరా పాకుచు తొల్లినున్న బల్లినిజేరి ప్రేమతో ఆడినది . ఈ ఘటన చిత్రం గదా ! సాయిని విశ్వసించే భక్తులు, సదా సాయి మనచర్యల గమనిస్తున్నారనేవిషయాన్ని మరువరాదు, నమ్మకమును వీడరాదు , మొక్కులమరువరాదు ! ఇదే ఈ అధ్యాయ ముఖ్యసందేశము . ఈ అధ్యాయ కథలను నిత్యము భక్తిశ్రద్ధలతో పారాయణజేసెడి వారి కష్టములు శ్రీసాయినాథుని కృపచే తొలగునని రచయిత హేమాద్రిపంతు చివరిమాటగా విన్నవించాడు . శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
" Know that to be Indestructible by which all this is pervaded. None can cause the destrucion of That-the Imperishable". The Holy Geeta: 2:17 (" ఏ ఆత్మచేత ఈ సమస్త ప్రపంచము వ్యాపింపబడియున్నదో, ఆ యాత్మ నాశరహితమైనదని తెలిసికొనుము . నాశములేని యీ యాత్మను నశింపజేయుటకు ఎవడును సమర్ధుడు గాడు ". గీత : 2:17 )
Comments
Post a Comment